అన్నంపెట్టే రైతు మీద లేని ప్రేమ రుణఎగవేతదారులపై ఎందుకు?
posted on Apr 30, 2020 @ 11:55AM
రిజర్వు బ్యాంకు ఇటీవల ఉద్దేశపూర్వకంగా ఋణాలు ఎగవేత దారులకు ఊరట కలిగిస్తూ రూ 68 వేల 607 కోట్ల ఋణాలు రద్దుచేసింది. ఈ చర్యతో లాభపడినవారంతా ఒళ్ళు బలిసిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలే. అన్నం పెట్టే రైతు కన్నీరు పెడుతుంటే వ్యవసాయ ఋణాల్ని ఎందుకు రద్దు చేయరు?
తమ ఋణాలపై నెలవారి కిస్తీ చెల్లించని వేతన జీవులు, రైతులు, రైతు కూలీల ఆస్తులు జప్తు చేసే బ్యాంకులు ఈ బడా పారిశ్రామిక వేత్తలకు, అందునా ఉద్దేశపూర్వకంగా ఋణాల ఎగవేత దారులను ఎందుకు కరుణించాయో చెప్పాలి.
ఆరుకాలం కష్టపడితే రైతుకు వచ్చే ఆదాయం ఎంత? ఒకవేళ ప్రకృతి కన్నెర్ర చేస్తే? గాలి దుమారం, వడగండ్ల వాన లేదా అగ్గితెగులు, మెడవిరుపు, వగైరా లాంటి రోగాలు వస్తే ఏంటి రైతు పరిస్థితి? అసలు రైతు ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెడుతున్నాడు. ఎంత ఆదాయం పొందుతున్నాడు.
1. నారుమడి, మరియు పొలం దున్నడం : ₹ 5500=00
2. చదును చేయడం వేయడం : ₹ 1500=00
3. గట్టు చెక్కడం పెట్టడం : ₹ 1000 =00
4. వరి నాటు : ₹ 4000=00
5. వరి విత్తనాలు హైబ్రిడ్20 కిలోలు : ₹ 1800=00
6. కలుపు మందు కలుపు తీయడం : ₹ 1800=00
7.DAP 2 బస్తాలు : ₹ 2500=00
8. జింక్ 10 కిలోలు : ₹ 600=00
9.గుళికలు: ₹ 1000=00
10.యూరియా2బస్తాలు : ₹ 700=00
11. పొటాష్1బస్తా : ₹ 950=00
12.మందుల పిచికారీ : ₹ 1000=00
13. వరి కోత మిషన్ : ₹ 2000=00
14. మిషన్ కు ట్రాక్టర్ : ₹ 1000=00
15. ధాన్యం ఆరబెట్టడం : ₹ 500=00
16. హమాలి ఛార్జ్ : ₹ 1000=00
___ రైతు పెట్టుబడి మొత్తము. : ₹ 26,850=00 ____
ధాన్యం దిగుబడి బస్తాలు = 70
1 బస్తాకి కిలోలు = 40
70×40 = 28 క్వింటాళ్లు
క్వింటాలుకు...ధర * ₹ 1810×28= 50,680=00*
రైతు పెట్టుబడి= ₹ 26,850=00
రైతుకు మిగిలింది= ₹ 23830=00 రైతు 6నెలల కష్టార్జితం
*రైతుకు 1నెల కష్టార్జితం = ₹ 3971=00
అంటే రైతుకు ఒక్క రోజుకు పడే కూలి ₹ 132=00
మనకు అన్నం పెట్టే రైతు పరిస్థితి ఇంత దారుణంగా వుంది. 6 నెలలు కష్టపడితే కానీ రైతు పండించే ధాన్యం గింజ మన కంచంలో అన్నం గా మనం తింటాము.
రైతు ఆదాయం కనీసం ఇంకొక 50% నుంచి 75% పెరగడమే ఎకైక పరిష్కారం, దానికి ప్రభుత్వం మార్గాలు అనుసరించాలి, రైతు ఉత్పత్తులను విలువ జోడిస్తే చాలా వరకు మేలు చేకూరుతుంది
ఉద్దేశపూర్వక ఋణాలు ఎగ్గొట్టిన వారి పట్ల బ్యాంకులకు ఇంత ప్రేమ ఎందుకో తెలియదు. అయినా ఈ వెసులుబాటు వ్యవసాయ ఋణాలకు ఎందుకు ఉండదు? ఉన్నా ఈ స్థాయిలో ఎందుకు ఉండదు? కంటితుడుపు ఋణమాఫీలు మాత్రమే ఎందుకుంటున్నాయి? అది కూడా ప్రభుత్వాలు మాత్రమే అమలు చేస్తున్నాయి కానీ బ్యాంకులు ఎందుకు అమలు చేయడం లేదు?
దేశంలోని ఏ బ్యాంకు ఆదాయం చూసినా అది ప్రజల నుండి డిపాజిట్ల రూపంలో వచ్చినదే. ప్రజలనుండి సేకరించిన సొమ్ము ప్రజలకు చెందకుండా ఇలా "ఉద్దేశపూర్వక ఋణ ఎగవేతదారులకు" లబ్ది చేకూర్చడం ఏ ఆర్థికశాస్త్రమో పాలకులే చెప్పాలి.
అసలు సీక్రెట్ ఇక్కడే వుంది. రైతులు రాజకీయనాయకులకు పార్టీ ఫండ్‌గా ఎన్నికల సమయంలో విరాళాలు ఇవ్వరు. పైగా ఎన్నికల్లో పోటీ చేసే నాయకులే ఓటుకు 500 రూపాయలు చొప్పున పడేస్తారు. ఈ డబ్బంతా నేతలు చందాల రూపంలో ఇలా ఉద్దేశపూర్వక ఋణాలు ఎగ్గొట్టిన వారి నుంచి తీసుకుంటారు.
ఈ బడా వ్యాపారస్థులు బ్యాంకు నుంచి తీసుకున్న రుణం నుంచి 20 శాతం వరకు పార్టీ ఫండ్‌గా రాజకీయ నేతలకు విరాళాలుగా అందిస్తారు. అధికారంలోకి వచ్చిన తరువాత పాలకులు బ్యాంక్ నుంచి తీసుకున్న పూర్తి రుణాన్ని మాఫీ చేస్తూ పాలసీ నిర్ణయం తీసుకుంటారు. అది లెక్క. అంతే.