పల్లాకు... నల్లేరుపై నడక కాదు ..
posted on Mar 5, 2021 @ 3:19PM
రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగతున్న ఎన్నికల పోలింగ్ తేదీ మార్చి 14 సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నియోజక వర్గం నుంచి ఏకంగా 71 మంది బరిలో నిలిచారు. అందులో ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి 21, ఖమ్మం జిల్లా నుంచి 15, హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు రంగంలో వున్నారు.ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్ధులతో పాటుగా, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ప్రొ. కోదండ రామ్, అందరికి సుపరిచితులైన తీన్మార్ మల్లన్న, యువ తెలంగాణ నాయకురాలు,రాణి రుద్రమ వంటి వారున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తరపున మంత్రులు జగదీష్ రెడ్డి,ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్ పలువురు శాసన సభ్యులు ఎన్నకల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడంతో పాటు, అన్ని రకాల హంగులు,ఆర్భాటాలు ముఖ్యంగా ఆవసరమయితే కోట్ల రూపాయలు ఖర్చు చేయగల ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తి కావడంతో పార్టీ పెద్దలు ఈ నియోజక వర్గంపై అంతగా దృష్టి కేంద్రీకరించనట్లు కనిపిస్తోంది. మంత్రి జగదీష్ రెడ్డి ఒక్కరే అన్నీ చక్కబెడుతున్నారు. హైదరాబాద్, రంగా రెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి అధికార పార్టీ అభ్యర్ధిగా మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు కుమార్తె వాణీదేవిని పోటీకి నిలపడంతో, అక్కడ పోటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్ల్యేలు వాణీ దేవి గెలుపు కోసం ప్రచారం సాగిస్తున్నారు.
నల్గొండ,వరంగల్, ఖమ్మం నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రామలు నాయక్ తరపున పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు సార్లు జిల్లాలో ప్రచారం కొనసాగించారు. బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరపున పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నాయకులు జిల్లా కేంద్రాలు, జిల్లాలలోని వివిధ పట్టణాలు, పల్లెలలలో ఆత్మీయ సమావేశాలు నిర్వహింఛి ప్రచారం సాగిస్తున్నారు. ఏబివిపి, బిజెపి కార్యకర్తలు ప్రచార భాద్యతలు చేపట్టారు. యవ తెలంగాణ తరుపున బరిలో వున్న జర్నలిస్టు రాణి రుద్రమ తెలంగాణలో నిరుద్యోగ సమస్య ప్రభుత్వ హామీలు వైపల్యాలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తు ప్రచారం చేస్తున్నారు.తెలంగాణ జన సమితికి చెందిన ప్రొ.కోదండరామ్ విద్యావేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అలాగే తెరాస ప్రభుత్వ విధానాలను తూర్పార పడుతూ, ప్రధాన మీడియా చేయని సాహసం చేస్తున్న తీన్మార్ మల్లన.. ఎన్నికల ప్రకటకు ముందు నుంచి, పాదయాత్ర చేస్తూ, సమస్యలను ప్రస్తావిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలు, మేథావులు, ఆయన వెంట ఉండి ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రముఖ యువ న్యాయవాది ఉమేశ్ చంద్ర వంటి టి సామాజిక స్పృహ గల అనేక మందితో పాటుగా యువకులు, విద్యాధికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు తీన్మార్ మల్లన తరపున ప్రచారం సాగిస్తున్నారు. మల్లన్న తమ విజయం పట్ల విశ్వాసంతో ఉన్నారు.
ప్రచారం ఎలా ఉన్నప్పటికీ ఎక్కువ మంది అభ్యర్ధులు బరిలో నిలవడంతో ఈ మూడు జిల్లాల పట్టభద్రులు ఎటు మొగ్గు చూపుతారు అనేది ఉహకు అందకుండా వుంది. అయితే అధికార పార్టీ అభ్యర్ధికి గెలుపు నల్లేరు మీద నడక కాదని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రొ. కోదండ రామ్ సెకండ్ ప్రియారిటీ ఓటు మీద దృష్టి పెట్టి సాగిస్తున్న ప్రచారం అంచనాలాను తల్లకిందులు చేసినా ఆశ్చర్య పోనవసరం లేదని స్థానిక విశ్లేషకులు చెబుతున్నారు.