పోలీసుల తలపై శాంటాక్లాజ్ టోపీలు! సర్జికల్ స్ట్రైక్ అవసరమన్న బీజేపీ నేతలు
posted on Dec 14, 2020 @ 2:45PM
సర్జికల్ స్ట్రైక్. 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసినప్పుడు మార్మోగిన పదం. కొన్ని రోజుల పాటు దేశ వ్యాప్తంగా సర్టికల్ స్టైక్స్ పైనే చర్చ జరిగింది. అప్పటి నుంచి ఎక్కడైనా పెద్ద ఘటన జరిగితే సర్జికల్ స్ట్రైక్ అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సర్జికల్ స్ట్రైక్ పదం మరోసారి ప్రకంపనలు రేపింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ కామెంట్లు రాజకీయ కాక రేపాయి. సంజయ్ సర్జికల్ స్ట్రైక్ కామెంట్ల చుట్టే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారమంతా సాగింది. గ్రేటర్ లో ఊహించని ఫలితాలు సాధించిన బీజేపీ విజయంలో సర్జికల్ స్ట్రైక్ అంశం కీలకంగా నిలిచిందని రాజకీయ వర్గాల అభిప్రాయం.
తెలంగాణలో బీజేపీ దూకుడుకు ఉపయోగపడిన సర్జికల్ స్ట్రైక్ పదం ఇప్పుడు ఏపీలోనూ మార్మోగుతోంది. అక్కడ కూడా కమలనాధులే జగన్ సర్కార్ పై పోరాటంలో తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు. ఏపీలో హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. టీటీడీ, విజయవాడ కనకదర్గ వంటి ప్రముఖల ఆలయాలతో పాటు ఇతర గుడుల్లో వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హిందూ సాంప్రదాయాలు మంటగలిపేలా కావాలనే కొందరు ఆంధ్రప్రదేశ్ లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. క్రైస్తవ పాస్టర్లకు జగన్ ప్రభుత్వం భృతి ఇవ్వడంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇవన్ని ఇలా ఉండగానే తాజాగా క్రిస్మస్ వేడుకల అంశం ఏపీలో రాజకీయ కాక రేపుతోంది. పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ వేడుకలు జరపడంపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
విజయవాడ పట్టణ మూడో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో గత వారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మూడు సింహాల టోపీలను పక్కనపెట్టి, శాంటాక్లాజ్ టోపీలు ధరించారు. పోలీసులు మూడు సింహాల టోపీలను పక్కనపెట్టి శాంటాక్లాజ్ టోపీలు ధరించడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు, ఏపీ సర్కార్ తీరుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వమే క్రైస్తవ మత ప్రచారం నిర్వహిస్తున్నట్టుగా ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ప్రత్యర్థుల ఆటకట్టించడానికి ఒక సర్జికల్ స్ట్రైక్ అవరమైతే.. ఆంధ్రప్రదేశ్ లో రెండు సర్జికల్ స్ట్రైక్ అవసరమని జీవీఎల్ అన్నారు. ఏపీలో మత రాజకీయాలు చేయడంలో వైసీపీ, టీడీపీ పోటీ పడుతున్నాయని, ఆ రెండిటిపైనా రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన అవసరం ఉందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. పోలీస్ స్టేషన్‌లో దసరా సంబరాలు ఎప్పుడైనా చేశారా అని జీవీఎల్ ప్రశ్నించారు. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యలో కూడా ముస్లిం ఓట్ల కోసం పోలీసులను వేధించారని చెప్పారు. లౌకిక పార్టీల పేరుతో వైసీపీ, టీడీపీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
పోలీసులు శాంటాక్లాజ్ టోపీలు ధరించి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వీడియోను ట్వీట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు బీజేపీ నేతలు. 41 రోజులు అయప్ప మాల ధరించిన పోలీసులు కూడా నాలుగు సింహాలున్న టోపీని గౌరవిస్తారు.. పవిత్ర రంజాన్ మాసంలో 41 రోజులు ఉపవాస దీక్ష చేసే ముస్లింలు కూడా నాలుగు సింహాలున్న టోపీని అంతే గౌరవంతో చూస్తారు.. మరి క్రిస్మస్ సమయంలో ఆ అవసరం లేదా? లేకుంటే ఆంధ్రాలో నాలుగు సింహాల టోపీకి విలువ తగ్గించారా? అని ఏపీ సర్కార్ ను కడిగి పారేస్తున్నారు కమలం నేతలు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు కోవిడ్ నిబంధనలు అమలు చేస్తారు.. ప్రతి సంవత్సరం జరుపుకోనే వినాయక చవితి పండుగకు విగ్రహాలు పెట్టకూడదంటారు.. మరి వీరికి మాత్రం ఏ నిబందనలూ వర్తించవా?' అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
తిరుపతి లోక్ సభకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ వేడుకలు, సర్జికల్ స్ట్రైక్ అంశాలకు ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుందట. లౌకిక పార్టీల పేరుతో వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తున్న కమలం నేతలు.. తిరుపతి ఉప ఎన్నికలో రెండు పార్టీలకు బుద్ధి చెబుతామని అంటున్నారు.