పట్టపగలు తహశీల్దారు సజీవ దహనం
posted on Nov 4, 2019 @ 2:23PM
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. తహశీల్దారుగా పని చేస్తున్న విజయారెడ్డి అనే మహిళను ఓ దుండగుడు సజీవ దహనం చేసాడు. ఈ ఘటన తహసీల్దార్ కార్యాలయంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగుడు తహసీల్దార్ విజయపై పెట్రోలు పోసి నిప్పింటించాడు. ఈ క్రమంలో తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు రెవెన్యూ సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దుండగుడు ఈ ఘటనకు పాల్పడిన అనంతరం తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాయపడ్డ సిబ్బందిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
తహసీల్దార్ కార్యాలయంలోకి దుండగుడు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వచ్చాడు. విజయారెడ్డితో మాట్లాడాలంటూ నిందితుడు ఆమె చాంబర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే తొలుత తహసీల్దార్ విజయారెడ్డి అటెండర్ అడ్డుకొన్నారు. మీటింగ్ పూర్తైన తర్వాత విజయారెడ్డి ఛాంబర్లోకి దుండగుడు వెళ్లినట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఆమె చాంబర్‌లోకి వెళ్లిన ఆ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోసి వెంటనే నిప్పంటించాడు. అయితే దుండగుడు ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు..? విధుల్లో ఉన్న తహసీల్దార్‌పై ఎందుకు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం ఘటనా స్థలానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేరుకున్నారు.