సుజిత్ మరణం మరవకముందే.. బోరు బావిలో పడి మరో చిన్నారి మృతి
posted on Nov 4, 2019 @ 1:19PM
దేశంలో టెక్నాలజీ పెరుగుతూనే ఉంది. కూర్చున్న చోటు నుంచే ప్రపంచ నలుమూలల్లో ఏ పనైనా చేయగలిగే సామర్ధ్యం ఉంది. కానీ నీటి కోసం తవ్విన బోరు బావిని పూడ్చలేరు.. తెలిసి తెలియక ఆడుకుంటూ అందులో పడిన చిన్నారులను కాపడలేరు. బోరు బావిలో పడి ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తమిళనాడులో చిన్నారి సుజిత్ విషాద గాధను మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.
హర్యాణ , కర్నాల్ జిల్లాలో శివాని అని ఓ ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయింది. హరిసింగ్ పురా గ్రామానికి చెందిన ఈ చిన్నారి సాయంత్రం తమ పొలంలో ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయింది. కొంతసేపటికి తల్లిదండ్రులు బోరు బావిలో చిన్నారి పడినట్టుగా గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులను.. అధికారులను.. ఆశ్రయించారు.
చిన్నారి 60 అడుగుల లోతులో ఉన్నట్టుగా గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. శివానిని విజయవంతంగా బయటకు తీశారు.. కానీ ఆసుపత్రికి తరలించేలోపే శివాని ప్రాణాలు కోల్పోయింది. ఐదేళ్ల చిన్నారిని ప్రాణం లేకుండా చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు చెందారు. ఇండియా నుంచి అమెరికాకి సెకన్లలో ఫోన్.. మెసేజ్.. చేయగలిగే టెక్నాలజీని కనుగొన్నారే కానీ కళ్లముందు 60 అడుగుల లోతులో ఉన్న చిన్నారి ప్రాణాలను సురక్షితంగా కాపాడే టెక్నాలజీని ఎప్పుడు కనిపెడతారో అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.