బీపాస్ కావాలా?.. కర్ఫ్యూ పాస్ కావాలా? గ్రేటర్ సభలో కేసీఆర్
posted on Nov 28, 2020 @ 8:43PM
హైదరాబాద్ అభివృద్ధి కోసం మరోసారి టీఆర్ఎస్ ను గెలిపించాలని గ్రేటర్ ఓటర్లను కోరారు సీఎం కేసీఆర్. వంచకులు, మోసగాళ్ల జిమ్మిక్కులకు మోసపోవద్దని సూచించారు. రెచ్చగొట్టే మాటలు నమ్మి ఆగం కావొద్దన్నారు కేసీఆర్. ఏదైనా తేడా జరిగితే భూముల విలువలు పడిపోతాయని, వ్యాపారాలు పోతాయి జాగ్రత్త అని హెచ్చరించారు. గతం కంటే ఐదారు సీట్లు ఎక్కువ గెలిపించాలని, కేంద్రం మెడలు వంచి డబ్బులు తెచ్చి హైదరాబాద్ ను మరింతగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
వరదలతో నష్టపోయిన హైదరాబాద్ కు సాయం చేయాలని అడిగితే కేంద్రం పైసా కూడా ఇవ్వలేదని కేసఆర్ ఆరోపించారు. ఇప్పుడు ఓట్ల కోసం కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు హైదరాబాద్‌కు వరదల్లా వస్తున్నారని విమర్శించారు. ఒక బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంత మంది వస్తారా?, దేశం కోసం, ప్రజల మంచి కోసం మాట్లాడటం తప్పా? అని కేసీఆర్ ప్రశ్నించారు. 30 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారు?. బీహెచ్‌ఈఎల్, రైల్వేలను, బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఎందుకు అమ్ముతున్నారు?. యూపీలోనే సక్కగ లేదు, ఆ రాష్ట్ర సీఎం వచ్చి మనకు చెప్తాడా?. 28వ ర్యాంకర్ వచ్చి 5వ ర్యాంకర్‌కు చెబుతాడా?. బీపాస్ కావాలా?.. కర్ఫ్యూ పాస్ కావాలో ఆలోచించండని కేసీఆర్ చెప్పారు.
ఎన్నికల్లో ఓటేసే ముందు నేతల పనితీరును ప్రజలు ఆలోచించుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ చాలా చైతన్యం, చరిత్ర ఉన్న నగరమని చెప్పారు. ఎన్నో మంచిచెడులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. 2001లో ఉద్యమాన్ని ప్రారంభిస్తే సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. రాష్ట్రం అంధకారమవుతుందని కొంతమంది, నీళ్లు రావని మరికొంతమంది శాపాలు పెట్టారని ఆక్షేపించారు. ఇన్ని అనుమానాలు, అపోహల మధ్య తెరాస పార్టీని నమ్మి దీవించి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. ప్రజల సహకారం ఉంటే రాబోయే కొన్ని నెలలు, సంవత్సరాల్లో హైదరాబాద్‌లో 24 గంటలూ నీరిచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు కేసీఆర్. పేదలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీరు ఇస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా చేస్తుందని చెప్పారు. కేసీఆర్ కిట్ సూపర్‌హిట్ పథకమని, రైతుబంధు దేశంలో ఎక్కడా లేదన్నారు. కరోనాతో ప్రభుత్వ ఆదాయం పడిపోయినా.. సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు కేసీఆర్. రాష్ట్రంలో ఏటా రూ.42వేల కోట్లకు పైగా సంక్షేమానికి కేటాయిస్తున్నామని తెలిపారు.