ఓడిపోతే ఎవరి ఖాతాలో.. మళ్లీ ఆయనే టార్గెట్?
posted on Mar 9, 2021 @ 11:41AM
ఇంకా పోలింగ్ జరగలేదు. ప్రచారమే సాగుతోంది, కానీ అప్పుడే, కొందరి ఆలోచనలు ఓటమికి ఎవరు బాధ్యత వహిస్తారు అనే వరకు వెళ్ళాయి. దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రచార బాధ్యతను బుజానికి ఎత్తుకున్న మంత్రి హరీష్ రావు పార్టీ ఓటమికి తనదే బాధ్యతని ప్రకటించారు. ఎన్నికల ప్రచారం మొత్తాన్ని తన బుజాలపైకి ఎత్తుకుని, పార్టీ అభ్యర్ధి సుజాతను గెలిపిస్తే ప్రజలకు ఏ సమస్య వచ్చినా, తానే స్వయంగా పూనుకుని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడమే కాకుండా, ప్రజలు తననే అభ్యర్ధిగా బావించి, ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. హరీష్ ఎక్కడికేకెళితే అక్కడ గెలుపు ఖాయమన్న ధీమానూ వ్యక్త పరిచారు. సో ... సహజంగానే దుబ్బాక ఓటమిహరీష్ ఖాతాలో చేరింది.
జీహెచ్ఎంసీ ఎన్నికలలో పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను బుజానికి ఎత్తుకున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఅర్,కూడా ఆశించిన ఫలితాలు రానందుకు, కొంచెం అటూ ఇటుగా ఓటమి బాధ్యతను తీసుకున్నారు.ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని అంగీకరించారు. అయినా సింగల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. పది పన్నెండు నియోజక వర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని,అయినా పార్టీలో చర్చించి లోపాలను దిద్దుకుంటామని చెప్పుకొచ్చారు. హరీష్ అంత హుందాగా కేటీఆర్ ఓటమి బాధ్యతను ఓన్ చేసుకోక పోయినా.. జీహెచ్ఎంసీ ఓటమి ఆయన ఖతాలోకే చేరింది.
ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజక వర్గంలో, కేటీఅర్, హరీష్ ఇద్దరూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇద్దరికీ స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపధ్యంలో దురదృష్టవశాత్తు పార్టీ అభ్యర్ధి, వాణీదేవి ఓడిపోతే అందుకు, ఎవరు బాధ్యత వహిస్తారు,ఆ ఓటమి ఎవరి ఖాతాలో చేరుతుంది.. అనే విషయంలో రాజకీయ,జర్నలిస్ట్ సర్కిల్స్’లో సరదా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలలో ఫలితాలను అటో ఇటో తేల్చేది అత్యధికంగా, 2.6 లక్షల ఓటర్లున్న రంగా రెడ్డి జిల్లానే. తెరాస అసలు పెట్టుకున్నది కూడా ఈ జిల్లాపైనే. అందుకే జిల్లా బాధ్యతలను కేసీఆర్ హరీష్ రావుకు అప్పగించారు. కాబట్టి, గెలుపు అయినా, ఓటమి అయినా హరీషే బాధ్యత వహించవలసి ఉంటుందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రంగారెడ్డి బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించే సమయంలోనే, ముఖ్యమంత్రి, కేసీఆర్,దుబ్బాక ఫలితం పునరావృతం కారాదన్న హెచ్చరికను కూడా చేశారని పార్టీ వర్గాల సమాచారం. అందుకs , కావచ్చు హరీష్ రావు, ఇటు బడ్జెట్ చర్చల్లో బిజీగా ఉండి కూడా,ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, వ్యూహ రచన పై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఇతర నాయకులతో కలిసి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
మరో వంక జిల్లాలో బీజేపీ అనుసరిస్తున్న పన్నా ప్రముఖ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక పన్నా ప్రముఖ్’ను ఏర్పాటు చేసి, వారి ద్వారా ఎన్నికల ప్రచారాన్ని హరీష్ మానిటర్ చేస్తున్నారు. అయినప్పటికీ, జరగకూడనిది జరిగితే,ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన పీవీ కుమార్తె, వాణీదేవి ఓడిపోతే, అందరికంటే ఎక్కువ బదనాం అయ్యేది హరీష్ రావే కావచ్చును. ఆయన మెడ మీది కత్తి మరింత దగరవుతుంది ఆయన గ్రాఫ్ ఇంకా పడిపోతుందని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి.