శ్రీధరన్ ఓకే.. అద్వానీ, జోషీ నాట్ ఓకేనా?
posted on Mar 6, 2021 @ 10:42AM
2014 సార్వత్రిక ఎన్నికలు. బీజేపీ అఖండ విజయం. ప్రధాని రేసులో అద్వానీ, మోదీ. వయసు మీద పడిందనే ముద్రతో అద్వానీని పక్కన పెట్టేశారు కమలనాథులు. బీజేపీలో 75 ఏళ్లు పైబడిన నేతలందరికీ రాజకీయ సన్యాసమే. ఇదీ ఆ పార్టీ పెట్టుకున్న సిద్ధాంతం. అద్వానీ, జోషీ, శాంతకుమార్ లాంటి వారిని అలానే పక్కన పెట్టేశారు. మార్గదర్శక మండలి క్రియేట్ చేసి.. వారికి ఎలాంటి పని లేకుండా చేసి.. వారి ప్రాభవాన్ని మసకబార్చారు. ఇదంతా అప్పటి వరకూ పార్టీలో గట్టి పట్టున్న అద్వానీ, మురళీ మనోహర్ జోషీ లాంటి సీనియర్లను తనకు అడ్డు రాకుండా చేసేందుకు మోదీ నడిపిన మంత్రాంగం అని పార్టీ వర్గాలే అంటుంటాయి. లేటెస్ట్ విషయానికి వస్తే.. కేరళలో 89 ఏళ్ల శ్రీధరన్ ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో మరోసారి వయసు వ్యవహారం తెరపైకి వచ్చింది.
బీజేపీ పెట్టుకున్న నియమం ప్రకారం 75 ఏళ్లు దాటితే ఎంతటి నేతైనా ఇక ఇంటికే పరిమితం. కానీ, కేరళలో ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టారు. ఓట్లు దండుకునేందుకు 89 ఏళ్ల కురవృద్ధుడు, మిస్టర్ఱ క్లీన్ ఇమేజ్ మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను ఎన్నికల బరిలో దింపారు. అద్వానీ, జోషీ విషయంలో వర్తించిన రూల్.. శ్రీధరన్ ఎపిసోడ్ లో ఎందుకు లెక్కలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి.
సుబ్రహ్మణ్యస్వామి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నేత. పార్టీలోనే ఉంటూ, పార్టీ లైన్ కు కట్టుబడే ఉంటూ.. కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్ చేయడంలో దిట్ట. లేటెస్ట్ గా, శ్రీధరన్ విషయంలో సంచలన కామెంట్లు చేశారు. ఏజ్ పాలిటిక్స్ పై గట్టిగా ప్రశ్నించారు. 89 ఏళ్ల శ్రీధరన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినందున.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అద్వానీ, జోషిలు కూడా పోటీ చేయాలంటూ సూచించారు సుబ్రహ్మణ్యస్వామి.
ప్రస్తుతం అద్వానీ వయసు 93 ఏళ్లు కాగా, జోషి వయసు 87. 2024లో పోటీ చేద్దామన్నా శారీరకంగా సహకరించకపోవచ్చు. వాళ్లు పోటీ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే.. సుబ్రహ్మణ్యస్వామి లేవనెత్తిన పాయింట్ మాత్రం పార్టీని ఇబ్బందికి గురి చేస్తోంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికైనా ఇబ్బందేగా? బీజేపీ సైతం అందుకు అతీతమేమీ కాదుగా? అందుకే అంటారు చెప్పేందుకే నీతులు అని...