అద్వైతాన్ని అందించిన వైశాఖ శుద్ధ పంచమి
* నేడు ఆదిశంకరుల జయంతి
ఈ రోజు ఆది శంకరుల జయంతి. సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు.
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు.
హిందూ మతంపై శంకరుల ప్రభావం అసమానమైనది. శంకరులు సాధించిన ప్రధాన విజయాలు ఇవే- బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు.ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి. ఈయన 108 గ్రంథాలు రచించారు.
సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మించారు. ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు.
శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని శంకరుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.
మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన
చిద్విలాస శంకర విజయం - 15 - 17 శతాబ్దాల మధ్యకాలంలో చిద్విలాసుని రచన
కేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచన
వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగారు.