ఫిబ్రవరి 1న ఉరి.. నిర్భయ దోషి ముఖేష్ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం
posted on Jan 29, 2020 @ 2:57PM
నిర్భయ దోషి ముకేష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రాష్ట్రపతి తన మెర్సీ పిటిషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు ముకేష్. దీనిపై వాదనలు విన్న జస్టిస్ భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. దీంతో ఫిబ్రవరి 1వ తేదీన ఉరి అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు తీహార్ జైలు అధికారులు. ముఖేష్ ను జైలులో లైంగికంగా వేధించారని అలాగే స్పెషల్ సెల్ లో నిర్బంధించారని ఆరోపించారు అతని తరపు న్యాయవాది అంజనా ప్రకాశ్. ఈ ఆరోపణలను కొట్టిపారేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తుషార్ మెహతా. దోషి ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దారుణమైన నేరాలకు పాల్పడిన వారికి క్షమాభిక్ష ఎలా ప్రసాదిస్తారని ప్రశ్నించారు. వాడి వేడిగా సాగిన ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం ముఖేష్ పిటిషన్ ను కొట్టి వేస్తూ తీర్పును వెలువరించింది.