కారుతో కైట్ ఫైట్.. డ్రామాలంటున్న కమలం.. గ్రేటర్ ట్విస్ట్!
posted on Sep 9, 2020 @ 5:55PM
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ఎంఐఎం మొదటి నుంచి మద్దతుగా ఉంది. ప్రభుత్వం తీసుకువచ్చే అన్ని బిల్లులకు సపోర్ట్ చేస్తూ వచ్చింది. కేసీఆర్ సర్కార్ పై విపక్షాలు ఆరోపణలు చేస్తే... ఎంఐఎం తిప్పికొట్టిన సందర్భాలున్నాయి. ఎంఐఎం మాకు మిత్రపక్షమేనని సీఎం కేసీఆరే పలు సార్లు ప్రకటించారు. ఒవైసీ బ్రదర్స్ కు ప్రభుత్వంలోనూ మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే కొన్ని రోజులుగా రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు అందుకు బలమిస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అక్బరుద్దీన్ ఒవైసీ. కరోనా పై చర్చలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
అసెంబ్లీలో కరోనాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రభుత్వ ప్రకటనపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వారియర్స్‌ను ప్రభుత్వం గుర్తు చేయకపోవడం దారుణమన్నారు. మంత్రి ఈటల ప్రసంగం హెల్త్ బులెటిన్‌లా ఉందని మండిపడ్డారు. కోవిడ్ నిధికి విరాళాలు ఇచ్చినవారిని గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు క్వశ్చన్ అవర్‌లో స్పీకర్‌తోనూ అక్బరుద్దీన్ వాగ్వాదానికి దిగారు. సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి తాము ప్రతీ అంశంలో సహకరిస్తున్నా రూల్స్ మాట్లాడుతున్నారంటూ స్పీకర్‌పై అక్బరుద్దీన్ అసహనం వ్యక్తం చేశారు.
అక్భరుద్దీన్ తీరుకు టీఆర్ఎస్ నేతలు కౌంటరిచ్చారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. అన్ని అంశాలను స్వల్ప కాలిక చర్చ నోట్ లో చెప్పడం సాధ్యం కాదన్నారు. సీనియర్ సభ్యుడైనంత మాత్రాన అక్బర్ ఏదీ పడితే అది మాట్లాడతానంటే కుదరదన్నారు తలసాని. బాధ్యత లేకుండా అక్బర్ మాట్లాడితే తామెందుకు ఊరుకుంటామన్నారు. ఓవర్ స్మార్ట్ గా అక్బర్ వ్యవహరించొద్దన్నారు తలసాని.
మంగళవారం అసెంబ్లీలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ప్రభుత్వం తీర్మానం పెట్టింది. తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతిచ్చినా ఎంఐఎం సపోర్ట్ చేయలేదు. చర్చ జరుగుతుండగానే ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేసి వెళ్లారు. టీఆర్ఎస్ సర్కార్ పెట్టిన బిల్లు లేదా తీర్మానానికి ఎంఐఎం మద్దతు ఇవ్వకపోవడం ఇదే తొలిసారి. ఇటీవల కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు పెంచారు అక్బరుద్దీన్. కరోనా కట్టడిలో విఫలమైందని ఆరోపించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత అన్ని అంశాల్లో కలిసి నడిచిన టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆసక్తి కల్గిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న సమయంలో టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య విభేదాలు రావడం ఆసక్తి కలిగిస్తున్నాయి. సిటీలో పట్టున్న ఎంఐఎం.. ఇంతకాలం సపోర్ట్ చేసిన అధికారపార్టీని టార్గెట్ చేయడంపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయని ఆరోపిస్తోంది. ఎంఐఎం చెప్పినట్లు నడుచుకునే టీఆర్ఎస్.. గ్రేటర్ ఎన్నికల కోసమే కొత్త డ్రామా మొదలు పెట్టిందని విమర్శిస్తోంది. ఎంఐఎంతో తమకు సంబంధం లేదని ఓటర్లు భావించేలా గులాబీ నేతలు ఎత్తులు వేస్తున్నారంటున్నారు కమలనాధులు.