40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకెళ్తారు.. జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ లోకేష్
posted on Sep 9, 2020 @ 5:51PM
టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులను తాము మర్చిపోబోమని, అన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ నేత లోకేష్ చెప్పారు. మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు ను నారా లోకేష్ ఈరోజు పరామర్శించారు. ప్రభుత్వంపై పోరాడితే సీఎం జగన్ జైల్లో పెట్టిస్తున్నారని అయన విమర్శించారు. "పేద ప్రజల నుంచి దొడ్డిదారిన రూ.5 లక్షలకు కొన్న భూమిని ప్రభుత్వానికి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలకు అమ్ముకుంటున్నారు. దీనిపై అన్నీ బయటపడతాయి... కనీసం 40 మంది జైలుకు వెళతారు.. పేద ప్రజల జేబులు కొట్టినోడు ఎవరూ బయటలేరండీ.. గ్యారంటీగా అందరు జైలుకు వెళతారు... ఎలాగూ వైసీపీ అనేది ఒక జైలు పార్టీయే కదా. పార్టీ అధ్యక్షుడూ జైలే... ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా జైలే... దీంతో ఇక ఎమ్మెల్యేలు మేం కూడా జైలుకు వెళ్లొస్తాం అంటున్నారు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ వైసీపీకి ఇంతకూ ఇంత వడ్డీ తో సహా కలిపి చెల్లించి తీరుతాం అని లోకేష్ పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం 16నెలల నుంచి అధికారంలో ఉందని, కానీ టీడీపీ హయాంలో అవినీతి జరిగినట్లు ఒక్క ఆధారమైనా చూపించారా? అని అయన ప్రశ్నించారు. అదే జగన్ మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోచుకోవడం వల్లే చాలా మంది అధికారులు జైలుకెళ్లారు. ఇక రానున్న రోజుల్లోనూ కొన్ని వందల మంది అధికారులు జైలుకెళ్లే పరిస్థితి ఉంది. అంతేకాకుండా మంత్రులందరికీ అసహనం చాలా పెరిగిపోయింది. సన్నబియ్యం ఇస్తాం ఇస్తాం అంటూ ఇవ్వలేకపోయిన మంత్రి కూడా అసహనంతో మాట్లాడుతున్నారు. సీఎం జగన్ పేరు కూడా అన్నిసార్లు తలవని సొంత మంత్రులు చంద్రబాబు పేరు మాత్రం నిత్యం జపిస్తున్నారు. పాపం నిద్రలేచిన దగ్గర నుంచీ పడుకునే వరకు వైసీపీ నేతల కలలోకి చంద్రబాబే వస్తున్నారు అని తీవ్రంగా విమర్శించారు.
ఒక మతంపై వరుస దాడులు జరుగుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ సీబీఐ విచారణ జరగాల్సిందే. ఏదైనా ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు కానీ వరుస సంఘటనలు చూస్తుంటే దీంట్లో ఎదో కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు ఓ రథం దగ్ధం చేశారని, తాజాగా అంతర్వేదిలోనూ అదే ఘటన జరిగిందని అయన తెలిపారు. మరోపక్క గుంటూరు జిల్లాలోని ఒక ఆలయంలో తల దువ్వుకోవద్దని చెప్పినందుకు ఆలయ అర్చకుడ్ని అన్యాయంగా చితకబాదారని.. దాడి చేసిన వ్యక్తి వైసీపీకి చెందినవాడని కూడా తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానిది.. కానీ ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. ఎవరైనా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే అక్రమకేసులు లేదా దాడులకు దిగుతున్నారు. టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి లపై ప్రభుత్వం బనాయాయించింది ముమ్మాటికీ దొంగ కేసులే. ప్రతిపక్షాలపై ఎక్కడలేని వింత వింత కేసులన్నీప్రయోగిస్తున్నారు. ఒక పెళ్లికి వెళ్లారని యనమల, చినరాజప్ప లపై కూడా కేసులు పెట్టారు. అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్ తో సహా 36మంది తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తుంటే దొంగ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అయితే టీడీపీ అన్నింటికీ సిద్ధంగా ఉంది అని లోకేష్ పేర్కొన్నారు.