6 రోజులు బ్యాంకులు బంద్.. కస్టమర్లు బీ అలర్ట్..
posted on Mar 9, 2021 @ 12:09PM
శివరాత్రి సెలవుతో పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె. ఉద్యోగుల సమ్మెతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు తెరుచుకోవు. శివరాత్రి సెలవు కూడా కలిపితే ఐదు రోజులు బ్యాంకులు బంద్. ఉద్యోగులు శుక్రవారం కూడా సెలవు పెడితే.. ఏకంగా 6 రోజులు ఇబ్బందులు తప్పవు. అంటే, గురువారం నుంచి మంగళవారం వరకూ బ్యాంకులు మూతే. అందుకే, బ్యాంకుకు వెళ్లే పని ఉండే కస్టమర్లంతా బీ అలర్ట్.
బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపు ఇచ్చాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె సందర్భంగా మార్చి 13 నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. మార్చి 13న రెండవ శనివారం సెలవు, మార్చి 14న సండే హాలిడే. మార్చి 15, 16 తేదీల్లో ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు బంద్. ఇలా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు పని చేయవు. ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం ఎప్పటిలానే యధావిధిగా కొనసాగుతాయి. కేవలం బ్యాంకు బ్రాంచీలు మాత్రమే పని చేయవు.
మార్చి 11న మహాశివరాత్రి నాడు బ్యాంకులకు సెలవు. మార్చి 22న బీహార్ దివస్, మార్చి 30న హోలి పండుగ హాలిడే ఉంది. ఇలా, పండుగ సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, రెండవ శనివారాలు, 4 ఆదివారాలతో కలిసి మార్చి నెలలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు క్లోజ్. స్థానిక సెలవులతో కలిసి 11 రోజులు బ్యాంకు పనిచేయనందున ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులు సూచించాయి.