తెలంగాణ వైన్‌షాపుల వద్ద భారీ క్యూ! పండుగ చేసుకుంటున్న మద్యం ప్రియులు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2300 మద్యం దుకాణాలు ఉండగా.. ఇందులో 15 షాపులు కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్నాయి. ఆ 15 షాపులు త‌ప్ప మిగతా అన్ని దుకాణాలూ తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఎక్సైజ్ అధికారులు, యజమానులు వైన్‌షాపుల ముందు సామాజిక దూరాన్ని పాటించే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. మందుబాబులు ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉదయం 6 గంటల నుంచే మద్యం షాపుల ముందు బారులు తీరి వేచి ఉన్నారు. చీప్ లిక్కర్‌పై 11 శాతం, మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణాలో పెంచిన ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్డినరీ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.10, 375 ఎంఎల్‌పై రూ.20, 750 ఎంఎల్‌పై రూ.40 అదనంగా పెరిగింది. ఇక మీడియం లిక్కర్‌కు సంబంధించి 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.20, 375 ఎంఎల్‌పై రూ.40, 750 ఎంఎల్‌పై రూ.80 పెరిగింది. ప్రీమియం లిక్కర్‌ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.30, 375 ఎంఎల్‌పై రూ.60, 750 ఎంఎల్‌పై రూ.120 అదనంగా పెరిగింది. మరోవైపు స్కాచ్ 90 ఎంఎల్/180 ఎంఎల్‌పై రూ.40, 375 ఎంఎల్‌పై రూ.80, 750 ఎంఎల్‌పై రూ.160 అదనంగా పెరిగింది. ఇక అన్ని సైజుల బీర్‌పై ఫ్లాట్ రూ.30 పెరిగింది. మద్యం దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, ఎక్కడైనా దీన్ని ఉల్లంఘించినట్లు తెలిస్తే ఆ క్షణమే సదరు దుకాణం లైసెన్సు రద్దుచేస్తామని తెలంగాణా ప్ర‌భుత్వంస్పష్టం చేసింది. మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ తెరచి ఉంచుతారు. ప్రజలు క్రమశిక్షణతో, భౌతిక దూరం పాటిస్తూ కొనుగోళ్లు చేయాలని, మాస్కు ధరించకపోతే మద్యం అమ్మవద్దని, దుకాణాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని అధికారులు సూచనలు జారీ చేశారు.

క‌రోనాతో క‌లిసి బ్ర‌త‌కాల్సిందే: సి.ఎం. కేసీఆర్‌

క‌రోనా స‌మ‌స్య రేపో మాపో స‌మ‌సిపోయేది కాదు. కాబ‌ట్టి క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందేన‌ని సి.ఎం. కేసీఆర్ అన్నారు. మ‌న చేతిలో వున్న ఏకైక ఆయుధం లాక్‌డౌన్‌. ఉపాయంతో మ‌న‌ల్ని మ‌న‌మే ర‌క్షించుకోవాలి. క‌రోనా స‌మ‌స్య ఇప్ప‌ట్లో స‌మ‌సిపోదు. కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తూచ త‌ప్ప‌కుండా క‌ఠినంగానే అమ‌లు చేస్తున్నాం. రేప‌టినుంచి భూముల కొనుగోళ్ళు, అమ్మ‌కాలకు అనుమ‌తి ఇచ్చాం. రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు, ఇసుక మైనింగ్ ప్రారంభిస్తున్న‌ట్లు సి.ఎం. తెలిపారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌న్నీ పూర్తి స్థాయిలో ప‌నిచేస్తాయ‌ని సి.ఎం. తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు పూర్తి చేస్తాం. రేప‌టి నుంచి ఇంట‌ర్ స్పాట్ వ్యాల్యూయేష‌న్ ప్రారంభిస్తాం. 65 ఏళ్ళు దాటిన వారు, చిన్న‌పిల్ల‌లు బ‌య‌‌టికి రావద్దని సి.ఎం. విజ్ఞ‌ప్తి చేశారు.  రెడ్‌జోన్ల‌లో షాప్‌లు తెరిచే అవ‌కాశం వుంది కానీ ఎట్టి ప‌రిస్థితుల్లోను అనుమ‌తి ఇవ్వ‌డం లేదు. గృహ‌నిర్మాణ యాక్టివిటీకి అనుమ‌తి ఇచ్చాం. నిత్యావ‌స‌ర‌వ‌స్తువుల షాపుల్ని అనుమ‌తించామని సి.ఎం. తెలిపారు. షాపుల‌న్నీ ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు తెరిచివుంటాయి.   చిల్ల‌ర రాజ‌కీయాలు, చీప్ పాలిటిక్స్ కొంత మందికి అల‌వాటైపోయింది.  ఉచిత వినోదం పంపే జోక‌ర్లు, భ‌ఫూన్‌గాళ్ళ‌ని తెలంగాణా ప్ర‌జ‌లు వారిని చూసి న‌వ్వుకుంటున్నారని సి.ఎం. కేసీఆర్ ఎద్దేవా చేశారు. క‌నీసం ఏ స‌మ‌స్య‌పై పోరాడాల‌నే తెలివి కూడా లేకుండా ఛండాలంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప‌నికిమాలిన ధ‌ర్నాలు చేస్తూ  అభాసుపాలు కావ‌ద్ద‌ని కేసీఆర్ సూచించారు.  చిల్ల‌ర‌గాళ్ళ మాట‌ల్లో ప‌డి రైతులు భ‌విష్య‌త్ చెడ‌గొట్టుకోవ‌ద్దని విజ్ఞ‌ప్తి చేశారు. రైతులు ఆలోచించండి. మాకు క‌మిట్‌మెంట్ వుంది. వంద శాతం రైతుల్ని ఆదుకుంటాం. రైతు బంధు య‌థాత‌థంగా కొన‌సాగిస్తాం సి.ఎం. భ‌రోసా ఇచ్చారు. రాజ‌కీయ డ్రామాల్లో ఇరుక్కుంటే మీరే న‌ష్ట‌పోతారు. తెలంగాణాలో వున్న‌ది రైతు రాజ్యం. చిల్ల‌ర‌గాళ్ళ రాజ్యం కాదు. రైతుసంక్షేమం పేద‌ల సంక్షేమంలో రాజీ ప‌డం.  మే 15న మ‌రోసారి స‌మీక్ష చేసి స‌డ‌లింపుల విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సి.ఎం. తెలిపారు.

రేప‌టి నుంచే తెలంగాణాలో మ‌ద్యం షాపుల‌కు అనుమ‌తి!

కంటైన్‌మెంట్ జోన్‌లో వున్న ఆ 15 షాపులు మిన‌హా  మిగ‌తా అన్ని చోట్ల షాపులు తెర‌వ‌డానికి తెలంగాణా ప్ర‌భుత్వం అనుమ‌తించింది. 16 శాతం ధ‌ర పెంచుకోవ‌డానికి  క్యాబినెట్ నిర్ణయించింది. చీప్‌లిక్క‌ర్ మీద 11 శాతం పెంచుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు.  చుట్టూ వున్న నాలుగు రాష్ట్రాల్లో  మ‌ద్యం దుకాషాలు తెరిచారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో 900 కిలోమీట‌ర్ల స‌రిహ‌ద్దు వుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణాలో ప్రారంభించ‌క‌పోతే మ‌ద్యం స్మ‌గ్లింగ్ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే రేప‌టి నుంచి తెలంగాణాలో మ‌ద్యం అమ్మ‌కాల‌కు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు సి.ఎం. ప్ర‌క‌టించారు.  మ‌ద్యం షాపుల వ‌ద్ద భౌతిక‌దూరం పాటించాల్సిందే. నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌క‌పోతే మ‌ద్యం షాపుల్ని మూసివేస్తాం. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం షాపులు తెరిచి వుంటాయి. షాప్ ఓన‌ర్లు క్ర‌మ‌శిక్ష‌ణ పాటించాలి. శానిటైజ‌ర్ పెట్టాలి. మాస్క్ లేక‌పోతే మ‌ద్యం ఇవ్వ‌వ‌ద్దు. మాస్క్ లేక‌పోతే కిరాణా షాపుల్లో కూడా నిత్యావ‌స‌ర వ‌స్తువులు ఇవ్వ‌వ‌ద్దని సి.ఎం ఆదేశించారు.

తెలంగాణాలో మే 29 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడ‌గింపు!

ఈ రోజు వ‌ర‌కు తెలంగాణాలో 1096 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. 628 పూర్తి చికిత్స పొంది ఆరోగ్యంగా ఇళ్ల‌కు వెళ్ళారు. ఈ రోజు కూడా 43 మంది డిశ్చార్జ్ అయి వెళ్ళారు. ప్ర‌స్తుతం 439 మంది చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా చికిత్స చేయ‌డం, నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో తెలంగాణా దేశానికే రోల్ మోడ‌ల్‌గా వుంది.  దేశంలో క‌రోనా డెత్ రేట్ 3.37 కాగా, తెలంగాణాలో డెత్ రేట్ 2.64 వుంది. అలాగే క‌రోనా చికిత్స త‌రువాత కోలుకున్న‌వారు దేశంలో రిక‌వ‌రీ రేట్ 27.40కాగా తెలంగాణాలో రిక‌వ‌రీ రేట్ 57.3 వుంద‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. తెలంగాణాలో వున్న బ‌యోటెక్ సంస్థ‌లు క‌రోనా వ్యాక్సిన్ ను అగ‌స్టు, సెప్టంబ‌ర్‌లో సిద్ధం చేసి ప్ర‌పంచంలోనే తెలంగాణాకు గుర్తింపు తీసుకురానున్నార‌ని సి.ఎం. కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణాలో 6 జిల్లాలు రెడ్ జోన్‌లో వున్నాయి. 9 జిల్లాలు గ్రీన్ జోన్‌లో వున్నాయి. 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో వున్నాయి. రాబోయే 11 రోజుల్లో 18 జిల్లాల‌న్నీ గ్రీన్ జోన్‌లోకి వెళ్ళ‌నున్నాయి.  66 శాతం కేసులు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనే వున్నాయి. 29 మంది చ‌నిపోతే 25 మంది ఇక్క‌డే చ‌నిపోయారు. కొత్త‌గా వ‌చ్చే కేసులు కూడా హైద‌రాబాద్ ప‌రిధిలోనే వ‌స్తున్నాయి. ప్ర‌జ‌లు భౌతిక‌దూరం పాటించాల్సిందేన‌ని సిఎం మ‌రో సారి పిలుపునిచ్చారు. తెలంగాణాలో పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని సి.ఎం. తెలిపారు. మెజార్టీ ప్ర‌జ‌లు లాక్‌డౌన్ పొడిగించాల‌నే సూచించారు. మంత్రి వ‌ర్గం కూడా పొడిగించాల‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసింది. మే 29 వ‌ర‌కు రాష్ట్రం లో లాక్ డౌన్ పొడిగిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. రాత్రి పూట క‌ర్ఫ్యూ మే 29 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని సి.ఎం. తెలిపారు. 

మంత్రి పేర్ని నాని అబద్దం చెప్పారా?

వంద బ‌ర్రెల‌ను తిన్న రాబందు ఒక్క గాలివాన‌కు బ‌లైపోయింది అన్నట్టు.. నలభై రోజులు లాక్డౌన్ ఒక్క నిర్ణయానికి బలైపోయింది. ఆ నిర్ణయమే మద్యం అమ్మకం. స్టార్ హీరో సినిమాకి థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ చేసే హంగామా కంటే వైన్ షాప్స్ వద్ద మందుబాబులు చేస్తున్న హంగామానే ఎక్కువగా ఉంది. కడుపులో మందు పడాలన్న ధ్యాసే తప్ప.. కరోనా మహమ్మారి అనేది ఒకటుందని.. మన నిర్లక్ష్యానికి మనతో పాటు మనకుటుంబం, మన దేశం ప్రమాదంలో పడతాయన్న ఆలోచనే లేదు. అందుకేనేమో లిక్కర్ షాపులకు క్యూ కట్టారు. ఇక ఏపీలో పరిస్థితి సరేసరి. వైన్స్ రీఓపెన్ చేసిన మొదటిరోజే దాదాపు రూ.70 కోట్ల విలువైన మద్యం అమ్ముడైందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యాన్ని నిషేధించి పేద వారి బతుకుల్లో వెలుగు నింపుతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. ఈ కరోనా కాలంలో వైన్ షాపులు తెరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. ధర పెంచడం వల్ల పేదలు మద్యానికి దూరమవుతారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. విపక్ష నేతలు మాత్రం ధర పెంచడం వల్ల మద్య నిషేధం సాధ్యం కాదని, అలా జరిగేటట్లయితే అంతలా జనం ఎందుకు ఎగబడతారని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఆదాయం కోసమే జగన్ సర్కార్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని ప్రతిపక్ష టీడీపీ మండిపడుతోంది. అయితే, వైసీపీ ప్రభుత్వం మాత్రం మద్యం అమ్మకాలను సమర్ధించుకుంటోంది. కేంద్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిందని చెబుతోంది. ఇక ఏపీ మంత్రి పేర్నినాని అయితే, ప్రధాని మోడీ పర్మిషన్ ఇచ్చాకే బ్రాందీ షాపులు తెరుచుకున్నాయని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది. అందుకే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయని మంత్రి చెప్పారు. కాగా, ఏపీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. మోడీ సర్కార్ మద్యం అమ్మమని చెప్పలేదు. అది ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశమని, దానిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని కేంద్రం చెప్పింది. దీంతో కొన్ని రాష్ట్రాలు ముందువెనక ఆలోచన లేకుండా ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ మద్యం దుకాణాలు తెరిచాయి. అదేమంటే కేంద్రం అనుమతి ఇచ్చింది అంటున్నారు. ఇక మంత్రి పేర్ని నాని అయితే, మోడీ పర్మిషన్ ఇచ్చాకే బ్రాందీ షాపులు తెరుచుకున్నాయని చెబుతున్నారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై నెటిజనులు మండిపడుతున్నారు. ఆదాయం కోసం వైన్స్ తెరిచి.. ప్రధాని మోడీ పర్మిషన్ ఇచ్చారు, అన్ని రాష్ట్రాల్లో ఓపెన్ అయ్యాయంటూ అబద్దాలు చెబుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిర్ణయం రాష్ట్ర పరిధిలోని అంశమే కదా, ప్రజల ప్రాణాలని లెక్క చేయకుండా ఇంత ఆతృతగా మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

ఆ లేఖ ఎస్‌ఈసీ ఆఫీస్‌లో చేయ‌లేదు! ఫోరెన్సిక్ నివేదిక

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లేఖకు సంబంధించి వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ లేఖకు సంబంధించి సీఐడీ అధికారులు అనేక విషయాలను రాబట్టారు. తాజాగా ఆ లేఖ ఎస్‌ఈసీ ఆఫీస్‌లో తయారుకాలేదని నిర్దారణ అయింది. లాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌లను పరిశీలించిన తరువాతే ఫోరెన్సిక్ నివేదికను అందించింది. నిమ్మగడ్డ పీఎస్‌ సాంబమూర్తి తప్పుడు సమాచారం ఇచ్చారని సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ అన్నారు. సాంబమూర్తి చెప్పినవి అన్ని అసత్యాలేనని అన్నారు. ఇందుకు సంబంధించి సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రమేష్‌ కుమార్‌ పీఏ సాంబమూర్తి అన్ని అసత్యాలే చెప్పారని అన్నారు. ఆ లేఖను ముందుగానే తయారుచేశారని.. అది బయటి నుంచి వచ్చిందని తెలిపారు. మార్చి 18వ తేదీ ఉదయం పెన్‌డ్రైవ్‌లో ఆ లేఖ రమేష్‌ కుమార్‌ వద్దకు చేరిందన్నారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో త్వరలోనే తేలుస్తామని చెప్పారు.  రమేశ్‌ కుమార్‌ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖపై తొలి నుంచి అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతో ఈ లేఖను టీడీపీ కార్యాలయంలో తయారైందని, ఆ లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీసీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను రమేష్‌ కుమార్‌ లేఖపై విచారణ చేపట్టాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ సందర్భంగా రమేశ్‌ కుమార్‌ చేసిన సంతకానికి, కేంద్ర హోంశాఖకు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదని విజయసాయిరెడ్డి అన్నారు.

ఆధార్ కార్డు.. గొడుగు.. మాస్క్ ఉంటేనే మద్యం!

ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్ర‌భుత్వం సూచనలు మేరకు మద్యం అమ్మకాలు చేపట్టింది. ఏ మద్యం దుకాణం ముందు చూసినా బారులు తీరిన మందుబాబులే కనిపిస్తున్నారు. మండు టెండలను సైతం లెక్కచేయకుండా మందుబాబులు దుకాణాల ముందు బారీ క్యూ లైన్లలో నిలబడ్డారు. కొంత మంది భౌతిక దూరం పాటించకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.  ఈ నేపథ్యంలో ఏపీలోని తెనాలి సీఐ హరికృష్ణ మందుబాబులకు కొత్త నిబంధనలు పెట్టారు. ఆధార్ కార్డు, గొడుగు ఉంటేనే మద్యం అమ్ముతారంటూ స్పష్టం చేశారు. గొడుగు ఉండడం వల్ల కచ్చితంగా ఒకరి నుంచి మరొకరు ఎడంగా ఉంటారని, దానికి తోడు ఎండ బారి నుంచి రక్షణగా ఉంటుందని, ఇక, ఇతర ప్రాంతాల నుంచి మద్యం కోసం వస్తుండడంతో విపరీతమైన రద్దీ ఏర్పడుతుందని వారిని కనుగొనేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. అలాగే మాస్క్ కూడా ఉండాలని నిబంధనలు విధించారు.

కిమ్ భార్య పోరు త‌ట్టుకోలేక అదృశ్య‌మైయ్యాడ‌ట‌!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 20 రోజుల పాటు కనిపించకుండా పోయారు. ఆపై బయటికి వచ్చారు. ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా కిమ్ రిబ్బన్ కట్ చేశాడు.  ఇంత‌కీ కిమ్ ఎందుకు క‌నిపించ‌కుండా పోయాడ‌నే విష‌యంపై ర‌క‌ర‌కాల వార్త‌లొస్తున్నాయి. అమ్మాయిల పిచ్చి బాగా వున్న కిమ్ ఏ దేశం వెళ్ళిన సరే అక్క‌డి అందమైన అమ్మాయిలతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాడు. అయితే  తన కేబినేట్‌లో ఉండే ఒక అందమైన అమ్మాయితో కిమ్ ప్రేమలో పడ్డాడట. అమ్మాయికి పెళ్లి అయింది.  దేశ ద్రోహం కేసులో ఆమె భర్తకు జైలు పంపి ఆమెతో పాటు పాంగ్యాంగ్‌కి దగ్గరగా ఒక చిన్న రిసార్ట్ లో ఎంజాయి చేయ‌డానికి వెళ్ళాడ‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న కిమ్ భార్య గుర్రుగా వుంది.  భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  కిమ్ భార్యకు నచ్చజెప్పే పనిలో ఉండి  బయటకు రాలేదట‌.

మద్యం తాగొద్దని చెప్పాలి కానీ, బ్రాండ్ల గురించి మాట్లాడతావా? అంబటి రాంబాబు

ఇలాంటి ఆపద సమయంలో ధరలు పెంచడం మంచిదా? అని చంద్రబాబు అంటున్నారు. మద్యం ఏమైనా నిత్యావసర వస్తువా? చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ మద్యం తాగొద్దంటూ ఉద్యమం చేయండి. అంతే తప్ప మద్యం ధరలు పెంచారంటూ, బ్రాండ్లు బాగాలేవంటూ ఉద్యమాలు చేయకండంటూ అంబ‌టి ఘాటుగా స్పందించారు. బ్రాండ్ల గురించి మాట్లాడుతూ నీచ సంస్కృతికి దిగజారుతారా? అయినా, చంద్రబాబు బాధ ఏంటో అర్థం కావడంలేదు. ప్రజలకు మద్యం అలవాటు చేసిందే చంద్రబాబు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్ర‌బాబు" అంటూ విమర్శలు గుప్పించారు. ప్రజలకు మద్యం అలవాటు చేసిందే చంద్రబాబు అన్న విష‌యం ఆంధ్ర‌ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌ని అంబటి రాంబాబు గుర్తు చేశారు. దక్షిణాదిన ఏ రాష్ట్రం కూడా మద్యం దుకాణాలు తెరవలేదని చంద్ర‌బాబు అబ‌ద్దాలు చెబుతున్నారు.  ప్ర‌జ‌లు మద్యం తాగొద్దని చెప్పకుండా, బ్రాండ్ల గురించి మాట్లాడడం ఏంటని అంబటి మండిపడ్డారు. కేంద్రమే మద్యం అమ్మకాలపై నిర్ణయం తీసుకుంది. కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయ‌న నిల‌దీశారు. తమ ప్రభుత్వం మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మద్యం రేట్లు పెంచడం ద్వారా డబ్బున్న వాళ్లు మాత్రమే తాగే పరిస్థితులు తీసుకువస్తామని, క్రమంగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పారు.

ఆ బ్రాండ్లతోనే ఆరోగ్య సమస్యలంటున్న చంద్రబాబు!

ఏపీలో మద్యం దుకాణాలు తెరవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు.  మద్యం దుకాణాల్లో కొన్ని బ్రాండ్లే అమ్ముతున్నారని, ఈ బ్రాండ్లను వినియోగించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని విమర్శించారు.    మద్యం దుకాణాలు వద్దని కొన్ని చోట్ల మహిళలు ఆందోళన చేస్తున్నారు. మద్యం వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి. మీ నిర్ణయం వల్ల ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో కరోనాను ఎలా కట్టడి చేస్తారో చెప్పాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. మద్యం వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయని  చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..దక్షిణాదిలో ఎక్కడా మద్యం దుకాణాలు తెరవకపోయినా ఏపీలో మాత్రం విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఓపెన్‌ చేశారని విమర్శించారు. మద్యం దుకాణాలను పోలీసులతో నియంత్రిస్తారా?.. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద పెడతారా అని ప్రశ్నించారు.

బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా?

గతంలో పది ఇళ్లకు ఒక బెల్టు షాపు కొనసాగితే ఎక్కడా క్యూలు ఉండేవి కావని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి వచ్చాక బెల్టు షాపులే లేకుండా చేశారని, వైన్ షాపుల సంఖ్య తగ్గించడం వల్ల జనాల్లో కొంత ఆతృత కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎన్టీర్ తెచ్చిన మద్య నిషేదాన్ని ఎత్తేసిన వ్యక్తి గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోందని ఎద్దేవాచేశారు. “ఉప్పల్ హెరిటేజ్‌లో నలుగురికి కరోనా, వారి వల్ల 25 మంది క్వారంటైన్‌” వీరంతా సత్వరం కోలుకోవాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. ఈ వార్త పబ్లిష్‌ కాకుండా, టెలికాస్ట్‌ కాకుండా మీడియాను మేనేజ్‌ చేసిన చంద్రబాబును ఏం చేయాలి? బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా? అని విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు.

మద్యం ధరలు పెంచడానికి కారణం అదే: సీఎం జగన్‌

అమరావతి: దశల వారీ మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి లిక్కర్‌ ధరలను భారీగా పెంచినట్టు ఆయన వెల్లండిచారు. ఇదే సమయంలో అక్రమ మద్యం రవాణాకు గట్టి చర్యలు చేపడతామని తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహించారు. మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.  ‘లిక్కర్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎలా జరుగుతుందో అన్న విషయాన్నిన్ని టీవీఛానళ్లు, పేపర్లు చూపిస్తున్నాయి. మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి 75 శాతం పెంచాలి. మనం 25 శాతం పెంచి తగ్గించాలనుకుంటే.. ఢిల్లీలో 70 శాతం పెంచారు. అందుకే 75 శాతం పెంచి.. గట్టి చర్య తీసుకున్నాం. మద్యం దుకాణాల సంఖ్యను మరో 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 20 శాతం తగ్గించాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 33 శాతం తగ్గించినట్టు అవుతుంది. ప్రతి షాపు వద్ద ఇంతకుముందు ప్రైవేటు రూమ్స్‌ పెట్టారు. మనం దీన్ని రద్దుచేశాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 43 వేల బెల్టు షాపులను రద్దు చేశాం. గ్రామాల్లో బెల్టు షాపులు శాశ్వతంగా లేకుండా చేయాలంటే... లాభాపేక్ష లేనప్పుడే జరుగుతుంది. అందుకనే ప్రైవేటు వారికి కాకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది. లేకపోతే సేల్స్‌ను పెంచుకోవడం కోసం ప్రైవేటు వాళ్లు బెల్టు షాపులను ప్రోత్సహిస్తారు. మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యం విక్రయించే వేళలలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటవరకూ పరిమితం చేశాం. అందులో భాగంగానే ఈ 75 శాతం పెంపు నిర్ణయం కూడా తీసుకున్నాం. షాక్‌ కొట్టించే రేట్లు ఉండాలని నిశ్చయించుకున్నాం. దీనివల్ల పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా, అలాగే రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని కూడా అడ్డుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి బాధ్యత ఎస్పీల మీద ఉంటుంది. దీనికోసం ప్రత్యేక పోలీసు అధికారిని పెట్టాం. లిక్కర్, ఇసుక మీద కలెక్టర్లు, ఎస్పీలు గట్టి ధ్యాస పెట్టాలి. కేవలం ఎక్సైజ్‌ సిబ్బంది మాత్రమే పూర్తిగా నియంత్రించలేరు. పోలీసులు దీంట్లో భాగస్వామ్యం కావాలి. అక్రమ మద్యం రవాణా, మద్యం తయారీ, ఇసుక అక్రమాలు ఎట్టి పరిస్థితులోనూ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష అనేది ఉండకూడదని కలెక్టర్లకు, ఎస్పీలకు గట్టిగా చెప్తున్నా. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఈ అంశాలను దగ్గరుండి నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. దాన్ని నిలబెట్టుకోవాల’ని వైఎస్‌ జగన్‌ అన్నారు.

రోజా సహా ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు!

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు నోటీసులు జారీ అయిన వారిలో రోజా, రజని తో క‌లిపి ఐదుగురు ఎమ్మెల్యేలు  లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో రోజా, విడదల రజని, మధుసూదన్ రెడ్డి, సంజీవయ్య, వెంకట గౌడ్ లు ఉన్నారు. కరోనా వ్యాప్తికి వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలే కారణమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఇంద్రనీల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. అనంతరం నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది . లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలకు నిత్యావసరాలను పంచడం, డబ్బు పంపిణీ చేయడం, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేశారు. ఈ కార్యక్రమాల సందర్భంగా సోషల్ డిస్టెన్స్ కూడా పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి విజువల్స్ మీడియాలో ప్రసారమయ్యాయి.

వైరస్‌ పుట్టుక ల్యాబ్‌ లోనే! చైనా మూల్యం చెల్లించుకోక తప్పదా?

కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌ ల్యాబ్ లోనే ‌ పురుడు పోసుకుందని అమెరికా మరోసారి ఆరోపించింది. ఐతే ఈ సారి మాత్రం ఈ ఆరోపణలకు పక్కా సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ కావాలనే చైనా కరోనా వైరస్‌ను ల్యాబ్‌ నుంచే విడుదల చేసిందని వెల్ల‌డించారు. చైనా కుట్రను త్వరలోనే ప్రపంచం ముందు ఉంచుతామని ఆయన అన్నారు. కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించటానికి చైనాయే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైరస్‌ కారణంగా జరిగిన నష్టాన్ని చైనా నుంచి వ‌సూలు చేస్తామ‌ని అమెరికా చెబుతోంది.  అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ పలుమార్లు కరోనా వైరస్‌ పుట్టుక వుహాన్‌ ల్యాబ్‌ లోనే జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన నోబెల్‌ బహుమతి గ్రహీత కరోనా వైరస్‌ వుహాన్‌ నుంచి బయటకు వచ్చిందని చెప్పారు. జపాన్‌కు చెందిన ఓ సైంటిస్టు కూడా ఇదే ఆరోపణ చేశారు. దీంతో అమెరికా చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లవుతోంది. నిజంగానే అమెరికాకు ఏమైనా ఆధారాలు దొరికాయా?

తెలంగాణలోనూ మద్యం అమ్మకాలకు సర్కార్ ఓకే!

కరోనా వైరస్ నియంత్రణ కోసం మార్చి 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా మూతబడిన మద్యం దుకాణాలు లాక్డౌన్ కారణంగా ఇప్పటివరకు తెరుచుకోలేదు. అయితే, కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలను తాజాగా పునఃప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోనూ మద్యం విక్రయాలు చేపట్టాలని సర్కారు నిర్ణయానికి వచ్చింది. తెలంగాణలో త్వరలోనే మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయి.  మద్యం తాగేందుకు ఇక్కడి ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారని, దీని ద్వారా అక్కడ నుంచి రాష్ట్రంలోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు వచ్చాయి. ఈ కారణాలరీత్యా రాష్ట్రంలో కూడా మద్యం విక్రయాలు పునరుద్ధరించడం అనివార్యంగా మారిందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ఈ నాలుగు జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన 29 జిల్లాల్లో మద్యం విక్రయాలు మే 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన స్టాకు తరలింపు ప్రక్రియ ప్రారంభ‌మైంది. కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్ మే 7తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీనిని మరికొన్ని రోజులు పొడిగించే అంశంతో పాటు మద్యం విక్రయాలు, ఇతర సడలింపులపై రాష్ట్రమంత్రివర్గం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మే 21 వరకు మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.  రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు లాంఛనమే కాగా, కొత్తగా ప్రకటించనున్న సడలింపుల విషయంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.    రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించేందుకు మరికొన్ని రోజులు వేచి చూస్తారని తెలుస్తోంది. ఆటోలు, ఆర్టీసీ బస్సులు వంటి ప్రజారవాణా సదుపాయాలను పునరుద్ధరిస్తే లాక్డౌన్ను అమలు చేయడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పూలు చల్లి..మద్యం ప్రియులకు ఘన స్వాగతం!

మందుబాబులు వెల్ కం.. స్వాగతం.. సుస్వాగతం... అంటూ ఓ వ్యక్తి  చేసిన హ‌ల్‌చ‌ల్ వీడియో వైర‌ల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ప్రియులకు అనూహ్యరీతిలో స్వాగతం లభించింది. మద్యం కోసం క్యూలైన్లలో నిల్చున్న మందు బాబులపై ఓ వ్యక్తి పూలవర్షం కురిపించాడు. మంగళవారం ఉదయం చందర్‌నగర్‌లోని ఓ మద్యం షాపు వద్ద కిలోమీటర్ల మేర జనాలు బారులు తీరారు. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి కవర్‌లో నుంచి పూలు తీసి మందుబాబులపై చల్లాడు. ఈ సందర్భంగా ఆ వ్యక్తి మాట్లాడుతూ.. మన దేశానికి ఆర్థిక వనరులు మీరే.. ప్రభుత్వం వద్ద నగదు లేదని పేర్కొన్నాడు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా మందుబాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరి.. తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు. దాదాపు 40 రోజుల తర్వాత మద్యం షాపులు తెరుచుకున్నాయి.  దీంతో మద్యం ప్రియులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు.  మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా..క్యూలో నిలుస్తున్నారు.  ఢిల్లీ ప్రభుత్వం కరోనా సెస్ విధించింది. కరోనా ఫీ పేరిట ఏకంగా 70 శాతం సుంకం విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంగళవారం నుంచి మద్యం ధరలు మ‌రింత పెరగనున్నాయి.

కరెంట్ బిల్లులు మాఫీ చేసి ఇంటి అద్దె ప్రభుత్వమే చెల్లించాలి! జగ్గారెడ్డి డిమాండ్‌

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 వేల రూపాయ‌ల‌ లోపు అద్దె ఉన్న వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. కరోనా కాలంలో ఇంటి కరెంట్ బిల్లులు మాఫీ చేయాలని జగ్గారెడ్డి కోరారు. ఇంటి పన్నులను కూడా ప్రభుత్వం మాఫీ చేయాలని, వర్షాకాలంలో రైతులకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ తో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగ్గారెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయని, ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1500 కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగానే ఉన్నా, పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. మూడు నెలల పాటు అద్దె మినహాయించినా, తర్వాత కట్టాల్సిందే కదా అని అభిప్రాయపడ్డారు. అందుకే, ఇంటి అద్దెలు క‌రెంట్ బిల్లులు కూడా ప్రభుత్వమే భరించాలని ఆయ‌న సూచించారు.

చ‌ప్ప‌ట్లు, దీపాలు, పూలు! ఇప్ప‌డు తీర్థంలా మ‌ద్యం!

''గంటలు మోగించారు! చ‌ప్ప‌ట్లు కొట్టారు! దీపాలు వెలిగించారు... పై నుంచి పూలు చల్లారు...ఇకపై తీర్థం ఇస్తున్నట్లుగా మద్యం అమ్మకాలు ప్రారంభించారు'' అని సెటైర్ వేశారు సీపీఐ రాష్ట్ర రామకృష్ణ. రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవడంపై ఆయ‌న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలపై పునరాలోచన చేయాలని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం తాపత్రయపడుతోందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు? కేంద్ర ప్రభుత్వం బుక్‌స్టాల్స్‌కు అనుమతులివ్వగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వైన్ షాపుల‌కు మాత్ర‌మే అనుమతి ఇచ్చి పుస్త‌కాల షాపుల‌కు ఎందుకు ఇవ్వలేద‌ని ఆయ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు లేఖ రాశారు. మద్యం షాపుల వద్ద లాక్‌డౌన్ నిబంధనలు పాటించ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. వ్యక్తిగత దూరం గాని కనీసం మాస్కులు కూడా లేకుండా మందుబాబులు బారులు తీరి లైన్లో నిల్చున్నారని అన్నారు. పోలీసుల బందోబస్తు మధ్య మద్యం అమ్మకాలు సాగించాల్సిన తొంద‌ర దేనిక‌ని, ఇలాంటి దుస్థితి నెలకొనడం విచారకరమని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.