కేంద్రం పై కేటీఆర్ మరో బుల్లెట్..
posted on Mar 5, 2021 @ 2:20PM
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు,రాష్ట మంత్రి కే.తారక రామా రావు గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పై వరస అస్త్రాలను సంధిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాగిస్తున్న వేస్తున్న బాణాలతో పాటుగా, అధికార కార్యక్రమాలు, ఇతర వేదికలు ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని అస్త్రాలుగా చేసుకుని బాణాలు సంధిస్తున్నారు. ఇతవరకు ఐటీఐఆర్, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అంశాలను మాత్రమే పదే పదే ప్రస్తావిస్తూ వచ్చిన కేటీఆర్, తాజాగా మరో బుల్లెట్ పేల్చారు. బుల్లెట్ రైలు గుజరాత్‌కేనా? ..హైదరాబాద్‌కు అర్హత లేదా? అంటూ సీఐఐ వార్షిక సమావేశం వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే,
వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయాన్నీ మరోమారు ప్రస్తావించారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం, 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామని, అయినా కోచ్ ఫ్యాక్టరీ రాలేదన్నారు. మేకిన్ ఇండియా అంటున్న కేంద్రం.. రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రియల్ జోన్ కూడా కేటాయించలేదన్నారు. అలాగే,, ఐటీఐఆర్ కారిడార్‌ను రద్దు విషయాన్ని మళ్ళీ ప్రస్తావించారు.
అయితే, కేటీఆర్’ హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికలలో లబ్ది పొందేందుకే, ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారని, బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు.ఐటీఐఆర్ ‘ రాష్ట్రానికి రాక పోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేసపూర్వకంగానే ప్రాజెక్ట్’ను అడ్డుకుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇక అక్కడి నుంచి ఐటీఐఆర్ విషయంలో తెరాస, బీజేపీ నాయకుల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు సాగుతూనే ఉన్నాయి. మరో వంక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఐటీఐఆర్’విషయంలో తెరాస, బీజేపీ దొంగాటలు ఆడుతున్నాయని, ఆ ఇద్దరు దోషులే అని తేల్చేశారు.
ఇక అసలు విషయంలోకి వస్తే 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజదాని, హైదరాబాద్ సహా మరో కొన్ని నగరాల్లో ఐటీఐఆర్ ప్రాజెక్టులు మంజూరు చేసింది. కానీ, కాంగ్రెస్ హయాంలో షరా మాములుగా అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మొత్తానికి మొత్తం ఐటీఐఆర్’ ప్రాజెక్టులను కట్టకట్టి అటకెక్కించింది. ప్రాజెక్ట్ మంచీ చెడులు,ప్రయోజనాలు,ఉపాథి అవకాశాలు పక్కన పెడితే, ఐటీఐఆర్’ ప్రాజెక్ట్ ఏపీ ప్రత్యేకక హోదాలాగా ముగిసిన అధ్యాయం. ఇప్పుడదొక మృత ప్రాజెక్ట్, ఇప్పుడు ఆ మృత ప్రాజెక్ట్కు పైనే ఇంత రాజకీయం సాగుతోంది. అలాగని,కేంద్రం ప్రాజెక్టును అటకేక్కించిన విషయం రహస్యమా అంటే కాదు, కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో చాలా స్పష్టంగా, ఐటీఐఆర్ ప్రాజెక్టులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు, అదే విషయాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామ రావు, మీడియాకు వివరించారు. అంటే ఆత్మవంచన, పరనింద తప్ప ఈ సవాళ్ళు,ప్రతి సవాళ్ళు వలన రాష్ట్రానికి జరిగే ప్రయోజనం శూన్యం.