సుప్రీం ఆదేశాలు భేఖాతర్.. స్థానిక ఎన్నికలకు పాత రిజర్వేషన్లనే అమలు చేయనున్న వైసీపీ ప్రభుత్వం
posted on Dec 27, 2019 @ 2:08PM
స్థానిక ఎన్నికల్లో పాత కోటానే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రిజర్వేషన్ల పై సరికొత్త నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికలను ఇంకొంత కాలం వాయిదా వేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లుగా కనిపిస్తుంది. పాత పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఉద్దేశం అందులో భాగమేనన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను కాదని ముందుకెళ్తూ ఉండటంతో వెంటనే ఎన్నికలు జరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదని స్పష్టమవుతోందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం పాత పద్ధతిలో 60.15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కోరిన సుప్రీం అంగీకరించలేదు. దీంతో 50 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఇవన్నీ తెలిసినప్పటికి మన రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలో 60.15 కోటా అమలుకు పరిచేందుకు సన్నహాలు చేస్తుంది. ఇందు కోసం తీసుకురావల్సిన ఆర్డినెన్స్ పై కేబినెట్ లో చర్చించి నిర్ణయించనున్నట్లు సమాచారం. పంచాయితీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఇప్పటికే హై కోర్టు ప్రభుత్వానికి సూచించింది.
ఎన్నికలు సకాలంలో ఎందుకు నిర్వహించలేదని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. రిజర్వేషన్లను ఖరారు చేయక పోవటంతో ఆ ప్రక్రియ ప్రారంభించ లేక పోయామని యస్ఈసి సమాధానం ఇవ్వడంతో ఆ ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికల జాప్యం చేసేందుకు హైకోర్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని తెలిసే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల మెలిక తెచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్లు 50 శాతానికి కుదిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టాల్సి ఉన్నా ఇటీవలి శీతాకాల సమావేశాల్లో ఆ పనిచేయలేదు. ఆర్డినెన్స్ ద్వారా 50 శాతం రిజర్వేషన్లను అంశం తెస్తారని అందరూ భావించారు. దీనికి హైకోర్టు గానీ సుప్రీంకోర్టు గానీ అంగీకరించవని తెలిసే ముందుకెళ్తూ ఉండటం వెనుక ఏ కారణం గానైనా కొంత మేర జాప్యం చేయవచ్చునన్న వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల్లో 50 శాతానికి రిజర్వేషన్లు పెట్టడంలో బీసీలకే నష్టం జరుగుతుందని బీసీ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కుదిస్తే బీసీల్లో అసంతృప్తి పెచ్చురిల్లుతుందని వైసీపీ ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఎప్పటిలానే రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించి సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తే కోర్టు ఆదేశాల ప్రకారం చేశామని ప్రచారం చేసుకునేందుకు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.
వైసిపి అధికారం చేపట్టగానే వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారని సర్వత్రా భావించారు. ఆ ఊపులోనే ఎన్నికలు నిర్వహిస్తే క్లీన్ స్వీప్ చేయవచ్చనుకున్నారు. అయితే సీఎం జగన్ గ్రామ సచివాలయాల ఏర్పాటు పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఆరు నెలల్లోపు పేదలకు వైసీపీ ప్రభుత్వ మార్కు చూపించి ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అయితే గ్రామ సచివాలయాల వ్యవస్థ ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం.. వివిధ పథకాలు ఇంకా అమలు దశలో ఉండడం ఇసుక ఇబ్బందులతో పాటు గ్రామీణ పట్టణ ప్రజల్లో అసంతృప్తి పెల్లుబకడంతో ఇంకొంత కాలం ఆగి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది ప్రభుత్వం.