ఎన్ఆర్పీ పై భయాందోళనలో ఉన్న ప్రజలు: ధైర్యాన్ని నింపుతున్న అమిత్ షా.....
posted on Dec 26, 2019 @ 1:15PM
ఇరవై రోజులుగా దేశం నిరసనలతో అల్లకల్లోలమవుతోంది. కుల, మత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాలు ఏకమయ్యాయి. విద్యార్థులు రోడ్డెక్కారు. పౌరసత్వ సవరణ చట్టం ఒప్పుకోమంటూ అన్ని వర్గాల ప్రజలు నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించిన తర్వాత దేశం లోని వివిధ ప్రాంతాల్లో దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఈ చట్టం ప్రకారం పొరుగు దేశాల నుంచి ఆశ్రయం కోసం భారత్ వచ్చిన హిందూ, జైన, బౌద్ధ, సిక్కు, పార్సి, క్రైస్తవ సమాజాలవారికీ భారత పౌరసత్వం ఇచ్చే నిబంధన ఉంది. ఈశాన్యంతో పాటు దేశం లోని చాలా ప్రాంతాల్లో ఈ చట్టం పై వ్యతిరేకత వస్తోంది. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం భారత రాజ్యాంగానికి విరుద్ధమని వాదిస్తున్నారు.
అంతేకాదు ఈ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి. కానీ కొత్త చట్టాన్ని తక్షణం నిషేధించాలని వినతిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. విచారణకు జనవరిలో తేదీని నిర్ణయించింది. ఇదే సమయంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియాలో తీవ్రంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆందోళనల సమయంలో హింస, దహనాలు తరువాత పోలీసులు అతి చేశారని విద్యార్థులు ఆరోపించారు. ఆ తరువాత నిరసన ప్రదర్శనలు అంతకంతకూ తీవ్రతరమయ్యాయి. అస్సాంలో మొదలైన నిరసన ప్రదర్శనలు జామియా తరువాత ఢిల్లీ సీలంపూర్ ప్రాంతాల్లో తీవ్రతరమయ్యాయి. అక్కడ విధ్వంసం సృష్టించారని పోలీసుల పై మరోసారి ఆరోపణలొచ్చాయి. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్ లో కూడా హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి.
కానీ ప్రభుత్వం పౌరసత్వ చట్టంలో మార్పులు వల్ల భారత్ లో ఉన్న ముస్లింలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతోంది మోడీ సర్కార్. కానీ విపక్షాలు ఆందోళనకారులు కొత్త చట్టాన్ని భారత్ లౌకికవాదానికి ముప్పుగా భావిస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా ఎన్ఆర్సీ ప్రక్రియ, పౌరసత్వ చట్టం అంటే సీఐఏ రెండూ వేరు వేరని చెబుతోంది. కానీ విపక్షాలు నిరసనకారులు ప్రభుత్వ విధానం ఉద్దేశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తమ సందేహాలు వ్యక్తం చేస్తూ రోడ్ల పైకి వస్తున్నారు. ఈ తరుణంలో తెరపైకి ఎన్పిఆర్ వచ్చింది. జాతీయ పౌరసత్వ జాబితా ఎన్ఆర్సికి జాతీయ జనాభా ఎన్పిఆర్ కు మధ్య ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంటున్నారు. ఎన్పిఆర్ కారణంగా ఏ ఒక్కరి పౌరసత్వం రద్దు కాదని ఒక మైనారిటీ పౌరుడి పౌరసత్వం కూడా దీనివల్ల వెనక్కు తీసుకోవడం జరగదని అంటున్నారు.దేశవ్యాప్తంగా జాతీయ జనాభా జాబితా అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్ ను నవీకరించేందుకూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుపై చర్చించాల్సిన అవసరం లేదని అమిత్ షా అంటున్నారు. ఒకవేళ ఎన్పీఆర్ లో ఎవరి పేరైనా గల్లంతయితే వారి పౌరసత్వానికి వచ్చే ఇబ్బందేమీ ఉండదని అమిత్ షా హామీ ఇస్తున్నారు. మొత్తం మీద సీఐఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ ఈ మూడు విషయాలు ఓ కుదుపు కుదిపేస్తున్నాయి.
మోదీ సర్కార్ ఈ మూడు అంశాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ కేంద్రం ఎన్ని మాటలు చెప్పినా వీటి పై ప్రజల్లో ఏర్పడిన సందేహాలూ పౌరసత్వం చుట్టూ నెలకొన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకని పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదో జరుగుతుందనే భయాందోళనలు ప్రజల్లో భారీగా ఏర్పడ్డాయి. ఈ చట్టం అమలైతే ఏర్పడే పరిణామాలు అంత సౌమ్యంగా ఉండవని అంచనాలూ ప్రజల్లో ఏర్పడ్డాయి. అందుకే సిఐఎ పైన ఎన్ఆర్సి పై ఎంత ఆందోళన వ్యక్తం చేశారో ఇప్పుడు ఎన్పిఆర్ అనేది కేవలం జనాభా లెక్క మాత్రమే అని కేంద్రం చెబుతున్నా ప్రజలలో కాస్త కూడా నమ్మకం కలగటం లేదు.ఈ అంశం పై కేంద్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో,ఎలా ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది అనేది వేచి చూడాలి.