రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చనున్న సిఎం జగన్...
ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు సిఎం వైఎస్ జగన్. మహిళల్లో, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణకు వైయస్సార్ బాల సంజీవనీ, వైయస్సార్ బాలామృతం పేరుతో కొత్త పథకం ప్రవేశపెట్టనున్నారు. అందుకు పైలట్ ప్రాజెక్టును రూపొందించారు. గర్భవతులకు, బాలింతలకు నెలకు 1062 రూపాయల విలువైన పౌష్టిక ఆహారాన్ని అందించనున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరే ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా ప్రజారోగ్యానికి, మాతా శిశువుల పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీని ఆరోగ్యాంధ్రాగా మార్చడానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సీఎం వైఎస్ జగన్ పిల్లలకు మధ్యాహ్న భోజనం పౌష్టికాహారం పై బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ క్రమంలోనే మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణపై చర్చించిన ఆయన మొదటి దశలో రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన సబ్ ప్లాన్ ప్రాంతాల్లోని గర్భవతులు, ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మాతా శిశువులకు పౌష్టికాహారాన్ని అందించటానికి వైయస్సార్ బాల సంజీవని, వైయస్సార్ బాలామృతం పేరుతో వారిని ఆదుకోనున్నారు. అందుకు గాను 77 గిరిజన సబ్ ప్లాన్ మండలాలను ఎంపిక చేసిన అధికారులు డిసెంబర్ నుంచి ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టును అనుసరించి గర్భవతులకు, బాలింతలకు నెలకు 1062 రూపాయల విలువైన ఆహారం అందించనున్నారు.
25 రోజుల పాటు రోజూ భోజనం, గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలతో పాటు 500 రూపాయల విలువ చేసే వైయస్సార్ బాల సంజీవని కిట్ అందించనున్నారు. వైయస్సార్ బాల సంజీవని కిట్లు మొదటి వారం రెండు కేజీల మల్టీ గ్రెయిన్ ఆటా, రెండోవారం అరకేజీ వేరుశెనగలతో చేసిన చిక్కి, మూడో వారం అరకేజీ రాగి ఫ్లేవర్, అరకేజీ బెల్లం, నాలుగో వారం అరకేజీ నువ్వుల ఉండలు అందజేస్తారు. ఆరు నెలల నుంచి మూడేళ్ళ లోపు చిన్నారులకు నెలలో ప్రతిరోజు గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు వైయస్సార్ బాలామృతం కిట్ లో భాగంగా 600 రూపాయల విలువ చేసే పౌష్టికాహారం ఇవ్వనున్నారు. అలాగే మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా నెలకు 25 రోజుల పౌష్టికాహారం అందించనున్నారు.
నెలలో 25 రోజుల పాటు భోజనం,గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, పోషకాలు ఇచ్చే మరో అల్పాహారం అందజేస్తారు. ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం 36 గిరిజన మండలాలను ఎంపిక చేయగా శ్రీకాకుళం జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఏడు, విశాఖపట్నం జిల్లాలో పదకొండు, తూర్పు గోదావరి జిల్లాలో పదకొండు, పశ్చిమగోదారి జిల్లాలో ఆరు ఉన్నాయి. సబ్ ప్లాన్ ప్రాంతానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో పంతొమ్మిది, తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, విశాఖపట్నం జిల్లాలో ఆరు, పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో మూడు, కర్నూలు జిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో మూడు, కలిపి మొత్తం 41 మండలాలను ఎంపిక చేశారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలపై ప్రజల్లో మంచి స్పందన వస్తోంది అని చెప్పారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని. అది చూసి ఓర్వలేకే చంద్రబాబు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వైద్యం అందక ఏ ఒక్క పేదవాడు చనిపోకూడదన్న ఉన్నత ఆశయంతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారని చెప్పారు, ఒంగోలు రిమ్స్ ను సందర్శించిన మంత్రి అక్కడ అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలసుకున్నారు. ఆస్పత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు, అనంతరం డీ.అర్.డి.ఎ ఆఫీస్ లో జిల్లా వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఆళ్ల నానితో పాటు మరో మంత్రి బాలినేని, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.