లోకల్‌వార్‌లో డబ్బే కీలకం! డబ్బుఖర్చుపెట్టే సత్తా చూసే అభ్యర్థి ఎంపికచేశారట!
posted on Mar 14, 2020 @ 11:45AM
మీ దగ్గర క్యాష్ ఎంతుంది? ఎంతున్నా. వారు చెప్పినంత ఉండాలి. అదికూడా ముందుగానే చూపించాలి. అప్పుడుగాని ఆ అభ్యర్ధి ఎన్నికల రేసులో ఉండరు. ఇదేంటని అనుమానం వ్యక్తం చేయకండి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే. పోటీ చేయాలంటే ఈ స్ధాయిలోనే ప్రాథమిక స్క్రీనింగ్ జరిగిందని కొందరు అభ్యర్ధులు వాపోతున్నారు. రాజకీయాల్లో డబ్బుల తర్వాతే ఏదైనా. సొమ్ములుంటే కొండమీద కోతైనా ఇట్టే వచ్చేస్తోంది. స్థానిక సంస్ధలలో పోటీ చేయాలనుకుంటున్న వారికి ఆయా నియోజకవర్గ ఇన్ ఛార్జి ఆశీస్సులు ఆశీర్వచనాలతో పాటు విటమిన్ ఎం. షో చేయాల్సిందేనట.
ఏపీలో రాజకీయ పార్టీలు ఎత్తులు పైఎత్తులతో వ్యూహాల్లో నిమగ్నమైయ్యారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసుకున్నారు. పదేళ్ల తర్వాత పోటీ స్ధానిక ఎన్నికలు రావడంతో బరిలో నిలిచేందుకు ద్వితీయశ్రేణి నాయకులు ఆసక్తి గా ఎన్నికల బరిలో దిగారు. దీంతో జాబితాను ఫైనల్ చేయడానికి ఇంఛార్జులకు సర్కస్ ఫీట్లు తప్పలేదట.
రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే విజయవాడ కార్పోరేషన్లో కాలు పెట్టేందుకు వైసీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నగరంలో మూడు నియోజకవర్గాలలో అభ్యర్దుల ఎంపిక నేతలకు తలనొప్పిగా మారింది. పశ్చిమ నియోజకవర్గం నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యర్దులను ఫైనల్ చేశారు. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాస్తాంత గట్టిపోటీ ఉన్నా అభ్యర్దుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆచీతూచీ అడుగులు వెస్తున్నారు. పార్టీ పెద్దల నుంచి ఒత్తిడులు ఉన్నా సాధ్యమైనంత వరకు గెలిచేవారికే ప్రేయార్టీ ఇచ్చారట. తూర్పు నియోజకవర్గంలో టిడీపీ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పార్టీ ఇంచార్జిగా ఉన్న దేవినేని అవినాష్ అభ్యర్దుల ఎంపికపై తీవ్రస్ధాయిలో కసరత్తు చేశారు.
అభ్యర్ధితో పాటుగా క్యాష్ కూడా చూస్తున్నారు... కార్పోరేటర్ గా పోటీ చేయాలంటే 50 లక్షలు ఉండాల్సిందే. రిజర్వుడు నియోజకవర్గంలో అయితే 25 నుంచి 30 లక్షలట. ఆ మొత్తాన్ని తమ వ్యక్తులకు చూపించాలని, ఎన్నికల టైంలో మావారు చెప్పినట్లే చేయాలని కూడా హుకుం జారీచేస్తున్నారు. ఇది ఒక్క దేవినేని దొడ్డిలోనే కాదు. దాదాపు నాయకులంతా ఇదే ధోరణి అనుసరించారు. అయితే అవినాష్ అనుభవం తక్కువ కావడంతో సీక్రెట్ కాస్తా ఓపెన్ అయ్యింది.
విజయవాడ కార్పోరేషన్ లో పరిస్ధితే కాదు... రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలలో పరిస్ధితి దాదాపు ఇలానే ఉంది. కౌన్సిలర్ అయితే 15 నుంచి 20 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. జెడ్పీటీసీగా బరిలో నిలబడే అభ్యర్దికి 50 లక్షల వరకు రెడీ చేసుకోవాల్సిన పరిస్ధితి. ఎంపిటీసి, సర్పంచ్ లకు 10 లక్షల వరకు అవసరం ఉంటుందనే ఇండికేషన్స్ ఆయా పార్టీల నేతలు ఇచ్చారు.
ముఖ్యమంత్రి మద్యం, నగదు పంపిణీకి చెక్ పెట్టాలని పంచాయతీ చట్టంలోనే మార్పులు తీసుకొచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందిని ఈ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే తాహతు లేని నేతలు మండిపడుతున్నారు.