బాలీవుడ్ మత్తులో కేటీఆర్!
posted on Mar 9, 2021 @ 6:32PM
నిర్మల్ జిల్లా భైంసాలో మరోసారి హింస చెలరేగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భైంసాలో భారీగా బలగాలను మోహరించారు.పట్టణంలో పోలీసు కవాతును నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల మీదుగా ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. బైంసా ఘటనపై రాజకీయ రగడ ముదురుతోంది. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఒక ప్రణాళిక ప్రకారమే భైంసాలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. దీనికి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలకు లేఖ రాస్తానని చెప్పారు. భైంసా అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు.
మంత్రి కేటీఆర్ బాలీవుడ్ మత్తులో మునిగిపోయారని... ఆ మత్తు నుంచి ఆయన బయటకు రావాలని అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో మునిగిపోయారని అన్నారు. ఓట్ల కోసం హిందువుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. మత్తులో మునిగితేలుతున్న కేసీఆర్ తన మతాన్ని కూడా మర్చిపోయారని అన్నారు. భూకబ్జాల్లో కేటీఆర్ ను కవిత మించిపోయారని విమర్శించారు. హోం మంత్రి మహమూద్ చేతకాని స్థితిలో ఉన్నారని... లా అండ్ ఆర్డర్ తమకు అప్పచెపితే అల్లర్లను ఎలా కంట్రోల్ చేయాలో చేసి చూపిస్తామని అర్వింద్ చెప్పారు.