ఇంత కక్కుర్తి అవసరమా జగనన్నా ..
posted on Mar 5, 2021 @ 2:19PM
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ . జనాభా పరంగా చైనా అతిపెద్ద దేశం అయినప్పటికీ.. అక్కడ పేరుకు కమ్యూనిస్ట్ పాలనే ఉన్నా .. అక్కడ మొత్తం నియంతృత్వ పాలన సాగుతోంది. అమెరికాలో ప్రజాస్వామ్యమే ఉన్నా కూడా మొన్న జనవరిలో అధికార మార్పిడి సందర్భంగా క్యాపిటల్ హిల్ లో జరిగిన సంఘటనలు ఆ దేశానికీ మాయని మచ్చ తీసుకు వచ్చాయి. భారత్ లో ప్రజాస్వామ్యం ఇంతలా బలపడడానికి కారణం ఇక్కడి ప్రజలలో వ్యవస్థలపై ఉన్న విశ్వాసమే . అయితే ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను కనుక గమనిస్తే సామాన్య ప్రజలకు మొత్తంగా ఈ రాజకీయ పార్టీలు, ఎన్నికల ప్రక్రియపై నమ్మకం పోయేలా ఉంది. ఏ పొలిటికల్ పార్టీ అయినా గెలిచి మనుగడ సాగించేది ప్రజలు స్వచ్చందంగా కదిలి వచ్చి ఓట్లు వేసి గెలిపిస్తేనే. ఆలా కాకుండా ప్రజలకు ఓట్లు వేసే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రత్యర్థులను కూడా భయపెట్టి సాధించే విజయం ప్రజాస్వామ్యం ముసుగులో సాగే నియంతృత్వానికి నిదర్శనం అవుతుంది.
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎన్నికలను గమనిస్తే ఇదే విషయం స్పష్టమౌతోంది. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల నుండి.. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలవరకు అధికార వైకాపా ఫాలో అవుతున్న పద్దతులను చూస్తే అసలు ఆ పార్టీకి డెమోక్రసీ పైన నమ్మకముందా అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ ఎన్నికలలో కేవలం తమ పార్టీ అభ్యర్ధులు మాత్రమే రంగంలో ఉండాలి ఇంకెవరు కనీసం పోటీ కూడా చేయకూడదు అన్నట్టుగా ఆ పార్టీ మంత్రాంగం నడుపుతోంది. దీని కోసం ఆ పార్టీ చేయని అరాచకం కానీ, పాల్పడని నీచం కానీ లేవంటే అతిశయోక్తి కాదు.
ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రతిపక్షాల అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయ్యేంతవరకు కనీసం బయటకు అడుగు పెట్టె పరిస్థితి లేదు. ఒకవేళ వైకాపా నాయకులు చేసే దౌర్జన్యాలు బెదిరింపులకు ఆ అభ్యర్థి మొండిగా ఎదురొడ్డి నిలబడినా.. వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల నుండి పారిపోయేలా చేస్తున్నారు. ఈ దురాగతాలకు ఒక ఉదాహరణ.. రాయలసీమలో పోటీ చేస్తున్న ఒక ప్రతిపక్ష అభ్యర్థి పై వైకాపా నాయకులు ఎన్ని సార్లు ఒత్తిడి చేసినా ఎన్నికల నుండి తప్పుకోక పోవడంతో అతడి జీవనాధారమైన పందులను రాత్రికి రాత్రే లారీలో తరలించుకుపోవడంతో ఆ అభ్యర్థి కుటుంబ సభ్యులు భీతిల్లి.. వైకాపా ప్రత్యర్థి వద్దకు పరుగులు పెట్టి.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి మహాప్రభో అంటూ వేడుకుని నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.
తాజాగా తిరుపతిలో జరుగుతన్న మున్సిపల్ ఎన్నికలలో ఏడో వార్డులో బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి సంతకాన్ని ఫోర్జరీ చేసి అధికారుల సాయంతో వైకాపా నాయకులు విత్ డ్రా చేయించేశారు. అయితే విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి విజయలక్ష్మి నేరుగా ఎస్ఈసీ కి ఫిర్యాదు చేయగా.. స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆమె నామినేషన్ ను కొనసాగించాలని ఆదేశించినా అక్కడి ఆర్ఓ పట్టించుకోలేదు దీంతో నిమ్మగడ్డ మళ్ళి రంగంలోకి దిగి అక్కడ ఎన్నికల ప్రక్రియను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు.
మొత్తానికి ఏపీలో 151 సీట్ల మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైకాపా ఈ ఎన్నికలలో ఇంతగా దిగజారి ఏకగ్రీవాల కోసం అది సాధ్యం కాకపోతే ఎలాగైనా నెగ్గేందుకు ప్రయత్నాలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్నికలను సవ్యంగా ఎదుర్కొని వచ్చే సానుకూల ఫలితాలతో తృప్తి పడాల్సింది పోయి ఈ అడ్డగోలు దారులలో 80 లేక 90 శాతం సీట్లు సాధించి ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయినా ఇలా బెదిరింపులు, ప్రలోభాలు, భయంతో సాధించే ఈ వాపును చూపించి.. ఇదే మా బలం అంటే జనం నమ్మే పరిష్టితి లో లేనే లేరని సాక్షాత్తు వైకాపా నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మరి ఇంత బలవంతంగా తెచుకున్న ఈ వాపుతో సీఎం జగన్ ఏం సాధించాలనుకుంటున్నరో ఆయనకే తెలియాలి...