పీఆర్వో పోస్ట్ ఊస్ట్.. కోల్డ్ వారే కొంపముంచిందా?
posted on Mar 3, 2021 @ 2:38PM
గటిక విజయ్ కుమార్. పేరు చెబితే వెంటనే గుర్తుకురాకపోవచ్చు కానీ, సీఎం కేసీఆర్ పీఆర్వోగా చాలా మందికి తెలుసు. ప్రెస్ మీట్లలో కేసీఆర్ వెనకే ఉంటాడు. సైలెంట్ గా మీడియాను కోఆర్డినేట్ చేసుకుపోతుంటాడు. CMO, సీఎం తరఫున ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయడం అసలు పని. అయితే, మనోడు అసలుతో పాటు కొసరు పనులు కూడా బాగానే చేస్తుండే వాడట. ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా ఇటీవలే గుర్తించారట. దీంతో, ఏడేళ్లుగా సీఎంవోకు పీఆర్వోగా ఉన్న విజయ్ కుమార్ పై వేటు పడింది. అతన్ని పీఆర్వో పోస్ట్ నుంచి తీసేశారు. విజయ్ కుమార్ మాత్రం తాను రాజీనామా చేశానని చెబుతున్నాడు.
ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న విజయ్ ను సడెన్ గా ఎందుకు తీసేశారనేది చర్చనీయాంశంగా మారింది. పీఆర్వోగా ఉండే విజయ్ కుమార్ సీఎంవో కేంద్రంగా అనేక పనులు చక్కబెట్టేవారని అంటున్నారు. అందులో అనేకం ఆయన సొంత పనులు కూడా ఉండేవట. బాగానే వెనకేసాడట. అలాంటి వారికి ఇలాంటివన్నీ కామనే అయినా.. కేసీఆర్ కు కోపం రావడానికి అసలు కారణం వేరేనట. విజయ్ చేస్తున్న రాజకీయ కుట్రలే అతని పదవిని పీకేసిందని అంటున్నారు.
నిత్యం కేసీఆర్ వెంటే ఉండే విజయ్.. అంతర్ఘత చర్చలు, మంత్రాంగాలను లీక్ చేసే వాడని కొందరు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆ లీకులు మరింత పెరిగాయని.. ఆ విషయం గుర్తించిన సీఎమ్వో విజయ్ పై యాక్షన్ తీసుకుందని అంటున్నారు. అయితే, అసలు కారణం అది కాదని.. చిన బాస్ కేటీఆర్ కు వ్యతిరేకంగా విజయ్ వ్యవహరిస్తున్నారని అందుకే కేసీఆర్ కు కోపం వచ్చిందని చెబుతున్నారు. ఇటీవల వరకూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి మార్పు అంశంలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఇంటర్నల్ గా ఆయన చేసిన కామెంట్లు అసలుకే ఎసరు పెట్టాయని టాక్. ఇక, కేటీఆర్ ను కాదని ఎంపీ సంతోశ్ కుమార్ కు అనుకూలంగా విజయ్ మంత్రాంగం నడిపిస్తుడని.. ఆ విషయం వెలుగుచూడటంతో పీఆర్వోపై వేటు పడిందని సమాచారం.
సీఎంవో పీఆర్వో పోస్ట్ అంటే మామూలు విషయం కాదు. గతంలో పలు మీడియా సంస్థలకు వరంగల్ లో జర్నలిస్టుగా పని చేశాడు విజయ్ కుమార్. కేసీఆర్ జరిపిన ఉద్యమంపై 'జ్వలిత దీక్ష' పుస్తకం కూడా రాశాడు. విజయ్ పని తీరుకు మెచ్చి సీఎంవోలో పీఆర్వోగా అవకాశమిచ్చారు సీఎం కేసీఆర్. విజయ్ కోసం అనేక నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ముందుగా విజయ్ కుమార్‌ను తెలంగాణ విద్యుత్ శాఖలో జనరల్ మేనేజర్ హోదాలో నియమించారు. ఆయనకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు రూపొందించి, ఆ జాబ్ నోటిఫికేషన్ జారీ చేశారనే విమర్శలు వచ్చాయి. అక్కడి నుంచి డిప్యూటేషన్ పై సీఎంవో పీఆర్వోగా తీసుకొచ్చారు. పీఆర్వోగా ఏడేళ్లు అంతా తానై వ్యవహరించారు. ఇప్పుడు యవ్వారం బెడిసికొట్టడంతో పీఆర్వో పోస్ట్ ఊడిపోయింది. కొన్ని కారణాలతో తన పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు విజయ్ కుమార్. పీఆర్వో ఉద్యోగంతో పాటు ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ జాబ్ కి కూడా రాజీనామా చేశారు. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే విజయ్ కుమార్ రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రగతి భవన్ లో ప్రక్షాళన మొదలైందా? అనే చర్చ కూడా జరుగుతోంది.