నిరాశపరిచిన ఫలితాలు.. టీఆర్ఎస్ మంత్రుల పై వేటు పడనుందా?
posted on Jan 29, 2020 @ 3:11PM
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అంచనాలకు మించి విజయం సాధించింది. 100 పైగా పురపాలక సంఘాల్లో పాగా వేసింది. అయితే జడ్పీ తరహాలోనే జిల్లాలో అన్ని మున్సిపాల్టీలు కార్పొరేషన్ లు గెలిపించాలని..క్లీన్ స్వీప్ లక్ష్యమని నిర్దేశించారు కేసీఆర్. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు గానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కేసీఆర్ ఈ టార్గెట్ ఇచ్చారు. ఓడిపోతే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చారు. పెద్ద పదవుల్లో ఉన్నవారైనా బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. ఉన్నవాళ్ల పదవులు పోతాయని.. కొత్తవాళ్లకు పదవులు ఇవ్వమని స్పష్టం చేశారు.
కొన్ని చోట్ల ఫలితాలు పార్టీకీ ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో కొందరు మంత్రుల మెడపై పదవీ గండం కత్తి వేలాడుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వడ్డేపల్లి మునిసిపాలిటీలో టిఆర్ఎస్ ఓడిపోయింది. ఈ మున్సిపాలిటీకి ఇన్ చార్జిగా మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన పదవికి గండం ఉన్నట్లేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. నిరంజన్ రెడ్డి పై చర్యలు తీసుకుంటారా వార్నింగ్ తో సరిపెడతారా అనే విషయం ఆసక్తిగా మారింది.
ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా టిఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. చండూరు, హలియ, నల్లగొండ మునిసిపాలిటీలో కాంగ్రెస్ మెజార్టీ వార్డులు దక్కించుకుంది. ఎక్స్ అఫిషియో సభ్యుడితో కొన్ని చోట్ల చైర్మన్ పదవులు దక్కాయి. పార్టీ పనితీరు పై సిఎం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. చిట్యాల, యాదగిరి గుట్ట, భువనగిరి లోనూ గులాబితో కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడింది. దీంతో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి వైపు నేతలు చూస్తున్నారు.
ఇక నిజామాబాద్ కార్పొరేషన్ లో కూడా టీఆర్ఎస్ కు ఫలితం అనుకూలంగా రాలేదు. అక్కడ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. దీంతో ఎంఐఎం మద్దతు కీలకంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అక్కడ పార్టీకి సానుకూల ఫలితాలు రాలేదు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. మరి జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పై ఇది ప్రభావం చూపనుందా అని పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఇక గ్రేటర్ కు ఆనుకొని ఉన్న కొన్ని కార్పొరేషన్ లు మున్సిపాలిటీల్లోనూ గులాబీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. తుక్కుగూడలో బిజెపి గెలిచింది. మీర్ పేటలో స్వతంత్రులు ఆధిక్యంతో గెలిచారు. ఇక తుర్కయాంజల్లో ప్రతికూల ఫలితం వచ్చింది. పెద్ద అంబర్ పేటలో కారు జోరు చూపించలేకపోయింది. దీంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై ఇవి ప్రభావం చూపే అవకాశముంది. మొత్తానికి ఐదు నుంచి ఆరుగురు మంత్రుల పని తీరు పట్ల సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.