తెలంగాణ కోడలికి ఓటెందుకు లేదు! వైఎస్ షర్మిలపై జనాల్లో రచ్చ
posted on Feb 21, 2021 @ 9:41AM
కొత్త పార్టీ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు వైఎస్ షర్మిల. తెలంగాణ కోడలుగా జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్న షర్మిల.. పార్టీ ఏర్పాట్లలో భాగంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజన్న బిడ్డను, తెలంగాణ కోడలిని అని నూతన సెంటిమెంటును తెరపైకి తీసుకొస్తున్నారు. తెలంగాణ కోడలినంటూ షర్మిల చేస్తున్న ప్రకటనలపై తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలోనూ రసవత్తర చర్చ జరుగుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముద్దుల చెల్లెలు షర్మిల 2019 ఎన్నికలలో ఎక్కడ తాను ఓటు వేశారో ఆమె మరిచిపోయినా.. షర్మిల ఓటు వేసిన ప్రాంత ప్రజలు మరిచిపోలేదని కొందరు పోస్టులు చేస్తున్నారు.2019 ఎన్నికలలో ఆమె పులివెందుల నియోజకవర్గంలోని ఒక బూత్‍లో ఆమె ఓటు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజన్న ముద్దు బిడ్డ.. జగనన్న ముద్దుల చెల్లెలుగా షర్మిల పులివెందులలో ఓటు వేశారే తప్ప తెలంగాణ కోడలు అని చెప్పుకుంటున్న షర్మిల ఆమె భర్త నివాసం ఉంటున్న ప్రాంతంలో ఎందుకు ఓటు వేయలేకపోయారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ కోడలికి పులివెందుల నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఓటు ఎందుకు ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. ఎన్నో సంవత్సరాల కిందట పులివెందులలో ఓటు నమోదు చేసుకున్న షర్మిల.. తెలంగాణ కోడలు అని చెప్పుకుంటున్న ఆమె భర్త నివాసం ఉంటున్న ప్రాంతంలో ఎందుకు ఓటు చేర్చుకోలేకపోయారని అడుగుతున్నారు. అప్పుడేమో అన్న జగన్ రెడ్డికి ఓటు వేయాలి.. ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆమె కోరుకున్నారని చెబుతున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తనను పట్టించుకోలేదని.. తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని.. తనను రాజ్యసభకు పంపలేదని.. తనకన్నా భార్య భారతికే జగన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని.. అనుభవంతో తెలుసుకున్న షర్మిల రాజన్న బిడ్డగా తెలంగాణలో పార్టీని స్థాపించాలనుకోవటంలో మర్మం ఏమిటి..? అని నిలదీస్తున్నారు.
తెలంగాణ కోడలు అని చెప్పుకుంటున్న షర్మిల.. తెలంగాణలో ఎందుకు ఓటు చేర్చుకోలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. తనకు భర్త ఉండే నివాసం కన్నా.. జగన్ అన్న నియోజకవర్గంలో ఓటు వేయటమే మిన్నగా భావించినట్లేకదా..? అని చెబుతున్నారు. 2019 ఎన్నికలలో పులివెందులలో ఓటు వేసిన షర్మిల తెలంగాణ ప్రాంత కోడలిగా ఆమె అనుకోవటం లేదని స్పష్టం చేస్తుంది కదా అని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందే తప్ప రాజన్న బిడ్డ కోసం కాదని.. ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.
మరోవైపు ఓటు పులివెందులలో.. పార్టీ పెట్టేది తెలంగాణలో అన్న అంశంపై మిగితా రాజకీయ పార్టీలు నిలదీస్తే.. షర్మిల ఏం చెబుతున్నారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ కోడలి కన్నా.. రాయలసీమ ఆడపడుచుగానే షర్మిల భావించారని… స్పష్టం అవుతోందని.. దీనిని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని ఆప్రాంత నేతలు రేపో మాపో బయట పెట్టే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.