హైకోర్టులో నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు న్యాయమూర్తులు

*ప్రమాణస్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.కె.మహేశ్వరి *నూతనంగా నియమితులైన న్యాయమూర్తులు బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు హైకోర్టులోని ఒకటవ నెంబర్ హాల్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్) జితేంద్ర కుమార్ మహేశ్వరి నూతనంగా నియమితులైన న్యాయమూర్తులచే శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత హైకోర్టు ఇన్ చార్జ్ రిజిస్ట్రార్‌ జనరల్‌ బి. రాజశేఖర్ న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. నూతన న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత దస్త్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్లు, జడ్జిలు, ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

పోలీసులతో కిడ్నాప్ చేయిస్తారా: చంద్రబాబు ట్వీట్

మీడియాపై వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. సొంతమీడియాలో ఎవరి మీదైనా, ఎంత అసత్య ప్రచారమైనా చేస్తుంటారని, వైసీపీ నేతల అక్రమాలను కట్టుకథలల్లి కప్పిపుచ్చుకుంటారని విమర్శించారు. కానీ ప్రజలకు ఏ మీడియా వాళ్ళైనా నిజాన్ని చెబితే వైసీపీ వాళ్ళు కుతకుతలాడిపోతుంటారన్నారు. ఆ మీడియా ప్రతినిధులపై కక్షగట్టి, అధికార దుర్వినియోగం చేస్తూ వేధిస్తారని విమర్శించారు. మైరా టీవీ అధినేత ఆచూకీ కోసం, వారి బంధువులు, మీడియాతో ఏమాత్రం సంబంధం లేని వెంకట కృష్ణ, విద్యార్ధి సవితా వరేణ్య, వారి డ్రైవర్ శ్రీనివాసరావులను పోలీసులతో కిడ్నాప్ చేయించడమేంటని ప్రశ్నించారు. ‘‘ఏమిటీ అరాచకం? దీన్ని తెలుగుదేశం ఖండిస్తోంది. ప్రభుత్వం వెంటనే వారిని వారి కుటుంబాలకు అప్పగించాలి. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ న్యాయపోరాటానికి సిద్ధం అవుతుంది. అవసరమైతే మానవహక్కుల సంఘాన్ని సైతం ఆశ్రయిస్తాం. ప్రజా హక్కులను హరిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు’’ అని ఘాటుగా ట్వీట్ చేశారు.

ఏపీలో వలసకూలీల అనుమతికి మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులు 1902కి ఫోన్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రీన్‌జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌లకు మాత్రమే రాకపోకలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. రిలీఫ్‌ క్యాంప్‌లో నుంచి స్వగ్రామాలకు వెళ్లాలని అనుకునే వారికి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. కొవిడ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ వస్తే వారిని బస్సులో 50 శాతం మించకుండా తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. స్వగ్రామాల్లో సైతం మరోసారి 14 రోజుల క్వారంటైన్‌, అనంతరం మరో 14 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొంది. ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తిస్తే ఆ గ్రూప్‌ మొత్తాన్ని అక్కడే ఉంచాల్సిందిగా సూచించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు ఆ జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చిన రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వచ్చిన వారికి స్క్రీనింగ్‌ సహా పూల్‌ పద్ధతిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో రెడ్‌జోన్‌, కంటైన్‌మెట్‌ జోన్‌ నుంచి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తించాలని సూచించారు. ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటైన్‌కు పంపి పరీక్షల అనంతరం బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

లాక్ డౌన్ సమయంలో జరిమానాలా? హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ!

ఏపీ హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గ్రానైట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చిన అంశంపై కోర్టు మొట్టికాయలు వేసింది. వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారులకు దాదాపు రూ. 2,500 కోట్ల అపరాధ రుసుము విధిస్తూ గనులు, భూగర్భశాఖ గతంలో ఇచ్చిన నోటీసులను హైకోర్టు ఇంతకు ముందే కొట్టేసింది. అయితే, తాజాగా ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో, క్వారీ యజమానులు బెంబేలెత్తిపోయారు. ఓ క్వారీ యజమాని మాత్రం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన హైకోర్టు... ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో గతంలోనే ఒక తీర్పును వెలువరించామని... ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా గ్రానైట్ పరిశ్రమ మూతపడిన తరుణంలో జరిమానాలు విధించడం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడే ప్రభుత్వ నోటీసులకు క్వారీల నిర్వాహకులు స్పందించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత, గ్రానైట్ పరిశ్రమ గాడిలో పడిన తర్వాత ఆలోచిద్దామని చెప్పింది.

లక్ష బెడ్లు సిద్ధం చేయండి: సీఎం జ‌గ‌న్

ఏపీలో మొత్తం కోవిడ్‌–19 పరీక్షలు 1,08,403 నిన్న 5,943 పరీక్షలు ప్రతి పదిలక్షలకు 2030 మందికి పరీక్షలు పాజిటివిటీ కేసుల రేటు 1.41శాతం.. దేశవ్యాప్తంగా 3.82శాతం రాష్ట్రంలో మరణాల శాతం 2.16శాతం, దేశవ్యాప్తంగా 3.28శాతం కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్షించారు. వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో కోవిడ్‌–19 పరిస్థితుల కారణంగా చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చించారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించి వారిక్కావాల్సిన భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కనీసం ఒక లక్ష బెడ్లు సిద్ధంచేసుకోవాలని సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్‌ ఈ మూడూ కలిసి గ్రామాల్లో కోవిడ్‌ –19 క్వారంటైన్‌ చర్యలు చేపట్టాలని సూచించారు. కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా మార్చాలని సీఎం చెప్పారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు,పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేస్తున్నారు. కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేసి నిత్యావసరాలకోసం ఒక వ్యక్తికే పాసు ఇస్తున్నారు. సీఎం ఆదేశాల మేర‌కు డాక్టరు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త, మందులు కూడా మొబైల్‌ యూనిట్‌కు అందుబాటులో ఉంటారు. కేంద్రహోంశాఖ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడెక్కడ కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండాలి అన్నదాన్ని గుర్తించి, అక్కడ అనుసరించాల్సిన విధానాలపై విధివిధానాలను సీఎం ఆదేశం మేర‌కు అధికారులు తయారుచేస్తున్నారు.

ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ పొడిగించాం: కిషన్‌ రెడ్డి

రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ ను పొడిగించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన వలస కార్మికులను స్వస్థలాలకు పంపుతున్నాం. అయితే ప్రజలు ఎవ్వరూ రైల్వే స్టేషన్ల వద్దకు రావద్దని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో రైల్వే టిక్కెట్లు అమ్మబోరని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఎవ్వరూ రైల్వే స్టేషన్ల వద్దకు రావద్దని ఆయన సూచించారు. విద్యార్థులు, యాత్రికులు, కూలీలు వంటి వారికి ప్రత్యేకంగా అధికారులు ప్రయాణం చేసే అవకాశాలు కల్పిస్తున్నారని కిషన్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా సంబంధిత కూలీలు పనిచేస్తోన్న సంస్థలు రైల్వే టిక్కెట్లు ముందుగానే కొనాల్సి ఉంటుందని తెలిపారు. దేశంలోని 80 జిల్లాల్లో గత వారం రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కిషన్‌ రెడ్డి తెలిపారు. అలాగే, 26 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క కేసూ నమోదు కాలేదని అన్నారు. 40 జిల్లాల్లో గత 21 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలు, ఆయా ప్రాంతాల్లోని కరోనా కేసుల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను విభజించినట్లు చెప్పారు. పలు రాష్ట్రాలతో చర్చించి, ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ ను పొడిగించామని చెప్పారు. రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం కరోనాపై పోరాడుతుందని తెలిపారు. కట్టడి ప్రాంతాల్లో కర్ఫ్యూ తరహా వాతావరణం ఉండాలని చెప్పారు. కొత్త కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. ప్రజలకు కొన్ని వెసులుబాట్లు కలిగేలా విధివిధానాలు తయారు చేశామని చెప్పారు.

కరోనాతో జీవించాల్సిన కాలం! భ‌యంతో దాక్కుంటారా? ఎమ్మెల్సీ ఇక్బాల్

సామాజిక దూరం అంటే సమాజానికి దూరం కావడం కాదు అని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాల‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత,ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు క్లౌడ్ ..జూమ్.. అంటూ మేఘాలలో జీవించడం కాదు.. భూమి మీదకు రండిని ఆయ‌న అన్నారు. కరోనా కట్టడిలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని , ప్రభుత్వ యంత్రాగాన్ని అభినందించాల్సింది పోయి ... ప్రజల్లో లేనిపోని అపోహలు ,భయాలు ,ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం మీకు తగునా ? ఇకనైనా మీ ప్రవర్తన మార్చుకోండి చంద్రబాబు నాయుడు గారూ అంటూ త‌న‌దైన స్టైల్ ఇక్బాల్ చుర‌క‌లంటించారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు నాయుడు కనీసం సామాజిక బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆయ‌న ఆరోపించారు. కరోనాతో జీవించాల్సిన కాలం ఇది అని ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడితే మీకేందుకు తప్పుగా కనిపిస్తుందని ఆయ‌న ప్ర‌శ్నించారు. కరోనా విపత్కర సమయంలో కోవిడ్ వారియర్స్ గా పనిచేస్తోన్న వాలంటీర్లను ఇదే చంద్రబాబు నాయుడు హేలన చేస్తూ మాట్లాడ‌డాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు.  మనం ఎప్పుడైతే సోషల్ రెస్పాన్స్ బులిటీ మరిచిపోతామో.. అప్పుడే సోషల్ క్రైసిస్ పుట్టుకొస్తాయి. ఇప్పటికైనా రాజకీయాలు మాట్లాడకుండా బాధ్యతగా మాట్లాడండని ప్ర‌తిప‌క్ష నేత‌ను ఎమ్మెల్సీ ఇక్బాల్ సూచించారు.

కోడెలకు టీడీపీ నేతల ఘ‌న‌నివాళి!

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ 74వ జయంతి నేడు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన ప్రముఖ నేతలంతా ఆయనను ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు. ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా మననం చేసుకున్నారు.  అచ్చెన్నాయుడు : మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో కీలకశాఖలకు మంత్రిగా చేసినా, విపక్షంలో వున్నా, స్పీకర్ గా పనిచేసినా, ఓడిపోయినా ఏనాడూ ప్ర‌జ‌ల‌కు దూరం కాని ప్ర‌జ‌ల మ‌నిషి డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు గారి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందించిన సేవ‌లు స్మ‌రించుకుందాం. అయ్యన్నపాత్రుడు : రాజ‌కీయాలు ఎలా చేశారో, రాజీప‌డ‌కుండా ప్ర‌త్య‌ర్థుల‌పై అలాగే పోరాటం చేశారు డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు. ప‌ల్నాడులో అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట వేసిన డాక్ట‌ర్, స్పీక‌ర్ స్థానానికి వ‌న్నె తెచ్చారు. జ‌యంతి సంద‌ర్భంగా కోడెల శివ‌ప్ర‌సాద‌రావుకు నివాళుల‌ర్పిస్తున్నాను. బీటీ నాయుడు : ఓ గుట్టపై  వుండే  కోటప్పకొండ త్రికోటేశ్వ‌ర‌స్వామి ఆల‌యాన్ని అభివృద్ధి చేసిన ఘ‌న‌త డాక్ట‌ర్  కోడెల శివ‌ప్ర‌సాద‌రావు గారిదే. ఈ రోజు కోట‌ప్ప‌కొండ ప్రాంతం ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్ర‌మైందంటే అది డాక్ట‌ర్ గారి చ‌ల‌వే.  జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న కృషిని మ‌న‌నం చేసుకుందాం. కిడారి శ్రవణ్ : తాగునీటి స‌మ‌స్య ఎదుర్కొంటున్న పల్నాడు ప్రాంత దాహార్తిని తీర్చిన శాశ్వ‌త ప‌థ‌కాలు తెచ్చిన ఘ‌న‌త డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావుగారికే ద‌క్కుతుంది.ప‌ల్నాడు ప్ర‌జ‌ల కోసం,ప్ర‌గ‌తి కోసం పాటుప‌డిన కోడెల శివప్రసాదరావు గారు ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు గద్దె రామ్మోహన్ : వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, మ‌రుగుదొడ్డి వాడ‌కం ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ ఇంటి నుంచి ప్రారంభించాల‌నే నినాదంతో ఒక ఉద్య‌మంలా మ‌రుగుదొడ్ల నిర్మాణం చేప‌ట్టి దేశంలోనే ఎవ‌రికీ సాధ్యంకాని రికార్డు నెల‌కొల్పిన మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు సేవలు చిరస్మరణీయం. బండారు సత్యనారాయణమూర్తి : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు ప‌ట్టుకున్న ప‌సుపుజెండాని మ‌ర‌ణించేవ‌ర‌కూ వీడ‌ని సైనికుడు, నాయ‌కుడు ప‌ల్నాటి పులి డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు జ‌యంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తున్నాను. ఎన్ అమర్‌నాథ్ రెడ్డి : రూపాయి డాక్ట‌ర్ అణ‌గారిన వ‌ర్గాల స్వ‌ర‌మైన లీడ‌ర్ అయ్యారు. మినిస్ట‌ర్ అయినా, స్పీక‌ర్ అయినా ఆ ప‌ద‌వికే వ‌న్నెతెచ్చిన మ‌హ‌నీయుడు డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు జ‌యంతి సంద‌ర్భంగా  నివాళుల‌ర్పిస్తున్నాను ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ : మ‌ర‌ణంలేని మ‌హ‌నీయుడు డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు గారు. అవ‌య‌వ‌దానంపై ప్ర‌చారం చేయ‌డ‌మే కాకుండా, తానే అంద‌రికంటే ముందుగా వ‌చ్చి అవ‌య‌వ‌దానం చేసిన మ‌న‌సున్న మ‌నిషి . ఆయ‌న ఆశ‌య‌సాధ‌నే మ‌న‌మిచ్చే ఘ‌న‌నివాళి.

ఏపీలో క‌రోనా విల‌య‌తాండ‌వం! 33 మంది మృతి!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  24 గంటల్లో 5,943 శాంపిళ్ల పరీక్ష చేయ‌గా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,525 న‌మోదైంది. ఇప్పటివరకు 441 మంది డిశ్చార్జ్ కాగా 33 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 5,943 శాంపిళ్లను పరీక్షించగా 62 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,525గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 441 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,051గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 4, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 2, కడపలో 4, కృష్ణాలో 12, కర్నూలులో 25, నెల్లూరులో 6, ప్రకాశంలో 1, విశాఖపట్నంలో 4, పశ్చిమ గోదావరిలో 1 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

20 రోజుల తర్వాత కనిపించిన కిమ్‌

ప్యాంగ్‌యాంగ్‌ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగారం పూర్తయిన కార్యక్రమంలో కిమ్‌ జోంగ్‌ ఉన్ పాల్గొన్నారు. ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్ 20రోజుల తర్వాత కనిపించారు. కిమ్‌ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్యాంగ్‌యాంగ్‌ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగారం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిమ్‌ పాల్గొన్నట్టు కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో కిమ్‌తోపాటూ అతని సోదరి కిమ్‌ యో జోంగ్‌ ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్‌ 15 నుంచి కిమ్‌ బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చజరిగింది. ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్‌ హాజరుకాకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది.

ఏపీలోని అన్ని విద్యాసంస్థలకు జూన్ 11 వరకు సెలవులు

ఏపీలోని అన్ని విద్యాసంస్థలకు జూన్ 11 వరకు సెలవులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవులు జూన్ 11 వరకు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి పాఠశాలలు ఎప్పుడు తెరవాలనే అంశంపై ప్రభుత్వం తరఫున మరోసారి అధికారికంగా తెలియజేస్తామని తెలిపింది. ప్రభుత్వం ఆదేశాలు వచ్చిన తర్వాత మరోసారి దీనిపై స్పష్టతనిస్తామని ప్రకటించింది. విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రైవేట్ విద్యాసంస్థలు, జూనియర్ కాలేజీలు అన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు మాత్రమే తీసుకోవాలిని రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ కాంతారావు కీలక ఆదేశాలు జారీ చేశారు.

వైకాపా క్రూర రాజకీయానికి కోడెల బలయ్యారుః చంద్ర‌బాబు

నేడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ 74వ జయంతి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఆయన చేసిన సేవలను ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు.  ‘‘ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, ఆపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాద్ గారి సొంతం. ఈ లక్షణాలే రూపాయి డాక్టరుగా పేదలకు వైద్య సేవలందిస్తోన్న కోడెలను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రమ్మని పిలిచేలా చేశాయి. ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయి. అలాంటి వ్యక్తి కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైసీపీ నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారు. మానసికంగా కృంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేసారు. వైసీపీ క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణ. ఈరోజు కోడెల శివప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆయన ప్రజాసేవలను మననం చేసుకుందాం’’ అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, అపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాదరావు సొంతమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. కోడెల జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేశారు. రూపాయి డాక్టరుగా పేదలకు అందించిన వైద్యసేవలే... కోడెలను ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రమ్మని పిలిచేలా చేశాయన్నారు.  ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయన్నారు. అలాంటి వ్యక్తి కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైకాపా నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారని మండిపడ్డారు. మానసికంగా కుంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని దుయ్యబట్టారు. వైకాపా క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఈరోజు కోడెల శివప్రసాద్‌ జయంతి సందర్భంగా ఆయన ప్రజా సేవలను మననం చేసుకుందామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

భారత్‌లో లాక్‌డౌన్‌ సడలింపులపై డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు!

లాక్‌డౌన్ వంటి చర్యలు‌ మాత్రమే కరోనాను కట్టడి చేస్తాయి. భారత్‌, అమెరికా‌ లాంటి దేశాలు ఆంక్షలు సడలిస్తే తీవ్ర పరిణామాలు వుంటాయి. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు సడలించొద్దని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. పలు దేశాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తోన్న విషయంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆయా దేశాలకు పలు హెచ్చరికలు చేసింది. కరోనా విజృంభణ అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం, లాక్‌డౌన్ వంటి చర్యలు‌ మాత్రమే కరోనాను కట్టడి చేస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగ సీనియర్‌ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు. భారత్‌తో పాటు అమెరికా‌ లాంటి దేశాలు ఒకవేళ నిబంధనలను సడలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాయని చెప్పారు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించవద్దని హెచ్చరించారు. కాగా, కరోనా వైరస్‌ను‌ కట్టడి చేయడానికి ప్రస్తుతం పలు దేశాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని తెలిపారు. ఇటువంటి సమయంలో వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాల్లో నిబంధనలు ఎత్తివేయడం వల్ల మళ్లీ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. ఆయా దేశాల్లో లాక్‌డౌన్ నిబంధనల్ని ఎత్తివేసే విషయంపై బాగా ఆలోచించుకోవాలని తెలిపారు. లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్న చాలా దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరిగాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో అధికంగా ఉన్నాయన్నారు.

హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకం!ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి

హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియమకం!ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి  నేడు ప్రమాణ స్వీకారం.  21కి చేరనున్న జడ్జీల సంఖ్య  ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ హైకోర్టులో న్యాయవాదులుగా ఉన్న బొప్పూడి కృష్ణమోహన్‌, కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి, కన్నెగంటి లలితకుమారి న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి వారితో శనివారం ప్రమాణం చేయించనున్నారు. వాస్తవానికి ఈ ముగ్గురితో సహా మొత్తం ఆరుగురి పేర్లను న్యాయమూర్తుల పదవికి సిఫారసు చేస్తూ హైకోర్టు కొలీజియం గత ఏడాది సుప్రీంకోర్టుకు జాబితా పంపింది. అయితే సుప్రీంకోర్టు కొలీజియం బి.కృష్ణమోహన్‌, కె.సురేశ్‌రెడ్డి, కె.లలితకుమారిలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని వారి పేర్లను గత నెలలో కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ జాబితాను పరిశీలించిన కేంద్రం.. రాష్ట్రపతికి సిఫారసు చేయగా, ఆయన ఆమోదముద్ర వేశారని కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి రాజేందర్‌ కశ్యప్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ముగ్గురి చేరికతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరినట్లయింది.

గుండెపోటుతో మరణించిన వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం: సీఎం వైయస్.జగన్

విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీచేస్తూ గుండెపోటుతో మరణించిన గబ్బాడ అనూరాధ (26) కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రకటించారు. దినపత్రికల్లో ఈ వార్తను చూసిన వెంటనే సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఘటన వివరాలను అడిగితెలుసుకున్నారు. విపత్తు సమయంలో విశేషంగా పనిచేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. గబ్బాడ అనూరాధ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అనూరాధ కుటుంబానికి ఈ సహాయం వెంటనే అందేలా చూడాలని విశాఖ జిల్లాకలెక్టర్‌ను ఆదేశించారు.

అరాచక కుల ఉన్మాదంపై పోరాడిన పల్నాటి పులి డాక్ట‌ర్ కోడెల‌!

పల్నాడు ప్రాంతంలో ఈ రోజు కనిపిస్తున్న ఒక కుల ఉన్మాదం, నీచత్వం, తక్కిన్న కులాల మీద దాష్టీకం చేసి ఆధిపత్యం సాధించి గత కాలపు అరాచకాన్ని వెట్టి ని ఆ చీకటి రోజులని గుర్తు చేస్తూ ఆ చీకటి ని మళ్లీ తీసుకు రావాలని చెలరేగి పోతున్న వున్మాధులని చూస్తే కోడెల ఎంత పోరాటం చేశారో, ఆయన పై ఎందుకు ఆ స్థాయి లో దాడి జరిగిందో అర్థం అవుతుంది.  గమనించి చూస్తే 3 రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఒక కుల ఉన్మాదం ఈ పల్నాడు ప్రాంతం లో ఒక పెత్తందారీ కులం లో కనబడుతుంది. ఎంతలా అంటే 30 యేళ్లు రాష్ట్రాన్ని ఏలిన రాయలసీమ, తెలంగాణ ప్రాంత సాటి కులస్తులని కూడా 8 యేళ్లు మాత్రం ఈ ప్రాంత కులస్తులు డైరెక్షన్ చేసి నడిపించే అంత. వీళ్ళ మసి వాళ్ళకి పూసే తెలివి తేటలు పుష్కలం వీరిలో.   40 యేళ్లు ఒక బక్క పల్చటి ఐదున్నర అడుగుల డాక్టర్ సింహ స్వప్నం లా నిల్చున్నాడు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలైనా, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి టీడీపీ తరపున గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశారు.   తిరుగులేని సర్జన్ గా కీర్తిగడించిన డాక్టర్ కోడెలపై అనాడు ఎన్టీఆర్ దృష్టి పడింది. దీంతో ఆయన్ను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్‌టిఆర్‌ పిలుపుమేరకు 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరి మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే.. మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. డాక్టర్ కోడెల అప్పటి ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వరుస విజయాలు నమోదు చేశారు డాక్టర్ కోడెల. 2004, 2009 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారానికి దూరమైనప్పుడు వరుస పరాజయాలు చవిచూశాడు. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి డాక్టర్ కోడెల విజయం సాదించారు.      రాజకీయ వ్యూహాలు రచిస్తూ, రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్రవేశారు. శాసనసభాపతిగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా, వివిధ మంత్రుత్వ శాఖల పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు. కోడెల రాజకీయంగానే కాక, అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ, సమాజానికి తనదైన సేవలు అందించారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా, వేడుకలు జరుపుకోకుండా, ఎదో ఒక సామాజిక సేవ చేసే వారు.

ఏపీలో మొత్తం 1,04,060 కరోనా టెస్టులు చేశాం: జవహర్‌రెడ్డి

ఏపీలో మొత్తం 1,04,060 కరోనా టెస్టులు చేశామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఏపీలో కరోనా కేసుల పాజిటివ్‌ రేటు 1.43శాతం ఉందని చెప్పారు. ఏపీలో 1,463 కరోనా పాజిటివ్‌ కేసులున్నాయని 403 మంది డిశ్చార్జ్‌ చేశామని ప్రకటించారు. ఏపీలో రికవరీ రేటు 27.55శాతం ఉందని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 9 ల్యాబ్‌లలో కరోనా టెస్టులు చేస్తున్నామని, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో మరో రెండు ల్యాబ్‌ల ఏర్పాటుకు అనుమతిచ్చామని తెలిపారు. శ్రీకాకుళం, ప్రకాశంలో ట్రయల్ టెస్టులు మొదలయ్యాయని, నెల్లూరులో ల్యాబ్‌ ఏర్పాటు పూర్తయిందని జవహర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, ఒక్కో ల్యాబ్‌లో 250 కరోనా పరీక్షలు చేయొచ్చని జవహర్‌రెడ్డి వివరించారు.

దేశవ్యాప్తంగా మే 17వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌

గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో ఆంక్షల సడలింపు విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌ హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసి ఉంచాలి అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్లు రద్దు అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు వారంకు ఒకసారి రెడ్‌ జోన్లలో పరిస్థితి పరిశీలన కేసులు తగ్గితే రెడ్‌ జోన్లను గ్రీన్‌ జోన్లుగా మార్పు గ్రీన్‌, ఆరేంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం గ్రీన్‌ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి ఆరేంజ్‌ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి ఆరేంజ్‌ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి ఆరేంజ్‌ జోన్లు: టూ వీలర్‌ మీద ఒక్కరికే అనుమతి ఆరేంజ్‌, గ్రీన్‌ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు