తెలంగాణ కోడలికి ఓటెందుకు లేదు! వైఎస్ షర్మిలపై జనాల్లో రచ్చ 

కొత్త పార్టీ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు వైఎస్ షర్మిల. తెలంగాణ కోడలుగా జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్న షర్మిల.. పార్టీ ఏర్పాట్లలో భాగంగా  వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజన్న బిడ్డను, తెలంగాణ కోడలిని అని నూతన సెంటిమెంటును తెరపైకి తీసుకొస్తున్నారు. తెలంగాణ కోడలినంటూ షర్మిల చేస్తున్న ప్రకటనలపై  తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలోనూ రసవత్తర చర్చ జరుగుతోంది.  ఏపీ  ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి ముద్దుల చెల్లెలు షర్మిల 2019 ఎన్నికలలో ఎక్కడ తాను ఓటు వేశారో ఆమె మరిచిపోయినా.. షర్మిల ఓటు వేసిన ప్రాంత ప్రజలు మరిచిపోలేదని కొందరు పోస్టులు చేస్తున్నారు.2019 ఎన్నికలలో ఆమె పులివెందుల నియోజకవర్గంలోని ఒక బూత్‍లో ఆమె ఓటు  వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజన్న ముద్దు బిడ్డ.. జగనన్న ముద్దుల చెల్లెలుగా షర్మిల పులివెందులలో ఓటు వేశారే తప్ప తెలంగాణ కోడలు అని చెప్పుకుంటున్న షర్మిల ఆమె భర్త నివాసం ఉంటున్న ప్రాంతంలో ఎందుకు ఓటు వేయలేకపోయారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  తెలంగాణ కోడలికి పులివెందుల నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఓటు ఎందుకు ఉందనే చర్చ తెరపైకి  వచ్చింది. ఎన్నో సంవత్సరాల కిందట పులివెందులలో ఓటు నమోదు చేసుకున్న షర్మిల.. తెలంగాణ కోడలు అని చెప్పుకుంటున్న ఆమె భర్త నివాసం ఉంటున్న ప్రాంతంలో ఎందుకు ఓటు చేర్చుకోలేకపోయారని అడుగుతున్నారు. అప్పుడేమో అన్న జగన్‍ రెడ్డికి ఓటు వేయాలి.. ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆమె కోరుకున్నారని చెబుతున్నారు. జగన్‍ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తనను పట్టించుకోలేదని.. తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని.. తనను రాజ్యసభకు పంపలేదని.. తనకన్నా భార్య భారతికే జగన్‍ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని.. అనుభవంతో తెలుసుకున్న షర్మిల రాజన్న బిడ్డగా తెలంగాణలో పార్టీని స్థాపించాలనుకోవటంలో మర్మం ఏమిటి..? అని నిలదీస్తున్నారు.  తెలంగాణ కోడలు అని చెప్పుకుంటున్న షర్మిల.. తెలంగాణలో ఎందుకు ఓటు చేర్చుకోలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. తనకు భర్త ఉండే నివాసం కన్నా.. జగన్‍ అన్న నియోజకవర్గంలో ఓటు వేయటమే మిన్నగా భావించినట్లేకదా..? అని చెబుతున్నారు. 2019 ఎన్నికలలో పులివెందులలో ఓటు వేసిన షర్మిల తెలంగాణ ప్రాంత కోడలిగా ఆమె అనుకోవటం లేదని స్పష్టం చేస్తుంది కదా అని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందే తప్ప రాజన్న బిడ్డ కోసం కాదని.. ఎంపీ రేవంత్‍ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.  మరోవైపు ఓటు పులివెందులలో.. పార్టీ పెట్టేది తెలంగాణలో అన్న అంశంపై మిగితా రాజకీయ పార్టీలు నిలదీస్తే.. షర్మిల ఏం చెబుతున్నారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ కోడలి కన్నా.. రాయలసీమ ఆడపడుచుగానే షర్మిల భావించారని… స్పష్టం అవుతోందని.. దీనిని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని ఆప్రాంత నేతలు రేపో మాపో బయట పెట్టే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన విమానం! గన్నవరంలో తప్పిన పెను ప్రమాదం

విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. దోహా నుంచి గన్నవరం వస్తున్న ఎయిరిండియా విమానం  ప్రమాదానికి గురైంది. గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా విమానం అదుపుతప్పి రన్ వే పక్కనే ఉన్న ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎయిరిండియా విమానం రెక్కలు దెబ్బతిన్నాయి.పైలట్‌ కన్ఫ్యూజన్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని ఎయిర్ పోర్టు అధికారులు అంటున్నారు.  ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విమానం రెక్క స్తంభాన్ని ఢీకొట్టడంతో భయంతో అరుపులు, కేకలు వేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులున్నారు. అయితే  ప్రయాణికులంతా  సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని విమానాశ్రయ డైరెక్టర్ వెల్లడించారు. ఈ ఘటనతో పలు విమాన రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా  దెబ్బతిన్న విమానం రెక్కలకు మరమ్మతులు నిర్వహించేందుకు నిపుణుల బృందం గన్నవరం రానుంది.

మరో ‘సారీ’  ప్రత్యేక హోదా!

ఈ రోజు ఫిబ్రవరి 20. ఈరోజుకు ఒక ప్రత్యేకత వుంది. 2014లో ఇదే రోజున ఆప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంగీకరించారు. ఆ మేరకు రాజ్య సభలో ప్రకటన చేశారు. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చరిత్ర. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా, ప్రభుత్వం అన్నది, ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాలు మారినా గత ప్రభుత్వాలు చట్టబద్దంగా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం కొత్తగా వచ్చిన ప్రభుత్వాల రాజ్యాంగ విదిత కర్తవ్యం. ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టింది,అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న, ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ. కాబట్టి ప్రత్యేక హోదా హామీని అమలు చేయవలసిన రాజ్యాంగ కర్తవ్యంతో పాటుగా,రాజకీయ నైతిక బాధ్యత కూడా ప్రభుత్వంపై వుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై కూడా ప్రత్యేక బాధ్యత ఉందని విపక్షాలే కాదు ప్రజలు కూడా బావిస్తున్నారు. అదలా ఉంటే, ఈ రోజు ఏడేళ్ళ తర్వాత, యాదృచ్చికమే కావచ్చుకానీ,మళ్ళీ అదే ఫిబ్రవరి 20 తేదీన, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మరోసారి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చారు.  ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్’గా నీతిఆయోగ్ పాలక మండలి అరవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని  ప్రధాన మంత్రిని కోరారు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రంలో పారిశ్రామిక,ఆర్థిక అభివృద్ధి సాధ్యమని ప్రధాన మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అప్పట్లో రాష్ట్ర విభజనకు ముందు అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా  ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతనే విభజ చట్టం (ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014) పార్లమెంట్ ఆమోదం పొందిన విషయాన్నికూడా గుర్తు చేశారు.  అయితే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఎప్పుడోనే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్ధనను పట్టించుకుంటుందని, ఎవరూ అనుకోవడం లేదు. ఎవరూ  ఆశించనూ లేరు.నిజానికి,ముఖ్యమంత్రికి కూడా ప్రత్యేక హోదా రాదని తెలుసు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీనిగెలిపిస్తే, లోక్ సభ ఎన్నికల్లో  తమ పార్టీకి 25 కి 25 సీట్లు గంప గుత్తగా కట్టపెడితే కేంద్రంపై పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.మొత్తానికి మొత్తంగాగాక   పోయినా, 25కు 22 లోక్ సభ సీట్లలోను ప్రజలు వైసీపీని గెలిపించారు.      అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చే రాగానే, డామిట్ కథ అడ్డం తిరగింది అన్నట్లుగా, కేంద్రంలో బీజేపీకి సొంతంగానే పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి, ఇక హోదా హులిక్కే అని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. చేతులెత్తేశారు. అయినా కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని అప్పట్లోనే ప్రకటించారు. ఇంతకు  ముందు ప్రధాన మంత్రిని కలిసిన సందర్భంలో హోదా గురించి అడిగారో లేదోగానీ, ఇప్పుడైతే ఒక అభ్యర్ధన చేశారు. అయితే ఇది అభ్యర్ధనలతో అయ్యే పని కాదు, నిజంగా ప్రభుత్వానికి, అధికార పార్టీకి హోదా సాధించాలన్న చిత్తశుద్ధి ఉంటే, అసెంబ్లీలో, పార్లమెంట్లో ఇతర వేదికలనుంచి నిరంతరంగా హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ,గతంలో చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీ చేసిన విధంగా ధర్మపోరాటం చేస్తే, కొంతైన ప్రయోజనం ఉంటుందని, అలా కాకుండా అడుగుతూనే ఉంటామని అంటే ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయినా గాలికొదిలేశారు.... చంద్రబాబు క్లాస్

టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసిపి చేతిలో ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుప్పం లోని పార్టీ స్థానిక నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికార వైసిపి చేసిన రౌడీయిజం, విచ్చలవిడి డబ్బు పంపిణీతోపాటు స్థానిక అధికారుల సహకారం కారణంగానే వైసీపీ విజయం సాధించిందని అయన అన్నారు. అంతేకాకుండా టీడీపీ నేతలు కూడా గెలుస్తామనే ధీమాతో పోలింగ్ బూత్ లను, కౌంటింగ్ ను వదిలిపెట్టి మరీ తిరిగారని ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నేతలకు బాబు చురకలు అంటించారు. ఆసమయంలో అధికారులు ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని అన్నారు. మరోపక్క అపోజిషన్ పార్టీ వాళ్లంతా నేరస్థులు కావడంతోపాటు.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ నాయకులు మరింత అప్రమత్తంగా ఉండాలని తాను చాలా సార్లు చెప్పానని బాబు గుర్తు చేశారు. మనం, మన కేడర్ ఎంత బాగా పని చేసినా అధికార పార్టీ అరాచకాల వల్ల పార్టీ ఓటమిపాలైందని అయన చెప్పారు. అంతేకాకుండా పార్టీలోని బలహీనతలు, అనైక్యతను వైకాపా అడ్వాంటేజ్ గా తీసుకుందని బాబు తెలిపారు. విలువలకు ఏంటో ప్రాధాన్యతనిచ్చే కుప్పం వ్యక్తిత్వాన్ని ఈ ఎన్నికల ఫలితాలు దారుణంగా దెబ్బతీశాయని అయన అన్నారు. త్వరలోనే ఈ మబ్బులు తొలగిపోతాయని... మన ప్రభుత్వం వచ్చిన తరువాత వడ్డీతో సహా తీర్చుకుందామని చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ తాము బాగా పని చేశామని... అయినా వైసీపీ అరాచకాలు, డబ్బు పంపిణీ వల్ల ఓడిపోయామని బాబుకు సంజాయిషీ ఇచ్చారు.చివరిగా తాను త్వరలో కుప్పం వస్తానని.. తన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ రెండుమూడు రోజుల్లో ఇస్తానని, రెండు రోజులు అక్కడే ఉండి పరిస్థితులను చక్కదిద్దుతానని స్థానిక నాయకులకు భరోసా ఇచ్చారు.

టీఆర్ఎస్ టార్గెట్ గానే షర్మిల పార్టీ? 

తెలంగాణలో రాబోతున్న వైఎస్ షర్మిల పార్టీ రాజకీయ కాక రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి.. తెలంగాణలో కొత్త పార్టీ పెడుతుండటం ఆసక్తిగా మారింది. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంపై ఎన్నో చర్చలు సాగుతున్నాయి. షర్మిల వెనక ఎవరున్నారు? ఆమె టార్గెట్ ఎవరు? షర్మిల పార్టీతో ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం? వంటి అంశాలు తెర పైకి వస్తున్నాయి. షర్మిలతో కేసీఆరే పార్టీ పెట్టిస్తున్నారని కొందరు.. బీజేపీ పెద్దలు షర్మిల వెనక ఉన్నారని మరికొందరు చెబుతున్నారు. అయితే తాజాగా షర్మిల వేస్తున్న అడుగులు, ఆమె ప్రసంగాలతో షర్మిల టార్గెట్ ఎవరో క్లారిటీ వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లక్ష్యంగానే షర్మిల పార్టీ ఉండబోతుందని చెబుతున్నారు. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో షర్మిల నోటి నుంచి ‘జై తెలంగాణ’ నినాదం రావడంతో ప్రధానంగా టీఆర్‌ఎస్‌పైనే ఆమె గురిపెట్టినట్లు అర్థమవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని నిర్ణించుకోవాలనే యోచనలో షర్మిల ఉన్నట్లు చెబుతున్నారు.  వైఎస్ షర్మిల జై తెలంగాణ నినాదం చేసి అందరిని ఉత్సాహ పరిచారు. మూడు సార్లు జై తెలంగాణ అంటూ నినదించిన షర్మిల.. జై తెలంగాణ జై వైఎస్సార్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పేదలు సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు.  ప్రజలకు చేయాల్సినవన్నీ ప్రభుత్వం చేస్తోందా? అని అడిగారు. తెలంగాణలో ఉన్న సమస్యలన్నింటిపై మాట్లాడదామని చెప్పారు షర్మిల.  వైఎస్సార్ పాలనను గుర్తు చేశారు షర్మిల. తెలుగు ప్రజల గుండెళ్లో వైఎస్ ఇంకా నిలిచి ఉన్నారని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో మళ్లీ రాజన్న కాలంనాటి స్వర్ణయుగాన్ని తెచ్చుకుందామన్నారు జగన్ సోదరి.  షర్మిల నోటి నుంచి ‘జై తెలంగాణ’ అనే మాట వినిపించడంతో నేతలు పోటీగా నినాదాలు చేశారు. తెలంగాణలో బలమైన ముద్ర వేయాలనే షర్మిల ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల షర్మిల అనుచరుడు కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్,‌ ఉమ్మడి ఏపీలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కొండా ప్రకటనలు, షర్మిల తాజా ప్రకటనతో కేసీఆర్ సర్కార్ టార్గెట్ గానే కొత్త పార్టీ వస్తుందన్న అనుమానాలకు బలం వస్తోందని చెబుతున్నారు.

ఒసాకాకే ఆస్ట్రేలియా ఓపెన్

జపనీస్‌ టెన్నీస్‌ స్టార్‌ నయోమి ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో అమెరికాకు చెందిన జెన్నిఫర్‌ బార్డీ 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. ఒసాకా కెరీర్‌లో రెండోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలుచుకుంది. ఓవరాల్‌గా ఆమె కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్.‌ అందులో రెండు యూఎస్‌ ఓపెన్‌ (2018, 2020) టైటిల్స్‌తో పాటు రెండు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (2019, 2021) టైటిల్స్‌ గెలుచుకున్నారు.   ఫైనల్‌ మ్యాచ్‌‌లో ఒసాకా తన ప్రత్యర్థి బార్డీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 6-4తో తొలి సెట్‌ను 41 నిమిషాల్లో సొంతం చేసుకున్న ఒసాకా రెండో సెట్‌ను మరో 36 నిమిషాల్లోనే 6-3తో నెగ్గి టైటిల్‌ను సొంతం చేసుకుంది. కాగా కరోనా కారణంగా 2020లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రద్దు కావడంతో 2021లో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను వరుసగా రెండోసారి గెలుచుకొని ఒసాకా చరిత్ర సృష్టించింది. 

నేను వజ్రాన్ని.. పారిపోలేదు ! పుట్టా మధు రియాక్షన్ 

తెలంగాణలో సంచలనం స్పష్టించిన, రాజకీయ దుమారం రేపుతున్న న్యాయవాదుల హత్య కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు నోరు విప్పారు. లాయర్ వామనరావు దంపతుల హత్యపై స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, ముఖం చాటేయలేదని తెలిపారు.   ఇన్వెస్టిగేషన్ మీడియా చేయాలా? పోలీసులు చేయాలో ఆలోచించుకోవాలని మధు అన్నారు.  ఇన్వెస్టిగేషన్ కానివ్వరా, ఎంక్వైరీ జరగనివ్వారా ఎవరు తప్పు చేస్తే వాళ్లు లోపలకు పోరా అని అడిగారు. ఎందుకింత దౌర్జన్యం చేస్తున్నారు నాపై, మీ బ్రేకింగ్‌ల కోసం, మీ ప్రచారం కోసం గరీబ్ బిడ్డను బద్నాం చేస్తున్నారని మధు అన్నారు. ఒక బీసీ జెడ్పీ చైర్మన్ కావడాన్ని జీర్ణించుకోలేక విష ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. పోలీసులను విచారణ చేయనిస్తారా.. లేక శ్రీధర్‌బాబు చేస్తారా? అని పుట్ట మధు ప్రశ్నించారు.విచారణ పూర్తయ్యాక హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెడుతానని ప్రకటించారు పుట్టా మధు.  మంథని నియోజకవర్గంలో టీఆర్ఎస్ సభ్యత్వ సేకరణ కార్యక్రమంలో పుట్టా మధు మట్లాడారు. మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పుట్ట మధును లోపల వేస్తరా అని కొన్ని టీవీల్లో, పత్రికల్లో రాస్తున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఉన్న రిపోర్టర్లకు సంబంధం లేకుండా హైదరాబాద్ లో ఉన్న వాళ్లు ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారని ధ్వజమెత్తారు. కొన్ని సంస్థలు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు అమ్ముడుపోయి బీసీ బిడ్డనైన తనను టార్గెట్ చేశాయని పుట్ట మధు ఆరోపించారు. త్వరలో హైదరాబాద్ లో మీటింగ్ ఏర్పాటు చేసి మీడియా బండారం అంతా బయటపెడతానని స్పష్టం చేశారు. 70 ఏళ్లలో ఓ బీసీ వాడు ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ కావడం ఏందీ? దీనిని మేం సహిస్తలేం? అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీడియాను చూస్తే ఒక ఆలోచన కలగాలి, ఒక ధైర్యం కలగాలన్నారు. కానీ నేడు మీడియాను చూస్తే అసహ్యం వేస్తోందని, ఎందుకు నాపై ఇంత కుట్ర, ఎందుకు నాపై ఇంత పగ అంటూ పుట్ట మధు ప్రశ్నించారు.నేను వజ్రాన్ని.., మోసగాన్ని కాదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పోరాటం ఆగేది లేదని, నా ప్రజల కోసం మాత్రమే ఉంటా మోసగాళ్ల కోసం ఉండనన్నారు. నా పిల్లలు స్థిరపడ్డారు ప్రజలు, టీఆర్ఎస్ కోసం నేను, నాభార్య జీవితం అంకితమని అన్నారు.తాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్లలేదని, వారిని అపాయింట్‌మెంట్ అడగలేదని తెలిపారు.    

షర్మిల పార్టీ.. హల్లేలూయా పార్టీ..

షర్మిల పార్టీపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ.. హల్లేలూయా పార్టీ అని సెటైర్లు వేశారు. తెలంగాణకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదు.. రామ రాజ్యమని అయన చెప్పారు. షర్మిల సమయం వృథా చేసుకుంటున్నారని అర్వింద్ సూచించారు.  తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే పలు పార్టీల నాయకులూ  షర్మిలకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. షర్మిల తో కేసీయారే పార్టీ పెట్టిస్తున్నారంటూ అనేక మంది ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం బీజేపీ డైరెక్షన్లోనే షర్మిల రాజకీయ అడుగులు వేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ షర్మిల పార్టీని హల్లేలూయా పార్టీ అనడం ఆసక్తికరంగా మారింది.   

హే రాఘవా.. ఇంతటి పరాభవమా?

వైఎస్ షర్మిల. దివంగత  వైఎస్సార్ తనయ. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి. తెలంగాణలో కొత్త పార్టీతో ముందుకొస్తున్నారు. నిత్యం పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. అనేక మంది ఆమెకు మద్దతు ఇవ్వడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఆలూ-సూలు లేని పార్టీపై అప్పుడే ఆసక్తి పెరుగుతోంది. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ, షర్మిల వ్యవహార శైలిపై అప్పుడే నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. జగన్ లానే ఆమెలోనూ మోనార్కిజం ఎక్కువే అంటున్నారు. అందుకు ఆధారంగా ఈ ఫోటోను చూపిస్తున్నారు.  లోటస్ పాండ్ లో జిల్లాల నుంచి వచ్చిన వైఎస్సార్ అభిమానులతో షర్మిల సమావేశమైనప్పుడు తీసిన ఫోటో ఇది. హాల్ లో పెద్ద డయాస్.. బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద ఫ్లెక్సీ.. వేదికపై మంచి సోఫా.. దర్జాగా కూర్చున్నారు షర్మిల. డయాస్ పై ఆమె ఒక్కరే. అంతా సింగిల్ ఉమెన్ షో.  షర్మిల తర్వాత తెలంగాణలో నెంబర్ టూ పొజిషన్ లో ఉన్నది కొండా రాఘవరెడ్డి. కొత్త పార్టీ నిర్మాణంలో ఆయనదే కీ రోల్ అని తెలుస్తోంది. షర్మిల తర్వాత పార్టీ వ్యవహారాలన్నీ రాఘవరెడ్డే చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కానీ షర్మిల ముందు ఆయన స్థానం మాత్రం పరిమితమే అంటున్నారు. ఎవరికైనా డౌట్ ఉంటే.. ఈ ఫోటో ఒకసారి చూడమంటూ ముందేస్తున్నారు. వేదకపై షర్మిల హుందాగా సోఫాలో కూర్చొంటే.. ఆ పక్కనే ఓ పాత ప్లాస్టిక్ కుర్చీ వేసి కొండా రాఘవరెడ్డిని కూర్చోబెట్టారు. తెలంగాణలో షర్మిల పార్టీకి టాప్ లీడర్ ఆయనే. అంతటి వ్యక్తిని.. ఇంత చీప్ గా చూడటమేంటని కొండా వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ నేతను అవమానించడమేనని అక్కస్సు వెల్లగక్కుతున్నారు. అయితే.. ఇదే మాట బయటకు అంటే ఎక్కడ షర్మిలకు కోపం వస్తుందోనని తమలో తాము గొనుగుకుంటున్నారని అంటున్నారు.  పార్టీ ఆమెది. అవసరం ఆమెది. వైఎస్సార్ మీద అభిమానంతో ఆమె వెంట నడిచారు కొండ రాఘవరెడ్డి. అంతటి అభిమానిని నెత్తిన పెట్టుకొని చూసుకోకున్నా.. కనీసం పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడైనా తగిన మర్యాద ఇస్తే బాగుండునని అంటున్నారు. తాను మాత్రం ఖరీదైన సోఫాలో ఆసీనురాలై.. రాఘవరెడ్డిని ప్లాస్టిక్ ఛైర్ కి పరిమితం చేయడం ఏమాత్రం సమంజసంగా లేదని అంటున్నారు. గతంలో జగన్ సైతం ఇలానే చేసేవారని గుర్తు చేస్తున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోటస్ పాండ్ కు వచ్చిన వైసీపీ నేతలకు కనీస గౌరవం కూడా ఇచ్చేవారు కాదని అంటున్నారు. గంటలకు గంటలు మీటింగులు పెట్టి.. కనీసం టీ, బిస్కెట్లు కూడా ఇచ్చే వారు కాదట. జగన్ శైలే షర్మిలకు కూడా వచ్చుంటుందని వాపోతున్నారు ఆమె అనుచరులు.  మాజీ సీఎం కూతురనో.. ప్రస్తుత ముఖ్యమంత్రి చెల్లి అనో.. కారణమేమోగానీ.. ఇలాంటి రాచరిక పోకడలు ప్రజాస్వామ్య పార్టీకి ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. గౌరవం ఇచ్చి పుచ్చుకుంటేనే ఎవరికైనా మంచిది. అప్పుడే కొత్త పార్టీకి మనుగడ. ఆదిలోనే ఇలా ఓవరాక్షన్ చేస్తే.. నెంబర్ టూ లాంటి కొండా రాఘవరెడ్డినే ఇలా అవమానిస్తే.. ఇక మిగతా వారు సైతం తమకూ ఇదే గతి పడుతుందని మొదట్లోనే వెనకడుగు వేసే ప్రమాదం లేకపోలేదు. పార్టీ నేతలనతోనే ఇలా వ్యవహరిస్తే.. సామాన్య జనాల పరిస్థితి ఏంటనే చర్చ కూడా మొదలైంది. షర్మిల తన తీరు మార్చుకోకపోతే పార్టీ మనుగడ కష్టమేనని కూడా చెబుతున్నారు.  

గద్దర్ తో షర్మిల పార్టీకి ఊపు వచ్చేనా! 

తెలంగాణలో కొత్త పార్టీకి సన్నాహాలు చేసుకుంటున్న వైఎస్ షర్మిల దూకుడుగా వెళుతున్నారు. లోటస్ పాండ్ లోని తన నివాసంలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొందరితో ఓపెన్ గా మాట్లాడుతున్న షర్మిల.. మరికొందరితో మాత్రం రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని వివిధ రంగాల ప్రముఖులతో షర్మిల మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో వైఎస్సార్ తో సన్నిహితంగా ఉన్న నేతలు షర్మిలతో టచ్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.  ప్రజా యుద్ధ నౌకగా పిలుచుకునే గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవలే షర్మిలతో గద్దర్ సమావేశం అయ్యారు. గద్దర్ చేరికతో షర్మిల పార్టీకి ప్రయోజనం ఎంతన్న దానిపై రాజకీయ వర్గాలు, షర్మిల మద్దతుదారుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో మావోయిస్టుల్లో పని చేసిన గద్దర్... జన జీవన స్రవంతిలోకి వచ్చాకా కూాడా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. గతంలో ఆయనకు మాస్ ఫాలోయింగ్ బాగానే ఉండేది. తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్ కీలక పాత్ర పోషించారు. తన మాటలు, పాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనే అభిప్రాయం వస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత గద్దర్ ప్రజా క్షేత్రంలో తిరగడం తగ్గిపోయింది. ప్రజా ఉద్యమాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు. ఇటీవల కాలంలో తెలంగాణలో చాాలా సమస్యలు తెరపైకి వచ్చాయి. రైతులు ఆందోళనలు చేశారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఉద్యోగులు కూడా సర్కార్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అయినా ఎక్కడా గద్దర్ కనిపించలేదు. గతంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నా... గద్దర్ వారికి మద్దతు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం గద్దర్ కు క్రేజీ తగ్గిపోయిందని, ఆయన వల్ల పార్టీకి ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చని షర్మిల సన్నిహితులే చెప్పుకుంటున్నారని తెలుస్తోంది.  2018 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు గద్దర్. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కాని ఆయన ప్రభావం పెద్దగా కనిపించ లేదు. ఆయన ప్రచారం చేసిన ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ కు ఓట్లు పెరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గద్దర్.. షర్మిల పార్టీలో చేరినా...అదేమంత పనికొచ్చేది కాదనే అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాదు  ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్ కు దూరంగానే ఉంటున్నారు. ఇటీవల ఎక్కడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. రాజకీయాలు, ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉంటున్న గద్దర్ తో ప్రయోజనం ఉన్నా లేకున్నా.. పార్టీకి మాత్రం జోష్ వస్తుందని కొందరు షర్మిల అనచరులు చెబుతున్నారు .

ఐపీఎల్ మ్యాచ్ లు అడ్డుకుంటాం! టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్ 

ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ యాజమాన్యం తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. లోకల్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మాజీ క్రికెటర్లు సన్ రైజర్స్ యాజమాన్యం తీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాాగా రాజకీయ నేతలు కూడా ఎంటరయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా స్పందించారు. మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిన డేవిడ్ వార్నర్ జట్టుకు కెప్టెన్ గా ఉండగా.. లోకల్ ఆటగాళ్లను తీసుకోకపోవడమేంటనీ ఆయన మండిపడ్డారు.  మ్యాచ్ ఫిక్సింగులో చిక్కుకున్న ప్లేయర్ ను కెప్టెనుగా పెట్టుకుని.. స్థానిక ఆటగాళ్లకు స్థానం లేకపోవడం ఏంటని ఆయన సన్ రైజర్స్ యాజమాన్యాన్ని నిలదీశారు. హైదరాబాదులో సత్తా ఉన్న క్రికెటర్లకు కొరత లేదన్నారు దానం నాగేందర్. సన్ రైజర్స్ టీమ్ లో హైదరాబాదు ఆటగాళ్లు లేకపోవడం దారుణమన్నారు.  ఇప్పటికైనా హైదరాబాదు ఆటగాళ్లకు సన్ రైజర్స్ టీమ్ లో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతై ఫ్రాంచైజీ పేరైనా మార్చుకోవాలని స్పష్టం చేశారు. ఇదే తీరు కొనసాగితే హైదరాబాదులో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు.   సన్ రైజర్స్ యాజమాన్యం తీరుపై  ఇప్పటికే భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్  అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాదీలను తీసుకోకుండా జట్టు కూర్పు ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ముంబై టీమ్ మేనేజ్ మెంట్ అక్కడి లోకల్ ఆటగాళ్లను ప్రోత్సహిస్తుందని.. అందుకే అర్జున్ టెండుల్కర్ ను తీసుకున్నారని చెప్పారు.   

వీళ్లతో నేను వేగలేను.. నాకు జైలే సుఖం.. పోలీసులకు లొంగిపోయిన వ్యక్తి

సాధారణంగా ఎవరైనా కష్ట సమయంలో అయినవారు తమకు తోడుగా ఉండాలని కోరుకుంటారు. అయితే అతడు మాత్రం. జనాల మధ్య ఉండడం తన వల్ల కాదని, తనను జైలులో పెట్టాలంటూ తనంత తానుగా పోలీసులను ఆశయించాడు. బ్రిటన్‌లో పరారీలో ఉన్న ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న జనాలతో వేగలేక పోతున్నానని పోలీసులను ఆశ్రయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. పరారీలో ఉన్న ఓ వ్యక్తి లాక్‌డౌన్ సమయంలో పూర్తిగా నాలుగు గోడల మధ్యే గడిపేశాడు.అయితే ప్రస్తుతం తాను జీవిస్తున్న మనుషుల తీరుతో విసిగిపోయిన అతడు ఇక్కడి కంటే జైలులో ఉండడమే బెటరని డిసైడ్ అయ్యి, అక్కడైతేనే తనకు ప్రశాంతంగా ఉంటుందని భావించాడు. దీంతో ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తాజాగా ఈ సంగతిని డారెన్ టేలర్ అనే పోలీసు అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో లొంగిపోయిన ఆ వ్యక్తిని జైలుకు తరలించినట్టు అయన పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఈ ట్విట్టర్ పోస్ట్ పై స్పందించిన చాలా మంది నెటిజన్లు ఆశర్యం వ్యక్తం చేస్తూ తమ పరిష్టితిని కూడా అతడితో పోల్చుకుంటూ తమకు కూడా ప్రశాంతత, నిశ్శబ్దం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం అతడి తో పాటు ఆ ఇంటిలో ఉన్న వ్యక్తులు అతడిని ఎంత తీవ్రంగా హింసిస్తేనో అతడు ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడని తమ సానుభూతిని వ్యక్తం చేసారు.

1200 ఎకరాలు.. రూ. 6 వేల కోట్లు ! కలకలం రేపుతున్న వామనరావు పోస్ట్

తెలంగాణలో కలకలం రేపిన పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. హత్యల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తుండగా.. అందుకు బలాన్నిచ్చే అధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హత్యకు గురైన న్యాయవాదులు గతంలో వేసిన కేసులు, మంథని ఏరియాలో జరిగిన పరిణామాలకు సంబంధించి సంచలన అంశాలు తెరపైకి వస్తున్నాయి.     ఇప్పటికే వామన్ రావు దంపతుల ఆడియో రికార్డ్ లు వైరల్ గా  మారాయి. తాజాగా మరో అంశం వెలుగులోనికి రావడంతో వామన్ రావు దంపతుల హత్యపై మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో వామన్ రావు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీలింగ్ యాక్ట్ పేరుతో 6 వేల కోట్ల రూపాయల భూ స్కాం జరుగుతుందని అందులో పేర్కొన్నారు వామన రావు.  హైకోర్టు అడ్వకేట్ గట్టు  వామనరావు పోస్టు ఇదీ.. ‘‘ మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలోని 18 గ్రామాల్లో 1973 సీలింగ్ యాక్ట్ ప్రకారం పట్టాలు కలిగి ఉన్న లబ్ధిదారుల పేర్ల నుండి వేరే ఇతర వ్యక్తుల పేర్లపైకి అక్రమ మార్గంలో సుమారు 1200 ఎకరాలు, ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 6 వేల కోట్ల విలువైన భూమిని బదలాయించి చట్ట విరుద్దంగా సీలింగ్ పట్టా మార్పిడి చేసిన అవినీతి అధికారులపై చర్యల కోసం హై కోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం (పిల్) దాఖలు చేయనున్న నెన్నెల మండలం ఇందూరు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఇందూరి రాంమోహన్’’  గట్టు వామనరావు చేసిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగినట్టుగా తెలుస్తున్న ఈ పోస్టుకు.. ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా అన్న చర్చ జరుగుతోంది. భూ దందాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ మర్డర్ ప్లాన్ లో ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.6 వేల కోట్ల విలువైన భూ దందా స్కాం గురించి వెలుగులోకి వస్తే పెద్ద తలకాయలు బయటపడతాయన్న ఆందోళనతో.. హంతకులతో ఎవరైనా  చేతులు కలిపి ఉంటారా అన్న చర్చ ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతోంది. వామనరావు పోస్టులతో పాటు మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలోని 18 గ్రామాల సీలింగ్ యాక్ట్ భూములపైనా సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్ వస్తోంది.  

ప్రేమించాలంటూ గన్‌తో వార్నింగ్.. బీటెక్ స్టూడెంట్ ఓవరాక్షన్

ప్రేమ పేరుతో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమించాలంటూ ఎంతకైనా తెగిస్తున్నారు. కాదూ, కూడదంటే బెదిరింపులకు తెగబడుతున్నారు. హైదరాబాద్ లో అలానే జరిగింది. తనను లవ్ చేయమంటూ తుపాకీతో బెదిరించాడు బీటెక్ స్టూడెంట్. కట్ చేస్తే.. స్థానికులు అతన్ని చితకబాదారు. సికింద్రాబాద్ దుమ్మాయిగూడలోని సాయిబాబానగర్ కు చెందిన అభిషేక్ బీటెక్ చదువుతున్నాడు. ఓ యువతిని ప్రేమించాలంటూ కొంతకాలంగా టార్చర్ చేస్తున్నాడు. వెంటబడి వేధించడమే కాకుండా.. ఆమె ఫోన్ నెంబర్ కూడా తెలుసుకొని వాట్సప్ లో మెసేజ్ లు పెడుతున్నాడు.  శనివారం ఆ యువతి తన బ్రదర్ తో కలిసి వెళుతుండగా వారిని అటకాయించాడు అభిషేక్. ఎయిర్ గన్ చూపించి తనను లవ్ చేయకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. భయంతో ఆ యువతి పెద్దగా అరిచింది. ఆ అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించారు. అభిషేక్ ను పట్టుకొని చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.

రాజారెడ్డి రాజ్యాంగంలో పోలీసులకే దిక్కులేదు...

ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరులో జరిగిన ఒక ఘటన పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. వైకాపా ప్ర‌భుత్వ పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింద‌ని లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించా‌రు. ఇక ఈ రాష్ట్రంలో సామాన్య ప్ర‌జ‌లు ఎలా బ‌త‌కాల‌ని ఆయ‌న నిల‌దీశారు. "రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజల రక్షణ దేవుడెరుగు.. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం, గ్రిద్దలూరు గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శివశంకర్ గారి పై వైకాపా గూండాలు విచక్షణారహితంగా దాడి చెయ్యడం దారుణం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని  అయన విమర్శించారు.   అంతేకాకుండా "శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులకే రక్షణలేకపోతే ఇక ఈ రాష్ట్రంలో సామాన్యులు ఎలా బ్రతకాలి?ఎస్ఐ శివశంకర్ గారి పై దాడి చేసిన వైకాపా రౌడీలను కఠినంగా శిక్షించాలి" అని జగన్ ప్రభుత్వాన్ని లోకేష్ డిమాండ్ చేశారు.

ఐపీఎల్ లో తెలుగు తేజం..

ఐపీఎల్ లో మరో తెలుగు కుర్రాడు. రాయలసీమ బిడ్డకు అరుదైన అవకాశం. కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన హరిశంకర్‌రెడ్డి ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. బౌలింగ్‌లో మంచి ప్రతిభ కనపర్చడంతో అండర్‌-19లో రాష్ట్ర జట్టుకు ఎంపికై 2016 నుంచి ఆడ్డం మొదలు పెట్టాడు. అనంతరం రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. 2018 నుంచి ఆంధ్రా జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నైలో గురువారం నిర్వహించిన ఐపీఎల్‌ వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఇతడిని రూ.20 లక్షలకు దక్కించుకున్నారు. చిన్నమండెం మండలం బోనమల హరిశంకర్‌రెడ్డి స్వగ్రామం. డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఐపీఎల్‌ కు ఎంపికవ్వడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌ లో మంచి ప్రతిభ కనపర్చి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఆకాంక్షించారు.   

దేవుడు హుండీలు కంటే నీ హుండీలు నిండాయి..

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. నేతల మధ్య డైలాగులు డైనమైట్లలా పేలుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను మించి మాటల తూటాలు వదులుతున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజదాని బెజవాడలో పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి, ఎంపీ కేశినేని నానిలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో డైలాగ్ వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని.. మంత్రి వెల్లంపల్లి టార్గెట్ గా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ‘దేవుడు హుండీలు కంటే నీ హుండీలు నిండాయి’ అంటూ వెల్లంపల్లిని ఉద్దేశించి అన్నారు. వైసీపీలో పని చేసిన వారిని పక్కన పెట్టి తన సొంత మనుషుల చేత వెల్లంపల్లి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ‘అవినీతి జరిగిందని, దోచుకున్నారని ఆరోపణలు కాదు... అధికారం ఉంది దమ్ముంటే విచారణ చేసుకో’అంటూ ఎదురు సవాల్ కూడా విసిరారు.  నియోజకవర్గంలో ఒక గుంట కూడా పూడ్చలేని వ్యక్తి  మంత్రి వెల్లంపల్లి అని అన్నారు. ఆయనవి పోసుకోలు కబుర్లంటూ మంత్రి ఆరోపణలను తీసిపారేశారు ఎంపీ కేశినేని నాని. ‘మీ పార్టీలో విబేధాలు నువ్వు చూసుకో.. మా పార్టీ మేము చూసుకుంటాం’ అంటూ ఎంపీ కేశినేని నాని మంత్రి వెల్లంపల్లికి హితవు పలికారు. 

దానికి జనం అలవాటు పడిపోయారు... మంత్రిగారి సెన్సేషనల్ కామెంట్స్

దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ దగ్గర నుండి నిత్యావసర వస్తువులైన వంట నూనె, పప్పులు, ఉప్పుల ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు.తాజాగా ఈ ధరల పెరుగుదలపై బీహార్ లోని నితీష్ సర్కార్ క్యాబినెట్ మంత్రి ఒకరు నోరు జారారు. దీంతో అయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్ పర్యాటకశాఖ మంత్రి నారాయణ్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ధరల పెరుగుదలకు జనం పూర్తిగా అలవాటు పడిపోయారు. ధరల పెరుగుదల వలన జనానికి ఇబ్బందేమీ లేదని వ్యాఖ్యానించారు. ధరల పెరుగుదల అంశంపై బీహార్ అసెంబ్లీ పరిసరాల్లో విపక్షాలు నిరసన ప్రదర్శనలు చేస్తూ, ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపధ్యంలో మంత్రి నారాణయ్ ప్రసాద్ విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ మీడియా ముందు వింత వ్యాఖ్యలు చేశారు. ధరల పెరుగుదల వలన సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, దీని వలన జనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అయన అన్నారు. ప్రజలకు ధరల పెరుగుదల అలవాటైపోయిందని అయన పేర్కొన్నారు. అంతేకాకుండా ధరలు పెరిగితే జనం సొంతవాహనాలకు బదులుగా బస్సులపై వెళతారన్నారు. అయినా బడ్జెట్ వచ్చిందంటే ధరలు పెరుగుతుంటాయనీ.. దీని ప్రభావం ప్రజలపై ఎమీ ఉండదు.. మెల్లమెల్లగా జనం అలవాటు పడిపోతారని అయన వ్యాఖ్యానించారు.

ఏపీలో లడ్డు పాలిటిక్స్ ..

తిరుపతి లడ్డు కావాలా నాయనా అంటూ.. వైసీపీ నేతలు ఏపీలో ఓట్లు దండుకోవడంపై బిజెపి నేతలు మండిపడ్డారు. శుక్రవారం తిరుపతి చంద్రగిరి అసెంబ్లీ తొండవాడ లో వైసీపీ నేతలు శ్రీవారి లడ్డుతో ప్రచారం చేయడంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తిరుమల లడ్డూలు, అందులోను రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి రేషన్ రవాణా చేసే వాహనాల్లో పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టిన తీరును ఆయన తప్పుపట్టారు. దేవుడిని రాజకీయానికి వాడుతున్నారు. ఇంతకంటే సిగ్గు చేటైన విషయం మరోకటి ఏమైనా ఉందా అంటూ ఆయన ధ్వజమెత్తారు. టీటీడీ, వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని అన్నారు. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ను విష్ణు వర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి  వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి’’ అంటూ విష్ణువర్ధన్‌రెడ్డి ట్వీట్ చేశారు.