కోడెలకు టీడీపీ నేతల ఘననివాళి!
posted on May 2, 2020 @ 12:49PM
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ 74వ జయంతి నేడు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన ప్రముఖ నేతలంతా ఆయనను ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు. ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా మననం చేసుకున్నారు.
అచ్చెన్నాయుడు : మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో కీలకశాఖలకు మంత్రిగా చేసినా, విపక్షంలో వున్నా, స్పీకర్ గా పనిచేసినా, ఓడిపోయినా ఏనాడూ ప్రజలకు దూరం కాని ప్రజల మనిషి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి జయంతి సందర్భంగా ఆయన ప్రజలకు అందించిన సేవలు స్మరించుకుందాం.
అయ్యన్నపాత్రుడు : రాజకీయాలు ఎలా చేశారో, రాజీపడకుండా ప్రత్యర్థులపై అలాగే పోరాటం చేశారు డాక్టర్ కోడెల శివప్రసాదరావు. పల్నాడులో అరాచకాలకు అడ్డుకట్ట వేసిన డాక్టర్, స్పీకర్ స్థానానికి వన్నె తెచ్చారు. జయంతి సందర్భంగా కోడెల శివప్రసాదరావుకు నివాళులర్పిస్తున్నాను.
బీటీ నాయుడు : ఓ గుట్టపై వుండే కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసిన ఘనత డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారిదే. ఈ రోజు కోటప్పకొండ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రమైందంటే అది డాక్టర్ గారి చలవే. జయంతి సందర్భంగా ఆయన కృషిని మననం చేసుకుందాం.
కిడారి శ్రవణ్ : తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న పల్నాడు ప్రాంత దాహార్తిని తీర్చిన శాశ్వత పథకాలు తెచ్చిన ఘనత డాక్టర్ కోడెల శివప్రసాదరావుగారికే దక్కుతుంది.పల్నాడు ప్రజల కోసం,ప్రగతి కోసం పాటుపడిన కోడెల శివప్రసాదరావు గారు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు
గద్దె రామ్మోహన్ : వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్డి వాడకం ప్రతీ ఒక్కరూ తమ ఇంటి నుంచి ప్రారంభించాలనే నినాదంతో ఒక ఉద్యమంలా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి దేశంలోనే ఎవరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సేవలు చిరస్మరణీయం.
బండారు సత్యనారాయణమూర్తి : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు పట్టుకున్న పసుపుజెండాని మరణించేవరకూ వీడని సైనికుడు, నాయకుడు పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
ఎన్ అమర్‌నాథ్ రెడ్డి : రూపాయి డాక్టర్ అణగారిన వర్గాల స్వరమైన లీడర్ అయ్యారు. మినిస్టర్ అయినా, స్పీకర్ అయినా ఆ పదవికే వన్నెతెచ్చిన మహనీయుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను
ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ : మరణంలేని మహనీయుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. అవయవదానంపై ప్రచారం చేయడమే కాకుండా, తానే అందరికంటే ముందుగా వచ్చి అవయవదానం చేసిన మనసున్న మనిషి . ఆయన ఆశయసాధనే మనమిచ్చే ఘననివాళి.