ఎమ్మెల్సీ ఎన్నికలలో బోగస్ ఓట్ల కలకలం
posted on Mar 9, 2021 @ 12:13PM
తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. అన్ని పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో గతంలో ఎప్పుడు లేనంతగా పోటీ నెలకొంది. అయితే పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ.. నల్గొండ ,ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానంలో బోగస్ ఓట్ల కలకలం రేగింది.
టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, అనురాగ్ యూనివర్సిటీ కేంద్రంగా బోగస్ ఓట్లు నమోదు చేయించారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ కి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. బోగస్ ఓట్లకు సంబంధించిన సాక్షాధారాలను కూడా రిటర్నింగ్ అధికారికి సమర్పించారు తీన్మార్ మల్లన్న.
బోగస్ ఓట్లు చేర్పించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు తీన్మార్ మల్లన్న. అనురాగ్ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని కోరారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఎమ్మెల్సీ బి ఫామ్ ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ గుర్తింపు కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీం కోర్టు కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు తీన్మార్ మల్లన్న. ఓడిపోతామనే భయంతోనే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, వేలాదిగా బోగస్ ఓట్లను ఎన్ రోల్ చేయించిందని మల్లన్న ఆరోపించారు.