మీడియాపై ఏపీ ప్రభుత్వ జులుం!
posted on Apr 30, 2020 @ 9:19PM
తెలుగుఒన్ కార్యాలయంపై సిఐడి డాడులు!
సోషల్ మీడియాలో వస్తున్ప పోస్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారపార్టీ నేతల జులుం మొదలైంది. ఈ మధ్య తమపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి జగన్ పోలీసుల సహాయంతో మీడియకు వెన్నుపోటు పొడుస్తున్నారు. అక్రమ కేసులు పెట్టడానికి సోషల్ మీడియా కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంలోజరుగుతున్న అక్రమాలు, కొవిడ్-19, అధికారపార్టీ నేతల అవినీతిపై తెలుగుఒన్‌లో వార్తలు రాయడం, ప్రశ్నించటమే పెద్ద నేరమైపోయింది. హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలోని తెలుగుఒన్ కార్యాలయంపై సిఐడి దాడులు నిర్వహించారు.
బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుగుఒన్ కార్యాలయంలో ఏపీ సిఐడి పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు సిఐడి పోలీసులు ఈ సోదాలో పాల్గొన్నారు.
లాక్‌డౌన్ సందర్భంగా తెలుగుఒన్ కార్యక్రమాలన్నీ ఉద్యోగులు ఇళ్ళ నుంచే చేస్తున్నారు. కార్యాలయంలో డ్రైవర్, వాచ్‌మెన్ తప్ప మరేవరూ లేరు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఏపి సిఐడి పోలీసులు హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలోని తెలుగుఒన్ కార్యాలయంపై ఆకస్మిక తనిఖీలు చేశారు. తెలుగుఒన్ ఎం.డి. రవిశంకర్ ఎక్కడ వుంటారు. ఆయనకు సంబంధించిన వివరాల్ని అడిగారు. ఎం.డి. గురించి తమకేమీ తెలియదని చెప్పడంతో పోలీసులు వెళ్ళిపోయారు.
మళ్ళీ గురువారం ఉదయం 11 గంటలకు తెలుగుఒన్ కార్యాలయానికి ఏపీ సిఐడి పోలీసులు ఆకస్మికంగా వచ్చారు. నెల చివరి రోజు కావడం. ఉద్యోగుల జీతాలకు సంబంధించి పని ఉండటంతో అకౌంటెంట్ ప్రసాద్ ఆ సమయంలో తెలుగుఒన్ కార్యాలయానికి వచ్చారు. ఏపీ సిఐడి పోలీసులు ఆయన్ని విచారించారు. ఎం.డి. రవిశంకర్‌కు సంబంధించిన వివరాలు అడిగారు. అయితే తనకు ఆయన ఎక్కడ ఉండేది తెలియదు. తాను కేవలం అకౌంట్స్ మాత్రమే చూస్తానని ప్రసాద్ చెప్పడంతో పోలీసులు ఎం.డి. డ్రైవర్ చిన్నాను బెదిరించారు. ఎం.డి. రూం తాళాం తెరిపించి రూంలో ఉన్న సి.డి.లు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు.
తెలుగుఒన్ ఎం.డి. తరఫు అడ్వకేట్ సిఐడి పోలీసులతో మాట్లాడడానికి ఫోన్‌లో మూడు సార్లు ప్రయత్నించినా పోలీసులు అడ్వకేట్‌తో మాట్లాడడానికి ఇష్టపడలేదు. పైగా సిఐడి పోలీసులు గద్దించడంతో భయపడిన డ్రైవర్ చిన్నా పోలీసుల్ని ఎం.డి. ఇంటికి తీసుకువెళ్ళాడు. ఎం.డి.గారు వేరే పని మీద బయటికి వెళ్ళి వుండటంతో మేడంతో మాట్లాడి సిఐడి పోలీసులు మళ్ళీ తెలుగుఒన్ కార్యాలయానికి వచ్చారు.
వాచ్‌మెన్ దగ్గర తాళాలు తీసుకొని మెయిన్ సర్వర్, హార్డ్‌డిస్క్, సిసిఫుటేజ్, సిసిటీవీ ఎక్విప్‌మెంట్, సి.డి.లు, పెన్‌డ్రైవ్‌లు అన్నీ సిఐడి పోలీసులు తీసుకొని వెళ్ళారు. కొవిడ్-19 కు సంబంధించి అంజిబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున ఏపి సిఐడి పోలీసులు తెలుగుఒన్ కార్యాలయంపై ఆకస్మిక దాడులకు పాల్పడ్డారు.