అయోధ్య కేసులో తుది తీర్పు... యూపీ , మధ్యప్రదేశ్ లో హై అలర్ట్

 

అయోధ్య తీర్పు వెల్లడికానున్న నేపథ్యంలో దేశం అంతటా అప్రమత్తమవుతున్నారు. యూపీ సీఎం ఆదిత్య నాథ్ తన మంత్రులను అలర్ట్ చేశారు. తీర్పు రానున్న కారణాన ఎవ్వరు నోరు జారవద్దని ఆదేశించారు. యూపీ ఒక్కటే కాకుండా అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పోలీసులకు సెలవులను రద్దు చేసింది. వివాదాస్పద బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం మరికొద్దిరోజుల్లో తుది తీర్పు ప్రకటించనుంది. ఎన్నో ఏళ్లు సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత వచ్చే ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. దేశంలో అత్యంత సున్నితమైన అంశం కావడంతో ఈ వ్యవహారంలో ఎలాంటి తీర్పు వచ్చినా దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు  అలర్ట్ అవుతున్నాయి. తీర్పు వచ్చే వరకు నోటికి పని చెప్పకుండా ఉండమని తన మంత్రులకు.. సహచరులకు.. యూపీ ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ కాస్త గట్టి గానే హెచ్చరించారని తెలుస్తుంది.

సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించక ముందే అధికార ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నట్లు అర్థం వచ్చేలా ఎటువంటి వ్యాఖ్యలు చెయ్యొద్దని మంత్రులకు యోగి సూచించారు. ఈ విషయంలో బిజెపి అధిష్టానం కూడా హెచ్చరికలు జారీ చేస్తూ.. సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా వేడుకలూ చేసుకోకూడదనే నిబంధన విధించింది. తీర్పు తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తమవుతున్నాయి. మిలాద్ ఉన్ నబి, గురునానక్ జయంతి లాంటి పర్వదినాల్లో అయోధ్య కేసు తీర్పు వెలువడనుంది. దీంతో శాంతి భద్రతలను దృష్టి లో పెట్టుకొని నవంబరు 1 నుంచి పోలీస్ అధికారులు సిబ్బంది ఎలాంటి సెలవులు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేశారు. మళ్లీ  ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చేంత వరకు పోలీసులు సెలవు పెట్టకూడదని అందులో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సెలవు తీసుకోవాల్సి వస్తే సీనియర్ల అనుమతి తీసుకోవాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. చరిత్రాత్మక నిర్ణయం కావడంతో దేశంలోని అందరి కళ్ళు అయోధ్య తీర్పు పైనే ఉన్నాయి.

Teluguone gnews banner