మీరు సిద్ధమైతే మేము సిద్ధమే చంద్ర బాబు..

ఏపీలో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై  కేంద్రానికి  బుద్ధి చెప్పడానికి కార్మిక సంఘాలు , ప్రజలు పార్టీల నాయకులు  ఆందోళనలు చేస్తుండగా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు గా లేకపోగా..  ప్రజల్లో  తమ ఉనికిని కాపాడుకోవడానికి మేము సిద్దమే అంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. విశాఖ ప్రయివేటీకరణపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ..విశాఖ  ఉక్కును ప్రయివేట్ పరం చేయొద్దని. తెలుగు ప్రజల హక్కును కాపాడుకోవడానికి అందరు ఒక్కటి కావాలని. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సొత్తు.. దాన్ని దక్కించుకోవాలని అందుకు ప్రజలు, పార్టీలు కలసి కట్టుగా సిద్ధం కావాలని.. తెలుగు ప్రజల గళం విప్పి కేంద్రం మెడలు వంచాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకు రాజీనామాలకు మీరు సిద్ధమైతే మేము సిద్ధమంటూ చంద్ర బాబు నాయుడు సవాల్ విసిరాడు.. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసే ఆలోచనను వ్యతిరేకించే పక్షంలో అధికార వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, తాము ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తామని తనతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని ఆయన అన్నారు, ఈ విషయంలో తాను సీనియర్ నేతననే అహం లేకుండా ప్రజల మనోభావాలను పరిరక్షించేందుకు ముందుకు వస్తానని అన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు సీఎం స్థాయిలో ఉన్న జగన్ ఏం చెబితే, అది చేస్తానని, ఈ విషయంలో అధిక బాధ్యత తనపైనే ఉందని జగన్ గుర్తించాలని సూచించారు.  వ్యక్తి గత హక్కు, సామాజిక హక్కు, వ్యక్తి గత హక్కుకు భంగం కలిగితే ఒక్కరే నష్టమవుతారు.. అదే సామాజిక హక్కు కు భంగం కలిగితే కొన్ని వేల జీవితాలు నష్టపోతాయి .. ఒక రాష్ట్రాన్నికి నష్టమవుతుంది.. ఇప్పుడు ఏపీ ముందు ఉన్న ప్రశ్న కూడా అదే విశాఖ ఉక్కు ను ప్రయివేట్ పరం చేయటానికి కేంద్రం కుట్రలు పన్నుతోంది..సామజిక హక్కుకు భంగం కలుగుతుంది.. ఆ సామజిక హక్కును కాపాడుకునే బాధ్యత మనందరిది..     

ఒకే అపార్ట్ మెంట్‌లో ఏకంగా 103 మందికి కరోనా.. బెంగుళూరులో కలకలం

మనదేశ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఏకంగా 103 మంది ఒకేసారి కరోనా బారినపడడం తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలోని బొమ్మనహళ్లి జోన్ లోని బిలేకహళ్లిలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో 435 ఫ్లాట్లు ఉన్నాయి. ఆ ఫ్లాట్లలో మొత్తం 1500 మంది నివసిస్తున్నారు. ఒక్కసారిగా ఇంతమందికి కరోనా వైరస్ సోకడానికి ఈ నెల 6న అపార్ట్‌మెంట్ వాసులు అందరు కలిసి ఏర్పాటు చేసుకున్న పెద్ద పార్టీ లో డ్రైవర్లు, పనిమనుషులు, వంటవాళ్ళతో సహా అందరు హాజరయ్యారు. అయితే ఈనెల 10 న మొదటి పాజిటివ్ కేసు బయటపడడంతో అందరికీ పరీక్షలు నిర్వహించగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 103 కు చేరుకుంది. ఇలా ఉండగా పాజిటివ్ వచ్చిన వారిలో 96 మంది 60 ఏళ్లకు పైబడిన వారిగా గుర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారులు అపార్ట్‌మెంట్‌కు వద్దకు చేరుకుని సెక్రటరీ, ఇతర సిబ్బందితో మాట్లాడి వారు పాటిస్తున్న కొవిడ్ నిబంధనలపై ఆరా తీశారు. అందరు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. బీబీఎంపీ సిబ్బంది అపార్ట్ మెంట్ మొత్తం శానిటైజ్ చేశారు. కరోనా బారినపడి వారందరు ప్రస్తుతం క్వారంటైన్‌కు వెళ్లారు..

మాస్క్ గాలికొదిలేసిన జనం.. మళ్ళీ లాక్ డౌన్ దిశగా ముంబై

భారత్ లో కరోనా వ్యాప్తి కొంతవరకు తగ్గినప్పటికీ.. గత మూడు రోజులుగా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో రోజుకు మళ్ళీ నాలుగు వేల కేసులు నమోదవుతున్నాయి దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అవసరమైతే మళ్లీ లాక్‌డౌన్ పెట్టబోతున్నట్లుగా అక్కడి పాలకులే సంకేతాలు ఇస్తున్నారు. నగరంలో ప్రజలు కరోనా నిబందనలు పాటించడం లేదని, ఇలా అయితే మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని ముంబై నగర మేయర్ కిషోరి పండేకర్ హెచ్చరించారు. ముంబైలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులపై మంగళవారం అధికారులతో చర్చలు జరిపారు. సమావేశం తరువాత మీడియాతో మాట్లాడుతూ మహమ్మారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను మరోసారి హెచ్చరించారు. ‘నగరంలోని ‘ప్రజల గురించి మాకు చాలా ఆందోళన ఉంది. రైళ్లలో ప్రయాణిస్తున్న వారిలో చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదు. అయితే మనం మరోసారి లాక్‌డౌన్‌కి వెళ్లకూడదనుకుంటే ప్రజలు అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించి, ప్ర‌భుత్వానికి స‌హాక‌రించాలి.. ముంబైలో మళ్లీ లాక్‌డౌన్ విధించడమనేది ప్రజల చేతుల్లోనే ఉంది’’ అని మేయర్ అన్నారు. గతంలో మూడు నెలల నిర్బంధ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా మంది నష్టపోయారు. ఇది ఇలా ఉండగా దేశం మొత్తంలో ప్ర‌తి రోజు సుమారు 10వేల పాజిటివ్ కేసులు కొత్త‌గా న‌మోద‌వుతుంటే… అందులో దాదాపు స‌గం కేసులు కేవలం మ‌హారాష్ట్ర, కేర‌ళ నుండే న‌మోద‌వుతుండ‌టంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆందోలన చెందుతున్నాయి.

గన్నవరం పంచాయతీలో ఊహించని ట్విస్ట్... వంశీకి షాక్ తప్పదా   

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశి టీడీపీ తరుఫున గెలిచి తరువాత వైసిపికి మారిన నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమౌతున్న సంగతి తెల్సిందే. వంశి వైసిపిలోకి వెళ్లినా అక్కడ అప్పటికే ఉన్న రెండు గ్రూపుల నాయకులతో నిత్యా ఘర్షణ పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే నియోజకవర్గం పరిధిలోని గన్నవరం పంచాయతీలో రాజకీయ సమీకరణాలు హఠాత్తుగా మారిపోయాయి. ఇక్కడ వైసీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పాలేటి మనోజ్ఞ తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మనోజ్ఞ చేరికతో గన్నవరం పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. తాజాగా మారిన సమీకరణాలతో ఈనెల 21న జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. గత కొంత కాలంగా రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ గా ఉన్న గన్నవరం ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాలి.

పబ్ జీ ఆడుకుంటున్నావా జగన్! విశాఖలో చంద్రబాబు విశ్వరూపం 

స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ నగరం లేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తుంటే ఏపీ  ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. జగన్ ఎక్కడున్నావ్.. పబ్‌జీ ఆడుకుంటున్నావా? విశాఖను దోచుకోవాలనుకుంటున్నారా? అంటూ చంద్రబాబు నిలదీశారు.  ఆనాడు ఉక్కు ఉద్యమంలో ఎవరూ తుపాకులకు భయపడలేదని, 32 మంది ప్రాణత్యాగాలు చేశారని చంద్రబాబు అన్నారు. ఇందిరాగాంధీ అంతటివారు సైతం దిగొచ్చారని తెలిపారు. నాడు అంతమంది ప్రాణత్యాగం చేస్తే, వారి ప్రాణత్యాగాల విలువ తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఓట్లు వేశాక జగన్ రెడ్డికి ప్రజలతో అవసరం తీరిపోయిందని, అందుకే హోదా గురించి మాట్లాడడంలేదని అన్నారు. ప్రజావేదిక నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో విధ్వంస పాలన షురూ చేశారని చంద్రబాబు మండిపడ్డారు.  ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ అని, దీని ద్వారా రూ.33 వేల కోట్ల పన్నులు చెల్లించారని చంద్రబాబు వివరించారు. ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు కూడా పన్నులు కట్టారని తెలిపారు.తాను మెచ్చే నగరం ఎప్పటికీ విశాఖపట్నమేనని ఉద్ఘాటించారు. విశాఖ మంచివాళ్లు ఉండే నగరం అని చంద్రబాబు అభివర్ణించారు. ఇక్కడి ప్రజలు ఎంతో నీతి నిజాయతీపరులని, అందుకే ఈ నగరాన్ని తాను అమితంగా ఇష్టపడతానని వివరించారు. ఒకప్పుడు చిన్నగ్రామంగా ఉన్న విశాఖ నేడు ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉందన్నారు టీడీపీ అధినేత.  ‘విశాఖ ఆత్మను అమ్మితే మీరు ఆమోదిస్తారా? విశాఖ స్టీల్ సిటీని స్టోలెన్ సిటీగా చేస్తే మీరు అంగీకరిస్తారా? విశాఖ ఉక్కపై సీఎం ఎందుకు మాట్లాడటం లేదు. నోరు పడిపోయిందా? విశాఖ ప్రజలు మంచివాళ్ళు అయినా పిరికివారు. విశాఖ ఉక్కు సంకల్పాన్ని అమ్మిస్తే.. ఊరుకోం. విశాఖపట్నం నాకు ప్రాణం.. అందర్నీ అడిగే అమరావతి ప్రకటించాను. విజయసాయిరెడ్డి అంతు చూస్తాం.  ముఖ్యమంత్రి తేలు కుట్టిన దొంగ. రేపు దొంగ స్వామిని కలవటానికి సీఎం వస్తున్నారు. అందరూ నన్ను నువ్వు చేతగానివాడివి... తిట్టలేవు అని అంటారు. విశాఖ స్టీల్ సాధిస్తావా? లేక నా వల్ల కాదు అని రాజీనామా చేసి జైలుకు పోతావో పో’ అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.   విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైజాగ్ లో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన దీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు పలికారు. విశాఖ వచ్చిన చంద్రబాబు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లాను కలిసి సంఘీభావం ప్రకటించారు. దీక్ష శిబిరం వద్ద భారీగా హాజరైన శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.  ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమానికి పల్లా శ్రీనివాసరావు తన దీక్షతో ఊపిరి పోశారని చెప్పారు చంద్రబాబు.  

తెలంగాణ మంత్రి సమైక్య రాష్ట్ర గళం 

తెలంగాణలో కొన్ని రోజులుగా అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన తర్వాత కొత్త కొత్త వాదనలు, ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో వినిపించిన వాదాలు కూడా మళ్లీ  చర్చగా మారాయి. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తుందంటూ లోక్ సభలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటన ప్రకంపనలు స్పష్టిస్తోంది. అసద్ వ్యాఖ్యలపై వివిధ పార్టీల నేతలు తీవ్రంగానే స్పందిస్తున్నారు. హైద్రాబాద్ జోలికి వస్తే ఊరుకునేది లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఆ వివాదం కొనసాగుతుండగానే తెలంగాణ మంత్రి  గంగుల కమలాకర్ మరో బాంబ్ పేల్చారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన గంగుల...  వైఎస్ షర్మిల పార్టీపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న బాణం షర్మిల వస్తోందని..  తర్వాత మెల్లగా జగన్ వస్తాడని చెప్పారు. జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడని గంగుల కామెంట్ చేశారు. తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవని, కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలని, లేకపోతే సమైక్య రాష్ట్రం అవుతుందని గంగుల హెచ్చరించారు. ఆంధ్రా నేతలు కరెంటు, నీళ్లు ఎత్తుకుపోతారని, తెలంగాణకు కేసీఆరే రక్షకుడని గంగుల హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ మంత్రి నోట మళ్లీ సమైక్య రాష్ట్రం నినాదం వినిపించడం ఇప్పుడు చర్చగా మారింది. 

ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో సంచలనం! 

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై  ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్  మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ వేసి స్క్రూట్నీలో ఆమోదం పొందిన అభ్యర్థులు ఎవరివైన బలవంతంగా విత్ డ్రా అయితే వారు ఆర్వోకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్ఈసీ సూచించింది. అటువంటి దరఖాస్తులను పరిశీలించాల్సిందిగా ఆర్వోలకు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అటువంటి నామినేషన్లను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులుగా ప్రకటించాలని ఆదేశించింది. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తన ఉత్తర్వుల్లో ఎస్‌ఈసీ పేర్కొంది. పలు రాజకీయపక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను సోమవారం ప్రకటించింది ఎన్నికల సంఘం.  మార్చి 10న 75 పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగునుంది. గత మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై... కరోనా కారణంగా నిలిచిపోయింది.  గతంలో ఆగిపోయిన దగ్గర నుంచే మళ్లీ ఎన్నికల ప్రక్రియను  కొన‌సాగుతుందని ఎస్ఈసీ ప్రకటించింది. అయితే ఎస్ఈసీ నిర్ణయంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. గత మార్చిలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, తమ అభ్యర్థులను బెదిరించి పోటీ నుంచి విత్ డ్రా చేయించిందని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపించాయి. మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ కొత్త షెడ్యూల్ ఇచ్చి... మొదటి నుంచి నిర్వహించాలని కోరాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం విపక్షాలకు కొంత ఊరట ఇస్తుందనే అభిప్రాయం వస్తోంది.  

ఓట్ల లెక్కింపును వీడియో తీయాల్సిందే! ఎస్ఈసీకి హైకోర్టు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఒక్క ఓటర్ కోరినా ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వాన్ని మొత్తం వీడియో తీయాల్సిందేనని స్పష్టం చేసింది. వీడియో చిత్రీకరణ చేయాలన్న పిటిషన్‌పై మంగళవారం విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు చోటుచేసుకోకుండా ఆ ప్రక్రియను వీడియో తీయాలంటూ ఇటీవల ఎస్ఈసీ ఆదేశాలు ఇవ్వగా, ఆ ఆదేశాలు అమలు జరిగేలా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. టెక్నాలజీ షాకులు చెప్పొద్దని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది.  కృష్ణా జిల్లాకు చెందిన శ్రీపతి నాంచారయ్య, గుంటూరు జిల్లాకు చెందిన ప్రతాప్ నాయక్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు సోమవారం  విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వీడియోగ్రఫీ విషయంలో ఎస్ఈసీ ఆదేశాలు అమలు కావడంలేదని, కనీసం మూడు, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లోనైనా ఓట్ల లెక్కింపును వీడియో తీసేలా ఆదేశించాలని కోరారు. ఈ విచారణలో ఎస్ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. వీడియో తీసే అంశంలో ఈ నెల 13న ఇచ్చిన ఉత్తర్వులకు రెండ్రోజుల తర్వాత సవరణ ఉత్తర్వులు కూడా జారీ చేశామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక పరమైన ఇబ్బందులు  ఉండడంతో అక్కడ పూర్తిగా సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యం కాదని కోర్టుకు వివరించారు. దాంతో జస్టిస్ సోమయాజులు ధర్మాసనం స్పందిస్తూ, సున్నితమైన, అత్యంత సున్నితమైన ప్రాంతాలను ఎలా వర్గీకరిస్తారంటూ ప్రభుత్వాన్ని, ఎస్ఈసీని ప్రశ్నించింది. తగిన వివరాలు అందించాలంటూ ఈ కేసును మంగళవారానికి  వాయిదా వేసింది. దీనిపై హైకోర్టు తీర్పునిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలని ఏ ఒక్క ఓటరు కోరినా, ఆ మేరకు వీడియో చిత్రీకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. టెక్నాలజీ సాకులు చెప్పొద్దని హితవు పలికింది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును వీడియో తీయాలంటూ ఈ నెల 13న ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని ఆదేశించింది. అదే సమయంలో, ఎన్నికలు పక్షపాతానికి తావులేకుండా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసీదేనని పేర్కొంది. 

పుదుచ్చేరి ప్రభుత్వానికి గండం? 

రాష్ట్రం ఏదైనా, అది కేంద్ర పాలిత ప్రాంతమే అయినా రాజకీయం మాత్రం ఒకటిగానే ఉంటుంది.ఫిరాయింపులు ఎక్కడైనా ఒక్కలానే జరుగ్తుఅయి. ఇందుకు తాజా ఉదాహరణ పుదుచ్చేరి. కొద్ది కాలం క్రితం మధ్య ప్రదేశ్’లో అంతకు ముందు మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఫిరాయింపుల ప్రభావంతో ప్రభుత్వాలు కూలిపోవడం చూశాం. ఇప్పుడు మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరిలో అదే పరిస్థితి తలెత్తింది. బొటాబొటి మెజారిటీతో ఇంతకాలం ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చిన ముఖ్యమంత్రి నారాయణ స్వామి  ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీలో పడింది.  పుదుచ్చేరి శాసన సభలో ముగ్గురు నామినేటెడ్ సభ్యులతో కలిపి మొత్తం సభ్యుల సంఖ్య 33. ఐదు సంవత్సరాల క్రితం 2016లో 30 స్థానాలకు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు గెలుచుకుంది. మరో ఇద్దరు డీఎంకే సభ్యుల మద్దతుతో నారాయణ స్వామి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.అయితే ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో, కేవలం పది రోజుల వ్యవధిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.  ఇదిలా ఉంటే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ఉద్దేశించిన రాహుల్ గాంధీ పర్యటనకు ఒక రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. గత నెల 25న నమశివాయం, తీప్పయింజన్‌ అనే ఇద్దరు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సోమవారం ఒకరు, మంగళవారం మరొకరు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బలం 15 నుంచి 11కు పడిపోయింది.  ఎమ్మెల్యేల ఫిరాయింపులతో అప్రమత్తమైన ముఖ్యమత్రి నారాయణ స్వామి.. హడావుడిగా మంత్రి వర్గ సమావేం ఏర్పాటు చేశారు. అసెంబ్లీని  రద్దుచేసి  ముదస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో నారాయణ స్వామిఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడి సహకరిస్తారా లేక కేంద్ర పాలనకు సిఫార్సు చేస్తారా అనేది కీలకంగా మారనుంది. 

హిట్లర్ పద్దతులను ఫాలో అవుతున్నారు..ఇలాగైతే కష్టమే...

అయోధ్యలో శ్రీ రాముడి మందిరం నిర్మాణం కోసం ఒకపక్క భక్తులు స్వచ్చందంగా విరాళాలు ఇస్తుండగా .. మరోపక్క ఈ విరాళాల సేకరణ కోసం కొందరు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా కర్ణాటకలో రామాలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వని ఇళ్లకు మార్క్ పెడుతున్నారని అక్కడి యడియూరప్ప సర్కార్‍‌పై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా అయన ఆర్ఎస్‌ఎస్, బీజేపీల‌ను జర్మనీలోని నాజీలతో పోల్చారు. ఈ వ్యవహారంపై తాజాగా ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై వరుస ట్వీట్లలో తీవ్రంగా మండి పడ్డారు. కుమారస్వామి తన తాజా ట్వీట్లలో "హిట్లర్ పాలనలో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు అనుసరించిన విధానమే ఇప్పుడు కర్ణాటకలో అనుసరిస్తున్నారు. రామాలయానికి విరాళాల సేకరిస్తున్న వారు.. ఇళ్ల వద్ద వేరువేరుగా మార్కింగ్ చేస్తున్నారు. ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదని గుర్తించేందుకే ఈ మార్కింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది" అని ఒక ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. ఈ దేశంలో ఏ ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే పరిస్థితి కనిపించడం లేదని.. ఒకవేళ ప్రభుత్వ అభిప్రాయాలను మీడియా కూడా సమర్ధిస్తూ పోతే ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో, సామాన్యుడి పరిస్థితి ఏమి కానుందో కూడా ఊహించడం కష్టమని" అయన వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ నేత‌లంతా క‌లిసి రామ మందిర నిర్మాణానికి విరాళం ఇవ్వ‌ని వారంద‌రి ఇంటిని ప్ర‌త్యేకంగా మార్క్ చేస్తున్నార‌ని అయన అన్నారు. అసలు ఇలాంటి మార్కింగ్‌ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని కుమారస్వామి పేర్కొన్నారు. జర్మనీలో నాజీలు ఏం చేశారో ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు అదే చేస్తోందని విమర్శించారు. జర్మనీలో నాజీ పార్టీ ఏర్పాటు చేసినప్పుడే ఆర్ఎస్ఎస్ పుట్టిందని, ప్రజలు ఎవ్వరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేని అప్రకటిత ఎమర్జెన్సీ ప్రస్తుతం దేశంలో ఉందని ఆరోపించారు.దీనిపై దేశం మొత్తం చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఉద్యమ పార్టీ నుంచి ఎన్నికలల పార్టీగా..! టీఆర్ఎస్ 20 ఏండ్ల ప్రస్థానం 

తెలంగాణ రాష్ట్ర సమితి  మరో రెండు నెలలలో 20 నిండి 21లోకి అడుగుపెడుతోంది. ఒక రాజకీయ పార్టీ చరిత్రలో రెండు దశాబ్దాలు తక్కువ కాలం కాదు. అందులోను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఉద్యమ పార్టీగా అవతరించిన పార్టీ ఇంతలోనే లక్ష్యాన్ని చేరుకొని, కొత్తగా ఏర్పడిన  తెలంగాణ రాష్ట్ర అధికార పగ్గాలను చేపట్టడం మాములు విషయం కాదు.అదొక అసాధరణ విజయం.  టీడీపీ స్థాపించి సంవత్సరం తిరగకుండా అధికారంలోకి వచ్చిన ఎన్టీఅర్’ది ఓ చారిత్రక విజయం అయితే  కొంత ఎక్కువ సమయం తీసుకున్నా ఏకంగా రాష్ట్రాన్ని సాధించి, కొత్త రాష్ట్రంలో వరుసగా రెండవసారి అధికార పగ్గాలను చేపట్టిన కల్వకుట్ల చంద్రశేఖర రావు అనే కేసీఆర్ సాధించిన విజయం నిస్సందేహంగా అంతకు మించిన చారిత్రక విజయం.   2001 ఏప్రిల్  27 న కొండా లక్ష్మణ బాపూజీ ఆశీస్సులతో జలదృశ్యంలో పురుడు పోసుకున్న తెరాసకు ఇప్పటి టీఆర్ఎస్ ఒకటేనా అంటే, కాదు.స్వాతంత్ర పోరాటానికి సారధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీకి అనంతరం సుదీర్ఘ కాలంపాటు దేశాన్ని పాలించిన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యత్యాసం ఉందో, అంతే వ్యత్యాసం ఉంది.దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే మహాత్మా గాంధీ కాంగ్రెస్’ను రద్దు చేయమని సూచించారు.ఇతర నాయకులు గాంధీ ప్రతిపాదనని పక్కన పెట్టారు. తెలంగాణ బాపూజీ కొండలక్ష్మణ్ బాపూజీ అలాంటి ప్రతిపాదన చేయలేదు గానీ, కేసీఆర్ పార్టీని రద్దు చేయక పోయినా పార్టీ స్వరూప,స్వభావాలను మాత్రం మార్చి వేశారు.ఎన్నికలల పార్టీగ  మార్చి వేశారు. కుటుంబ పార్టీగా తీర్చి దిద్దారు.   నిజానికి  ఎంతమందికి గుర్తుందో ఏమో గానీ, 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన, తెరాస అధికారంలోకి వచ్చిన సందర్భంలో, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని హోదాలో కేసీఆర్, ఉద్యమ పార్టీ అధ్యాయం ముగిసిందని ప్రకటించారు. ఇక పై తెరాస ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీగా వ్యవవహరిస్తుందని స్పష్టం చేశారు. గడచిన ఆరేడేళ్ళలో తెరాస  మరో అడుగు ముందుకేసింది, ఫక్తు పదహారణాల కుటుంబ పార్టీగా రూపాంతరం చెందిందని, ఉద్యమ పార్టీలో కీలక పాత్రను పోషించిన నాయకులు ఆరోపిస్తున్నారు.  ఉద్యమ పార్టీ నేతగా, పదవులు ఆశించను, రాష్ట్రానికి కావలి కుక్కలా ఉంటా ... దళితుని ముఖ్యమంత్రి చేస్తా... అని ప్రకటించిన కేసీఆర్, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఒట్టుతీసి గట్టున పెట్టారు. ముఖ్యమంత్రి గద్దె నెక్కారు. అంతే కాదు వారసుని సిద్ధం చేశారు. కొడుకు కేటీఅర్’కు పార్టీ పగ్గాలు అప్పగించారు. కేటీఆర్ పట్టాభిషేకానికి కూడా సర్వం సిద్దమైంది. అయితే, ముహూర్తబలం సరిగా లేకనో ఏమో, కథ కాస్త అడ్డం తిరిగింది.  కానీ ఈ రోజు కాకపోతే రేపు కేసీఆర్ వారసుడు కేటీఆరే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కరలేదు. అయితే అది ఎప్పుడు అన్నదే  ప్రస్తుతానికి ప్రశ్న. అలాగే మరో రెండు నెలలలో జరిగే తెరాస ద్విశతాబ్ది ఉత్సవాలలో అయినా వారసుని పట్టాభిషేకం ఉంటుందా ...ఈ లోగా ఇంకాఏమైనా జరుగుతుందా ... కుటుంబ పార్టీలోంచి సామాజిక తెలంగాణ నినాదంతో మరో ఉద్యమ పార్టీ పుట్టుకొస్తుందా? ఇవ్వన్నీ కూడా ప్రస్తుతానికి ఎన్నో కొన్ని డాలర్ల ప్రశ్నలనే అంటున్నారు, విజ్ఞులు,విశ్లేషకులు.

మంత్రిపై డాక్టర్ షాకింగ్ కామెంట్స్ !

అతనో సీనియర్ డాక్టర్. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరిండెంట్ గా పని చేస్తున్నారు. సడెన్ గా ఆ డాక్టరును బదిలీ చేశారు. డిప్యూటేషన్ పై మరో ప్రాంతానికి పంపించారు. తనను బదిలీ చేశారన్న విషయం తెలిసి ఆ సూపరిండెంట్  షాకయ్యారు. 16 నెలల్లో రిటైర్ కాబోతున్న తనను.. కక్ష పూరితంగానే ట్రాన్స్ ఫర్ చేశారంటూ  ఆవేదన వ్యక్తం చేశారు,  ఏకంగా మంత్రినే టార్గెట్ చేశారు. తన బంధువుకు పోస్టింగ్ ఇవ్వడం కోసం తనను .. అకారణంగా బదిలీ చేయించారంటూ మంత్రిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.    మహబూబా బాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ భీమ్ సాగర్ బదిలీ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. తనను బదిలీ చేయడం పట్ల డాక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్‌పై డాక్టర్ ఆరోపణలు గుప్పించారు. మంత్రి సత్యవతి రాథోడ్ తనను టార్గెట్ చేసి మానసికంగా వేధించారని..కావాలనే తనను హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించారని విరుచుకుపడ్డారు. ఇక్కడ వైద్యుడిగా పనిచేసే మంత్రి కుమారుడు నెలలో  వారం రోజుల మాత్రమే డ్యూటీకి వస్తాడని తెలిపారు. నెల రోజుల జీతం ఇవ్వాలని అధికారులపై వత్తిడి తెస్తాడన్నారు. అలా ఇవ్వకపోవడంతోనే తనను టార్గెట్ చేశారని డాక్టర్ భీమ్ సాగర్  ఆరోపించారు.  ఏ తప్పు చేయకున్నా తనను అకారణంగా శిక్షించారన్నారు డాక్టర్ భీమ్ సాగర్ .  సీబీఐ, సీబీసీఐడీ విచారణకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.జిల్లా హాస్పిటల్ సూపరిండెంట్ బదిలీయే రాజకీయ వివాదంగా మారగా.. ఆయన చేసిన కామెంట్లు మరింత కలకలం రేపుతున్నాయి. అంతేకాదు మంత్రిని టార్గెట్ చేసిన డాక్టర్ భీమ్ సాగర్.. టీఆర్ఎస్ పార్టీకే చెందిన మాజీ మంత్రి రెడ్యా నాయక్ , ఎంపీ మాలోతు కవిత, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనకు సహకరించారని చెప్పారు. దీంతో సూపరిండెంట్ బదిలీ వ్యవహారం టీఆర్ఎస్ లోనూ రచ్చ రాజేసే సూచనలు కనిపిస్తున్నాయి. 

డ్యూటీలోనే కానిస్టేబుళ్ల మందు పార్టీ!  

ఫ్రెండ్లీ పోలీస్.. ఇది తెలంగాణ పోలీసుల నినాదం. ఈ విధానం గురించే దేశ వ్యాప్తంగా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది కేసీఆర్ సర్కార్. అయితే  కొందరు హైదరాబాద్ పోలీసులు మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పాటు పార్టీ పోలీసింగ్ కూడా చేస్తున్నారు. తమ కార్యాలయాన్నే  ఓపెన్ బార్ గా మార్చేశారు. విధులను పక్కన పెట్టి దర్జాగా మందు కొట్టారు. షాడో పోలీస్ దీన్ని చిత్రీకరించడంతో వాళ్ల మందు బండారం బయటపడింది.  నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు.. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారు డ్యూటీలో ఉండగానే మందు పార్టీ చేసుకున్నారు.  ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే ఫుల్లుగా మందు కొట్టారు. ఈ ఘటననంతా షాడో పోలీస్ రికార్డ్ చేశారు. అయితే ఆ షాడో పోలీస్‌పై మద్యం సేవించిన ముగ్గురు కానిస్టేబుళ్లు దాడికి పాల్పడ్డారు. ఎస్బీ రిపోర్ట్ ఆధారంగా ముగ్గురు కానిస్టేబుళ్లను సీపీ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు. కానిస్టేబుళ్ల వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.

కేసీఆర్ ఆంధ్రా బిడ్డ.. షర్మిల  తెలంగాణ బిడ్డ! టీకాంగ్రెస్ నేత సంచలనం  

వైఎస్ షర్మిల కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. కొత్త పార్టీ కోసం  షర్మిల చకచకా ఏర్పాట్లు చేసుకుంటుండగా.. ఆమెకు మద్దతు కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న నాయకులు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత మాగం రంగారెడ్డి లోటస్ పాండ్ వెళ్లి షర్మిలతో సమావేశమయ్యారు. అంతేకాదు షర్మిలతో సమావేశం తర్వాత హాట్ కామెంట్స్ చేశారు మాగం రంగారెడ్డి.  వైఎస్ షర్మిల తెలంగాణ బిడ్డ అని.. ఇదే గడ్డమీద జన్మించింది అన్నారు మాగం. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బిడ్డకాదని చెప్పారు. ఎంపీ  కే.కేశవరావు తండ్రి కూడా ఆంధ్రా నుంచి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు రంగారెడ్డి. తెలంగాణలో పనిచేసేందకు వస్తున్న మహిళను అందరూ స్వాగతించాలని సూచించారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజం అని.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా కేరళకు చెందిన మహిళ అని గుర్తుచేశారు.షర్మిలపై అవాకులు చెవాకులు పేలవద్దని వార్నింగ్ ఇచ్చారు మాగం రంగారెడ్డి. గతంలో వైఎస్ తో లబ్ది పొందిన వారు కూడా ఇప్పుడు షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.  తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న మాగం రంగారెడ్డి  తెలంగాణలో పార్టీకి ఏర్పాటుకు సన్నహాలు చేస్తున్న షర్మిలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఆమెతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన కూడా తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానంతో షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశానని ఆయన చెబుతున్నా.. షర్మిలకు రాజకీయంగా రంగారెడ్డి అండగా ఉండబోతున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కన్న బిడ్డను బ్లేడ్ తో కోసేసింది! రంగారెడ్డి జిల్లాలో కసాయి తల్లి 

అమ్మంటే దేవతకి ప్రతిరూపం అంటారు. అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఎక్కడా ఉండదంటారు. బిడ్డలను లాలించి, ప్రేమించడమే అమ్మలకు తెలుసు. కానీ ఓ తల్లి మద్యం మత్తులో కసాయిగా మారింది. కన్నకొడుకుపైనే కిరాతకంగా వ్యవహరించింది. పీకల దాకా మద్యం తాగిన ఆ మహా తల్లి... మద్యం మత్తులో,  ఏం చేస్తుందో కూడా స్పృహ లేకుండా  కుమారుడిపై బ్లేడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో  జరిగిందీ ఈ దారుణ ఘటన.  రంగారెడ్డి జిల్లా హైదర్షాకోట్ మండలం గంధంగూడలో తాగిన మైకంలో ఓ తల్లి కుమారుడిని బ్లేడ్‌తో విచక్షణారహితంగా కోసి గాయపర్చింది. గాయాల బాధను బరించలేని బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెళ్లారు. అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను అడ్డుకుని, బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా తల్లి మద్యం మత్తులో ఉండే ఈ ఘాతుకానికి పాల్పడ్డినట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించారు. దాడికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

వేధించిన కుర్రాళ్లకు బుద్ధి చెప్పిన ఎద్దు..   వైరల్ అవుతున్న వీడియో

మూగ జీవాల జోలికి వెళ్ళవద్దు.. వాటిని హింసిస్తే భగవంతుడు కూడా క్షమించడు అంటారు మన పెద్దలు. అయినా కొంతమంది ప్రబుద్ధులు తమ రాక్షస ఆనందం కోసం అమాయకమైన జంతువులను హింసిస్తూనే ఉంటారు. ఇటువంటి వారు మనకు మంచి చేసే మూగజీవాల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుంటారు. మనదేశంలో ఎన్ని జంతు పరిరక్షణ చట్టాలు ఉన్నా ఇలాంటి వారి నుండి ఈ మూగ ప్రాణులను మాత్రం కాపాడలేకపోతున్నాయి. అయితే ఇలాంటి వారిపైకి ఒక్కోసారి ఆ జంతువులే తిరగబడి తమను వేధిస్తున్న వారిని శిక్షించిన ఘటనలు కొన్ని మనం చూశాం తాజాగా ఇలాంటి ఘటన కు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను గమనిస్తే.. ఇద్దరు యువకులు చెట్టు కొమ్మల మధ్య ఓ ఎద్దు తలను ఉంచి దాన్ని తీవ్రంగా వేధించారు. దాని కొమ్మలను పట్టి లాగుతూ దాని తలకు గాయమయ్యేలా చేసి వారు రాక్షసానందం పొందారు. ఇలా ఆ యువకులు చాలాసార్లు చేశారు. అంతేకాకుండా తమ క్రూరత్వాన్ని వారు వీడీయో కూడా తీశారు. అయితే ఆ యువకుల హింస మితిమీరడంతో ఆ ఎద్దు ఆగ్రహించి.. ఒక్కసారిగా వారి మీదకు దూసుకెళ్లింది. అంతేకాకుండా ఇద్దరిని తన కొమ్ములతో గుద్ది కింద పడేసింది. అక్కడి నుండి వేగంగా పరుగెత్తి తనను తాను రక్షించుకుంది. ఈ వీడియోను అవనీశ్ శరణ్​ అనే ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "మంచితనానికి ఇవి రోజులు కావు" అంటూ అయన ఆ వీడియోకు మంచి క్యాప్షన్ కూడా ఇచ్చారు . తాజాగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనకు పాల్పడ్డ యువకులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేధించిన యువకుల తిక్కను ఆ ఎద్దు బాగా కుదిర్చిందని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. దేశంలో ఎక్కడో ఒక చోట కొంత మంది శాడిస్టులు ఇలా జంతువులను వేధించడం మామూలైపోయిందని, ఇలా చేసే వారికి తప్పకుండ శిక్ష పడాల్సిందేనని కామెంట్లు పెట్టారు.

సెంచరీ కొట్టిన పెట్రోల్..  హెల్మెట్ పైకి ఎత్తి నిరసన! 

దేశంలో చమరు ధరలు అకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో  ఇప్పటికే పెట్రోల్ రేట్ సెంచరీ మార్క్ దాటగా.. తాజాగా  భోపాల్‌లో ప్రీమియం పెట్రోల్ ధర లీటరు వంద రూపాయలు  దాటేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇతర నగరాల్లోనూ ఇంధనం ధరలు సెంచరీ మార్క్ దాటేశాయి. పెట్రోల్ ధర వంద రూపాయలు దాటేయడంపై వాహనదారులను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భోపాల్ లో ఓ వాహనదారుడు వినూత్న నిరసన తెలిపారు. ఒక పెట్రోల్ పంప్ వద్ద ఒక చేత్తో హెల్మెట్, మరో చేతితో బ్యాట్ ధరించి 'సెంచరీ' సంకేతమిచ్చాడు.         పెట్రోల్, డీజిల్ ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటూ ఆయిల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు చెబుతుండటంతో వినియోగదారుల గుండెల్లో మరిన్ని రైళ్లు పరిగెడుతున్నాయి. చమురు ధరలపై సోషల్ మీడియాలో కుప్పలు తెప్పులుగా పోస్టులు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు తీవ్రంగా స్పందిస్తున్నారు. 'కఠోర శ్రమ, పోరాటంతో ఎట్టకేలకు పెట్రోల్‌ సెంచరీ చేసింది' అంటూ ఒక ట్విట్టర్ యూజర్ భోపాల్ యువకుడి ఫోటోను షేర్ చేశాడు. పెట్రోల్ ప్రైజ్ అంటూ దానికి హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.పెట్రోల్ ధర రూ.100కు చేరువైనందున భారత్ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతోందంటూ ట్విట్టర్ లో వ్యంగ్యోక్తులు సంధించాడు. 

వారి కోసం నా ప్రాణమైనా ఇస్తా... బాలకృష్ణ సంచలనం

ఏపీలో జరుగుతున్న అరాచకాలపై టీడీపీ నేత, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ మద్దతుదారులపై అధికార వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. అసలు నామినేషన్లు కూడా వేయవద్దని బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామాలలోని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ హిందుపూరానికి వెళ్లి.. టీడీపీ మద్దతుదారులు, వారి కుటుంబాలను, కార్యకర్తలను పరామర్శించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "‘కార్యకర్తల కోసం నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. వారికోసం నా ప్రాణాన్ని ఫణంగా పెడతా. రాష్ట్రమంతా వైసిపి నాయకులు భయాందోళనలు సృష్టిస్తున్నారు..వాళ్ళ అఘాయిత్యాలకు అడ్డుకట్టవేసే వాళ్లు లేరనుకుంటున్నారు. దీనిపై నేను హెచ్చరిస్తున్నా.. జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే దానికి రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటాం. కార్యర్తలు అందరు సమాయత్తంగా ఉండండి. ఒకాయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ ఉక్కు కారాగారం అంటాడు. సీబీఐ కేసులలో ఇరుక్కుని జైలుకు వెళ్లి కారాగారం పదం బాగా అలవాటైంది. పోటీచేసే అభ్యర్థుల కుటుంబీకులు ఆఘాయిత్యాలకు పాల్పడేలా అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాష్ట్రంలో గాలి పీల్చే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది" అని బాలకృష్ణ వాసిపై సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ అరాచకాలు పెరిగిపోతుండడం పై గత కొంత కాలంగా బాలకృష్ణ ఘాటైన వ్యాఖ్యలు చేస్తుండడంతో ఒక పక్క వైసిపి నేతలు కొంత వెనక్కు తగ్గుతుండగా.. మరోపక్క టీడీపీ కేడర్ లో మానసిక స్థైర్యం పెరుగుతోంది.

టీడీపీ నేత దీక్ష భగ్నం! విశాఖలో హై టెన్షన్

విశాఖపట్నంలో హై టెన్షన్ నెలకొంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆరు రోజులుగా పల్లా ఆమరణ దీక్ష చేస్తున్నారు. పల్లాకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం విశాఖ రానున్నారు. చంద్రబాబు నగరానికి రావడానికి ముందే పోలీసులు పల్లా దీక్షను భగ్నం చేశారు. దీక్ష శిబిరం నుంచి ఆయనను బలవంతంగా కృషి ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తరలింపును అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలోనే పల్లా దీక్షను కొనసాగిస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. పల్లా పరిస్ధితిని చూసి మహిళా కార్యకర్తలు కంటతడిపెడుతున్నారు. చంద్రబాబు వస్తున్నారనే దీక్షను భగ్నం చేశారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాసరావుకు అమరావతి రైతులు మద్దతు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి విశాఖ చేరుకున్న మహిళా రైతులు నేరుగా దీక్షా శిబిరానికి వెళ్లి శ్రీనివాస్ రావు మద్దతు ప్రకటించి, సంఘీభావం తెలిపారు.