విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన విమానం! గన్నవరంలో తప్పిన పెను ప్రమాదం
posted on Feb 20, 2021 @ 6:34PM
విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. దోహా నుంచి గన్నవరం వస్తున్న ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా విమానం అదుపుతప్పి రన్ వే పక్కనే ఉన్న ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎయిరిండియా విమానం రెక్కలు దెబ్బతిన్నాయి.పైలట్ కన్ఫ్యూజన్ కారణంగానే ప్రమాదం జరిగిందని ఎయిర్ పోర్టు అధికారులు అంటున్నారు.
ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విమానం రెక్క స్తంభాన్ని ఢీకొట్టడంతో భయంతో అరుపులు, కేకలు వేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులున్నారు. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని విమానాశ్రయ డైరెక్టర్ వెల్లడించారు. ఈ ఘటనతో పలు విమాన రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా దెబ్బతిన్న విమానం రెక్కలకు మరమ్మతులు నిర్వహించేందుకు నిపుణుల బృందం గన్నవరం రానుంది.