బీజేపీలోకి నేతల క్యూ!కాంగ్రెస్, కారు పార్టీల బేజారు

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, సర్వే సత్యనారాయణ, వివేక్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు.. గతంలో వీళ్లంతా ఆయా పార్టీల్లో కీలక నేతలు. ఓ రేంజ్ లీడర్లంతా బీజేపీకి క్యూ కట్టారు. కమలం పూదోటలో తమ అద్రుష్టం పరీక్షించుకుంటున్నారు.  కొందరు సొంత పార్టీలో ప్రాధాన్యత దక్కకపోతో చలో బీజేపీ అంటున్నారు. మరికొందరు తమ రాజకీయ భవిష్యత్ బాగుండాలని బీజేపీకి జై కొడుతున్నారు. ఇలా అందరి నోటా బీజేపీనే. అందరి చూపూ కమలం పార్టీ వైపే. చేరే వారేమైనా చిన్నా చితకా నేతలా? అంతా హేమాహేమీలే. పార్టీలో, వారి నియోజక వర్గాల్లో స్ట్రాంగ్ లీడర్లే. అయినా.. కాషాయ కండువా కప్పుకుంటున్నారు. రాజకీయంగా తమ స్థానం మరింత బలోపేతం చేసుకుంటున్నారు.  నేటి కూన శ్రీశైలం గౌడ్ నుంచి.. నాటి డీకే అరుణ వరకూ.. ఒక్కొక్కరిదీ ఒక్కో లెక్క. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గ్రేటర్ కాంగ్రెస్ లో గట్టి పట్టున్న నేత. కుతుబుల్లాపూర్ లో ఆయనే కింగ్ మేకర్. కాంగ్రెస్ లో, నియోజక వర్గంలో ఇప్పటికిప్పుడు వచ్చిన కష్టమేమీ లేదు. లోకల్ గా ఆయన మాటకు ఎదురు లేదు. రేవంత్ రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్ లో ఆయన భవిష్యత్ కూ డోకా ఏమీ లేదు. అయినా.. హస్తం పార్టీలో కొనసాగలేకపోయారు. కాషాయ కండువా కప్పుకోకుండా ఉండలేక పోయారు. దటీజ్ బీజేపీ. తెలంగాణలో కమలం పార్టీ హవా ఆ రేంజ్ లో ఉంది. ఇతర పార్టీ నేతలను, తటస్తులను, సానుభూతులను సూదంటు రాయిలా ఆకర్షిస్తోంది కమలదళం.  దుబ్బాకలో గెలిచి బీజేపీ సత్తా ఎంతో యావత్ తెలంగాణకు తెలిసొచ్చేలా చేసింది. దుబ్బాక ఫలితాలతో అధికార టీఆర్ఎస్ ఒక్కసారిగా షాక్. దుబ్బాక గెలుపు గాలివాటం కాదని మరింత బలంగా చాటేలా.. జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో 48 స్థానాలు గెలుచుకొని కాషాయ పార్టీ కాక మీదుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లపైనా కాషాయ జెండా ఎగరేసేందుకు సై సై అంటోంది. వరుస విజయాలతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు సైతం ఆ పార్టీకి బాగా కలిసొస్తోంది. తెలంగాణలో ఏ చిన్న కార్యకర్తకు ఏ చిన్న కష్టమొచ్చిన నేనున్నానంటూ అక్కడ వాలిపోతున్నారు. కేడర్ పై పోలీసుల లాఠీఛార్జీపై గట్టిగా తిరగబడుతున్నారు. బండి జోరు.. బీజేపీకి మరింత బూస్ట్ ఇస్తోంది. ఈ హవా ఇలానే కొనసాగితే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు అంటున్నారు. అందుకే... ఇతర పార్టీల నేతలంతా ఇప్పుడు బీజేపీ వైపు క్యూ కడుతున్నారు.  ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి వలసలు ఉండటం కామన్. గతంలో గులాబీ పార్టీ ఆ విధంగానే బలపడింది. అయితే.. తెలంగాణలో మాత్రం ఇప్పుడు విచిత్ర రాజకీయ పరిస్థితి. ఏకంగా అధికార పార్టీ నేతలే ప్రతిపక్ష బీజేపీ వైపు చూస్తున్నారు. మాజీ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, వివేక్, జితేందర్ రెడ్డిలాంటి వాళ్లు ఆ కోవకు చెందిన వారే. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతలకైతే బీజేపీనే పెద్ద దిక్కుగా మారింది. హస్తం పార్టీలో నాయకత్వ శూన్యత, ఆధిపత్య పోరుతో కాకలు తిరిగిన కాంగ్రెస్ నేతలు సైతం కాషాయ కండువ కప్పేసుకుంటున్నారు. కూన శ్రీశైలం గౌడ్, సర్వే సత్యనారాయణ, డీకే అరుణ.. ఇలా పార్టీలో ఇప్పటికే చేరిన వారు కొందరైతే.. పువ్వు గుర్తు వైపు ఆశగా చూస్తున్న కోమటిరెడ్డిలాంటి లీడర్లు ఇంకా ఎందరో.  వారంతా సరైన సమయంలో గోడ దూకేందుకు.. బీజేపీకి జై కొట్టేందుకు రెడీగా ఉన్నారు. ఇక, తెలంగాణలో ఉనికి కోసం పాకులాడుతున్న టీడీపీ దాదాపు ఖాళీ. రేవూరి ప్రకాశ్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు లాంటి మాజీ తమ్ముళ్లంతా ఇప్పుడు కమలం గూటిలో సేద తీరుతున్నారు.  అధికార టీఆర్ఎస్ పార్టీనే బలంగా ఉండి ఉంటే.. వీళ్లంతా బీజేపీ వైపు ఎందుకు చూసేవారు? అంటే, కారు పార్టీకి ఇకపై తెలంగాణలో భవిష్యత్ లేదనేగా అర్థం? వరుస విజయాలు, జనాల్లో జోష్ చూసి.. ఇక కాషాయ పార్టీదే ఫ్యూచరంతా అనేది వీరి లెక్క. పొలిటికల్ పల్స్ తో పాటు పీపుల్స్ పల్స్ పట్టడంలో ఎక్స్ పర్ట్స్ అయిన నేతలంతా బీజేపీలో చేరిపోతున్నారు. ఎన్నికల నాటికి ఈ సంఖ్య మరింత భారీగా పెరగొచ్చు. నేతల చేరికతో.. వెయ్యేనుగుల బలంతో.. ప్రగతి భవన్ వైపు దండయాత్రగా కదులుతోంది కమలదళం.

4,230 స్థానాల్లో టీడీపీ గెలుపు!

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసినా అధికార, విపక్షాల మధ్య పంచాయితీ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా గెలుచుకున్నామని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. అయితే టీడీపీ మాత్రం తాము 35 శాతం సీట్లు గెలిచామని చెబుతోంది.  పారదర్శకంగా ఎన్నికలు జరిగితే అధికార పార్టీ అడ్రస్ గల్లంతయ్యేదని టీడీపీ నేతలు అంటున్నారు.  పంచాయతీ ఎన్నికలపై మాట్లాడిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.ప్రజలను వేధించే ప్రభుత్వాన్ని ఇదివరకెప్పుడూ చూడలేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ పతనం ప్రారంభమైనట్లు తెలుస్తోందని, దీనిని ఎవరూ కాపాడలేరని అన్నారు. వైసీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అరాచకాలు సృష్టించారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు టీడీపీ వీరోచితంగా పోరాడిందన్నారు చంద్రబాబు.   4వ విడతలో 41.7 శాతం సర్పంచ్‌ స్థానాలు గెలుచుకున్నామని చెప్పారు చంద్రబాబు. మొత్తం నాలుగు విడతల్లో కలిపి 4,230 సర్పంచ్‌ స్థానాలను గెలిచామని తెలిపారు. సక్రమంగా జరిగి ఉంటే మరో 10 శాతం స్థానాల్లో విజయం సాధ్యమయ్యేదన్నారు.అధికార దుర్వినియోగం, ఫలితాల తారుమారుపై వైసీపీ ఆధారపడిందన్నారు టీడీపీ అధినేత. అధికారాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో ఎస్‌ఈసీ విఫలమైందన్నారు. సక్రమంగా నిర్వహించామని ఎన్నికల సంఘం ఎలా చెప్పగలదని చంద్రబాబు ప్రశ్నించారు.   డెమోక్ర‌సీకి జ‌గ‌న్ మోనోక్ర‌సీకి మ‌ధ్య జ‌రిగిన ఎన్నిక‌ల్లో కొంత తేడాతో సంఖ్యా విజ‌యం వైసీపీ‌దైనా అస‌లు సిస‌లు గెలుపు టీడీపీదే అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ....‘‘అంబేద్క‌ర్ రాజ్యాంగం ప్ర‌కారం జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లను వైఎస్ జగన్ త‌న‌ రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారు. మ‌న‌దేశానికి అర్ధ‌రాత్రి స్వాతంత్ర్యం వ‌స్తే, నాలుగు విడ‌త‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అర్థ‌రాత్రి జ‌గ‌న్‌రెడ్డి ఫ్యాక్ష‌న్ పాలిటిక్స్‌కి స్వాతంత్రం వ‌చ్చింది. టీడీపీ మ‌ద్ద‌తుతో పోటీచేసే అభ్య‌ర్థుల్ని చంపేశారు, నామినేష‌న్ వేయ‌కుండా కిడ్నాప్ చేశారు. బెదిరించారు, భ‌య‌పెట్టారు. క‌ట్టేసి కొట్టారు. అయినా వెన‌క్కిత‌గ్గ‌ని టీడీపీ అభ్య‌ర్థులు లెక్కింపులో ముందంజ‌లో వుంటే.. క‌రెంట్ నిలిపేశారు. కౌంటింగ్ కేంద్రాల‌కు తాళాలేసారు. పోలీసుల‌తో బెదిరించారు. దాడులు చేశారు. టీడీపీ మ‌ద్ద‌తుదారులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్ పేరుతో వైసీపీ గెలుపు ప్ర‌క‌టించుకున్నారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లోనే ఎన్న‌డూ లేని విధంగా జ‌గ‌న్‌రెడ్డి అరాచ‌కాల‌కు పాల్ప‌డినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచి గెలిచిన‌ టిడిపి కార్య‌క‌ర్త‌లు, నేత‌లు, అభిమానులంద‌రికీ శిర‌సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.   

పదవి మాత్రమే మీది.. పవర్ మాదే... స్పీకర్ కుమారుడి హెచ్చరిక

ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. ఈ ఎన్నికలలో అధికార వైసిపి ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ఎన్నికలలో గెలిచిన ప్రత్యర్థి పార్టీ వారిని నయానో భయానో బెదిరించి వైసిపి కండువాలు కప్పుతోందని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఎన్నికల సమయంలోనే కాకుండా ఫలితాలు వచ్చిన తరువాత కూడా వైసిపి నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి . తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో టీడీపీ మద్దతుతో గెలిచిన సర్పంచులను స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి బెదిరించారు. " గెలిచిన అభ్యర్థులు ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరిస్తే బాగుంటుంది.. లేదంటే నేను ఓపెన్‌గా చెబుతున్నా.. పదవి మాత్రమే మీది.. కానీ పవర్ మాది" ఇది గుర్తు పెట్టుకోండంటూ పబ్లిక్‌గా హెచ్చరించారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో స్పీకర్ కుమారుడి తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది.

బీజేపీకి రాజకీయ సమాధి!

దక్షిణాదిలో పాగా. ఇదీ బీజేపీ ఎజెండా. ఉత్తరాదిలో పాతుకుపోయిన కాషాయం పార్టీ.. ఇక దక్షిణాదిలో దూసుకెళ్లాలని ఉత్సాహంగా ఉంది. తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగానే ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రోజురోజుకీ అంటరాని పార్టీగా మారిపోతోంది. ఇదంతా ఆ పార్టీ స్వయంక్రుతాపరాధమే అంటున్నారు. 2014లో చంద్రబాబుతో కలిసి అధికారం పంచుకున్నప్పుడు బీజేపీని ఏపీ ప్రజలు నెత్తినపెట్టుకొని చూసుకున్నారు. ప్రత్యేక హోదాపై చిక్కుముడులు వేసినప్పటి నుంచీ ఆ పార్టీని చీదరించుకుంటున్నారు. అప్పుడు మొదలైన బీజేపీ పతనం.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ఇప్పుడు పాతాళానికి దిగజారింది ఆ పార్టీ ప్రతిష్ట.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయ శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క బీజేపీనే. ఏపీకీ ఆ పార్టీ చేసిన, చేస్తున్న అన్యాయం ఇంకెవరూ చేయలేదనే చెబుతున్నారు. ఆనాటి ప్రత్యేక హోదా నుంచి నేటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వరకూ అంతా అన్యాయమే. రాష్ట్రానికి తీరని నష్టమే అంటున్నారు ఏపీ ప్రజలు. ఇంత చేసి తగదునమ్మా అంటూ తిరుపతి ఎంపీ సీటు కోసం తహతహలాడుతోంది. ఏపీకి ఏం చేశారని ఆ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు ఓటర్లు. ఆంధ్రుల ఆక్రోషం ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులే కరువు. పోటీ చేసిన చోట్ల డిపాజిట్లు గల్లంతు.  ఇప్పుడే కాదు.. గత 2019 ఎన్నికల్లోనూ కాషాయ పార్టీకి ఒక్క శాతం కూడా ఓట్లు రాలేదు. గతంలో పువ్వు గుర్తుపై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి ఉండేవారు. ఇప్పుడు చట్టసభల్లో ప్రాతినిధ్యమే లేదు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు గత ఎన్నికల్లోనే ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారు ఓటర్లు. ఇప్పుడిక విశాఖ రైల్వే జోన్ ఇవ్వనందుకు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేస్తున్నందుకు.. కమలదళంపై కాక మీదున్నారు ఏపీ ప్రజలు. ప్రత్యేకించి విశాఖ వాసులైతే బీజేపీపై ఓ రేంజ్ లో రగిలిపోతున్నారు. ఒకప్పుడు విశాఖ ఓటర్లు కమలనాథులను విశేషంగా ఆదరించారు. ఇప్పుడు నేతలే పార్టీని వీడిపోతున్నారు. తాజాగా, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు బీజేపీకి రాజీనామా చేశారు. ఏపీలో బీజేపీ ఉనికి కోల్పోయిందన్నారు.  నిజమే ఏపీలో బీజేపీ తనకు తాను రాజకీయ సమాధి చేసుకుంటోంది. కేంద్రం తీరుతో రాష్ట్ర పార్టీ ఇరకాటంలో పడుతోంది. అంతర్వేది రథం దగ్థం తర్వాత రాజకీయంగా కాస్త హడావుడి చేసిన కమలనాథులు.. ఆ తర్వాత వరుసగా జరిగిన ఆలయాలపై దాడులతో పొలిటికల్ యాక్టివిటీ పెంచారు. శ్రీశైలం మీదుగా కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ రథయాత్ర చేయ సంకల్పించారు. అంతలోనే పంచాయతీ ఎన్నికలు రావడం.. ఈ లోగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం జరిగిపోవడంతో.. రథయాత్రకు బ్రేకులు పడ్డాయి. ఈ సమయంలో కమలనాథులు కాలు బయటపెడితే జనాలు ఆ పార్టీపై ఉక్కు పిడికిలి బిగించడం ఖాయం.  అందుకే నష్ట నివారణ కోసం ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లి తనవంతు ప్రయత్నం చేయబోగా.. కేంద్ర పెద్దల నుంచి ఆయనకు ఎలాంటి సహాయమూ అందలేదు. విశాఖ ఉక్కు గురించి తనను అడగొద్దంటూ అమిత్ షా ముఖం చాటేశాడు. ప్రధాని మోదీ అయితే వీర్రాజుకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. హస్తినలో తెలుగోడికి ఇంతటి అవమానకర పరిస్థితి రావడం ఇదే తొలిసారి కాదు. కేంద్రం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలు, బీజీపీతో వైసీపీ కుమ్మక్కు అయిన తీరు... అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఏపీ ప్రజలు. ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి సరైన సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు.

కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుదుచ్చేరి రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. శాసనసభలో తన మెజారిటీ నిరూపించుకోవడంలో సీఎం నారాయణస్వామి విఫలమయ్యారు. మేజిక్ ఫిగర్ లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లిపోయారు. ఎల్జీ తమిళసైని కలిసి తన రాజీనామా అందజేశారు నారాయణ స్వామి.  బలపరీక్ష కోసం పుదుచ్చేరి శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభమైన తర్వాత సీఎం నారాయణస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానంపై ఓటింగ్‌ జరగకముందే ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో విశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్‌ వీపీ శివకొలుందు ప్రకటించారు.  పుదుచ్చేరి శాసనసభలో ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం 33 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాల తర్వాత ప్రస్తుతం 26 మంది ఉన్నారు. నారాయణస్వామి ప్రభుత్వం గట్టెక్కాలంటే 14 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ అధికార కాంగ్రెస్‌ కూటమి బలం 12కి తగ్గింది. ఇందులో కాంగ్రెస్‌ నుంచి స్పీకర్ తో కలిపి 10, డీఎంకే నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు విపక్ష పార్టీ అయిన ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూటమి బలం 14గా ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో పుదుచ్చేరి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే అనూహ్యంగా కిరణ్‌బేడీని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి తప్పించి.. తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎల్జీగా బాధ్యతలు స్వీకరించిన తమిళసై.. నారాయణస్వామి ప్రభుత్వం సోమవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించింది.  

వరవరరావుకు బెయిల్! ముంబై విడిచి వెళ్లొద్దని షరతు

విరసం నేత వరవరరావుకు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గోరేగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడుపుతున్న వరవరరావుకు బాంబే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు. ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని కోర్టు వెల్లడించింది.  ముంబై విడిచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని కోర్టు తెలిపింది.  తనపై ఆరోపణలు ఉన్న కేసు విచారణకు సంబంధించి, పోలీసులకు సహకరించాలని, సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నిస్తే, బెయిల్ ను రద్దు చేస్తామని న్యాయమూర్తి వరవరరావును హెచ్చరించారు. సోమవారం సాయంత్రం లోగా బెయిల్ పేపర్లను జైలు అధికారులకు అందించి, విడుదలయ్యేలా చూస్తామని వరవరరావు తరఫు న్యాయవాదులు చెప్పారు. ఇటీవల వరవరరావు ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. కరోనా కూడా సోకడంతో పాటు నరాల సంబంధిత ఇబ్బందులు.. ఇతర సమస్యలతో ఆయన బాధ పడుతున్నారు.   వరవరరావును 2018 జూన్‌ 18న చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. భీమాకోరేగావ్ అల్లర్లకు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు జూన్ మొదటివారంలో కొందరిని అరెస్టు చేశారు. వీరంతా ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నారని, వీరికి వరవరరావు ఆర్థికంగా సహకరిస్తున్నారని మహారాష్ట్ర పోలీసుల అభియోగం.ఈ మేరకు వరవరరావుపై ఐపీసీ 153 (ఏ), 505 (1) (బీ), 117, 120 (బీ), చట్ట వ్యతిరేక చర్యల (నియంత్రణ) చట్టం సెక్షన్ 13, 16, 17, 18 (బీ), 20, 38, 39, 40 సెక్షన్ల కింద మహారాష్ట్ర పూణే జిల్లా విశారంబాగ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.  

అప్పుడు శంకరమ్మ.. ఇప్పుడు వాణిదేవి! 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో ప్రధాన పార్టీలకు సవాల్ గా మారాయి. కొంత కాలంగా వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలతో కుదేలైన అధికార పార్టీని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఉద్యోగులు, నిరుద్యోగులు ఎక్కువగా ఓటర్లు ఉండే ఈ స్థానాల్లో గెలవడం టీఆర్ఎస్ కు కత్తి మీద సామే. అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారంటే.. ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు.   నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెనుకంజ వేసినా.. టీఆర్ఎస్ పెద్దలు ఇతరత్రా ఏవోవే హామీలు ఇచ్చి పోటీకి ఆయనను ఒప్పించారంటున్నారు. హైదరాబాద్- మహబూబ్ నగర్- రంగారెడ్డి స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గ్రేటర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను పోటీ చేయాలని కోరినా.. ఆయన తిరస్కరించారని తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం భావించినట్లు ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ పోటీ చేయకుండా... వామపక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు సపోర్ట్ చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు కూడా వార్తలు వచ్చాయి.  అయితే నామినేషన్ల గడువు ముగియడానికి రెండు రోజుల ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ స్థానం నుంచి రంగంలోకి దిగాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌ పట్టభద్రుల అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని కటించారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓడిపోతామనే భయంతో పోటీ చేసేందుకు నేతలు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉన్న స్థానంలో... పీవీ కూతురును పోటీ చేయిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం పీవీ కుటుంబాన్ని బలి పశువు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  పెద్దపల్లి జిల్లాలో ఇటీవల జరిగిన హైకోర్టు లాయర్ దంపతుల హత్య దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించింది. పట్టపగలు నడిరోడ్డుపై లాయర్లను అతి కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గురైన వామనరావు దంపతులు బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో ఆ వర్గమంతా అధికార పార్టీపై ఆగ్రహంగా ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బ్రహ్మణ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ సమయంలో వాణిదేవిని ఎమ్మెల్సీ బరిలోకి దింపారు కేసీఆర్. దీని ద్వారా ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న ఆ వర్గ ప్రజలను కూల్ చేయవచ్చని కేసీఆర్ భావించినట్లుగా చెబుతున్నారు. బ్రహ్మణుల్లో సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడంతో పాటు బీజేపీ అభ్యర్థికి చెక్ పెట్టేలా గులాబీ బాస్ ఎత్తు వేశారంటున్నారు.  ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణిదేవిని దింపాలన్న కేసీఆర్ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి విమర్శలే వస్తున్నాయి. ఖచ్చితంగా ఓడిపోతామని భావించిన  సీటులో పీవీ కూతురుని పోటీ చేయిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాల సమయంలో వాణిదేవికి ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీలు ఖాళీ కావడంతో ఆమెను ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. కాని కేసీఆర్ మాత్రం తాను ఇచ్చిన మాటన మర్చిపోయి.. ఇతరులకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలోనే పీవీ అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. అయినా పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు మాత్రం తన పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉండటంతో ఆమెను పావుగా వాడుకుంటున్నారని జనాల్లో చర్చ జరుగుతోంది.దివంగత ప్రధాని కూతురిని గవర్నర్ కోటాలోనే లేకపోతే ఎమ్మెల్యే కోటాలోనే నామినేట్ చేయాలని కాని.. ఎన్నికల బరిలో నిలపడం ఏంటనే చర్చ వస్తోంది. అది కూడా ఓడిపోతామని తెలిసిన సీటులో... మహిళను బరిలోకి దింపి రాజకీయం చేయడమేంటనే ప్రశ్న జనాల నుంచి వస్తోంది.  గతంలోనూ తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతా చారీ తల్లి విషయంలోనూ కేసీఆర్ ఇలానే చేశారని ప్రజా సంఘాలు, పీవీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. శంకరమ్మను అసెంబ్లీకి పంపిస్తానని ఉద్యమంలోనే హామీ ఇచ్చిన కేసీఆర్.. 2014 ఎన్నికల్లో మాత్రం ఆమె కోరుకున్న సీటు ఇవ్వకుండా.. మరో ప్రాంతానికి పంపించారు. అది కూడా  కాంగ్రెస్ కు అడ్డాగా ఉన్న,  బలమైన నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసిన హుజూర్ నగర్ నుంచి ఆమెను బరిలోకి దింపారు. శంకరమ్మ  టికెట్ సమయంలోనే కేసీఆర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఓడిపోయే సీటును ఇచ్చి కేసీఆర్ అవమానించారనే ఆరోపణలు ఉద్యమకారుల నుంచి వచ్చాయి. ఇప్పుడు వాణిదేవి విషయంలో అదే జరుగుతుందని చెబుతున్నారు.  రాజకీయ లబ్ది కోసం వాణిదేవిని ఎమ్మెల్సీగా పోటీ చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం పీవీ కుటుంబాన్ని వాడుకోవడం కేసీఆర్ దిగజారుడు తనానికి నిదర్శనమని విపక్షాలు మండిపడుతున్నాయి.

బావ బావమరిదిని టార్గెట్ చేసిన వైసిపి..

ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం నిన్నటితో ముగిసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు భావించినప్పటికీ.. ఇటు ఏకగ్రీవాల రూపంలో కొన్ని.. సంక్షేమ కార్యక్రమాలను కట్ చేస్తామని బెదిరింపులతో మరి కొన్ని చోట్ల వైసిపి బలపరచిన అభ్యర్థులు విజయ సాధించారు. మరోపక్క 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పలు చోట్ల టీడీపీ పుంజుకుంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, అయన బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబీ స్థానాలలో మాత్రం వైసిపి ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. కుప్పంలోని 87 పంచాయతీలకు గాను 73 వైసిపి బలపరచిన అభ్యర్థులు గెలుపొందారు. మరోపక్క బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని 38 స్థానాలకు గాను 30 చోట్ల వైసిపి మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో బావ బావమరుదులను అధికార వైసిపి గట్టిగా టార్గెట్ చేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాయలసీమ ప్రాంతం నుండి టీడీపీ మూడు చోట్ల మాత్రమే విజయం సాధించింది. అందులో రెండు కుప్పం, హిందుపూర్ కాగా మూడోదైన ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. దీంతో ఏపీలో టీడీపీ ని ఎప్పుడు ఫినిష్ చేద్దామా అని చూస్తున్న వైసిపి తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో బావ బావమరుదులను గట్టిగా టార్గెట్ చేసింది. కరోనా నేపథ్యంలో టీడీపీ నాయకులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. మరోపక్క కింది స్థాయి టీడీపీ నేతలను ప్రలోభాలు, బెదిరింపుల ద్వారా వైసిపి లోబరుచుకుంది. ఇక్కడ ముందుగా ఏకగ్రీవాల కోసం ప్రయత్నించిన వైసిపి, టీడీపీ సానుభూతిపరులను నామినేషన్లు వేయకుండా తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. అది వర్కౌట్ కాకపోవడంతో.. వైసిపి ఓడితే సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ ఓటర్లను కూడా భయపెట్టి మరీ ఈ రెండు నియోజకవర్గాలలో గెలిచారు. దీంతో పార్టీ అధినేత బాబు, అయన బావ మరిది బాలకృష్ణ సొంత స్థానాలలోనే తమకు తిరుగులేదని.. ఇక టీడీపీ పని అయిపోయిందని వైసిపి సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. అయితే వైసిపి చేస్తున్న ఈ దాడిని టీడీపీ ఏ వ్యూహం ద్వారా తిప్పి కొడుతుందో వేచి చూడాలి.

ఏపీ ఎన్నికలకు వ్యతిరేకంగా హైకోర్టుకు వకీల్ సాబ్

ఏపీలో ఎంతో ఉత్కంఠగా జరిగిన పంచాయతీ ఎన్నికలు నిన్నటితో ముగిశాయి ఇక త్వరలో మున్సిపల్, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే గత ఏడాది మార్చిలో జరిగిన ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో వైసిపి దౌర్జన్యాలకు పాల్పడడంతో చాల చోట్ల ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. ఇదే విషయాన్నీ అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ అటు కేంద్రానికి ఇటు ఎపి హైకోర్టుకు కూడా తెలిపారు మరోపక్క ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలు ముక్త కంఠంతో ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ ను కోరాయి . అయితే తాజాగా ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ లో ఏడాది క్రితం ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుండి ముందుకు కొనసాగుతుందని పేర్కొంది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పార్టీ మరోసారి డిమాండ్ చేసింది. ఎస్ఈసీ ఆవిధంగా ఆదేశాలు ఇవ్వకపోతే న్యాయపోరాటం చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ లీగల్ సెల్ విభాగానికి సూచనలు చేసినట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. గతేడాది కరోనా వ్యాప్తికి ముందు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో చాలా అక్రమాలు జరిగాయని .. చాల చోట్ల తమ పార్టీ నాయకులు చాలా మందిని బెదిరించారన్నారు. అప్పట్లో దాడులకు పాల్పడి నామినేషన్లు వేయనివ్వకుండా తమపార్టీవారిని అడ్డుకున్నారని అయన ఆరోపించారు. అంతేకాకుండా గతంలో నామినేషన్ల సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొన్న అభ్యర్థులు తమ ఫిర్యాదులు తీసుకుని ఆయా జిల్లాల కలెక్టర్లను కలవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించడంతో తమ పార్టీకి చెందిన వారు కలెక్టర్లను కలవడానికి వెళ్తే. అక్కడ అధికారులు మొక్కుబడిగా ఫిర్యాదులు తీసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కొన్నిచోట్ల జిల్లాల కలెక్టర్లు కూడా కలవడం లేదని, కిందిస్థాయి అధికారులు నామ్ కే వాస్తేగా ఫిర్యాదులు తీసుకుని పంపించేస్తున్నారని.. మొత్తంగా ఈ ప్రక్రియలో సీరియస్‌నెస్ లేదని అయన విమర్శించారు.. దీంతో ఈ ఎన్నికల ప్రక్రియపై మాకు నమ్మకం పోయిందని అయన అన్నారు. వచ్చిన ఫిర్యాదులపై న్యాయం చేస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ చెప్పినా మాకు మాత్రం నమ్మకం కలగడం లేదని అయన స్పష్టం చేసారు. దీనిపై పార్టీ న్యాయ విభాగంతో ఇప్పటికే మాట్లాడానని.. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేయమని చెప్పానని అయన తెలిపారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై పునరాలోచించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ వ్యవహారం పై జనసేన హైకోర్టును ఆశ్రయిస్తే ఈ ఎన్నికల ప్రక్రియ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

ఒకే రోజు  24 భాషల్లో ఉపరాష్ట్రపతి వ్యాసం 

ఒకరే రాసిన, ఒకటే వ్యాసం, ఒకే రోజున, 24 భాషా పత్రికల్లో ప్రచురించడం,అంటే అది మాములు విషయం  కాదు. అది కూడా ప్రపంచ మాతృ భాషా దినోత్సవం రోజున ... మాతృ భాష విశేషతను వివరిస్తూ, ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు రాసిన వ్యాసం కావడం మరీ  విశేషం. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాతృ భాషాభిమానం, తెలుగు భాషాభిమానం  గురించి వేరే చెప్పనవసరం లేదు.ఏదో ఏడాదికి ఒక రోజు అన్నట్లు కాకుండా, ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా ... మాతృ భాష, మరీ ముఖ్యంగా మన తెలుగు భాష గొప్పదనం గురించి ఆయన వివరిస్తూనే ఉన్నారు. ఇంకో విషయం, ఇంకో విశేషం, మాతృ భాషా దినోత్సవం రోజున ఉపరాష్ట్రపతి 22 అధికార భాషల్లోనూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు ట్వీట్ చేశారు.   ప్రపంచ మాతృ భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని, ‘అమ్మ’ భాష గొప్ప తనాన్ని, మన భాష,మన యాసల పరిరక్షణ అవసరాన్ని, ప్రాధమిక విద్యా బోధనా మాతృ భాషలో జరగవలసిన అవసరాన్ని ... ఇలా ఆనేక అంశాలను విశ్లేషిస్తూ వెంకయ్య నాయుడు రాసిన వ్యాసం ఒకే రోజు 24 ప్రాతీయ భాష పత్రికలో ప్రచురితం కావడం పట్ల భాషాభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.  ఇదలా ఉంటే ... మాతృ భాషా దినోత్సవంసందర్భంగా తానా ప్రపంచ సాహిత్య సమావేశంలో ప్రసంగించిన ఉప రాష్టపతి, ప్రాధమిక విధ్యాబ్యాసం తెలుగు రాష్ట్రాలలో తెలుగులో ... తమిళ రాష్ట్రంలో తమిళంలో, అన్ని రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర భాషల్లోనే జరగాలని ఉద్బోదించారు. అలాగే అన్ని రాష్ట్రాలలో పరిపాలన మాతృ భాషలోనే జరగాలని, తెలుగు వారిని ఆంగ్లంలో  పరిపాలించడం ఏమిటని తమదైన శైలిలో చురకలు వేశారు. అలాగే, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడున్నా తెలుగులో మాట్లాడాలని,అలా మాట్లాడడం గోప్పదనంగా భావించాలని, మన భాష, మన యాసలతో పాటుగా మన కట్టు బొట్టు, సంస్కృతీ, సంప్రదాయలను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరించారు.  అలాగే మహారాష్ట్ర మాజీ గవర్నర్, సిహెచ్ విద్యాసాగర రావు మరో చక్కని సూచనా చేశారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమలో పాల్గొన్న ఆయన, ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి అంతర్జాతీయ తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకొచ్చి ప్రణాళికను సిద్ధం చేస్తే 40 దేశాల్లోని తెలుగు వారు సహకరించేందుకు సిద్దంగా ఉన్నారని విద్యాసాగర రావు చెప్పారు. మంచి ఆలోచనే కానీ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు..

మహారాష్ట్రలో కరోనా పంజా! ఐదు జిల్లాల్లో లాక్ డౌన్

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పంజాబ్ లో కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ మహారాష్ట్రపై పంజా విసురుతోంది. కేసులు పెరుగుతుండడంతో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అమరావతి, అకోలా, బుల్దానా, వాషిం, యావత్మాల్‌‌ జిల్లాలలో వారం రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం అర్ధ రాత్రి నుంచి మార్చి 1 వరకు లాక్ డాన్ అమల్లో ఉంటుంది. పూణె, నాసిక్ నగరాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నారు. శుక్రవారం నాడు పరిస్థితిని సమీక్షించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారు. విద్యాసంస్థలను కూడా ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో గత రెండు వారాల్లో కేసులు 2 వేల 500 నుంచి ఏడు వేలకు పెరిగాయి. పరిస్థితి ఇలానే ఉంటే రాష్ట్ర వ్యాప్త లాక్‌డౌన్‌పై ఆలోచిస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్‌డౌన్ వద్దనుకుంటే కనుక ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. 

టీఆర్ఎస్ అభ్యర్థిగా పీవీ కూతురు! 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ స్థానం నుంచి రంగంలోకి దిగాలని నిర్ణయించిన గులాబీ బాస్.. అభ్యర్థి ఎంపికలో విపక్షాలకు షాకిచ్చారు. టీఆర్‌ఎస్‌ పట్టభద్రుల అభ్యర్థిగా సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. వాణీదేవి దివంగత మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె. వాణీదేవి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్  నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావునే తిరిగి బరిలోకి దింపింది. గతంలో ఇక్కడి నుంచి విజయం సాధించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ మరోసారి బరిలోకి దిగారు. ఆయన వామపక్షాల మద్దతుతో పోటీ చేస్తున్నారు. నల్గొండకు సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించిన కేసీఆర్.. హైదరాబాద్ కు ప్రకటించలేదు. దీంతో ఇక్కడ పోటీ చేయకుండా... ప్రొఫెసర్ నాగేశ్వర్ కు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందనే ప్రచారం జరిగింది.  వాణీదేవిని అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ ప్రకటించడం వెనుక వ్యూహం ఉందని పలువురు చెబుతున్నారు.  పి.వి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నుంచి అంచెలంచలుగా ఎదిగి దేశానికి ప్రధాని అయ్యారు. అలాంటి పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్ దూరం చేసుకుంది కాబట్టి.. దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు టీఆర్‌ఎస్ పావులు కదుపుతోందని తెలుస్తోంది.   

నారావారిపల్లిలో టీడీపీ ఘన విజయం

అధికార పార్టీ ప్రలోభాలు పని చేయలేదు.. వైసీపీ నేతల బెదిరింపులను ఓటర్లు పట్టించుకోలేదు. చిత్తూరు జిల్లాలోని టీడీపీ అధినేత చంద్రబాబు స్వంత గ్రామంలో టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. తుది దశ పంచాయతీ పోరులో నారావారిపల్లిలో టీడీపీ మద్దతుదారు లక్ష్మి.. సమీప అభ్యర్థిపై 563 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఫలితాల్లో టీడీపీ విజయం సాధించడంలో ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   నారావారిపల్లిలో వైసీపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఓటర్లు వైసీపీ ప్రలోభాలకు లొంగకుండా టీడీపీకి విజయాన్ని అందించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు గెలుచుకుని రాష్ట్రస్థాయిలో చంద్రబాబును దెబ్బ కొట్టామని చెప్పుకుంటున్న వైసీపీ ఇప్పుడు ఆయన స్వగ్రామం నారావారిపల్లిపై ప్రత్యేక దృష్టి సారించింది. వైసీపీ మద్దతుదారును గెలిపించుకునేందుకు  తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. భారీగా  ఖర్చు చేశారు.  పోలింగ్ సందర్భంగా తిరుపతి నుంచి యువకులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ నారావారిపల్లిలో టీడీపీ మద్దతుదారు విజయం సాధించడంతో వైసీపీ నేతలు షాకయ్యారు.

నారావారిపల్లిలో భారీగా దొంగ ఓట్లు!

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ భారీగా అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో యథేచ్చగా రిగ్గింగ్ జరిగిందని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో.. వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయించారని, రిగ్గింగ్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.    నారావారిపల్లె పంచాయతీలో దొంగ ఓట్లు వేయడానికి తిరుపతి నుంచి కొంతమంది యువకులు వచ్చారు. కొత్తగా వచ్చిన యువకులు అనుమానస్పదంగా ఉండడంతో గ్రామస్తులు చెప్పే వరకు పోలీసులు వారికి తనికీలు చేయలేదు. ఎస్ఈసీ నిబంధనల ప్రకారం ఓటరు ఆధార్, ఓటరు స్లిప్ అన్ని చూపించి లోపలకు వెళ్లాలి. అవేవి లేకుండా దొంగఓట్లు వేయడానికి వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొంత మంది గోడలు దూకి దొంగ ఓట్లు వేయడానికి వస్తున్నారు. ఇక్కడ ప్రతి పోలింగ్ బూత్‌లో ఇదే పరిస్థితి నెలకొంది.  నారావారా పల్లిలో ఎలాగైనా గెలిచేందుకు వైసీపీ కుట్రలు చేసిందని, అడ్డదారులు తొక్కిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. బయటి వ్యక్తులు వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాకు. అధికారులు, పోలీసుల కనుసన్నల్లోనే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని మండిపడుతున్నారు. 

తెలంగాణ సీఎం బఫూన్! బీజేపీ ఎంపీ హాట్ కామెంట్స్ 

ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసే బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను బఫూన్లు పరిపాలిస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, పోలీసులు రాష్ట్రంలో రోహింగ్యాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో బోగస్ అడ్రస్ లతో పాస్ పోర్టులు ఇస్తున్నారని తెలిపారు. హోంమంత్రికి లా అండ్ ఆర్డర్ అంటే ఏమిటో కూడా తెలియదని మండిపడ్డారు ధర్మపురి అర్వింద్. మయన్మార్ లో వందలాది హిందువులను వధించిన రోహింగ్యాలు దేశభద్రతకే సవాల్ గా మారారని చెప్పారు. భారత్ లో ప్రవేశించిన రోహింగ్యాలు ఐరిస్, బయోమెట్రిక్ లేకుండానే ఆధార్ కార్డులు సంపాదిస్తున్నారని వివరించారు. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ రోహింగ్యాలపై ఎందుకు కూయడం లేదని ప్రశ్నించారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. రోహింగ్యాలు అక్రమంగా నివాసం ఉండటం వెనుక ప్రభుత్వ పాత్ర కూడా ఉందన్నారు.  రాష్ట్ర విభజన సమయంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. కల్వకుంట్ల దోపిడి పాలనలో అప్పులమయంగా మారిందన్నారు ధర్మపురి అర్వింద్. ఆరున్నర ఏండ్లలోనే కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచారన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారని ఆరోపించారు. అవినీతి పాలన చేస్తున్న కేసీఆర్ కుటుంబం తోలు తీసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అరవింద్ స్పష్టం చేశారు.కేసీఆర్, కేటీఆర్ ల తోలు తీస్తామంటున్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించడంలేదని విమర్శించారు. 

బ్రదర్ అనిల్ వదిలిన బాణం? 

అప్పుడు షర్మిల జగనన్న సంధించిన బాణం ... అన్న జైలుకు పోతే ఆమె అన్న పాదుకల్లో కాలుపెట్టారు. ఆయన ప్రారంభించిన పాద యాత్రను కొనసాగించారు. నిజానికి జగన్ కంటే షర్మిలే ఎక్కువదూరం,(మూడు వేల పై చిలుకు కిలోమీటర్లు)నడిచారు. జైల్లో జగన్ ఏ కష్టాలు పడ్డారో ... ఏ సుఖాలు అనుభవిఇంచారో ఏమో గానీ, పాదయాత్రలో  షర్మిల పడరాని పాట్లు పడ్డారు. ఆయన జైలులో ఉన్న 16 నెలలు రాజన్న రాజకీయ వారసత్వాన్ని సజీవంగా నిలిపారు. ఒక విధంగా ఆ సమయంలో ఆమె వైసీపీని బతికించారు. వైసీపీ ప్రస్థానంలో అంతకు ముందు ఆ తర్వాత పార్టీని నడిపించడం ఒకెత్తు అయితే, ఆ 16 నెలలు పార్టీని సజీవంగా ఉంచడం ఒక్కటీ ఒకెత్తు. ఆ సమయంలో వైసీపీ ప్రస్థానానికి బ్రేకులు పడి ఉంటే పార్టీ ప్రస్తుత స్థిలో ఉండేది కాదు.ఇది ఎవరు కాదనలేని నిజం.  అప్పట్లో షర్మిలను నడిపించింది కేవలం రక్తబంధమేనా,లేక ఇంకేమైనా లౌకిక, అలౌకిక బంధాలు ఉన్నాయా? అంటే నిజానిజాలు ఏమిటో ఇప్పటికీ ఎవరికీ స్పష్టంగా తెలియదు. అయితే పదవులవిషయంలో రాజకీయ ప్రాధాన్యత విషయంలో జగన్ ఇచ్చినమాట తప్పడం వల్లనే షర్మిల ఇప్పుడు ఇలాంటి నిర్ణయానికి వచ్చారని కొందరు చెపుతున్నారు. అలాగే ఆమె ఇప్పుడు ఒక్కసారిగా తమ రాజకీయ ఆకాంక్షను బయట పెట్టడంతో ఎన్నెన్నో ప్రశ్నలు, ఇంకెన్నో సందేహలు బాణాల్లా దుసుకోస్తున్నాయి. మరోవంక ఆమె ఎవరు వదిలిన బాణం అనే చిక్కు ప్రశ్న తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతోంది. షర్మిల తాజా నిర్ణయం రాజకీయ, రాజకేయేతర ఊహాగానలకు తావిస్తోంది. అంతే కాదు ఈ ప్రశ్న మూలాలు ఇంకెక్కడో ఉన్నాయన్న అనుమానాలు వినవస్తున్నాయి.  రాష్ట్రాల సరిహద్దులు, దేశాల సరిహద్దులుదాటి ఏ జెరూసలంలోనో ఇంకెక్కడో షర్మిల రాజకీయ ఆకాంక్షల వేళ్ళు తేలుతున్నాయి. అందుకే కావచ్చు  సామాజిక మాధ్యమాలలో కొందరు ఇది ఏసు ప్రభువు సంకల్పం, జేరూసలం ఆజ్ఞ అంటున్నారు. భర్త బ్రదర్ అనీల్ ఆదేశం.. అప్పుడు ఒక సోదరిగా జగన్ జగన్ కోసం ముందుకొచ్చి పాదయాత్ర చేసిన షర్మిల, ఇప్పడు భర్త అనీల్ కోసం మరో సారి రాజకీయ వేదిక మీదకు వచ్చారని  బీజేపీ నాయకులు అంటున్నారు. దీంతో ఆమె ఎవరు సంధించిన బాణం అనే విషయంలో చాలా చాలా కథలు కథనాలు వినిపిస్తున్నాయి. ఒకరు ఆమెకు అన్నజగన్ కు మధ్య ఆస్తి తగాదాలతో పాటుగా రాజకీయ వారసత్వ తగవులు, తగాదాలు ఏవో ఉన్నాయని అంటారు. ఇంకొందరు అబ్బే అదేమీ  కాదు.. అలా అయితే ఆమె తిరుగుబాటు జెండా ఏపీలో ఎగరేయాలిగానీ ఇక్కడ తెలంగాణలో ఎందుకు ఎగరేస్తారు అంటూ లాజిక్ లాగుతున్నారు. కేసీఆర్, జగన్, షర్మిల ముగ్గురినీ కలిపి ట్రైయాంగిల్ పొలిటికల్ స్టొరీ తెరమీదకు తెచ్చారు ఇంకొందరు.  తెరాసకు ఇటీవల వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో కారు 16 అంటే అది కాస్త సగానికి పడిపోయింది.అది ఎప్పటి సంగతో అనుకున్నా , నిన్నమొన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఘాట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు చోట్ల విజయం సాధించిన బీజేపీలో జోష్ పెరిగింది.ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కాంగ్రెస్ ’లోనూ కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి పదివి తప్ప ఇక దేనితోనూ కాంప్రమైజ్’ కాని గడుసుపిండం రేవంత్ రెడ్డి యాత్రాలతో ఉప్పెన సృష్టిస్తున్నారు.మరో వంక ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వరకు బారులు తీరిన ఎన్నికలు భయపెడుతున్నాయి.ఈనేపధ్యంలోకేసీఆర్, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు,అంతకంటే ముఖ్యంగా చల్లారిన తెలంగాణ సెంటిమెంట్ ను వేడెక్కించేందుకు వ్యూహాత్మకంగా జగన్ తో కలిసి షర్మిలను తెరమీదకు తెచ్చారు అనే కథొకటి కూడా సర్క్యులేషన్’లో ఉంది.  తెర వెనక ఉంది బీజేపీనే అనే కథనం మరొకటి కూడా అక్కడక్కడా వినవస్తోంది.   అయితే ఇందులో ఏది నిజం, ఏది కట్టు కథ  అంటే ... చెప్పడం కొంచెం కష్టమే.కానీ  కొద్దిగా విశ్లేషించి చూస్తే మాత్రం పైకి కనిపిస్తున్న,వినిపిస్తున్నకథలు, కథనాల కంటే, కనిపించని, నాలుగో సింహం ఇంకొకటి ఎదో ఉందని అనిపిస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డ్డి కుమార్తె, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి మాత్రమే కాదు.. ఆమె బ్రదర్ అనీల్ భార్య అనే విషయాన్ని మరిచి పోకూడదు. నిజానికి, ఆమె ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు తెలంగాణ తనకు మెట్టినిల్లని  సమాధానం ఇచ్చారు.అంటే  వైసీపీ పుట్టింటి పార్టీ అయితే ఇప్పుడ పెట్టబోయే పార్టీ అత్తింటి పార్టీ అనుకోవచ్చును.ఇక్కడే  షర్మిల చేత కొత్తగా రాజకీయ అడుగులు వేయిస్తున్నది  బ్రదర్ అనీల్ అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కొందరు బ్రదర్ షర్మిల అనీల్ వదిలిన బాణమని అంటున్నారు.    బ్రదర్ అనీల్ ఎవరో ... ఏమిటో .. ఆయన వృత్తి, ప్రవృత్తి,లక్ష్యం,గమ్యం ఏమిటో అందరికీ తెలిసిందే. బ్రదర్ అనీల్ క్రైస్తవ ధర్మాన్ని నరనరాన  నింపుకున్న పవిత్ర క్రైస్తవుడు. వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి ఇతర క్రైస్తవ రెడ్డి నాయకుల్లాగా బ్రదర్ అనీల్ లౌకికవాదం ముసుగులు కప్పుకోలేదు.ఆంధ్ర ప్రదేశ్ లో  వైసీపీని గెలిపించింది కూడా ఏసు ప్రభువే అని గట్టిగా విశ్వసిస్తారు. క్రైస్తవ రాజ్య స్థాపన లక్ష్యంగా ఆయన ప్రపంచ వ్యాప్తంగా బహిరంగ మత ప్రచారం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో  ఆయనకు క్రైస్తవ సంబంధాలున్నాయి. అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలతో ఆర్థిక సంబంధాలూ ఉన్నాయి.అదీ గాక గతంలో ఎప్పుడూ షర్మిలతో  కలిసి  రాజకీయ వేదికల మీద కనిపించని బ్రదర్ అనీల్.. షర్మిల తాజా రాజకీయ ఆలోచన వేదిక మీద కనిపించడమే కాదు, కర్తః కర్మ క్రియ అన్నీ తానై కథ నడిపిస్తున్నారు. అంటే పార్టీ పెట్టేది షర్మిల అయినా.. పార్టీని నడిపించేది మాత్రం బ్రదర్ అనీల్ కుమార్ అనేది ఇప్పటికే చాలా వరకు స్పష్టమైంది.  సో ... షర్మిలను వెనకుండి నడిపిస్తున్నది కేసీఆర్ కావచ్చు,జగన్ కావచ్చు, కాదంటే మరొకరు ఎవరైనా కావచ్చును.. కానీ  ముందుండి దారి చూపుతున్నది,మార్గదర్శనం చేస్తున్నది మాత్రం బ్రదర్ అనీల్ ... అందులో సందేహం లేదు. అందుకే షర్మిల పేరున సాగుతున్న రాజకీయ వేదిక నిర్మాణం బ్రదర్ అనీల్ కుమార్’ ఆశయాల సాధనకోసం, అంటే క్రైస్తవ రాజ్య స్థాపన కోసం కావచ్చు కదా అని కొందరి అనుమానం..  

బీజేపీలోకి రేవంత్ అనుచరుడు! తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్

తెలంగాణలో బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కూన  కూన శ్రీశైలం గౌడ్.. ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి ఆయన రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ వ్యవహారాలపై కొంత కాలంగా శ్రీశైలం గౌడ్ అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీశైలం గౌడ్  మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.  గ్రేటర్ పరిధిలో బలమైన నేతగా ఉన్నారు కూన శ్రీశైలం గౌడ్. కొంత కాలంగా ఎంపీ రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. గత డిసెంబర్ లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా పోరాడారు. గ్రేటర్ పరిధిలో అంతో ఇంతో కాంగ్రెస్ బలంగా పోటీ ఇచ్చిన డివిజన్లు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. రేవంత్ రెడ్డికి గ్రేటర్ లో కుడి భుజంగా వ్యవహరించిన  కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా.. కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది.   2004లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు కూన శ్రీశైలం. తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. గత 2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మేడ్చల్ జిల్లాకు చెందిన కొందరు నేతలతో కూనకు విభేదాలున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లోనూ తనకు వ్యతిరేకంగా ఆ వర్గం పని చేసిందని కూన బహిరంగంగానే ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు.    

ఇటు జై శ్రీరామ్ ...అటు బెంగాల్ పుత్రిక 

అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న పశ్చిమ బెంగాల్’లో నినాదాల హోరు ఉపందుకు కుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ, జై శ్రీరామ్ నినాదాన్ని హోరేతిస్తుంటే, అదికార తృణమూల్ కాంగ్రెస్ తాజగా, స్థానిక సెంటిమెంట్’ను జోడిస్తూ ‘బెంగాలీ పుత్రిక’ నినాదాన్ని తెరమీదకు తెచ్చింది. అ వారాంతంలో కోల్కతాలో ఎక్కడికి వెళ్ళిన, ఎక్కడ చూసిన మమత బెనర్జీ ఫోటో, ‘బంగ్లా నైజర్ మేయేకే చాయే’(బెంగాల్ పుత్రికనే ..బెంగాల్ కోరుకుంటోంది) అనే నివేదిక ఉన్న పోస్టర్లు దర్శన మిచ్చాయి. ఎన్నికల రాజకీయలలో, రాజకీయ ఉద్యమాలలో నినాదాలు చాలా కీలక పాత్రనే పోషిస్తాయి.స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ ఇతర నేతలు పోషించిన పాత్ర ఎంత గొప్పదో, ‘వందేమాతరం’ నినాదం పోషించిన పాత్ర అంతకంటే గొప్పది. అలాగే, ఇందిరా గాంధీ 1969లో కాంగ్రెస్ పార్టీని చీల్చి సమయంలో ఇచ్చిన రెండు పదాల నినాదం, ‘గరీబీ హఠావో’ ఆమెను తిరుగులేని నాయకురాలిగా నిలిపింది. ఆ ఒక్క నినాదంతో మొరార్జీ దేశాయ్’వంటి మహానాయకుల ఓల్డ్ కాంగ్రెస్’ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. అలాగే, ‘అగలీ బారీ అటల్బిహారీ’ , అలాగే, తెలుగు రాష్ట్రాలలో  జై తెలంగాణ నినాదంతోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఇలా చెప్పుకుంటూ పొతే, పొలిటికల్ ఈక్వేషన్స్’ను మార్చి వేసిన నినాదాలు చాలానే ఉన్నాయి.  మరో రెండు నెలల్లో ఎన్నికలు  పశ్చిమ బెంగాల్’లో ఇతర అమసలు అన్నీ పక్కకు పోయి కేవలం నినాదాలే కీలకంగా మారాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్’ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన భారతీయ జనత పార్టీ, సంధించిన ‘జై శ్రీరామ్’ నినాదం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆమెలో ‘జై శ్రీరామ్’ వ్యతిరేక ఆందోళన, ఆగ్రహం ఏ స్థాయికి ఎదిగిందో,వేరే చెప్పనకక్రలేదు.ఇటీవల సుభాష్ చంద్ర బోసు బాబు జయంతి ఉత్సాలలో ప్రధాని నరేంద్ర మోడీతో వేదికను పంచుకున్న ఆమె,సభలో ఎవరో ‘జై శ్రీరామ్’ నినాదం చేశారని ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రసంగం చేయకుండా మికే పక్కన పెట్టి వెళ్లి పోయారు.  మమతలో  ‘జై శ్రీరామ్’ నిందం కంపరం పుట్టించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో  ఆమె కాన్వోయ్ వెళుతున్న మార్గంలో రోడ్డు పక్కన నిలుచున్నప్రజలు ‘జై శ్రీరామ్’ అనగానే, ఆమె కాన్వోయ్ ఆపి, కారు దిగివచ్చి మరీ, సామాన్య ప్రజలతో వాదులాటకు దిగారు. అంతే కాదు, అసలు ‘జై శ్రీరామ్’ నినాదాన్ని రాష్ట్రంలో బ్యాన్ చేయాలనే ఆలోచన కూడా చేశారు. అసెంబ్లీలో తీర్మానం పెట్టె ఆలోచన చేశారు. అయితే, బీజేపీతో పాటుగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూడా ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో వెనక్కి తగ్గారు. జై శ్రీరామ్’ నినాదం పట్ల మమతా దీదీకి ఉన్న వ్యతిరేకతను, బీజేపీ బాగా సొమ్ము చేసుకుంది.నినాదాన్ని,నినాదం పట్ల మమతకు,ఆమె పార్టీకి ఉన్న వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. దీంతో ఇప్పటికే చాలావరకు కంసాలిడేట్’ అయిన 70 శాతం వరకు ఉన్న హిందూ ఓటు మరింతగా బలపడింది. ఈ ధీమాతోనే కావచ్చును, పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం మంత్రి బెంగాల్ ఎన్నికల ప్రధాన వ్యూహ కర్త అమిత్ షా 200 ప్లస్ సీట్లు ఖాయమని ధీమాను వ్యక్త పరుస్తున్నారు.  మమతా బెనర్జీ జై శ్రీరామ్కు వ్యతిరేకంగా బంగ్లా నైజర్ మేయేకే చాయే’(బెంగాల్ పుత్రికనే ..బెంగాల్ కోరుకుంటోంది) అనేనినాదాన్ని తెర మీదకు తెచ్చారు.మమత ఫోటో,  నినాదం ఉన్న హోర్డింగులు నిన్న కొల్కతా అంతటా దర్శనమిచ్చాయి.భారతీయ జనతా పార్టీని, స్థానికేతర పార్టీగా చిత్రించే వ్యూహంతో ఆమె బెంగాలీ సెంటిమెంట్’ను ఆశ్రయించారు. అయితే, ఇప్పటికే, అమిత్ షా, స్థానికులే పశ్చిమ బెంగాల్’ ను పాలిస్తారని, అది ఎవరన్నది, బెంగాలీ ప్రజలు ఎన్నుకున్నబీజేపీ ఏమ్మేల్ల్య్యేలే నిర్ణయిస్తారని వివరణ ఇచ్చారు. ఈ నేపద్యంలో, మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో,ఎవరు గెలుస్తారు అనే దాని కంటే ఏ నినాదం గెలుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

అభ్యర్థి లేడా.. వ్యూహాత్మకమా! అక్కడ పోటీ చేయనట్టేనా? 

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. ఇందులో నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని అధికార టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. ఆయన ప్రచారంలో మునిగిపోయారు. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్’నగర్’ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్ధి పేరును తెరాస అధిష్టానం ఇంతవరకు ప్రకటించలేదు.ఈ స్థానం నుంచి, తెరాస పోటీ చేయక పోవచ్చని పార్టీ వర్గాల సమచారం. ఈ విషయంలో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కట్టుబడి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.  ఇటీవల కాలంలో దూకుడు పెంచిన బీజేపీకి కళ్ళెం వేయడమే ధ్యేయంగా పావులు కదుపుతున్న గులాబీ బాస్, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే వ్యూహం అనుసరించే అలోచనాలో ఉన్నారని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. అందులో భాగంగా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఓడించడమే లక్ష్యంగా, వామపక్షాలు బలపరుస్తున్న మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ కు తెరాస మద్దతు ఇవ్వ వచ్చని అంటున్నారు.  ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వడం ద్వారా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఇటు బీజేపీని ఓడించడంతో పాటుగా వామపక్ష మేథావులను కట్టడి చేయవచ్చని కేసీఆర్ అలోచిస్తున్నట్లు తెరాస భవన్’లో గుసగుసలు వినవస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తెరాస హామీ తీసుకున్న తర్వాతనే నామినేషన్ దాఖలు చేశారని అంతవరకు ఆయన కూడా వేచి చూసే ధోరణితోనే ఉన్నారని సోషల్ మీడియాలో వినవస్తోంది. ఇప్పటికే గోరటి వెంకన్నకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన తెరాస.. ఇప్పడు ప్రొఫెసర్ నాగేశ్వర్కు  మద్దతు ఇవ్వడం ద్వారా తెలంగాణ మేథావుల వ్యతిరేకను కట్టడి చేయవచ్చని భావిస్తుందని చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు.  మరోవైపు పోటీ చేయకపోతే తమకు భయపడే పోటీచేయలేదని బీజేపీ  డప్పుకొట్టి టాం..టాం వేసుకుంటే  పరువు పోతుందని.. పోటీచేసి ఓడిపోతే పార్టీ పరువు మరింతగా దిగజారి పోతుందని పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్, వ్యూహాలు ఎత్తుగడలు ఎలా ఉంటాయో ఎవరూ ఉహించలేరు. సో చివరి  క్షణంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు అటు పార్టీ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంసంగా మారింది.