ముఖ్యమంత్రి మాట్లాడడు, మంత్రులు నోర్లు విప్పరు, మీడియా రాయదు

హైదరాబాదులోని కొత్తపేటలో ఉండే పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించిన సంగతి తెలిసిందే. కోహెడలో తాత్కాలికంగా షెడ్లను నిర్మించి పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేశారు. అయితే, గాలివాన బీభత్సానికి కోహెడ పండ్ల మార్కెట్ షెడ్ మొత్తం కూలిపోయింది. రేకులు ఎగిరిపడటంతో పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కనీసం రైతులని పరామర్శించలేదని కాంగ్రెస్ నేతలు విమరిస్తున్నారు. తాజాగా ఇదే ఘటనపై కాంగ్రెస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. "ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దది, ఆధునికమైనది అని చెప్పి, హడావిడిగా కనీసం ఇనుప రాడ్లను నట్టులు, బోల్టులతో బిగించకుండా, బట్టలతో కట్టిన షెడ్డు రైతుల, పండ్లు అమ్ముకునే వ్యాపారుల జీవితాల మీద కుప్పకూలిపోయింది. కొత్తపేట నుండి కోహెడకు తరలించిన పండ్ల మార్కెట్ దుస్థితి ఇది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా సప్పుడు చెయ్యకుండా ఉంటరా? ఇది న్యాయమేనా? రైతుల మీద కరోనా కంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. రైతుల గురించి ఎంతో గొప్పగ మాట్లాడుతారు...మరి ఇది న్యాయమేనా? వందలాది మంది రైతులు, పండ్ల విక్రయదారులు నష్టపోయారు. చాలా మందికి తీవ్రంగా గాయాలైనవి. ప్రాణాలు పోయినవారు ఉన్నరో లేదో ఇంకా తెలియలేదు. ఇంత జరిగినా ఒక్క మాట కూడా మాట్లాడకపోతే....మీ ప్రేమ రైతుల మీద ఉన్నట్టా లేక దీని వెనుక ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ఉన్నట్టా? ఇప్పటి వరకు కనీసం ఆ షెడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ మీద కానీ, పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద కానీ, నాయకుల మీద కానీ ఎటువంటి విచారణ లేదు, చర్య తీసుకోలేదు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ భూముల మీద ఉన్న ప్రేమ రైతుల మీద ఉంటే...ఈ ప్రమాదం జరిగేది కాదు. కనీసం టాయిలెట్స్ లేకుండా ఆసియాలోనే అత్యాధునిక, అత్యంత పెద్ద ఫ్రూట్ మార్కెట్ నిర్మించిన ఘనులు. కోహెడ కు తరలించిన తరువాత రైతుల పంటకు ధరలు సగం కూడా వస్తలే. గిరాకీ లేక చిన్న వ్యాపారుల బతుకు ఆగం అయిపోయింది. అయినా ఈ విషయం మీద ఒక్క మాట మాట్లాడరు. ముఖ్యమంత్రి మాట్లాడడు, మంత్రులు నోర్లు విప్పరు, మీడియా రాయదు. హాస్పిటల్ లో చావుబతుకుల్లో ఉన్న వారి ఏడ్పులు, మాటలు విన్న తర్వాతనైనా నమ్ముదాం. ఇప్పుడు చెప్పండి తెలంగాణలో స్కామ్ స్టర్స్ ఎవరు? ఎవరు సామాన్యులను దోచుకుంటున్నది? రియల్ ఎస్టేట్ వ్యాపారం, కమీషన్ కోసం మామిడి పండ్ల సీసన్ లో హడావిడిగా మార్కెట్ ను కొత్తపేట్ నుండి కోహెడకు మార్చి, ఇటువంటి ప్రమాదకరమైన షెడ్డులు నిర్మించి పేద రైతుల, చిరు వ్యాపారుల బతుకులను చిదిమేస్తున్నది ఎవరు?" అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.

బండ్ల బ్లేడు బాగోతం! ఎక్స్ పైరీ డేట్ దాటిన తిండి తిని పిచ్చెక్కింది!

ప్రస్తుతం టీడీపీలో యమా యాక్టివ్ గా ఉన్న దివ్యవాణి బండ్ల గణేశ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చినబాబుపై బండ్ల ట్వీట్లను అస్త్రంగా చేసుకొని ఓ రేంజ్లో ఉతికి ఆరేశారు. ''అంతా బాగుందయ్యా బండ్ల. పెంటలాంటి నీ మీద రాయి వేయటం ఎందుకు అనుకున్నాం. కానీ.. నువ్వు టీడీపీని గబ్బు పట్టించిన రెడ్డి వేసిన పి డిగ్రీ తిని మొరుగుతున్నవాని అర్థమయ్యాక నీ బ్లేడు బాగోతం బయటపెట్టాల్సిందేనని ఈ రిప్లై ట్వీట్'' ''ఎవరో ఒకరు పడేస్తారు. ఇలా గబ్బు రెడ్డి వేసిన ఎక్స్ పైరీ డేట్ దాటిన తిండి తిని పిచ్చెక్కినట్లు మొరగకు. ఎన్నికల ముందు వరకూ బ్లేడ్ బ్యాచ్ హెడ్డుగా ఉండే బండ్ల ట్వీటుకు నోటు తీసుకునే స్థాయికి దిగజారిపోవటమే ఓడలు బండ్ల అవ్వడమంటే'' ''లోకేశ్ని చూసి భయం వేయడానికి నీలాగ నరహంతకుడు నయీంతో కలిసి దందాలు చేయలేదే! నీలాగ బ్లేడ్తో గొంతులు కోసే రకమూ కాదే! బండ్ల తమ్ముడు గొంతు కోసుకోవటానికి సెవనో క్లాక్ బ్లేడ్ కొనుక్కోవటానికి ఐదు రూపాయిలు లేకపోతే అడుక్కో'' ''స్టాన్ ఫోర్డ్ లో చదవడమంటే ఎవడో బడాబాబుల సొమ్ముకు బినామీగా వ్యవహరించి సినిమా తీసి బడా ప్రొడ్యూసర్ అనిపించుకోవటం కాదు. మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవటమంటే.. నువ్వు సినిమా టికెట్ బ్లాక్ లో కొన్నట్టూ కాదు'' ''లోకేశ్ మంత్రిగా నిర్వహించిన శాఖలకు అత్యదిక అవార్డులు వచ్చాయి. మీలాంటి క్రిమినల్స్ కి నచ్చే సీబీఐ.. ఈడీ కేసుల్లో ఏ1.. లిక్కర్ డాన్ జగన్ లాంటి నాయకుడిగా మా నారా లోకేశ్ ఎప్పటికి కాలేడు'' ''పంచాయితీ రాజ్ శాఖామంత్రిగా లోకేశ్ పాతికవేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయించారు. దేశంలో తయారయ్యే ప్రతి పది సెల్ ఫోన్లలో మూడు ఫోన్లు ఏపీలో తయారవుతున్నాయంటే.. దటీజ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ లోకేశ్'' ''ఉపాధి హామీలో దేశంలోనే అగ్రస్థానం ఆంధ్రప్రదేశ్ ది. గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రిగా లోకేశ్ సాధించిన రికార్డు. నువ్వో క్రిమినల్ వి అని నీపై కేసులు చెబుతున్నాయి. నీకు పదకొండు చార్జిషీట్లున్న రూ.43వేల కోట్ల గజదొంగ జగన్ ఆదర్శం కావటంలో తప్పు లేదు బండ్ల. మా లోకేశ్ పై ఒక్క అవినీతి కేసూ లేదు. చెక్ బౌన్స్ కేసులు, క్రిమినల్ గ్యాంగులతో సంబంధాలున్న బండ్ల గణేష్ కూడా ట్వీట్ చేస్తున్నాడు ఇదే కరోనా కాలం అంటే అని విమర్శలు చేశారు.

అంతా బాగుంటే లాక్డౌన్ పొడిగించుడు ఎందుకో!

కచరా పాలనలో ముక్కుకి, నోటికే కాదు, కంటికీ, చెవులకి కూడా మాస్కులు. దేశంలో అతి తక్కువ కరోనా పరీక్షలు తెలంగాణాలో జ‌రిగాయి. మరణాలు దాచిపెట్టుడు కూడా తెలంగాణాలోనే జ‌రిగింది. మల్ల అంతా బాగుంటే లాక్డౌన్ పొడిగించుడు ఎందుకో. అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. రైతు దీక్షను చూసి తట్టుకోలేక కేసీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారు. ఆయనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కేసీఆర్ అహంకారమే ఆయన పతనానికి దారితీస్తుందని జ‌గ్గారెడ్డి అన్నారు. కుర్చీ పోయిన తెల్లారి నిన్ను కుక్కలు కూడా పట్టించుకోవు. పదవిపోయిన తెల్లారి నీ కుటుంబ సభ్యులెవరు నీ వెంట వుండరు. ఆ విష‌యాన్ని గుర్తుపెట్టుకొని అహంకారాన్ని త‌గ్గించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లనే నీవు సీఎం అయ్యావు. సోనియా ను ఒప్పించి తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ నాయకులు బఫ్యూన్ గాళ్ళు అయ్యారా? తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి కేసీఆర్ అంటూ జ‌గ్గారెడ్డి ఘాటాగా స్పందించారు. రైతు సమస్యలు మాట్లాడితే చిల్లగాళ్లంటావా? చిల్లరగాళ్లని రైతులను అవమానిస్తారా? ప్రగతి భవన్ లో మీరు ఉన్నట్టు రైతులందరూ సుఖంగా లేరుని జ‌గ్గారెడ్డి అన్నారు. తాగండి, సావండి, ఖజానా నింపండి, అన్న‌ట్లుగా ఉంది కేసీఆర్ వైఖరి అని ఆయ‌న విమ‌ర్శించారు.

కరోనా వ్యాక్సిన్ వ‌స్తుందా? రాదంటున్న WHO శాస్త్రవేత్త!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లోని కరోనా ఎనలిస్ట్ డేవిడ్ నబారో మాత్రం కరోనా వైరస్‌కి ఇప్పుడే కాదు, మ‌రెప్ప‌టికీ వ్యాక్సిన్ రాకపోవచ్చు అని విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలో ఎయిడ్స్, డెంగ్యూ, సార్స్ లాంటి వైరస్‌లకు ఇప్ప‌ట్టి వ‌ర‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఎయిడ్స్, డెంగ్యూ లాంటి వాటికి ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ వైరస్‌కి చెక్ పెట్టలేకపోతున్నారు శాస్త్ర‌వేత్త‌లు. ఇక సార్స్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ల ప్రయోగాలు చేపట్టినా, అది దానంతట అదే తగ్గడంతో ప్రయోగాల్ని తొలిదశలోనే ఆపేశారు. ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కరోనా వైరస్ దాదాపు సార్స్ వైరస్‌కి దగ్గర పోలికలతో ఉంది. అందువల్ల సార్స్‌కి వ్యాక్సిన్ కనిపెట్టి ఉంటే, అది కరోనాకీ చెక్ పెట్టి ఉండేదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా అంత త్వరగా లొంగేలా కనిపించట్లేదు. అందుకే డేవిడ్ నబారో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. డేవిడ్ నబారో నిరాశతో ఉన్నారు. మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగాల్లో చాలా దశలుంటాయి. మొదటి దశలో వ్యాక్సిన్ ఇస్తే... అది ఆ మనిషికి ఏదైనా ప్రమాదకరమా అన్నది చూస్తారు. ఆ తర్వాత... ఆ వ్యాక్సిన్ వైరస్‌ని చంపుతుందా లేదా అన్నది చూస్తారు. ఆ తర్వాత వ్యాక్సిన్ వల్ల మనిషికి దీర్ఘకాలిక సమస్యలేమైనా వస్తాయా అన్నది చూస్తారు. అలాగే వ్యాక్సిన్ ఇస్తే, ఆ వ్య‌క్తికి ఆల్రెడీ ఉన్న జబ్బులపై ఎలాంటి ప్రభావం ఉంది అన్నది చూస్తారు. అలాగే వ్యాక్సిన్ ఏ వయసు వారిపై ఎలా పనిచేస్తోంది అన్నది చూస్తారు. ఇలా చాలా లెక్కలుంటాయి. వీటిలో ఏ ఒక్కటి సెట్ కాకపోయినా ఆ వ్యాక్సిన్ తయారీ ఆపేస్తారు. అందుకే డేవిడ్ నబారో క‌రోనా వ్యాక్సిన్ తయారీ అంత తేలిక కాదంటున్నారు. కరోనా, సార్స్‌, స్వైన్‌ఫ్లూ, క్షయ ఇవన్నీ శ్వాసకోశ సంబంధ అంటు వ్యాధులే. అయితే కరోనా, సార్స్‌, స్వైన్‌ఫ్లూ, ఉప్పె నలా విరుచుకుపడ‌తాయి. క్షయను మాత్రం సైలెంట్ కిల్ల‌ర్ నిశ్శబ్ధ హంతకిగా చెబు తారు. ఎయిడ్స్‌ తర్కాత ఎక్కువ మందిని బలిగొఒంటున్న అంటు వ్యాధి ఈ క్షయ. ఎయిడ్స్ వల్ల ఏటా 3.2 కోట్ల మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం 94 లక్షల మంది దీని టిబి బారిన పడగా 17 లక్షల మంది మరణించారు. క్షయ వ్యాధి ఒక్క భారత్‌లోనే ఏటా 5 లక్షల మందిని కబళిస్తోంది. అలాగే ఏటా 4 లక్షల మందికి డెంగ్యూ సోకుతోంది. క‌నీసం డెంగ్యూకి వ్యాక్సిన్ తయారయ్యేలా చాలాసార్లు కనిపించినా ఫెయిలవుతూనే వుంది. అయితే వాస్త‌వ ప‌రిస్థితులు ఇలా వుంటే, ఆగస్ట్ కల్లా క‌రోనా వ్యాక్సిన్ తయారవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటి వాళ్లు కూడా చెబుతున్నారు. నిజంగానే క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుందా? ‌లేక మెడిక‌ల్ మాఫియా కొత్త నాట‌కానికి తెర‌లేపుతుందా? ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చు.

నిమ్మగడ్డ తీర్పుపై ఉత్కంఠ‌త‌! భారీగా బెట్టింగ్‌లు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్ తాను అనుకున్న కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. రాజ‌ధాని త‌ర‌లింపుతో పాటు జూన్ లోనే ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కనగరాజు ని కొత్త ఈసీగా నియమించారని అంటున్నారు. అయితే మాజీ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవిని తొలగించారంటూ హై కోర్టుకు వెళ్లారు. దాని మీద ఇపుడు కోర్టులో విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ అన్ని వర్గాల్లో ఉంది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ నే కొనసాగించాలని కనుక హైకోర్టు తీర్పు ఇస్తే అపుడు సంగతేంటన్న చర్చ కూడా ఉంది. రమేష్ కుమార్ పేరు మీద ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎన్నికలు మధ్యలో ఉన్నాయి. అందువల్ల వాటిని కంటిన్యూ చేయాలంటే నిమ్మగడ్డనే కొనసాగించాలని ఆయన తరఫున న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే నిమ్మగడ్డని తొలగించలేదని, చట్టంలో మార్పుల కారణంగానే ఆయన పదవీకాలం ముగిసిందని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అంటున్నారు. అయితే దీని మీద హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో అని ఉత్కంఠ‌త నెల‌కొంది. అందరి చూపు ఇపుడు శుక్రవారం హైకోర్టు ఇచ్చే తీర్పు మీద ఉంది. అంతే కాదు విచిత్రమైన బెట్టింగ్లు జరుగుతున్నాయి. గుంటూరు దగ్గర్లోనే ఒక క్లబ్ లో మూడు సామాజిక వర్గాలు. ఆ మూడు సామాజిక వర్గాలు కూడా ఆర్థికంగా బాగా సెట్ అయిన వారు చేసుకున్నటువంటి బెట్టింగులు.ఇక్కడ లక్షలకు లక్షలు చేతులు మారుతూ ఉంటాయి. నిమ్మగడ్డ కేసులో గెలుస్తారు అన్నదానిపై 100 కి 300 రూపాయల బెట్టింగ్లు ఇస్తున్నారట‌!

పెట్రోల్‌పై 10/- డీజిల్‌పై 13/- వడ్డింపు! కొర‌డా జులిపిస్తున్న మోదీ!

అంతర్జాతీయంగా చ‌మురు ధరలు త‌గ్గినా, కేంద్రం మాత్రం ప్ర‌జ‌ల ముక్కు పిండి వ‌సూలు చేసుకుంటోంది. కరోనా దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ అయ్యింది. దీంతో చమురు ఉత్పత్తికి తగ్గరీతిలో డిమాండ్ లేకపోవడంతో ధరలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమైనప్పటికీ దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు మాత్రం తగ్గడం లేదు. భారీగా తగ్గిన ధరల వెసులుబాటును ప్రజలకు మళ్లించకుండా.. కేంద్రం ఎక్సైజ్ రేట్లు పెంచకుంటూ పోతుంది. లీటర్ పెట్రోలు పై 10 రూపాయలు, డీజిల్‌పై 13 రూపాయలు పెంచుతూ మోదీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇందులో రెండు రూపాయలు ఎక్సైజ్ సుంకంకాగా, ఎనిమిది రూపాయలు రోడ్ సెస్ విధించింది. కొత్తగా కేంద్రం పెంచిన ధరలతో... దేశంలో లీటర్ పెట్రోలుకు దాదాపు 33 రూపాయలు ఎక్సైజ్ సుంకం రూపంలోనే కేంద్రం జేబులోకి వెళ్తుంది. నరేంద్రమోడీ 2014లో ప్రధాని అయినప్పుడు పెట్రోలుపై ఎక్సైజ్ సుంకం కేవలం తొమ్మిదన్నర రూపాయలు మాత్రమే ఉండేది. అదిప్పుడు పెరుగుతూ పెరుగుతూ వచ్చి 33 రూపాయలకు చేరుకుంది. చమురు ధరల పతనం మొదలయ్యాక ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. తగ్గిన చమురు ధరలు సామాన్యులకు దక్కకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్రం తన ఖజానాకు మళ్లించుకుంది.

మోదీ స‌ర్కార్ త‌ప్పుడు విధానాల్ని అవ‌లంభిస్తోంది: కేసీఆర్ ఫైర్‌!

కరోనావైరస్ వ్యాప్తికి ముందే దేశ ఆర్థిక పరిస్థితి భారీగా దెబ్బతిన్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. పులిమీద పుట్రలాగా కరోనా రావడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలను అవ‌లంభిస్తోంద‌ని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ద్రవ్య నియంత్రణ వ్యవస్థను చేతిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులివ్వట్లేదని మండిపడ్డారు. వేరే మార్గాల్లోనైనా నిధులు సమీకరించుకునేందుకు అనుమతించడం లేదన్నారు. ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న హెలికాప్టర్‌ మనీ వంటి మార్గాల్లో డబ్బు సమీకరించుకోవడానికి రాష్ట్రాలను అనుమతించాలని కేసీఆర్ కోరారు. FRBM రుణ పరిమితిని పెంచాలని, రాష్ట్రాల అప్పుల చెల్లింపులను (డిఫర్మెంట్) వాయిదా వేయాలని విజ్ఞప్తిచేశామన్నారు. అయినా కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తోందని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహాయంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. తెలంగాణకు ప్రతి నెలా అన్నీ కలిపి రూ.15వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉందని చెప్పారు. ఇందులో సొంత పన్నుల ఆదాయమే రూ.10,800 కోట్లు ఉన్నాయని అన్నారు. అయితే వచ్చింది రూ.1,600 కోట్లు మాత్రమేనన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికే ప్రతి నెలా రూ.3వేల కోట్లు కావాలన్నారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించినా కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదన్నారు. ఎందుకు కేంద్రం పట్టించుకోవడం లేదో చెప్పాలన్నారు. అలా చేస్తే మీ మీద భారం పడుతుందా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ నెలలో కూడా అప్పులకు సంబంధించి రూ.2,500 కోట్ల వడ్డీలను RBI కట్‌ చేసుకుందని కేసీఆర్ చెప్పారు. కేంద్రం అధికారాలను తన దగ్గర పెట్టుకుని వాడుకోవట్లేదన్నారు. లేదంటే రాష్ట్రాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ చట్టం.. సవరణ ముసాయిదా బిల్లుపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాల అధికారాలను హరించేలా ఈ బిల్లు ఉందన్నారు. పార్లమెంట్లో పాస్‌ కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రాల ERC చైర్మన్ల అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్నారు. కేంద్రం లాగేసుకునేందుకు ఈ బిల్లును తెచ్చిందన్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్‌ సబ్సిడీలు ఎత్తేయాల్సి వస్తుందన్నారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు కోల్పోతామన్నారు. అందరూ సబ్సిడీ లేకుండా విద్యుత్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నగదు బదిలీ రూపంలో సబ్సిడీలను ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపేందుకు వారి నుంచి రైలు టికెట్‌ చార్జీలను కేంద్రం వసూలు చేయడం సరైనది కాదన్నారు. స్పెషల్‌ రైళ్లు, రిజర్వేషన్ల పేరుతో దోపిడీ అవసరమా అని ప్రశ్నించారు. వలస కూలీలను వారి రాష్ట్రాలకు పంపేందుకు టికెట్‌ చార్జీల కింద మంగళవారం రూ.4 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు కట్టిందన్నారు.

బలంగా మారిన కరోనా వైరస్! ఇంక్యుబేషన్‌ వ్యవధి 28 రోజులు!

ఇప్పటి వరకూ మనం చూస్తున్న కరోనా వైరస్... బంతిలా ఉండి... దానిపై అక్కడక్కడా కొవ్వుతో తయారైన ముళ్లు ఉన్నాయి. కొత్తగా కనిపిస్తున్న కరోనా వైరస్‌కి ఆ ముళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా రూపాంతరం (Mutation) చెందిన కొత్త వైరస్... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందనీ, ఇది ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనది, బలమైనది అని అమెరికాలోని లాస్ అలామోస్ నేషనల్ లాబొరేటరీ (LANL) శాస్త్రవేత్తల బృందం తెలిపింది. కరోనా సోకిన వ్యక్తిలో లక్షణాలు కనిపించడానికి (ఇంక్యుబేషన్‌ వ్యవధి) 28 రోజుల వరకు పట్టవచ్చని ఉత్తరప్రదేశ్‌ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో కరోనా లక్షణాలు 14 రోజుల్లో బయటపడటంలేదని సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ ఎస్‌కే కల్రా తెలిపారు. ఓ వ్యకిలో వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు పరీక్షలు జరిపితే 'నెగెటివ్‌'గా, ఆ తర్వాత వైరల్‌ లోడ్‌ పెరిగితే 'పాజిటివ్‌'గా వస్తుందని ఆగ్రా జిల్లా దవాఖాన చీఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ సతీశ్‌ వర్మ వివరించారు. నిర్బంధంలో ఉన్న వ్యక్తులకు తరుచూ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కరోనా వైరస్‌ రెండు రకాలుగా ఉన్నాయని తేల్చింది ఓ పరిశోధన.. కరోనా వైరస్‌పై పెకింగ్‌, షాంఘై వర్సిటీలకు చెందిన పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. కొవిడ్‌-19లో ఎల్‌, ఎస్‌ అనే రెండు జాతులు ఉన్నట్టుగా తేల్చారు. ఈ రెండు రకాల్లో 'ఎస్‌' రకం మొదటి నుంచీ ఉండగా.. జన్యు ఉత్పరివర్తనం కారణంగా 'ఎల్‌' రకం పుట్టుకొచ్చిందని ఆ అధ్యయనం తేల్చింది. ఇక మొదటి రకం ఎస్ కంటే 'ఎల్' మహా ప్రమాదకరమైన వైరస్ అని అంటున్నారు. అంతే కాదు ఇప్పటి వరకు ఎక్కువగా నమోదు అయిన కేసుల్లో 'ఎల్' ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొత్త కరోనా వైరస్‌పై ఏర్పడిన అదనపు ముళ్ల వల్ల అది మరింత తేలిగ్గా... ఊపిరి తిత్తుల్లో ఉన్న శ్వాస కణాల్లోకి వెళ్లగలుగుతోంది. ప్రస్తుతం కరోనాకి వ్యాక్సిన్ తయారుచేస్తున్న సంస్థలన్నీ... ఈ కొత్త వైరస్ రూపురేఖలు, సామర్ధ్యాన్ని వెంటనే గుర్తించి... అందుకు తగిన వ్యాక్సిన్ తయారుచెయ్యాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.

తెలంగాణ వైన్‌షాపుల వద్ద భారీ క్యూ! పండుగ చేసుకుంటున్న మద్యం ప్రియులు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2300 మద్యం దుకాణాలు ఉండగా.. ఇందులో 15 షాపులు కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్నాయి. ఆ 15 షాపులు త‌ప్ప మిగతా అన్ని దుకాణాలూ తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఎక్సైజ్ అధికారులు, యజమానులు వైన్‌షాపుల ముందు సామాజిక దూరాన్ని పాటించే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. మందుబాబులు ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉదయం 6 గంటల నుంచే మద్యం షాపుల ముందు బారులు తీరి వేచి ఉన్నారు. చీప్ లిక్కర్‌పై 11 శాతం, మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణాలో పెంచిన ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్డినరీ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.10, 375 ఎంఎల్‌పై రూ.20, 750 ఎంఎల్‌పై రూ.40 అదనంగా పెరిగింది. ఇక మీడియం లిక్కర్‌కు సంబంధించి 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.20, 375 ఎంఎల్‌పై రూ.40, 750 ఎంఎల్‌పై రూ.80 పెరిగింది. ప్రీమియం లిక్కర్‌ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.30, 375 ఎంఎల్‌పై రూ.60, 750 ఎంఎల్‌పై రూ.120 అదనంగా పెరిగింది. మరోవైపు స్కాచ్ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.40, 375 ఎంఎల్‌పై రూ.80, 750 ఎంఎల్‌పై రూ.160 అదనంగా పెరిగింది. ఇక అన్ని సైజుల బీర్‌పై ఫ్లాట్ రూ.30 పెరిగింది. మద్యం దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, ఎక్కడైనా దీన్ని ఉల్లంఘించినట్లు తెలిస్తే ఆ క్షణమే సదరు దుకాణం లైసెన్సు రద్దుచేస్తామని తెలంగాణా ప్ర‌భుత్వంస్పష్టం చేసింది. మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ తెరచి ఉంచుతారు. ప్రజలు క్రమశిక్షణతో, భౌతిక దూరం పాటిస్తూ కొనుగోళ్లు చేయాలని, మాస్కు ధరించకపోతే మద్యం అమ్మవద్దని, దుకాణాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని అధికారులు సూచనలు జారీ చేశారు.

క‌రోనాతో క‌లిసి బ్ర‌త‌కాల్సిందే: సి.ఎం. కేసీఆర్‌

క‌రోనా స‌మ‌స్య రేపో మాపో స‌మ‌సిపోయేది కాదు. కాబ‌ట్టి క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందేన‌ని సి.ఎం. కేసీఆర్ అన్నారు. మ‌న చేతిలో వున్న ఏకైక ఆయుధం లాక్‌డౌన్‌. ఉపాయంతో మ‌న‌ల్ని మ‌న‌మే ర‌క్షించుకోవాలి. క‌రోనా స‌మ‌స్య ఇప్ప‌ట్లో స‌మ‌సిపోదు. కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తూచ త‌ప్ప‌కుండా క‌ఠినంగానే అమ‌లు చేస్తున్నాం. రేప‌టినుంచి భూముల కొనుగోళ్ళు, అమ్మ‌కాలకు అనుమ‌తి ఇచ్చాం. రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు, ఇసుక మైనింగ్ ప్రారంభిస్తున్న‌ట్లు సి.ఎం. తెలిపారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌న్నీ పూర్తి స్థాయిలో ప‌నిచేస్తాయ‌ని సి.ఎం. తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు పూర్తి చేస్తాం. రేప‌టి నుంచి ఇంట‌ర్ స్పాట్ వ్యాల్యూయేష‌న్ ప్రారంభిస్తాం. 65 ఏళ్ళు దాటిన వారు, చిన్న‌పిల్ల‌లు బ‌య‌‌టికి రావద్దని సి.ఎం. విజ్ఞ‌ప్తి చేశారు.  రెడ్‌జోన్ల‌లో షాప్‌లు తెరిచే అవ‌కాశం వుంది కానీ ఎట్టి ప‌రిస్థితుల్లోను అనుమ‌తి ఇవ్వ‌డం లేదు. గృహ‌నిర్మాణ యాక్టివిటీకి అనుమ‌తి ఇచ్చాం. నిత్యావ‌స‌ర‌వ‌స్తువుల షాపుల్ని అనుమ‌తించామని సి.ఎం. తెలిపారు. షాపుల‌న్నీ ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు తెరిచివుంటాయి.   చిల్ల‌ర రాజ‌కీయాలు, చీప్ పాలిటిక్స్ కొంత మందికి అల‌వాటైపోయింది.  ఉచిత వినోదం పంపే జోక‌ర్లు, భ‌ఫూన్‌గాళ్ళ‌ని తెలంగాణా ప్ర‌జ‌లు వారిని చూసి న‌వ్వుకుంటున్నారని సి.ఎం. కేసీఆర్ ఎద్దేవా చేశారు. క‌నీసం ఏ స‌మ‌స్య‌పై పోరాడాల‌నే తెలివి కూడా లేకుండా ఛండాలంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప‌నికిమాలిన ధ‌ర్నాలు చేస్తూ  అభాసుపాలు కావ‌ద్ద‌ని కేసీఆర్ సూచించారు.  చిల్ల‌ర‌గాళ్ళ మాట‌ల్లో ప‌డి రైతులు భ‌విష్య‌త్ చెడ‌గొట్టుకోవ‌ద్దని విజ్ఞ‌ప్తి చేశారు. రైతులు ఆలోచించండి. మాకు క‌మిట్‌మెంట్ వుంది. వంద శాతం రైతుల్ని ఆదుకుంటాం. రైతు బంధు య‌థాత‌థంగా కొన‌సాగిస్తాం సి.ఎం. భ‌రోసా ఇచ్చారు. రాజ‌కీయ డ్రామాల్లో ఇరుక్కుంటే మీరే న‌ష్ట‌పోతారు. తెలంగాణాలో వున్న‌ది రైతు రాజ్యం. చిల్ల‌ర‌గాళ్ళ రాజ్యం కాదు. రైతుసంక్షేమం పేద‌ల సంక్షేమంలో రాజీ ప‌డం.  మే 15న మ‌రోసారి స‌మీక్ష చేసి స‌డ‌లింపుల విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సి.ఎం. తెలిపారు.

రేప‌టి నుంచే తెలంగాణాలో మ‌ద్యం షాపుల‌కు అనుమ‌తి!

కంటైన్‌మెంట్ జోన్‌లో వున్న ఆ 15 షాపులు మిన‌హా  మిగ‌తా అన్ని చోట్ల షాపులు తెర‌వ‌డానికి తెలంగాణా ప్ర‌భుత్వం అనుమ‌తించింది. 16 శాతం ధ‌ర పెంచుకోవ‌డానికి  క్యాబినెట్ నిర్ణయించింది. చీప్‌లిక్క‌ర్ మీద 11 శాతం పెంచుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు.  చుట్టూ వున్న నాలుగు రాష్ట్రాల్లో  మ‌ద్యం దుకాషాలు తెరిచారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో 900 కిలోమీట‌ర్ల స‌రిహ‌ద్దు వుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణాలో ప్రారంభించ‌క‌పోతే మ‌ద్యం స్మ‌గ్లింగ్ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే రేప‌టి నుంచి తెలంగాణాలో మ‌ద్యం అమ్మ‌కాల‌కు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు సి.ఎం. ప్ర‌క‌టించారు.  మ‌ద్యం షాపుల వ‌ద్ద భౌతిక‌దూరం పాటించాల్సిందే. నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌క‌పోతే మ‌ద్యం షాపుల్ని మూసివేస్తాం. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం షాపులు తెరిచి వుంటాయి. షాప్ ఓన‌ర్లు క్ర‌మ‌శిక్ష‌ణ పాటించాలి. శానిటైజ‌ర్ పెట్టాలి. మాస్క్ లేక‌పోతే మ‌ద్యం ఇవ్వ‌వ‌ద్దు. మాస్క్ లేక‌పోతే కిరాణా షాపుల్లో కూడా నిత్యావ‌స‌ర వ‌స్తువులు ఇవ్వ‌వ‌ద్దని సి.ఎం ఆదేశించారు.

తెలంగాణాలో మే 29 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడ‌గింపు!

ఈ రోజు వ‌ర‌కు తెలంగాణాలో 1096 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. 628 పూర్తి చికిత్స పొంది ఆరోగ్యంగా ఇళ్ల‌కు వెళ్ళారు. ఈ రోజు కూడా 43 మంది డిశ్చార్జ్ అయి వెళ్ళారు. ప్ర‌స్తుతం 439 మంది చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా చికిత్స చేయ‌డం, నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో తెలంగాణా దేశానికే రోల్ మోడ‌ల్‌గా వుంది.  దేశంలో క‌రోనా డెత్ రేట్ 3.37 కాగా, తెలంగాణాలో డెత్ రేట్ 2.64 వుంది. అలాగే క‌రోనా చికిత్స త‌రువాత కోలుకున్న‌వారు దేశంలో రిక‌వ‌రీ రేట్ 27.40కాగా తెలంగాణాలో రిక‌వ‌రీ రేట్ 57.3 వుంద‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. తెలంగాణాలో వున్న బ‌యోటెక్ సంస్థ‌లు క‌రోనా వ్యాక్సిన్ ను అగ‌స్టు, సెప్టంబ‌ర్‌లో సిద్ధం చేసి ప్ర‌పంచంలోనే తెలంగాణాకు గుర్తింపు తీసుకురానున్నార‌ని సి.ఎం. కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణాలో 6 జిల్లాలు రెడ్ జోన్‌లో వున్నాయి. 9 జిల్లాలు గ్రీన్ జోన్‌లో వున్నాయి. 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో వున్నాయి. రాబోయే 11 రోజుల్లో 18 జిల్లాల‌న్నీ గ్రీన్ జోన్‌లోకి వెళ్ళ‌నున్నాయి.  66 శాతం కేసులు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనే వున్నాయి. 29 మంది చ‌నిపోతే 25 మంది ఇక్క‌డే చ‌నిపోయారు. కొత్త‌గా వ‌చ్చే కేసులు కూడా హైద‌రాబాద్ ప‌రిధిలోనే వ‌స్తున్నాయి. ప్ర‌జ‌లు భౌతిక‌దూరం పాటించాల్సిందేన‌ని సిఎం మ‌రో సారి పిలుపునిచ్చారు. తెలంగాణాలో పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని సి.ఎం. తెలిపారు. మెజార్టీ ప్ర‌జ‌లు లాక్‌డౌన్ పొడిగించాల‌నే సూచించారు. మంత్రి వ‌ర్గం కూడా పొడిగించాల‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసింది. మే 29 వ‌ర‌కు రాష్ట్రం లో లాక్ డౌన్ పొడిగిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. రాత్రి పూట క‌ర్ఫ్యూ మే 29 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని సి.ఎం. తెలిపారు. 

మంత్రి పేర్ని నాని అబద్దం చెప్పారా?

వంద బ‌ర్రెల‌ను తిన్న రాబందు ఒక్క గాలివాన‌కు బ‌లైపోయింది అన్నట్టు.. నలభై రోజులు లాక్డౌన్ ఒక్క నిర్ణయానికి బలైపోయింది. ఆ నిర్ణయమే మద్యం అమ్మకం. స్టార్ హీరో సినిమాకి థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ చేసే హంగామా కంటే వైన్ షాప్స్ వద్ద మందుబాబులు చేస్తున్న హంగామానే ఎక్కువగా ఉంది. కడుపులో మందు పడాలన్న ధ్యాసే తప్ప.. కరోనా మహమ్మారి అనేది ఒకటుందని.. మన నిర్లక్ష్యానికి మనతో పాటు మనకుటుంబం, మన దేశం ప్రమాదంలో పడతాయన్న ఆలోచనే లేదు. అందుకేనేమో లిక్కర్ షాపులకు క్యూ కట్టారు. ఇక ఏపీలో పరిస్థితి సరేసరి. వైన్స్ రీఓపెన్ చేసిన మొదటిరోజే దాదాపు రూ.70 కోట్ల విలువైన మద్యం అమ్ముడైందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యాన్ని నిషేధించి పేద వారి బతుకుల్లో వెలుగు నింపుతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. ఈ కరోనా కాలంలో వైన్ షాపులు తెరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. ధర పెంచడం వల్ల పేదలు మద్యానికి దూరమవుతారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. విపక్ష నేతలు మాత్రం ధర పెంచడం వల్ల మద్య నిషేధం సాధ్యం కాదని, అలా జరిగేటట్లయితే అంతలా జనం ఎందుకు ఎగబడతారని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఆదాయం కోసమే జగన్ సర్కార్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని ప్రతిపక్ష టీడీపీ మండిపడుతోంది. అయితే, వైసీపీ ప్రభుత్వం మాత్రం మద్యం అమ్మకాలను సమర్ధించుకుంటోంది. కేంద్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిందని చెబుతోంది. ఇక ఏపీ మంత్రి పేర్నినాని అయితే, ప్రధాని మోడీ పర్మిషన్ ఇచ్చాకే బ్రాందీ షాపులు తెరుచుకున్నాయని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది. అందుకే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయని మంత్రి చెప్పారు. కాగా, ఏపీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. మోడీ సర్కార్ మద్యం అమ్మమని చెప్పలేదు. అది ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశమని, దానిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని కేంద్రం చెప్పింది. దీంతో కొన్ని రాష్ట్రాలు ముందువెనక ఆలోచన లేకుండా ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ మద్యం దుకాణాలు తెరిచాయి. అదేమంటే కేంద్రం అనుమతి ఇచ్చింది అంటున్నారు. ఇక మంత్రి పేర్ని నాని అయితే, మోడీ పర్మిషన్ ఇచ్చాకే బ్రాందీ షాపులు తెరుచుకున్నాయని చెబుతున్నారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై నెటిజనులు మండిపడుతున్నారు. ఆదాయం కోసం వైన్స్ తెరిచి.. ప్రధాని మోడీ పర్మిషన్ ఇచ్చారు, అన్ని రాష్ట్రాల్లో ఓపెన్ అయ్యాయంటూ అబద్దాలు చెబుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిర్ణయం రాష్ట్ర పరిధిలోని అంశమే కదా, ప్రజల ప్రాణాలని లెక్క చేయకుండా ఇంత ఆతృతగా మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

ఆ లేఖ ఎస్‌ఈసీ ఆఫీస్‌లో చేయ‌లేదు! ఫోరెన్సిక్ నివేదిక

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లేఖకు సంబంధించి వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ లేఖకు సంబంధించి సీఐడీ అధికారులు అనేక విషయాలను రాబట్టారు. తాజాగా ఆ లేఖ ఎస్‌ఈసీ ఆఫీస్‌లో తయారుకాలేదని నిర్దారణ అయింది. లాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌లను పరిశీలించిన తరువాతే ఫోరెన్సిక్ నివేదికను అందించింది. నిమ్మగడ్డ పీఎస్‌ సాంబమూర్తి తప్పుడు సమాచారం ఇచ్చారని సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ అన్నారు. సాంబమూర్తి చెప్పినవి అన్ని అసత్యాలేనని అన్నారు. ఇందుకు సంబంధించి సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రమేష్‌ కుమార్‌ పీఏ సాంబమూర్తి అన్ని అసత్యాలే చెప్పారని అన్నారు. ఆ లేఖను ముందుగానే తయారుచేశారని.. అది బయటి నుంచి వచ్చిందని తెలిపారు. మార్చి 18వ తేదీ ఉదయం పెన్‌డ్రైవ్‌లో ఆ లేఖ రమేష్‌ కుమార్‌ వద్దకు చేరిందన్నారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో త్వరలోనే తేలుస్తామని చెప్పారు.  రమేశ్‌ కుమార్‌ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖపై తొలి నుంచి అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతో ఈ లేఖను టీడీపీ కార్యాలయంలో తయారైందని, ఆ లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీసీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను రమేష్‌ కుమార్‌ లేఖపై విచారణ చేపట్టాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ సందర్భంగా రమేశ్‌ కుమార్‌ చేసిన సంతకానికి, కేంద్ర హోంశాఖకు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదని విజయసాయిరెడ్డి అన్నారు.

ఆధార్ కార్డు.. గొడుగు.. మాస్క్ ఉంటేనే మద్యం!

ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్ర‌భుత్వం సూచనలు మేరకు మద్యం అమ్మకాలు చేపట్టింది. ఏ మద్యం దుకాణం ముందు చూసినా బారులు తీరిన మందుబాబులే కనిపిస్తున్నారు. మండు టెండలను సైతం లెక్కచేయకుండా మందుబాబులు దుకాణాల ముందు బారీ క్యూ లైన్లలో నిలబడ్డారు. కొంత మంది భౌతిక దూరం పాటించకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.  ఈ నేపథ్యంలో ఏపీలోని తెనాలి సీఐ హరికృష్ణ మందుబాబులకు కొత్త నిబంధనలు పెట్టారు. ఆధార్ కార్డు, గొడుగు ఉంటేనే మద్యం అమ్ముతారంటూ స్పష్టం చేశారు. గొడుగు ఉండడం వల్ల కచ్చితంగా ఒకరి నుంచి మరొకరు ఎడంగా ఉంటారని, దానికి తోడు ఎండ బారి నుంచి రక్షణగా ఉంటుందని, ఇక, ఇతర ప్రాంతాల నుంచి మద్యం కోసం వస్తుండడంతో విపరీతమైన రద్దీ ఏర్పడుతుందని వారిని కనుగొనేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. అలాగే మాస్క్ కూడా ఉండాలని నిబంధనలు విధించారు.

కిమ్ భార్య పోరు త‌ట్టుకోలేక అదృశ్య‌మైయ్యాడ‌ట‌!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 20 రోజుల పాటు కనిపించకుండా పోయారు. ఆపై బయటికి వచ్చారు. ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా కిమ్ రిబ్బన్ కట్ చేశాడు.  ఇంత‌కీ కిమ్ ఎందుకు క‌నిపించ‌కుండా పోయాడ‌నే విష‌యంపై ర‌క‌ర‌కాల వార్త‌లొస్తున్నాయి. అమ్మాయిల పిచ్చి బాగా వున్న కిమ్ ఏ దేశం వెళ్ళిన సరే అక్క‌డి అందమైన అమ్మాయిలతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాడు. అయితే  తన కేబినేట్‌లో ఉండే ఒక అందమైన అమ్మాయితో కిమ్ ప్రేమలో పడ్డాడట. అమ్మాయికి పెళ్లి అయింది.  దేశ ద్రోహం కేసులో ఆమె భర్తకు జైలు పంపి ఆమెతో పాటు పాంగ్యాంగ్‌కి దగ్గరగా ఒక చిన్న రిసార్ట్ లో ఎంజాయి చేయ‌డానికి వెళ్ళాడ‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న కిమ్ భార్య గుర్రుగా వుంది.  భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  కిమ్ భార్యకు నచ్చజెప్పే పనిలో ఉండి  బయటకు రాలేదట‌.

మద్యం తాగొద్దని చెప్పాలి కానీ, బ్రాండ్ల గురించి మాట్లాడతావా? అంబటి రాంబాబు

ఇలాంటి ఆపద సమయంలో ధరలు పెంచడం మంచిదా? అని చంద్రబాబు అంటున్నారు. మద్యం ఏమైనా నిత్యావసర వస్తువా? చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ మద్యం తాగొద్దంటూ ఉద్యమం చేయండి. అంతే తప్ప మద్యం ధరలు పెంచారంటూ, బ్రాండ్లు బాగాలేవంటూ ఉద్యమాలు చేయకండంటూ అంబ‌టి ఘాటుగా స్పందించారు. బ్రాండ్ల గురించి మాట్లాడుతూ నీచ సంస్కృతికి దిగజారుతారా? అయినా, చంద్రబాబు బాధ ఏంటో అర్థం కావడంలేదు. ప్రజలకు మద్యం అలవాటు చేసిందే చంద్రబాబు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్ర‌బాబు" అంటూ విమర్శలు గుప్పించారు. ప్రజలకు మద్యం అలవాటు చేసిందే చంద్రబాబు అన్న విష‌యం ఆంధ్ర‌ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌ని అంబటి రాంబాబు గుర్తు చేశారు. దక్షిణాదిన ఏ రాష్ట్రం కూడా మద్యం దుకాణాలు తెరవలేదని చంద్ర‌బాబు అబ‌ద్దాలు చెబుతున్నారు.  ప్ర‌జ‌లు మద్యం తాగొద్దని చెప్పకుండా, బ్రాండ్ల గురించి మాట్లాడడం ఏంటని అంబటి మండిపడ్డారు. కేంద్రమే మద్యం అమ్మకాలపై నిర్ణయం తీసుకుంది. కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయ‌న నిల‌దీశారు. తమ ప్రభుత్వం మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మద్యం రేట్లు పెంచడం ద్వారా డబ్బున్న వాళ్లు మాత్రమే తాగే పరిస్థితులు తీసుకువస్తామని, క్రమంగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పారు.

ఆ బ్రాండ్లతోనే ఆరోగ్య సమస్యలంటున్న చంద్రబాబు!

ఏపీలో మద్యం దుకాణాలు తెరవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు.  మద్యం దుకాణాల్లో కొన్ని బ్రాండ్లే అమ్ముతున్నారని, ఈ బ్రాండ్లను వినియోగించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని విమర్శించారు.    మద్యం దుకాణాలు వద్దని కొన్ని చోట్ల మహిళలు ఆందోళన చేస్తున్నారు. మద్యం వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి. మీ నిర్ణయం వల్ల ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో కరోనాను ఎలా కట్టడి చేస్తారో చెప్పాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. మద్యం వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయని  చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..దక్షిణాదిలో ఎక్కడా మద్యం దుకాణాలు తెరవకపోయినా ఏపీలో మాత్రం విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఓపెన్‌ చేశారని విమర్శించారు. మద్యం దుకాణాలను పోలీసులతో నియంత్రిస్తారా?.. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద పెడతారా అని ప్రశ్నించారు.