చంద్రబాబుకు ‘అది’ కూడా మిగలదా?
posted on Mar 14, 2020 @ 9:49AM
40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను, మూడు సార్లు ముఖ్యమంత్రిగా, అనేక దఫాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసాను.. అని పదే పదే చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడికి ప్రస్తుతం ప్రజలిచ్చిన ప్రతిపక్ష నాయకుడు అనే హోదా కూడా లేకుండా చేసేందుకు పావులు కదుపుతోంది అధికార పక్షం. అన్నీ అనుకున్నట్టు జరిగితే బహుశా త్వరలోనే అది జరిగే అవకాశం ఉంటుంది. చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా పోతే ఇప్పుడు ఆయనకు ఉన్న కొన్ని సౌకర్యాలు తీసేస్తారు.
ఇది 40 ఏళ్ళుగా ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబుకు తీరని అవమానంగా మిగలుతుంది. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలలో కేవలం 23 స్థానాలలో గెలిచింది. గెలిచిన నాటి నుంచి ఈ తొమ్మిది నెలల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. వల్లభనేని వంశి, మద్దాలి గిరి, కరణం బలరాంలు పార్టీ వదలి జగన్ పంచన చేరారు.
శాసనసభ్యత్వాలు మాత్రం వారు అంటిపెట్టుకునే ఉన్నారు. వాస్తవంగా తమ పార్టీలో చేరాలంటే ఎదుటి పక్షం వారు పదవులకు రాజీనామా చేసి రావాలని అలాగైతేనే పార్టీలో చేర్చుకుంటామని ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారం రోజునే చెప్పారు. గత అసెంబ్లీలో తమ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలో కలుపుకున్నాడని, అందువల్ల ఈ ఎన్నికల్లో ఆ పార్టీని దేవుడు కేవలం 23 మంది మాత్రమే గెలిచేలా చేశాడని చెప్పిన జగన్ ఆ తర్వాత తనకు పెట్టుకున్నాను అని చెప్పిన నిబంధనను సడలించుకున్నారు. దేవుడే రాసాడన్న స్క్రిప్టుకు కొద్దిపాటి మార్పులు చేసి ముగ్గురిని అనధికారికంగా తన పార్టీలో చేర్చేసుకున్నారు.
అయితే ఇప్పుడు తాజాగా దేవుడి స్క్రిప్టును పూర్తిగా మార్చేసేందుకు జగన్ నిశ్చయించుకున్నట్టు స్పష్టంగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి తమ పార్టీలో చేరేందుకు వేచి ఉన్న కనీసం 10 మంది ఎమ్మెల్యేలకు కండువా కప్పేస్తే చాలని.. ఆయన భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే ముందుగా కరణం బలరాంను చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అడ్డు చెప్పడం సరి కాదని జగన్ తాజాగా నిర్ణయించారు. తెలంగాణలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ఇక్కడ కూడా రెండింట మూడు వంతుల మంది ఎమ్మెల్యేలు గోడ దూకిన తర్వాత వారిని వైసిపిలో విలీనం చేసేసుకోవాలనే పథకాన్ని అమలు చేస్తున్నారు.
అవసరమైనంత మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత తెలుగుదేశం శాసనసభా పక్షాన్ని వైసిపిలో విలీనం చేస్తారు. ఇప్పటికే శాసన మండలి రద్దు చేసి తెలుగుదేశం పార్టీని చావు దెబ్బ కొట్టిన జగన్ ఇప్పుడు అన్ని జిల్లాలలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను చేర్చుకునే పనిలో ఉన్నారు. జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వచ్చేసిన తర్వాత ఇక తెలుగుదేశం పని ఖతం అయినట్లే అనే పరిస్థితి రాగానే ఎమ్మెల్యేలకు గేట్లు ఎత్తుతారు. ఆ చివరి స్ర్టోక్ తో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా పోతుంది. చంద్రబాబును రాష్ట్రంలో జీరో గా మిగల్చాలనేది అదికార పక్షం వ్యూహం.