హే రాఘవా.. ఇంతటి పరాభవమా?
posted on Feb 20, 2021 @ 2:25PM
వైఎస్ షర్మిల. దివంగత వైఎస్సార్ తనయ. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి. తెలంగాణలో కొత్త పార్టీతో ముందుకొస్తున్నారు. నిత్యం పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. అనేక మంది ఆమెకు మద్దతు ఇవ్వడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఆలూ-సూలు లేని పార్టీపై అప్పుడే ఆసక్తి పెరుగుతోంది. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ, షర్మిల వ్యవహార శైలిపై అప్పుడే నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. జగన్ లానే ఆమెలోనూ మోనార్కిజం ఎక్కువే అంటున్నారు. అందుకు ఆధారంగా ఈ ఫోటోను చూపిస్తున్నారు.
లోటస్ పాండ్ లో జిల్లాల నుంచి వచ్చిన వైఎస్సార్ అభిమానులతో షర్మిల సమావేశమైనప్పుడు తీసిన ఫోటో ఇది. హాల్ లో పెద్ద డయాస్.. బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద ఫ్లెక్సీ.. వేదికపై మంచి సోఫా.. దర్జాగా కూర్చున్నారు షర్మిల. డయాస్ పై ఆమె ఒక్కరే. అంతా సింగిల్ ఉమెన్ షో.
షర్మిల తర్వాత తెలంగాణలో నెంబర్ టూ పొజిషన్ లో ఉన్నది కొండా రాఘవరెడ్డి. కొత్త పార్టీ నిర్మాణంలో ఆయనదే కీ రోల్ అని తెలుస్తోంది. షర్మిల తర్వాత పార్టీ వ్యవహారాలన్నీ రాఘవరెడ్డే చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కానీ షర్మిల ముందు ఆయన స్థానం మాత్రం పరిమితమే అంటున్నారు. ఎవరికైనా డౌట్ ఉంటే.. ఈ ఫోటో ఒకసారి చూడమంటూ ముందేస్తున్నారు. వేదకపై షర్మిల హుందాగా సోఫాలో కూర్చొంటే.. ఆ పక్కనే ఓ పాత ప్లాస్టిక్ కుర్చీ వేసి కొండా రాఘవరెడ్డిని కూర్చోబెట్టారు. తెలంగాణలో షర్మిల పార్టీకి టాప్ లీడర్ ఆయనే. అంతటి వ్యక్తిని.. ఇంత చీప్ గా చూడటమేంటని కొండా వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ నేతను అవమానించడమేనని అక్కస్సు వెల్లగక్కుతున్నారు. అయితే.. ఇదే మాట బయటకు అంటే ఎక్కడ షర్మిలకు కోపం వస్తుందోనని తమలో తాము గొనుగుకుంటున్నారని అంటున్నారు.
పార్టీ ఆమెది. అవసరం ఆమెది. వైఎస్సార్ మీద అభిమానంతో ఆమె వెంట నడిచారు కొండ రాఘవరెడ్డి. అంతటి అభిమానిని నెత్తిన పెట్టుకొని చూసుకోకున్నా.. కనీసం పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడైనా తగిన మర్యాద ఇస్తే బాగుండునని అంటున్నారు. తాను మాత్రం ఖరీదైన సోఫాలో ఆసీనురాలై.. రాఘవరెడ్డిని ప్లాస్టిక్ ఛైర్ కి పరిమితం చేయడం ఏమాత్రం సమంజసంగా లేదని అంటున్నారు. గతంలో జగన్ సైతం ఇలానే చేసేవారని గుర్తు చేస్తున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోటస్ పాండ్ కు వచ్చిన వైసీపీ నేతలకు కనీస గౌరవం కూడా ఇచ్చేవారు కాదని అంటున్నారు. గంటలకు గంటలు మీటింగులు పెట్టి.. కనీసం టీ, బిస్కెట్లు కూడా ఇచ్చే వారు కాదట. జగన్ శైలే షర్మిలకు కూడా వచ్చుంటుందని వాపోతున్నారు ఆమె అనుచరులు.
మాజీ సీఎం కూతురనో.. ప్రస్తుత ముఖ్యమంత్రి చెల్లి అనో.. కారణమేమోగానీ.. ఇలాంటి రాచరిక పోకడలు ప్రజాస్వామ్య పార్టీకి ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. గౌరవం ఇచ్చి పుచ్చుకుంటేనే ఎవరికైనా మంచిది. అప్పుడే కొత్త పార్టీకి మనుగడ. ఆదిలోనే ఇలా ఓవరాక్షన్ చేస్తే.. నెంబర్ టూ లాంటి కొండా రాఘవరెడ్డినే ఇలా అవమానిస్తే.. ఇక మిగతా వారు సైతం తమకూ ఇదే గతి పడుతుందని మొదట్లోనే వెనకడుగు వేసే ప్రమాదం లేకపోలేదు. పార్టీ నేతలనతోనే ఇలా వ్యవహరిస్తే.. సామాన్య జనాల పరిస్థితి ఏంటనే చర్చ కూడా మొదలైంది. షర్మిల తన తీరు మార్చుకోకపోతే పార్టీ మనుగడ కష్టమేనని కూడా చెబుతున్నారు.