జనసేనతో బీజేపీ పొత్తు ఉన్నట్టా.. లేనట్టా! పవన్ ఎందుకు ప్రచారం చేయడం లేదు?
posted on Nov 28, 2020 @ 2:44PM
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తుపై మళ్లీ సస్పెన్స్ నెలకొంది. బీజేపీ నేతల కామెంట్లు, తెలంగాణ జనసేన నేతల కౌంటర్లతో రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. గ్రేటర్ లో తమకు ఎవరితోనూ పొత్తు లేదని బీజేపీ నేతలు ప్రచారంలో చెబుతుండటంపై జనసేన సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య జరుగుతున్న తాజా పరిణామాలతో పొత్తు కొనసాగుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన వ్యవహారం మొదటి నుంచి గందరగోళంగానే ఉంది. సొంతంగానే పోటీ చేస్తామని ముందు ప్రకటించిన పవన్ కల్యాణ్.. తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్ చర్చలు జరపడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జనసేన నుంచి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా బీజేపీ అభ్యర్థులకు పడాలని చెప్పిన పవన్ కల్యాణ్.. బీజేపీ తరపున ప్రచారం కూడా చేస్తానని చెప్పారు. అయితే గ్రేటర్ ప్రచారం ముగుస్తున్నా ఎక్కడా ఆయన ప్రచారం చేయలేదు. గ్రేటర్ బరి నుంచి తప్పుకుని బీజేపీకి మద్దతు ఇచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్లారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. రెండు రోజుల పాటు అక్కడే ఉండి కొందరు బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కూడా కలిశారు. గ్రేటర్ ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికతో బీజేపీ పెద్దలతో పవన్ కల్యాణ్ మాట్లాడారనే ప్రచారం జరిగింది. ఢిల్లీ నుంచి రాగానే జీహెచ్ఎంసీలో ప్రచారం చేస్తారని అంతా భావించారు. కాని జనసేన చీఫ్ ప్రచారానికి దిగలేదు.
గ్రేటర్ లో పవన్ ప్రచారం చేయకపోవడంతో ఢిల్లీలో బీజేపీతో జరిగిన చర్చలు సానుకూలంగా జరగలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో సపోర్ట్ చేస్తున్నందున తిరుపతి సీటును తమకు కేటాయించాలని పవన్ కోరగా.. బీజేపీ అంగీకరించలేదని చెబుతున్నారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ పాల్గొనడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ ప్రచారానికి రాకపోవడంపై మరో వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలే ఆయన ప్రచారానికి ఇష్టపడలేదని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటుపై గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తెరపైకి తెస్తే గ్రేటర్ ఎన్నికల్లో ఫలితం చూపించవచ్చని కొందరు కమలం నేతలు అభిప్రాయపడ్డారట. జనసేన పొత్తుపైనే విమర్శలు వస్తున్నాయని, పవన్ ను ప్రచారానికి కూడా తీసుకువస్తే ప్రమాదమని మరికొందరు సూచించారని తెలుస్తోంది. అందుకే పవన్ ప్రచారానికి చేయడానికి సిద్ధమైనా.. తెలంగాణ బీజేపీ నేతలు వద్దని చెప్పారనే చర్చ జరుగుతోంది.
జనసేన పొత్తు విషయంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య గ్యాప్ ను పెంచాయి. ఎన్నికల రోడ్ షోలో మాట్లాడిన అర్వింద్.. తమకు ఎవరితోనూ పొత్తు లేదని ప్రకటించారు. జనసేన పార్టీ సొంతంగా నిర్ణయం తీసుకుని పోటీ నుంచి తప్పుకుందని చెప్పారు. ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలపై జనసేనలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అర్వింద్ ప్రకటనపై అభ్యంతరాలు తెలుపుతూ జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ అగ్ర నేతలు, తెలంగాణ రాష్ట్ర నేతలు కోరితేనే ఎన్నికల్లో పోటీ నుంచి జనసేన పార్టీ తప్పుకుందని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు. ఇవేవీ తెలుసుకోకుండా అరవింద్ మాట్లాడం సబబు కాదన్నారు. జనసేన పార్టీపై అరవింద్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ ఏ పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందో మీకు తెలియకపోతే మీ అగ్రనాయకులను అడిగి తెలుసుకోండని అర్వింద్ కు సూచించారు. జనసైనికులను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం సరైన పద్ధతి కాదని విమర్శించారు శంకర్ గౌడ్.
ఎంపీ అర్వింద్ ప్రకటన తర్వాత జరుగుతున్న తాజా పరిణామాలతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారని, బీజేపీకి మద్దతు విషయంలో వారంతా పునరాలోచించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. జనసేన ప్రకటన విడుదల చేసిన తర్వాత బీజేపీ ముఖ్య నేతలు అప్రమత్తమయ్యారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తో మాట్లాడి.. బీజేపీకి మద్దతుపై మరోసారి ప్రకటన చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.