పథకాలకు పేర్లే కాదు పాలన కూడా సేమ్! సీఎం జగన్ తీరుపై జనాల్లో చర్చ
posted on Dec 14, 2020 @ 8:45PM
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అంతా వైఎస్సార్ నామ జపమే వినిపిస్తోంది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన పథకాలన్నింటికి వైఎస్సార్ పేరే పెట్టారు. పెన్షన్ పథకం నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వరకు అన్నింటికి అదే పేరు. ప్రభుత్వ పథకాల పేర్లపై జనాల నుంచి వ్యతిరేకత వస్తున్నా ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి సర్కార్ పథకాలకు పేరు పెట్టడం కాదు పాలనంతా గతంలో వైఎస్సార్ హయాంలో జరిగినట్లుగా చేయాలనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో సంచలనం రేపిన మైనింగ్ స్కాంలో అరెస్టై జైలుకు వెళ్లిన సీనియర్ ఐఎస్ అధికారి వై.శ్రీలక్ష్మిని పట్టుబట్టి మరీ ఏపీకి తీసుకురావడం, ఈ నెలాఖారులో పదవి విరమణ చేయనున్న నీలం సాహ్నీ స్థానంలో తదుపరి సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ ను నియమించాలని నిర్ణయించడాన్ని అందుకు ఉదాహరణగా చూపుతున్నారు.
వైఎస్ హయాంలో కీలకంగా ఉన్న అధికారులకే జగన్ కీలక పోస్టులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. గతేడాది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్.. గతంలో తన తండ్రి దగ్గర పనిచేసిన పలువురు అధికారులను తెచ్చిపెట్టుకున్నారు. సీనియర్లను కాదని కొందరు జూనియర్లకు కీలక పోస్టులు కట్టబెట్టారు. ఇదే కోవలో తనకూ అవకాశం దక్కుతుందని సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కేంద్రం ఆమెను డిప్యుటేషన్‌పై ఏపీకి పెంపేందుకు నిరాకరించింది. సెక్రటరీ స్ధాయి అధికారుల డిప్యుటేషన్ కుదరదని చెప్పేసింది. సీఎం జగన్ జోక్యం చేసుకుని ఆమెకు మద్దతుగా కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో ఏడాదిన్నర కాలంగా ఆమె తెలంగాణ క్యాడర్‌లోనే పనిచేయాల్సి వచ్చింది. చివరకు క్యాట్ ను ఆశ్రయించి అనుకున్నది సాధించారు శ్రీలక్ష్మి. క్యాట్ అదేశాలతో ఆమె ఏపీకి బదిలీ అయ్యారు. శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖను అనుమతి కోరింది. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పోస్టింగ్ ఇవ్వనున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి ఓ వెలుగు వెలిగారు. గనులశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఓబుళాపురం మైనింగ్ కు అనుమతుల విషయంలో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించడం ద్వారా గాలి జనార్ధనరెడ్డికి భారీగా లబ్ధి చేకూరింది. దీంతో శ్రీలక్ష్మి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణల వచ్చాయి. వైఎస్ మరణం తర్వాత సీబీఐ మైనింగ్ తో పాటు జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు చేయడంతో ఆమె జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది. జైలులో ఆమె ఆరోగ్యం క్షిణించడం ఆ తర్వాత కోలుకోవడం జరిగాయి. గతంలో అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లిన అధికారి కోసం జగన్ సర్కార్.. కేంద్రం దగ్గర లాబీయింగ్ చేయడంపై విమర్శలు వచ్చాయి. అయితే గతంలో తన తండ్రికి నమ్మినబంటుగా పని చేసిన అధికారి కాబట్టే జగన్ ఇంతగా పట్టుబట్టారని చెబుతున్నారు. తన ప్రభుత్వంలోనూ శ్రీలక్ష్మికి జగన్ కీలక బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు.
ఏపీ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆమె తరువాత సీఎస్ గా 1987వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ వైపే సీఎం జగన్ మొగ్గు చూపినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్‌ను ముందుగా సీఎస్ కార్యాలయంలో ఓఎస్డీగా నియమిస్తున్నట్లు సమాచారం. నెలాఖరు వరకూ అయన ఓఎస్డీగా ఉంటూ పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకోడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సంప్రదాయం కేంద్ర సర్వీసుల్లో ఇప్పటికే ఉంది. నిజానికి నీలం సాహ్ని తర్వాత సీనియారిటీలో ఆమె భర్త అజయ్ సాహ్ని, ఆ తర్వాతి స్థానాలలో సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. వీరిలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉండగా, అభయ్ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పనిచేస్తున్నారు. మరో ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర మాజీ సీఎం చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసారు. ఆయనను సీఎస్ గా చేయడానికి జగన్ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. మరో అధికారి జేఎస్వీ ప్రసాద్‌పై కూడా సీఎంకు సదభిప్రాయం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం సీసీఎల్ఏ బాధ్యతలు చూస్తున్న నీరబ్ ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే నీరబ్‌కు 2024 జూన్ వరకూ పదవీకాలం ఉంది. అంటే మూడున్నర ఏండ్లు ఆయనే సీఎస్. అంత ఎక్కువ కాలం ఒకరినే సీఎస్ గా కొనసాగించడం సరికాదన్న ఉద్దేశంతో సీఎం జగన్ ఆదిత్యనాథ్ వైపే మొగ్గుచూపారని చెబుతున్నారు. అంతేకాదు జగన్ కు మొదటి నుంచి ఆధిత్యనాథ్ నమ్మకస్తుడిగా ఉన్నారు. అందుకే జగన్ కూడా ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. సీఎంవోలోనూ చోటు కల్పించారు. ఈ నేపథ్యంలోనే ఆదిత్యనాథ్ దాస్ ను సీఎస్ గా నియమించాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా వైఎస్సార్ తరహాలోనే జగన్ పాలనలో ముందుకు వెళుతున్నారని తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో మాత్రం దీనిపై మరో చర్చ జరుగుతోంది. వైఎస్సార్ హయాంలో అవినీతి అరోపణలు ఎదుర్కొన్న వారికి ప్రాధాన్యత ఇస్తే జనాల్లోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.