కేంద్రం దగ్గర కేసీఆర్ ప్రాజెక్టుల చిట్టా! సీఎంవో నుంచే సమాచారం లీక్?
posted on Dec 14, 2020 @ 3:46PM
ప్రగతి భవన్ లో లీకు వీరులున్నారా? కేసీఆర్ రహస్య చిట్టా మొత్తం కేంద్రం చేతికి వెళ్లిందా? లీకేజీ సమాచారంతో టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ పంజా విసరబోతుందా? అంటే తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. పాలనా వ్యవహారాలకు సంబంధించి కేసీఆర్ రహస్యంగా దాచాలనుకున్న విషయాలన్నీ బహిర్గతమైనట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన మూడో టీఎంసీ ఎత్తిపోతలకు బ్రేక్ వేస్తూ కేంద్ర జలవనరుల శాఖ నుంచి వచ్చిన లేఖ ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ లో అలజడి రేపుతుందని చెబుతున్నారు. కేంద్ర మంతి గజేంద్ర షెకావత్… సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలు ఉన్నాయట. లేఖలో చాలా విషయాలను పాయింట్ టు పాయింట్ కేంద్రం అడిగిందట. కేంద్ర మంత్రి నుంచి వచ్చిన లేఖతో కేసీఆర్ ఇంతకాలం రహస్యంగా ఉంచిన ప్రాజెక్ట్ డీపీఆర్‌లు కేంద్రం దగ్గర ఉన్నట్లు స్పష్టమవుతోందట. కేంద్రం నుంచి లేఖ వచ్చిన రోజే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీ వెళ్లడం మరింత ఆసక్తిగా మారింది. సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్ లు, అవినీతి ఆరోపణలపై సంజయ్ నుంచి బీజేపీ పెద్దలు మరింత సమాచారం తీసుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
కేసీఆర్ సర్కార్ చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అంతర్గత విషయాలన్నీ కేంద్రం చేతిలో ఉన్నాయని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులపై జలశక్తి, కేఈఆర్ఎంబీ, జీఆర్ఎంబీలు చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు అడుగుతూనే ఉన్నాయి. డీపీఆర్‌లు సమర్పించాలని లేఖలు రాస్తూనే ఉన్నాయి. కేంద్రం కూడా దీనిపై చాలాసార్లు సీఎంకు అధికారికంగా లేఖలు పంపింది. అపెక్స్ కౌన్సిల్ కూడా డీపీఆర్‌లు ఇవ్వాలని కోరింది. కానీ రాష్ట్రం మాత్రం అవన్నీ పాత ప్రాజెక్టులంటూ కొట్టిపారేస్తుందే కానీ డీపీఆర్‌లు మాత్రం కేంద్రానికి ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ఆ డీపీఆర్ లు కేంద్రం దగ్గర ఉన్నాయని.. షెకావత్ నుంచి వచ్చిన లేఖ తర్వాత సీఎం కేసీఆర్ అంచనాకు వచ్చారని సమాచారం. కేంద్రం చేతికి చెక్కిన ప్రాజెక్టుల డీపీఆర్ లతో రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు తప్పవనే ప్రచారం జరుగుతోంది. ఆ డీపీఆర్ లలో చాలా లోపాలు ఉన్నాయంటున్నారు. ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు కూడా ఉన్నాయట. ప్రైస్ ఎస్కలేషన్‌తో పాటు ఇసుక దందా, నిర్మాణాల్లో వైఫల్యాల వంటి అంశాలన్నీ కేంద్రం గుర్తించినట్లు చెప్పుతున్నారు. ఈ డీపీఆర్‌లు కేంద్రానికి వెళ్లడం సీఎం కేసీఆర్‌కు అగ్ని పరీక్షేనని చెబుతున్నారు.
టీఆర్ఎస్ సర్కార్ దాచిపెట్టిన రహస్యాలు ఎలా లీక్ అయ్యాయనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రగతి భవన్‌కు ఎవరైనా వెళ్లడం అత్యంత కష్టం. చాలా సెక్యూరిటీ అంశాలను దాటుకుని డీపీఆర్‌లు బయటకు వెళ్లడం అంత ఈజీ కాదంటున్నారు. కేసీఆర్ అధికారిక నివాసం నుంచి పక్కాగా లీకులు ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. కొంతమంది ఉన్నతాధికారులను అనుమానించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. దీంతో తన దగ్గరే ఉంటూ నమ్మక ద్రోహానికి పాల్పడిందెవ్వరనే అంశంపై నిగ్గు తేల్చే పనిలో పడ్డారట గులాబీ బాస్. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ టీం ఉంటోంది. సీనియర్ ఐఏఎస్‌లు, ముందు నుంచి తనకు అండగా నిలిచిన అధికారులకు ప్రగతిభవన్‌లో స్థానం కల్పించారు కేసీఆర్. కొంతమంది సెంట్రల్ సర్వీసుల్లో ఉన్న వారిని డిప్యూటేషన్‌పై తెచ్చుకున్నారు. అయితే ఇంత నమ్మకంగా ఉన్నా డీపీఆర్‌ల విషయంలో నమ్మకద్రోహం చేసి కేంద్రానికి సహకరించిదెవ్వరనే అంశం మిస్టరీగానే ఉందట. కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన అధికారులపైనే కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన కీలక డీపీఆర్‌లు కేంద్రం చేతికి చిక్కడంతో తమకు సమస్యలు తలెత్తుతున్నాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు. అది కూడా కేంద్రంతో కొంత వివాదం మొదలైన నేపథ్యంలోనే డీపీఆర్‌లు వెళ్లడం అధికార పార్టీని మరింత కలవరపెడుతోందట. కేసీఆర్ సర్కార్ పై ఇప్పటికే దూకుడుగా వెళుతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతోనే రాష్ట్ర బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని, కేంద్ర దగ్గర ఉన్న సమాచారం రాష్ట్ర నేతలకు కూడా చేరిందనే అనుమానాలను టీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ డీపీఆర్ ల ద్వారా ఏదో విధంగా తమను ఇరికించే ప్రయత్నాలు కేంద్ర సర్కార్ చేయవచ్చని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారట. మరీ ఈ విషయం ఎంత వరకు వెళుతుందో.. కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో.. చూడాలి మరీ..