రాజధాని మార్పును రైతులు సమ్మతిస్తారా?
posted on Dec 27, 2019 @ 10:40AM
రాజధానిని అమరావతిని విశాఖపట్నం తరలించేందుకు రంగం సిద్ధమైంది. అధికార పార్టీ నేతలు ఇప్పటికే మానసికంగా సిద్ధమై తరలింపు ప్రక్రియను ఏ విధంగా చేయాలనే దానిపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే జీఎన్ రావు తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కర్నూలులో హై కోర్టు, అమరావతిలో శాసన సభ, శాసన మండలి, రాజ్ భవన్, మంత్రుల నివాసాలు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయాలు, హెచ్వోడీలు, అసెంబ్లీ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని కమిటీ నివేదిక సూచించింది. దీనిపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. కమిటీ నివేదికపై రాజధాని రైతులు భగ్గుమంటున్నారు.రాయలసీమ వాసులు కూడా హై కోర్టు ఏర్పాటు వల్ల తమకేమీ ప్రయోజనమని నిలదీస్తున్నారు. అమరావతికి రావాలంటేనే 6 గంటలు పడుతోందని, ఇక విశాఖపట్నం వెళ్లాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రాజధాని రైతులతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలలో అమరావతి తరలింపు పై నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రజా ప్రతి నిధుల తీరు పై రాజధాని జిల్లా ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యం లోనే గుంటూరు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో గురువారం సాయంత్రం సీఎం సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. రాజధాని తరలింపు రైతులు రెండు జిల్లాల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయని సమాధానం చెప్పలేకపోతున్నామని ఎమ్మెల్యేలూ సజ్జల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో ఐటి హబ్ లా మార్చి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేస్తామని రైతులకు నష్టం రాకుండా చూస్తామని సజ్జల హామీ ఇచ్చారు. చంద్రబాబు తెలుగుదేశం పై ఎదురు దాడి చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. దీంతో బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు అమరావతి నిర్మించాలంటే లక్షా తొమ్మిది వేల కోట్లు అవుతుందని చంద్రబాబు చెప్పారని ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితిలో అంత డబ్బు లేదని స్పష్టం చేశారు. అందువల్లే అన్ని ప్రాంతాల అభివృద్ధికి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.జీఎన్ రావు కమిటి పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ప్రకటించారు. దీంతో రాజధాని తరలింపు ఖాయమని తేలిపోయింది. రాజధాని తరలింపు పై మంత్రి బొత్స కూడా పరోక్షంగా సూచనలు ఇచ్చారు. ఒక్క సచివాలయం మాత్రమే వెళ్తే ఏమవుతుందని రాజధాని రైతులకు పోయేదేముందని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఉచ్చులో రాజధాని రైతులు చిక్కుకోవద్దని ఆయన ఆరోపించారు.క్యాబినెట్ సమావేశంలో జిఎన్ రావు కమిటీ నివేదిక పై కూడా చర్చిస్తామని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో పట్టణ నగర ప్రాంతాలు రాజధాని సమగ్రాభివృద్ధి కోసం సలహాలు, సూచనలు కోరిన జీఎన్ రావు కమిటీ నివేదిక పై క్యాబినెట్ సమావేశంలో చర్చించటంతో పాటు దీనిని ఆమోదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆందోళన చేస్తున్న అమరావతి రైతుల కోసం ఐటి, పారిశ్రామిక హబ్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే రాజధాని తరలింపును మాత్రం అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.భేటి అనంతరం అమరావతి రైతులు రాజధాని మార్పులను సమ్మతిస్తారా లేదా అనేది వేచి చూడాలి.