టీఆర్ఎస్ టార్గెట్ గానే షర్మిల పార్టీ?
posted on Feb 20, 2021 @ 3:53PM
తెలంగాణలో రాబోతున్న వైఎస్ షర్మిల పార్టీ రాజకీయ కాక రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి.. తెలంగాణలో కొత్త పార్టీ పెడుతుండటం ఆసక్తిగా మారింది. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంపై ఎన్నో చర్చలు సాగుతున్నాయి. షర్మిల వెనక ఎవరున్నారు? ఆమె టార్గెట్ ఎవరు? షర్మిల పార్టీతో ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం? వంటి అంశాలు తెర పైకి వస్తున్నాయి. షర్మిలతో కేసీఆరే పార్టీ పెట్టిస్తున్నారని కొందరు.. బీజేపీ పెద్దలు షర్మిల వెనక ఉన్నారని మరికొందరు చెబుతున్నారు. అయితే తాజాగా షర్మిల వేస్తున్న అడుగులు, ఆమె ప్రసంగాలతో షర్మిల టార్గెట్ ఎవరో క్లారిటీ వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లక్ష్యంగానే షర్మిల పార్టీ ఉండబోతుందని చెబుతున్నారు. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో షర్మిల నోటి నుంచి ‘జై తెలంగాణ’ నినాదం రావడంతో ప్రధానంగా టీఆర్‌ఎస్‌పైనే ఆమె గురిపెట్టినట్లు అర్థమవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని నిర్ణించుకోవాలనే యోచనలో షర్మిల ఉన్నట్లు చెబుతున్నారు.
వైఎస్ షర్మిల జై తెలంగాణ నినాదం చేసి అందరిని ఉత్సాహ పరిచారు. మూడు సార్లు జై తెలంగాణ అంటూ నినదించిన షర్మిల.. జై తెలంగాణ జై వైఎస్సార్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పేదలు సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రజలకు చేయాల్సినవన్నీ ప్రభుత్వం చేస్తోందా? అని అడిగారు. తెలంగాణలో ఉన్న సమస్యలన్నింటిపై మాట్లాడదామని చెప్పారు షర్మిల. వైఎస్సార్ పాలనను గుర్తు చేశారు షర్మిల. తెలుగు ప్రజల గుండెళ్లో వైఎస్ ఇంకా నిలిచి ఉన్నారని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో మళ్లీ రాజన్న కాలంనాటి స్వర్ణయుగాన్ని తెచ్చుకుందామన్నారు జగన్ సోదరి.
షర్మిల నోటి నుంచి ‘జై తెలంగాణ’ అనే మాట వినిపించడంతో నేతలు పోటీగా నినాదాలు చేశారు.
తెలంగాణలో బలమైన ముద్ర వేయాలనే షర్మిల ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల షర్మిల అనుచరుడు కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్, ఉమ్మడి ఏపీలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కొండా ప్రకటనలు, షర్మిల తాజా ప్రకటనతో కేసీఆర్ సర్కార్ టార్గెట్ గానే కొత్త పార్టీ వస్తుందన్న అనుమానాలకు బలం వస్తోందని చెబుతున్నారు.