కరోనా పుట్టింది భారత్ లోనట.. చైనా శాస్త్రవేత్తల వితండ వాదన.. నమ్మేదెవరు
posted on Nov 28, 2020 @ 9:17PM
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరంలో పుట్టి దాదాపుగా ఒక సంవత్సరం పూర్తవుతోంది. ఇది అక్కడి జంతువుల నుండి మనుషులకు వ్యాపించిందని.. చైనా ప్రభుత్వం ఆ విషయాన్ని దాచి పెట్టడంతో అక్కడి నుండి ప్రపంచం మొత్తం వ్యాపించిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే దీని పై మరో వాదన కూడా ఉంది. వూహాన్ లోని ఒక ల్యాబ్ లో ఈ ప్రాణాంతక వైరస్ ను తయారు చేసి ప్రపంచం మీదికి వదిలారని చైనా నుండి పారిపోయి వచ్చిన మరి కొంత మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వైరస్ మాత్రం చైనాలోనే పుట్టిందని అమెరికా తో సహా ప్రపంచ దేశాలన్నీ నమ్ముతున్నాయి.
అయితే తాజాగా చైనా శాస్త్రవేత్తలు మాత్రం కరోనా మహమ్మారి పుట్టుక మూలాలు భారత్ లో ఉండొచ్చంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. భారత్, బంగ్లాదేశ్ లో కరోనా వైరస్ ఉత్పన్నమై ఉంటుందని వారు చెబుతున్నారు. 2019 డిసెంబరులో వుహాన్ లో కరోనా వ్యాప్తి మొదలు కాగా, అంతకుముందే భారత్, బంగ్లాదేశ్ లో ఈ వైరస్ ఉనికి వెల్లడైందని చైనాలోని షాంఘై ఇన్ స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు చెపుతున్నారు.
అంతేకాకుండా కొవిడ్-19 పుట్టింది తమ దేశంలో కాదనడానికి ఆధారాలు ఉన్నాయని.. 2019 వేసవిలోనే ఈ వైరస్.. జంతువుల నుంచి కలుషితమై నీటి ద్వారా మానవులకు సోకడం ద్వారా భారత గడ్డపైనే పుట్టిందని, చైనా పరిశోధకుల వాదన. వుహాన్ లో పుట్టిందే నిజమైన కరోనా వైరస్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని వారి వితండ వాదన.
వైరస్ మూలాన్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా వివిధ రకాల జన్యు ఉత్పరివర్తనాలను పరిశోధించడం ద్వారా ఫైలోజెనెటిక్ విశ్లేషణ కూడా చేపట్టామని వెల్లడించారు. 2019 వేసవిలో పాకిస్థాన్ వైపు నుంచి వీచిన వేడిగాలులతో భారత్ లో తీవ్రమైన నీటి సంక్షోభం ఏర్పడిందని, తత్ఫలితంగా జంతువులు, మానవులు ఒకే నీటిని తాగడంతో ఉద్భవించిన కరోనా వైరస్ రక్కసి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని షాంఘై ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు విశ్లేషించారు.
ఇది ఇలా ఉండగా ఈ చైనా పరిశోధకుల వాదనను భారత్ సహా ఇతర దేశాల్లోని పరిశోధకులు ఎవరూ ఏమాత్రం విశ్వసించడంలేదు. భారత ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్న వైరాలజిస్ట్ ముఖేశ్ ఠాకూర్ షాంఘై ఇన్ స్టిట్యూట్ అధ్యయనంలోనివన్నీ తప్పుడు వాదనలేనని ఖండించారు. అంతర్జాతీయ నిపుణుడు డేవిడ్ రాబర్ట్ సన్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు.
అయితే ఇంత ప్రాణాంతకమైన వైరస్ భారత్ లోనే కనుక పుడితే 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో దాని వ్యాప్తి చాలా తీవ్రంగా ఉండేది. దీంతో వూహాన్ కంటే ముందే భారత్ బలి అయ్యేది. అయితే 2019 డిసెంబర్ లో వూహాన్ లో ఈ వైరస్ వ్యాప్తి ప్రభావంతో అక్కడ తీవ్ర అలజడి రేగిన సంగతిని అంతర్జాతీయ సంస్థలు కూడా గుర్తించాయి. ఇదే సమయంలో భారత్ లోని మొదటి కేసు 2020 జనవరిలో నమోదైంది. కరోనా సోకిన ఒక విద్యార్థిని వూహాన్ నుండి కేరళకు తిరిగి రావడంతో తొలి కేసు నమోదైంది.
దీనికి తోడు చైనా కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చైనీయులు మొన్న జనవరిలో తమ దేశానికీ వెళ్లి మళ్ళీ తిరిగి రావడంతో ఇటలీ వంటి దేశాలలో ఈ వైరస్ విలయతాండవం సృష్టించడంతో వేలాది మంది చనిపోయిన సంగతి ప్రపంచం మొత్తం చూసింది. అంతేకాకుండా ఈ వైరస్ గురించి చైనా ప్రపంచాన్ని ఏమాత్రం అప్రమత్తం చేయలేదని మొన్నటి వరకు దాని మిత్ర దేశం గా ఉన్న ఆస్ట్రేలియా తో సహా ప్రపంచ దేశాలన్నీ గట్టిగా నమ్ముతున్నాయి. దీంతో ఈ చిక్కుల నుండి బయట పడేందుకు చైనా ఆ పాపాన్ని భారత్ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తోంది. కరోనా వైరస్ పుట్టుక గురించి ప్రపంచ దేశాల వద్ద ఇంత స్పష్టమైన సమాచారం ఉండగా చైనా చేస్తున్న ఈ జిమ్మిక్కులను నమ్మేదెవరు..