అయినా గాలికొదిలేశారు.... చంద్రబాబు క్లాస్
posted on Feb 20, 2021 @ 5:33PM
టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసిపి చేతిలో ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుప్పం లోని పార్టీ స్థానిక నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికార వైసిపి చేసిన రౌడీయిజం, విచ్చలవిడి డబ్బు పంపిణీతోపాటు స్థానిక అధికారుల సహకారం కారణంగానే వైసీపీ విజయం సాధించిందని అయన అన్నారు.
అంతేకాకుండా టీడీపీ నేతలు కూడా గెలుస్తామనే ధీమాతో పోలింగ్ బూత్ లను, కౌంటింగ్ ను వదిలిపెట్టి మరీ తిరిగారని ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నేతలకు బాబు చురకలు అంటించారు. ఆసమయంలో అధికారులు ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని అన్నారు. మరోపక్క అపోజిషన్ పార్టీ వాళ్లంతా నేరస్థులు కావడంతోపాటు.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ నాయకులు మరింత అప్రమత్తంగా ఉండాలని తాను చాలా సార్లు చెప్పానని బాబు గుర్తు చేశారు. మనం, మన కేడర్ ఎంత బాగా పని చేసినా అధికార పార్టీ అరాచకాల వల్ల పార్టీ ఓటమిపాలైందని అయన చెప్పారు.
అంతేకాకుండా పార్టీలోని బలహీనతలు, అనైక్యతను వైకాపా అడ్వాంటేజ్ గా తీసుకుందని బాబు తెలిపారు. విలువలకు ఏంటో ప్రాధాన్యతనిచ్చే కుప్పం వ్యక్తిత్వాన్ని ఈ ఎన్నికల ఫలితాలు దారుణంగా దెబ్బతీశాయని అయన అన్నారు. త్వరలోనే ఈ మబ్బులు తొలగిపోతాయని... మన ప్రభుత్వం వచ్చిన తరువాత వడ్డీతో సహా తీర్చుకుందామని చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ తాము బాగా పని చేశామని... అయినా వైసీపీ అరాచకాలు, డబ్బు పంపిణీ వల్ల ఓడిపోయామని బాబుకు సంజాయిషీ ఇచ్చారు.చివరిగా తాను త్వరలో కుప్పం వస్తానని.. తన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ రెండుమూడు రోజుల్లో ఇస్తానని, రెండు రోజులు అక్కడే ఉండి పరిస్థితులను చక్కదిద్దుతానని స్థానిక నాయకులకు భరోసా ఇచ్చారు.