ఒక్క క్షణం ఆగి ఉంటే.. ఎంత బాగుండేది
posted on Dec 14, 2020 @ 11:39AM
మనిషి చేసే చిన్న పొరపాటు ఒక్కోసారి తమను కన్నవారిని ఇక ఎప్పటికి కోలుకోలేని విషాదంలో ముంచేస్తుంది. తాజాగా ఇటువంటి దుర్ఘటన ఒకటి హైదరాబాద్ లో జరిగింది. ఐదుగురు యువకులు సరదాగా కారులో షికారుకు బయలుదేరారు. అయితే మితిమీరిన వేగంతో ఒక చౌరస్తా వైపు దూసుకొచ్చారు. ఆ చౌరస్తా వద్ద అప్పటికే రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా కారును ముందుకు పరుగులు పెట్టించారు. అయితే ఆ తప్పే అటు వారి నిండు ప్రాణాలను బలిగొనడమే కాక వారిని కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. ఇదే సమయంలో గ్రీన్ సిగ్నల్ రావడంతో మరోవైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్, వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురూ మృతి చెందారు.
గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో మృతులంతా ఏపీకి చెందిన యువకులుగా గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మనోహర్(23), కాట్రగడ్డ సంతోష్(25), నెల్లూరుకు చెందిన కొల్లూరు పవన్ కుమార్(24), నాగిశెట్టి రోషన్(23), విజయవాడకు చెందిన పప్పు భరద్వాజ్(20) మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. అయితే సంతోష్ ఐటీ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా, మనోహర్ యానిమేషన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. పవన్‌కుమార్, నాగిశెట్టి రోషన్, పప్పు భరద్వాజ్‌లు మొన్నటి వరకు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారు. అయితే లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు పోవడంతో ఈ ముగ్గురూ ప్రస్తుతం అమీర్‌పేటలో కొత్త సాప్ట్‌వేర్ కోర్సులలో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే అందరూ రాత్రికి హాస్టల్ చేరుకున్న తర్వాత సరదాగా సంతోష్ కు చెందిన కారులో బయలుదేరగా.. వాహనాన్ని సంతోషే నడిపాడు.
కొంత సేపు అక్కడక్కడా తిరిగి... స్నేహితులను కలిసి అర్ధరాత్రి తర్వాత తిరిగి హాస్టల్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే రాత్రి ట్రిపుల్ ఐటీ సర్కిల్ నుంచి విప్రో జంక్షన్ వద్దకు 2:48 గంటలకు చేరుకునే సరికి అక్కడ రెడ్ సిగ్నల్ పడి ఉంది. అయితే వాహనాన్ని ఆపకుండా సంతోష్ క్యూసిటీ వైపు దూసుకు పోయాడు. అదే సమయంలో మరోపైపు నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో టిప్పర్ దూసుకొచ్చింది. అయితే కారును చూసి టిప్పర్ డ్రైవర్ బ్రేకులు వేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. దీంతో ప్రమాదంలో టిప్పర్ కూడా బోల్తా పడింది. ఇక కారులో ఉన్న సంతోష్, మనోహర్, పవన్, రోషన్ ఘటనాస్థలిలోనే మృత్యువాత పడగా.. ఆస్పత్రి తరలించిన కొద్దిసేపటికి భరద్వాజ్ కూడా కన్నుమూశాడు. దీంతో వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేవలం కొన్ని క్షణాలు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేసి ఉంటే ఆ ఐదుగురు యువకులు ప్రాణాలతో ఉండేవారు... అదే సమయంలో వారిని కన్నవారికి ఈరోజు తీరని శోకం కూడా తప్పేది అని వారి బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.