అన్నదాతల్ని ఆదుకోండి
ఏపీ సి.ఎంకు టిడిపి నేత లోకేష్ లేఖ
కరోనా లాక్డౌన్ కారణంగా పంట దిగుబడులను విక్రయించుకోలేక అవస్థలు పడుతున్న అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి టిడిపి నేత లోకేష్ ఒక లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతలు తాము పండించిన పంటలను అమ్ముకోలేక అవస్థలు పడుతుంటే పట్టించుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. పంటలను కొనుగోలు చేస్తున్నామనే వ్యవసాయ మంత్రి హామీ అరకొరగానే అమలవుతోందన్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఉద్యానవన పంటల రైతుల గోడు వినేవారు కరువయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను రోడ్లపైనే పారబోస్తున్న విషయం మీ దృష్టికి రాలేదా? వచ్చినా మొద్దు నిద్ర నటిస్తున్నారా? అని నిలదీశారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో.. అప్పుల భారం పెరిగి ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని లోకేష్ ఆ లేఖలో పేర్కొన్నారు.
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రబీ సీజన్లో వరి 55 లక్షల మెట్రిక్ టన్నులు, మొక్కజొన్న 14.5, శనగ 5.50, జొన్న 3.50, పసుపు 2.00, మిర్చి 8.50, కంది 1.90, మినుము 2.50, పెసర 0.50 లక్షల మెట్రిక్ టన్నుల మేర దిగుబడులొచ్చాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల మేర పండ్ల ఉత్పత్తులు జరగగా అందులో అరటిని నామ్ కే వాస్తేగా కేవలం 7వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. అరటి గెల రూ.40 నుంచి రూ.50కే అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ ప్రకటనలకు, కొనుగోలుకు ఎంత అగాధం ఉందో అరటిధర చూస్తే అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం రూ.30వేల కోట్ల రూపాయలు పెట్టి రైతుల పంటలను కొనుగోలు చేస్తోందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదు? అని లోకేష్ ప్రశ్నించారు. అరటి టన్ను లాక్ డౌన్ కు ముందు రూ.15,000 వరకు ఉండగా ప్రస్తుతం రూ.1000 నుంచి రూ.1500 కు కొనుగోలు చేస్తున్నారని, కర్భూజ టన్ను రూ.3 వేలకు, టమోట కేజీ రూ.2కు, కొబ్బరికాయ రూ.7కు కొంటున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లోకేష్ సిఎం దృష్టికి తీసుకు వచ్చారు. ఆక్వా రైతుల విషయంలో ప్రభుత్వం ప్రకటించిన ధరలకు, క్షేత్రస్థాయిలో చెల్లిస్తున్న ధరలకు పొంతన లేదని ఆయన విమర్శించారు. లాక్ డౌన్ నిబంధనల నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు సడలింపులు ఇచ్చినప్పటికీ తగిన ప్రయోజనం దక్కడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రబీ సీజన్లో 22.44 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయని తెలిపారు. పంటకోత, రవాణ, ఎగుమతులు, మార్కెటింగ్ సౌకర్యాలు లేక ధరలు సగానికి పైగా పడిపోయాయని, ప్రధానంగా వరి, మొక్కజొన్న, పొగాకు, పసుపు, శనగ, మిర్చి, కంది ఇలా అనేక పంటలు ఉన్నాయని తెలిపారు. రాయలసీమతో పాటు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి, కర్బూజ, పుచ్చకాయలను ఎక్కువగా సాగు చేశారని, ఆయా పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికీ ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లే పూర్తి కాలేదని, రూ.300 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు ఉన్నమాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు రబీ సీజన్లో పంట కోతకు వచ్చిందని, మిర్చి ఇప్పటికీ కల్లాల్లోనే ఉందని, వీటిని కొనే నాథుడే లేడని వాపోయారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామి మాటలకే పరిమితమయిందని విమర్శించారు. ఈ-క్రాప్ బుకింగ్ తో సంబంధం లేకుండా ప్రభుత్వమే మార్కెఫెడ్ ద్వారా అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని లోకేష్ డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, అనంతపురం, కర్నూలు, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయని, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని లోకేష్ సిఎం దృష్టికి తీసుకు వచ్చారు. తక్షణమే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. వరితో పాటు వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న, నువ్వు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయని, సుమారు 15 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లుగా ప్రాథమిక అంచనా ద్వారా తెలుస్తోందన్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులకు అకాల వర్షాల ద్వారా మరింత నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్సారం చేయకుండా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీపై ఉందని జగన్మోహనరెడ్డికి లోకేష్ స్పష్టం చేశారు.