దుర్గమ్మ దర్శనం మరింత ఖరీదు.. ఫోటో దిగాలన్నా అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందే

 

విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం మరింత ఖరీదు కానుంది. జేబు నిండా డబ్బులుంటేనే తప్ప భక్తులు అమ్మ వారిని దర్శించుకోలేరన్న వార్తలు  వినిపిస్తున్నాయి. భక్తుల జేబులను గుల్ల చేసే విధంగా దేవస్థానం అధికారులు నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మ వారిని దర్శించుకునేందుకు వెళ్లే సమయంలో భక్తులు తమ వెంట సెల్ ఫోన్ లు, కెమెరాలు తీసుకువెళ్లకూడదు అనే నిబంధన ఉంది. వాటిని సంబంధిత కౌంటర్ లలో భద్రపరుచుకోవాలి అంటే ఒక్కో వస్తువుకు ఐదు రూపాయలు చెల్లించాల్సి  ఉంటుంది. ఇవి కాకుండా ఇతర సామాన్లు కూడా భద్రపరుచుకోవాలి అంటే వాటికి కూడా రుసుము చెల్లించాల్సిందే. ఇందుకు సంబంధించిన టెండర్ లకు పిలవాలని అధికారులు నిర్ణయించారు. భక్తులు ముచ్చటపడి దేవాలయ ప్రాంగణాల్లో గుర్తుగా ఫొటోలు దిగాలి అనుకోవడం మరియు సెల్ఫీ తీసుకోవాలి అంటే ఇక పై కుదరదనే చెప్పొచ్చు.

కొండ పైనున్న చిన్న రాజగోపురం, మహామండపం, ఏడో అంతస్తు పై పెద్ద రాజగోపురం ఫొటో దిగేందుకు లైసెన్స్ పొందిన ప్రైవేట్ ఫొటోగ్రాఫర్ లను ఆశ్రయించాలి. వారు చెప్పిందే రేటు, ఇచ్చిందే ఫొటో అన్నట్లు గా స్పాట్ ఫోటోలకు లైసెన్స్ హక్కు కల్పించనున్నారు. ఈ నెల(నవంబర్ 13న) సీల్డ్ టెండర్ లు తెరిచి అర్హులైన వారికి దేవస్థానం అధికారులు లైసెన్స్ లు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన 16 నెలల కాలపరిమితితో టెండర్ లను ఆహ్వానించారు. గతంలో చెప్పుల స్టాండ్ లు, క్లాక్ రూములు, సెల్ ఫోన్ లు, కెమెరాలు వంటి వస్తువులను భద్రపరిచే కౌంటర్ లను ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టుకు ఇచ్చేవారు. భక్తుల నుంచి అదనపు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో..భక్తులే ఫ్రీగా సామన్లు భద్రపరుచుకునేందుకు అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. భక్తులు తమ వస్తువుల భద్రపరుచుకునేందుకు ఫొటోలు తీసుకునేందుకు మళ్లీ రుసుము చెల్లించాలి అంటూ ప్రస్తుత ఈవో సురేష్ బాబు నిర్ణయించారు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. దేవుడిని చూడటానికి డబ్బు చెల్లించాలి.. మా వస్తువులు మేము తెచ్చుకోకుండా ఉండాలంటే కూడా డబ్బు చెల్లించాలి.. దేవుడి దగ్గరికి వచ్చినందుకు గుర్తుగా ఒక ఫోటో దిగాలన్నా కూడా మీరు అడిగినంత డబ్బు చెల్లించాలి.. ఇవేం నిబంధనలు అంటూ భక్తులు మండిపడుతున్నారు.
 

Teluguone gnews banner