ఆ బ్రాండ్లతోనే ఆరోగ్య సమస్యలంటున్న చంద్రబాబు!

ఏపీలో మద్యం దుకాణాలు తెరవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు.  మద్యం దుకాణాల్లో కొన్ని బ్రాండ్లే అమ్ముతున్నారని, ఈ బ్రాండ్లను వినియోగించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని విమర్శించారు.    మద్యం దుకాణాలు వద్దని కొన్ని చోట్ల మహిళలు ఆందోళన చేస్తున్నారు. మద్యం వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి. మీ నిర్ణయం వల్ల ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో కరోనాను ఎలా కట్టడి చేస్తారో చెప్పాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. మద్యం వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయని  చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..దక్షిణాదిలో ఎక్కడా మద్యం దుకాణాలు తెరవకపోయినా ఏపీలో మాత్రం విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఓపెన్‌ చేశారని విమర్శించారు. మద్యం దుకాణాలను పోలీసులతో నియంత్రిస్తారా?.. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద పెడతారా అని ప్రశ్నించారు.

బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా?

గతంలో పది ఇళ్లకు ఒక బెల్టు షాపు కొనసాగితే ఎక్కడా క్యూలు ఉండేవి కావని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి వచ్చాక బెల్టు షాపులే లేకుండా చేశారని, వైన్ షాపుల సంఖ్య తగ్గించడం వల్ల జనాల్లో కొంత ఆతృత కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎన్టీర్ తెచ్చిన మద్య నిషేదాన్ని ఎత్తేసిన వ్యక్తి గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోందని ఎద్దేవాచేశారు. “ఉప్పల్ హెరిటేజ్‌లో నలుగురికి కరోనా, వారి వల్ల 25 మంది క్వారంటైన్‌” వీరంతా సత్వరం కోలుకోవాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. ఈ వార్త పబ్లిష్‌ కాకుండా, టెలికాస్ట్‌ కాకుండా మీడియాను మేనేజ్‌ చేసిన చంద్రబాబును ఏం చేయాలి? బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా? అని విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు.

మద్యం ధరలు పెంచడానికి కారణం అదే: సీఎం జగన్‌

అమరావతి: దశల వారీ మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి లిక్కర్‌ ధరలను భారీగా పెంచినట్టు ఆయన వెల్లండిచారు. ఇదే సమయంలో అక్రమ మద్యం రవాణాకు గట్టి చర్యలు చేపడతామని తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహించారు. మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.  ‘లిక్కర్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎలా జరుగుతుందో అన్న విషయాన్నిన్ని టీవీఛానళ్లు, పేపర్లు చూపిస్తున్నాయి. మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి 75 శాతం పెంచాలి. మనం 25 శాతం పెంచి తగ్గించాలనుకుంటే.. ఢిల్లీలో 70 శాతం పెంచారు. అందుకే 75 శాతం పెంచి.. గట్టి చర్య తీసుకున్నాం. మద్యం దుకాణాల సంఖ్యను మరో 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 20 శాతం తగ్గించాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 33 శాతం తగ్గించినట్టు అవుతుంది. ప్రతి షాపు వద్ద ఇంతకుముందు ప్రైవేటు రూమ్స్‌ పెట్టారు. మనం దీన్ని రద్దుచేశాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 43 వేల బెల్టు షాపులను రద్దు చేశాం. గ్రామాల్లో బెల్టు షాపులు శాశ్వతంగా లేకుండా చేయాలంటే... లాభాపేక్ష లేనప్పుడే జరుగుతుంది. అందుకనే ప్రైవేటు వారికి కాకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది. లేకపోతే సేల్స్‌ను పెంచుకోవడం కోసం ప్రైవేటు వాళ్లు బెల్టు షాపులను ప్రోత్సహిస్తారు. మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యం విక్రయించే వేళలలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటవరకూ పరిమితం చేశాం. అందులో భాగంగానే ఈ 75 శాతం పెంపు నిర్ణయం కూడా తీసుకున్నాం. షాక్‌ కొట్టించే రేట్లు ఉండాలని నిశ్చయించుకున్నాం. దీనివల్ల పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా, అలాగే రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని కూడా అడ్డుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి బాధ్యత ఎస్పీల మీద ఉంటుంది. దీనికోసం ప్రత్యేక పోలీసు అధికారిని పెట్టాం. లిక్కర్, ఇసుక మీద కలెక్టర్లు, ఎస్పీలు గట్టి ధ్యాస పెట్టాలి. కేవలం ఎక్సైజ్‌ సిబ్బంది మాత్రమే పూర్తిగా నియంత్రించలేరు. పోలీసులు దీంట్లో భాగస్వామ్యం కావాలి. అక్రమ మద్యం రవాణా, మద్యం తయారీ, ఇసుక అక్రమాలు ఎట్టి పరిస్థితులోనూ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష అనేది ఉండకూడదని కలెక్టర్లకు, ఎస్పీలకు గట్టిగా చెప్తున్నా. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఈ అంశాలను దగ్గరుండి నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. దాన్ని నిలబెట్టుకోవాల’ని వైఎస్‌ జగన్‌ అన్నారు.

రోజా సహా ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు!

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు నోటీసులు జారీ అయిన వారిలో రోజా, రజని తో క‌లిపి ఐదుగురు ఎమ్మెల్యేలు  లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో రోజా, విడదల రజని, మధుసూదన్ రెడ్డి, సంజీవయ్య, వెంకట గౌడ్ లు ఉన్నారు. కరోనా వ్యాప్తికి వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలే కారణమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఇంద్రనీల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. అనంతరం నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది . లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలకు నిత్యావసరాలను పంచడం, డబ్బు పంపిణీ చేయడం, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేశారు. ఈ కార్యక్రమాల సందర్భంగా సోషల్ డిస్టెన్స్ కూడా పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి విజువల్స్ మీడియాలో ప్రసారమయ్యాయి.

వైరస్‌ పుట్టుక ల్యాబ్‌ లోనే! చైనా మూల్యం చెల్లించుకోక తప్పదా?

కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌ ల్యాబ్ లోనే ‌ పురుడు పోసుకుందని అమెరికా మరోసారి ఆరోపించింది. ఐతే ఈ సారి మాత్రం ఈ ఆరోపణలకు పక్కా సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ కావాలనే చైనా కరోనా వైరస్‌ను ల్యాబ్‌ నుంచే విడుదల చేసిందని వెల్ల‌డించారు. చైనా కుట్రను త్వరలోనే ప్రపంచం ముందు ఉంచుతామని ఆయన అన్నారు. కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించటానికి చైనాయే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైరస్‌ కారణంగా జరిగిన నష్టాన్ని చైనా నుంచి వ‌సూలు చేస్తామ‌ని అమెరికా చెబుతోంది.  అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ పలుమార్లు కరోనా వైరస్‌ పుట్టుక వుహాన్‌ ల్యాబ్‌ లోనే జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన నోబెల్‌ బహుమతి గ్రహీత కరోనా వైరస్‌ వుహాన్‌ నుంచి బయటకు వచ్చిందని చెప్పారు. జపాన్‌కు చెందిన ఓ సైంటిస్టు కూడా ఇదే ఆరోపణ చేశారు. దీంతో అమెరికా చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లవుతోంది. నిజంగానే అమెరికాకు ఏమైనా ఆధారాలు దొరికాయా?

తెలంగాణలోనూ మద్యం అమ్మకాలకు సర్కార్ ఓకే!

కరోనా వైరస్ నియంత్రణ కోసం మార్చి 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా మూతబడిన మద్యం దుకాణాలు లాక్డౌన్ కారణంగా ఇప్పటివరకు తెరుచుకోలేదు. అయితే, కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలను తాజాగా పునఃప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోనూ మద్యం విక్రయాలు చేపట్టాలని సర్కారు నిర్ణయానికి వచ్చింది. తెలంగాణలో త్వరలోనే మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయి.  మద్యం తాగేందుకు ఇక్కడి ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారని, దీని ద్వారా అక్కడ నుంచి రాష్ట్రంలోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు వచ్చాయి. ఈ కారణాలరీత్యా రాష్ట్రంలో కూడా మద్యం విక్రయాలు పునరుద్ధరించడం అనివార్యంగా మారిందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ఈ నాలుగు జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన 29 జిల్లాల్లో మద్యం విక్రయాలు మే 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన స్టాకు తరలింపు ప్రక్రియ ప్రారంభ‌మైంది. కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్ మే 7తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీనిని మరికొన్ని రోజులు పొడిగించే అంశంతో పాటు మద్యం విక్రయాలు, ఇతర సడలింపులపై రాష్ట్రమంత్రివర్గం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మే 21 వరకు మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.  రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు లాంఛనమే కాగా, కొత్తగా ప్రకటించనున్న సడలింపుల విషయంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.    రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించేందుకు మరికొన్ని రోజులు వేచి చూస్తారని తెలుస్తోంది. ఆటోలు, ఆర్టీసీ బస్సులు వంటి ప్రజారవాణా సదుపాయాలను పునరుద్ధరిస్తే లాక్డౌన్ను అమలు చేయడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పూలు చల్లి..మద్యం ప్రియులకు ఘన స్వాగతం!

మందుబాబులు వెల్ కం.. స్వాగతం.. సుస్వాగతం... అంటూ ఓ వ్యక్తి  చేసిన హ‌ల్‌చ‌ల్ వీడియో వైర‌ల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ప్రియులకు అనూహ్యరీతిలో స్వాగతం లభించింది. మద్యం కోసం క్యూలైన్లలో నిల్చున్న మందు బాబులపై ఓ వ్యక్తి పూలవర్షం కురిపించాడు. మంగళవారం ఉదయం చందర్‌నగర్‌లోని ఓ మద్యం షాపు వద్ద కిలోమీటర్ల మేర జనాలు బారులు తీరారు. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి కవర్‌లో నుంచి పూలు తీసి మందుబాబులపై చల్లాడు. ఈ సందర్భంగా ఆ వ్యక్తి మాట్లాడుతూ.. మన దేశానికి ఆర్థిక వనరులు మీరే.. ప్రభుత్వం వద్ద నగదు లేదని పేర్కొన్నాడు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా మందుబాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరి.. తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు. దాదాపు 40 రోజుల తర్వాత మద్యం షాపులు తెరుచుకున్నాయి.  దీంతో మద్యం ప్రియులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు.  మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా..క్యూలో నిలుస్తున్నారు.  ఢిల్లీ ప్రభుత్వం కరోనా సెస్ విధించింది. కరోనా ఫీ పేరిట ఏకంగా 70 శాతం సుంకం విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంగళవారం నుంచి మద్యం ధరలు మ‌రింత పెరగనున్నాయి.

కరెంట్ బిల్లులు మాఫీ చేసి ఇంటి అద్దె ప్రభుత్వమే చెల్లించాలి! జగ్గారెడ్డి డిమాండ్‌

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 వేల రూపాయ‌ల‌ లోపు అద్దె ఉన్న వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. కరోనా కాలంలో ఇంటి కరెంట్ బిల్లులు మాఫీ చేయాలని జగ్గారెడ్డి కోరారు. ఇంటి పన్నులను కూడా ప్రభుత్వం మాఫీ చేయాలని, వర్షాకాలంలో రైతులకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ తో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగ్గారెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయని, ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1500 కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగానే ఉన్నా, పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. మూడు నెలల పాటు అద్దె మినహాయించినా, తర్వాత కట్టాల్సిందే కదా అని అభిప్రాయపడ్డారు. అందుకే, ఇంటి అద్దెలు క‌రెంట్ బిల్లులు కూడా ప్రభుత్వమే భరించాలని ఆయ‌న సూచించారు.

చ‌ప్ప‌ట్లు, దీపాలు, పూలు! ఇప్ప‌డు తీర్థంలా మ‌ద్యం!

''గంటలు మోగించారు! చ‌ప్ప‌ట్లు కొట్టారు! దీపాలు వెలిగించారు... పై నుంచి పూలు చల్లారు...ఇకపై తీర్థం ఇస్తున్నట్లుగా మద్యం అమ్మకాలు ప్రారంభించారు'' అని సెటైర్ వేశారు సీపీఐ రాష్ట్ర రామకృష్ణ. రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవడంపై ఆయ‌న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలపై పునరాలోచన చేయాలని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం తాపత్రయపడుతోందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు? కేంద్ర ప్రభుత్వం బుక్‌స్టాల్స్‌కు అనుమతులివ్వగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వైన్ షాపుల‌కు మాత్ర‌మే అనుమతి ఇచ్చి పుస్త‌కాల షాపుల‌కు ఎందుకు ఇవ్వలేద‌ని ఆయ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు లేఖ రాశారు. మద్యం షాపుల వద్ద లాక్‌డౌన్ నిబంధనలు పాటించ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. వ్యక్తిగత దూరం గాని కనీసం మాస్కులు కూడా లేకుండా మందుబాబులు బారులు తీరి లైన్లో నిల్చున్నారని అన్నారు. పోలీసుల బందోబస్తు మధ్య మద్యం అమ్మకాలు సాగించాల్సిన తొంద‌ర దేనిక‌ని, ఇలాంటి దుస్థితి నెలకొనడం విచారకరమని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

బాయ్ ఫ్రెండ్ వీర్యాన్ని జ్యూస్ తో క‌లిపి తాగేస్తుందట‌!

ఫిట్ నెస్ ట్రైనర్‌గా వ్యవహరించే కిస్ అలా ఎందుకు చేస్తుంది? వీర్యాన్ని జ్యూస్‌తో క‌లిపి ఎందుకు తాగుతోంది? క‌రోనాకు ఈమె అల‌వాటుకు ఏమైనా లింక్ వుందా? సైంటిఫిక్ రీజన్ ఏమిటి? ఇంగ్లండ్ లోని ఏల్స్ బ్యూరీకి చెందిన 32 ఏళ్ల ట్రాసీ కిస్ అనే మహిళ గడిచిన కొద్ది రోజులుగా తన బాయ్ ఫ్రెండ్ వీర్యాన్ని అదే పనిగా జ్యూస్ లో  కలుపుకొని తాగేస్తుందట.  రోగ నిరోధక శక్తి పెంచుకోవటానికి ఇలా చేస్తుంద‌ట‌. ప్రపంచమంతా కరోనా భయాందోళన్లో మునిగి తేలుతున్న వేళ.. దానికి చెక్ చెప్పేందుకు వీలుగా వీర్యాన్ని తాగితే మంచిదన్నది ఆమె భావన. దానికి సైంటిఫిక్ రీజన్ ఏమిటన్న విషయాన్ని క్లియర్ గా చెప్పట్లేదు. వీర్యాన్ని తల్లిపాలతో పోలుస్తోంది ఈ ఫిట్ నెస్ ట్రైనర్‌.  ఆమె.. విటమిన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్లే వీర్యాన్ని తాగుతున్న‌ట్లు చెబుతోంది. తాను 2017 నుంచి వీర్యాన్ని తీసుకుంటున్నట్లు చెబుతోంది. అందులో బోలెడన్ని విటమిన్స్ ఉంటాయని.. ఆ అలవాటు తోనే తనకు ఇప్పటివరకూ జలుబు.. జ్వరం రాకపోవటానికి కారణమని చెబుతోంది.  ఫిట్ నెస్ ట్రైనర్ కిస్ చెబుతున్న విధానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించ లేదు. కరోనాకు ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాక్సిన్ లేదు.

వ్యక్తిగతంగా వచ్చేవారు ఏపీకి రావ‌ద్దు! సీఎం జ‌గ‌న్‌!

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలు మాత్ర‌మే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏపీలో రావ‌డానికి అనుమ‌తిస్తున్నాం. లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిలో వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థులనే అనుమతిస్తామని సిఎం. ప్రకటన చేశారు. అయితే చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు వారి వివరాలను పరిశీలించి రాష్ట్రంలోకి రావ‌డానికి అవకాశం కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టం వ‌ల్ల ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటోందని సి.ఎం. జ‌గ‌న్ చెప్పారు. వ్యక్తిగతంగా వచ్చేవారికి అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి మెరుగైన వసతులు కల్పించి, ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి క్వారెంటైన్ త‌రువాతే వారి వారి ఇళ్ల‌కు పంపించ‌నున్నారు.   మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు హైద‌రాబాద్‌లోనే వున్నారు. అయితే ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై బాబు ఎలా స్పందిస్తార‌ని ఏపీ ప్ర‌జ‌లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

టెన్త్ పరీక్షల నిర్వ‌హ‌ణ‌కు కొత్త రూల్స్!

పదవ తరగతి పరీక్షల నిర్వహణా షెడ్యూల్ని ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.  లాక్ డౌన్ క్రమక్రమంగా ఎత్తి వేస్తున్న తరుణంలో పదవతరగతి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది.  సామాజిక దూరం పాటిస్తూనే పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఒక పరీక్ష హాలులో కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే కూర్చొని పరీక్షలు రాసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.  ప్రతి విద్యార్థికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండడంతో పాటు ప్రతి బెంచ్ కి ఒక్క విద్యార్థి మాత్రమే కూర్చునేలా విద్యాశాఖ కొత్త రూల్స్ తో మార్గ‌ద‌ర్శ‌కాలు త‌యారు చేసింది.  కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కార‌ణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎప్పుడో జరగాల్సిన పదో తరగతి పరీక్షలు ఇప్పటికీ  జరగకుండానే ఉన్నాయి. వైరస్ ప్రభావం తీవ్రంగా పెరిగిపోవడంతో పరీక్షలను వాయిదా వేయక తప్పలేదు.

మూడు మాస్క్‌లు ఏవీ...?: చంద్రబాబు

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మూడు మాస్క్‌లు పంపిణీ చేస్తామన్న మాట గాలికి వదిలేశారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రతి ఒక్కరికి  3మాస్క్ లు పంపిణీ చేయ‌లేద‌ని,  అరకొర చోట్ల ఇచ్చిన మాస్క్ లు కూడా కిరోసిన్ కంపుకొట్టేవి, విద్యార్ధుల యూనిఫామ్ క్లాత్ తో కుట్టినవి కావడంతో అక్కడే పారేసి పోతున్నారు. అదే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున టిడిపి అందజేసిన మాస్క్ ల నాణ్యత ఎంతో బాగుంది. నాణ్యమైన మాస్క్ లు ప్రతి పేద కుటుంబానికి వెంటనే పంపిణీ చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. మద్య నిషేధం పట్ల వైసిపి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని చంద్రబాబు విమర్శించారు. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సడలిస్తే అక్కడ మద్యం దుకాణాలు తెరిచి ప్రజల రక్తం పిండుకోవడం దారుణమని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులు పండించిన పంటలో పదోవంతు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, పంటలకు ధరలు లేక రైతులు నైరాశ్యంతో ఉన్నారని విమర్శించారు. క్వారంటైన్‌ కేంద్రాల నుంచి 14 రోజుల తర్వాత ఇంటికెళ్లేవారికి రూ.2 వేలు అందిస్తామన్న హామీ కూడా అమలు కాలేదన్నారు. హైదరాబాద్‌ నుంచి  టిడిపి నేతలతో ఆన్‌లైన్‌ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు. మద్దతు ధరల కోసం రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించడం వైసిపి ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమన్నారు. లాక్ డౌన్ తో కోట్లాది పేదలు ఉపాధి కోల్పోయి తినడానికి తిండిలేక అల్లాడుతున్నారని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  పదోవంతు పంటలు కొనలేదనడానికి కోర్టులో ప్రభుత్వ అఫిడవిట్ సాక్ష్యం.  పండించిన పంటలకు ధరలు లేక రైతులంతా నైరాశ్యంలో ఉన్నారు, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.   తెలంగాణలో ధాన్యం ఇప్పటికే 21లక్షల మెట్రిక్  టన్నులు కొనగా ఏపిలో కేవలం 4.92లక్షల టన్నులకే పరిమితం కావడం గప్పాలు కాక మరేమిటని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రుల కంటితుడుపు ప్రకటనలే తప్ప రైతులను ఆదుకుంది శూన్యమ‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. కరెంటు బిల్లులు తడిసి మోపెడై అల్లాడుతున్నారు. గతనెల బిల్లు రీడింగ్ కు అదనంగా ఈ నెల రీడింగ్ కలిపి ఆ మొత్తంపై పెరిగిన శ్లాబు ప్రకారం కరెంటు బిల్లులు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం దారుణమ‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రేపటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్లకు అనుమతి...

ఏపీలో కరోనా వైరస్ రాక తర్వాత విధించిన లాక్ డౌన్ కారణంగా మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రేపటి నుంచి తెరవాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతించిన సర్కారు.. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కంటైన్ మెంట్ జోన్ల బయట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచేందుకు ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం... తిరిగి రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వడం ద్వారా ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.  ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేపటి నుంచి కంటైన్ మెంట్ జోన్ల బయట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరుచుకోన్నాయి. అయితే కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ప్ఱభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రకారం ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు కూడా మాస్క్ లు ధరించాలని సూచించింది. ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలు సాగాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా వచ్చే వారికి ముందుగా అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రార్లకు సూచించింది. అలాగే ఉద్యోగుల హాజరు కోసం వాడే బయోమెట్రిక్ యంత్రాలను రోజూ శానిటైజ్ చేయాలని కోరింది. పది మంది కంటే ఎక్కువగా గుమికూడకుండా ఉంచాలని, ఆఫీసులను రోజూ డిస్ ఇన్ ఫెక్షన్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. ఇతరులు ఎవరినీ కార్యాలయాలకు అనుమతించరాదని ఆదేశించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట తప్పారు: డీకే అరుణ

రైతుల నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట తప్పారని అరుణ ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్ర‌భుత్వం ఘోరంగా వైఫ‌ల్యం చెకందింద‌ని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఆమె హితవు పలికారు.  కేంద్రం ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రానికి  పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నా కూడా టిఆర్ఎస్ నేతలు బిజెపిపై రాజకీయ విమర్శలకు దిగడం సరికాదని అరుణ వ్యాఖ్యానించారు. బిజెపి నేత‌లు కూడా ఈ స‌మ‌యంలో రాజకీయం చేస్తే టీఆర్ఎస్ మంత్రులు ఒక్కరు కూడా బయట తిరగలేని పరిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ని డీకే అరుణ ధ‌మ్‌కీ ఇచ్చారు. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వ పని తీరు, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వ అలసత్వం వంటి అంశాలపై  తెలంగాణ జేజెమ్మ ప్రభుత్వం పై విరుచుకు పడింది. తెలంగాణ వ్యాప్తంగా రైతులంతా బిజెపి నేతలను సంప్రదిస్తూ కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారని అరుణ వివరించారు.   క‌రోనా వైరస్ వ్యాప్తి, అకాల వర్షాలు, ధాన్యం సేకరణ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు బిజెపి నేతలపై ఎదురు దాడికి దిగితే సహించేది లేదని టీఆర్ఎస్ మంత్రులను ఆమె హెచ్చరించారు.

నిమ్మగడ్డ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా!

ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్‌పై విచారణ ఈరోజు పున:ప్రారంభం అయింది. ఉదయం 11 గంటలకు హైకోర్టులో నేరుగా విచారణ చేప‌ట్టారు. ఈ క్రమంలో హైకోర్టు సూచన మేరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న న్యాయవాదులకు పోలీసులు పాసులు అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్లో వేరే వారు వస్తుండటంతో నేరుగా విచారించాలని న్యాయవాదులు సూచించడంతో అందుకు ధర్మాసనం అంగీకారం తెలిపింది. నిమ్మగడ్డ  పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇప్పటికే పలు దఫాలు వాదనలు విన్నది. తాజాగా జరిగిన విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై దాదాపు 5 గంటల పాటు వాదోపవాదాలు సాగాయి. పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఆదినారాయణ, నారాయణ వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ మేరకు కోర్టు ముందు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి మరికొన్ని పిటిషన్లు ఉన్నందున, రేపటి విచారణలో మరికొందరు పిటిషనర్ల వాదనలు కూడా వినాలని హైకోర్టు భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలంపై ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీనిపై రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

వైన్స్ షాపుల ఎదుట భారీ క్యూ! పండ‌గ‌చేసుకున్న మందుబాబులు!

మందుబాబుల ఆనందానికి అవధులు లేవు. వైన్స్ షాపుల ఎదుట క్యూ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చాంతాండత క్యూలో నిలబడడం కనిపించింది. కిలోమీటర్ల మేర జనాలు నిలబడ్డారు. ఆంధ్ర‌ ప్రదేశ్‌లో మద్యం కోసం జనాలు బారులు తీరడంతో లిక్కర్ దుకాణాల వద్ద పెద్ద ఎత్తున క్యూలైన్లు కనిపిస్తున్నాయి.  చాలా రోజుల తర్వాత మద్యం షాపులు తెరవడంతో మందుబాబులు అందరూ మద్యం షాపులకు క్యూ కట్టారు. దేవుడా..ఒకే ఒక్క క్వార్టర్ వచ్చే విధంగా చూడు.. తన వంతు వచ్చే వరకు స్టాక్ ఉండాలి దేవుడా.. అంటూ మందుబాబులు..క్యూ లైన్ లో వేచి చూస్తూ దేవుడిని ప్రార్థించుకున్నారు. పెద్ద సంఖ్యలో బాటిళ్లు కొనుగోలు చేశారు. చాలా ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 7 గంటల నుంచే జనాలు బారులు తీరి కనిపించడం విశేషం. కొన్ని ప్రాంతాల్లో సామాజిక దూరం నిబంధనను సైతం మందుబాబులు గాలికి వదిలేశారు. దీంతో మద్యం దుకాణాల యజమానులు షాపుల బయట సర్కిల్స్ గీసి నిలబెట్టారు. కాగా మద్యం షాపుల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించ‌డం లేద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. బెంగుళూరులో మ‌హిళ‌లు కూడా లైన్‌లో నిల‌బ‌డ్డారు. విశాఖ‌, సిరిపురం, చిత్తూర్‌, నెల్లూరు, దుగ్గిరాల‌, పెద్ద‌పాలెం దృశ్యాలు  సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి.  తమకు పండుగ రోజు అంటూ కొంతమంది మందుబాబులు వెల్లడిస్తున్నారు. పండుగ రోజు ఎంత సంతోషంగా ఉంటారో..అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉండడం కనిపించింది. కొంతమంది గుర్తు పట్టకుండా ఉండేందుకు హెల్మెట్, పెద్ద పెద్ద టవల్స్, మాస్క్ లు ధరించి క్యూలో నిలబడ్డారు. ఎంతో నిరీక్షణతో ఎదురుచూస్తున్న మందుబాబులకు ప్రాణం లేచి వచ్చినంత పనయ్యింది. ఇక మద్యం షాపులు తెరిచి ఉండడంతో ఎప్పుడెప్పుడు మద్యం కొనుగోలు చేసి తాగుదామా అన్నట్లుగా నిరీక్షణ గా ఎదురుచూస్తున్నారు మందు షాపుల వద్ద. కానీ కొన్ని చోట్ల మాత్రం మందుబాబుల ఆశలపై నీళ్లు చల్లారు మహిళలు. మద్యం షాపులను తెరవద్దు అంటూ ఆందోళనకు దిగారు. నగరంలోని రేణిగుంట మండలం పాపానాయుడుపేట వద్ద సోమవారం మహిళలు ఆందోళనకు దిగారు. ఇళ్ల మధ్యలో ఉన్న బ్రాందీ షాప్‌లను మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. పోలీసుల జోక్యంతో మూడు మద్యం షాపులను తాత్కాలికంగా మూసివేశారు.  విజ‌య‌వాడ నగరంలో మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నేటి నుంచి మద్యం దుకాణాలు తెరువనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఉదయం నుంచి మద్యం ప్రియులు వైన్ షాపుల వద్ద బారులు తీరారు. అయితే విజయవాడ రెడ్‌జోన్ కావడంతో మద్యం షాపులు తెరవవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో సూపర్ వైజర్లు మద్యం షాపులను మూసివేసి సీల్ వేసి వెళ్లిపోయారు.

పోలీసులపై వలస కూలీల దాడి

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వలస కూలీల ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. తమ స్వస్థలాలకు పంపించాలని ఉదయం నుంచి వలస కార్మికులు ఆందోళనకు దిగారు. కొవ్వూరు ప్రధాన రహదారిపైకి ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌ ,ఒడిశాకు చెందిన 300 మందికిపైగా వలస కూలీలు చేరి ధర్నా చేపట్టారు. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులపై రాళ్లు, సీసాలతో వలస కూలీలు దాడి చేశారు. లాఠీఛార్జి చేసి వలసకూలీలను పోలీసులు చెదరగొట్టారు.  సొంత రాష్ట్రాలకు పంపాలని జాతీయరహదారిపై వలసకూలీలు ఆందోళన చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి అనుమతి వచ్చే వరకు పంపలేమని పోలీసులు చెబుతున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న డీఎస్పీ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కూలీలను తరలించేందుకు ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు వచ్చేంత వరకూ పంపించలేమని చెప్పారు. అయితే శాంతించని వలస కూలీలు పోలీసులపై రాళ్లు, సీసాలు విసిరి దాడికి దిగారు. దీంలో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. కూలీలు నడిచి వెళతామని పట్టుపడటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వీరంతా గోదావరి నదిలో ఇసుక కార్మికులుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు. అయితే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.