కేటీఆర్ సీఎం... కేసీఆర్ సూపర్ సీఎం... శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యల అర్ధమిదేనా?
posted on Dec 27, 2019 @ 1:52PM
మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్ కేటీఆర్ ... త్వరలో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి అనుకూలంగా కామెంట్స్ చేశారు. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది కేటీఆరే అన్నారు. ఇది చిన్న పిల్లాడికి కూడా తెలుసంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.... కేటీఆర్ ముక్కసూటి మనిషని... ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే నడిచిన నాయకుడంటూ కొనియాడారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఐటీ రంగం దూసుకుపోతోందని... భవిష్యత్ లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
అయితే, కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టనున్నారని, త్వరలోనే పట్టాభిషేకం జరగబోతోందని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక... కేటీఆర్ సీఎం... కేసీఆర్ సూపర్ సీఎం అంటూ సంచలన కథనాన్ని కూడా ప్రచురించింది. దాంతో, ఆ ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే, వచ్చే ఏడాది అంటే 2020లోనే కేటీఆర్ ముఖ్యమంత్రి పగ్గాలు అందుకోవచ్చని అంటున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ఇటీవలే కేసీఆర్ ఏడాది పూర్తి చేసుకోవడం... అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కూడా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకోవడంతో.... కొత్త సంవత్సరంలోనే పట్టాభిషేకం జరగొచ్చని చెబుతున్నారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా పట్టాభిషేకం జరగొచ్చని అంటున్నారు.
ఏదిఏమైనా నిప్పు లేకుండా పొగైతే రాదు... అంటే, కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనేది కేసీఆర్ ఆకాంక్షగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలాగుంటాయో చెప్పలేని పరిస్థితులు నెలకొనడంతో... ఇఫ్పుడు తనయుడిని ముఖ్యమంత్రిగా చూడాలని కేసీఆర్ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు కాకపోతే... మరెప్పుడనే భావనతో కేసీఆర్ ఉన్నారని, దాంతో, అతిత్వరలోనే కేటీఆర్ కి పట్టాభిషేకం జరిగిపోవచ్చని అంటున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు కూడా అందుకు సంకేతాలేనని చెబుతున్నారు.