కాలభైరవ సేవలో బాలకృష్ణ.. అందుకోసమేనా?
posted on Mar 5, 2021 @ 3:33PM
హీరో కమ్ ఎమ్మెల్యే బాలకృష్ణకు దైవభక్తి అధికం, ముహూర్తాలు, పూజలు, జాతకాలపై అమిత నమ్మకం. జ్యోతిష్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వందే అసలే పనీ ప్రారంభించరు. ప్రతీరోజూ రాశిఫలాలు ఫాలో అవుతుంటారు. హైదరాబాద్ లో ఉండే బాలకృష్ణ కుటుంబం సడెన్ గా కామారెడ్డి జిల్లాలో ప్రత్యక్షమైంది. రామారెడ్డి మండలం, ఇసన్నపల్లిలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు బాలకృష్ణ. ఆయనతో పాటు సతీమణి వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ, కూతురు బ్రాహ్మణి ఉన్నారు.
కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లిలోని 13వ శతాబ్దం నాటి కాలభైరవ స్వామి ఆలయం మహిమాన్మితమైనది. కాశీక్షేత్రం తరువాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక కాలభైరవ స్వామి ఆలయం ఇదే. ఆలయంలో శ్రీ కాలభైరవస్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉంటుంది. కార్తీక బహుళాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి జయంతిని ఘనంగా జరుపుతారు.
కాలభైరవుడు అత్యంత పవర్ ఫుల్ గాడ్. జాతక దోషాలు మరీ విపరీతంగా ఉంటేనే కాలభైరవుడిని పూజిస్తుంటారు. ఎలాంటి గ్రహ దోషాలనైనా నివారించే శక్తి కాలభైరవుడికే సొంతం. బాలకృష్ణ ఫ్యామిలీ సైతం జాతక దోషాల నివారణకే కాలభైరవ ఆలయ దర్శనం చేసుకున్నారని అంటున్నారు. ఇటీవల ఏర్పడిన కాలసర్ప దోష ప్రభావం బాలకృష్ణపై ఉందని.. అందుకు పరిహారంగా కాలభైరవ పూజ చేయాలని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు సూచించారని చెబుతున్నారు. అందుకే, దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక కాలభైరవ స్వామి ఆలయం ఉన్న కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లికి బాలకృష్ణ కుటుంబ విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారని తెలుస్తోంది.