ప్రధానికి లేఖతో కవరింగ్! జగన్‌కు GVMC టెన్షన్
posted on Mar 9, 2021 @ 2:24PM
విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ. ప్రైవేటీకరణపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని వినతి. అఖిలపక్షంతో ఢిల్లీకి వచ్చి చర్చిస్తానంటూ మోదీకి ప్రతిపాదన. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి. 7వేల ఎకరాలు ప్లాట్లు చేసి అమ్మేయాలి. ఇలా పలు ప్రతిపాదనలు ఆ లేఖలో ఉన్నాయి. సీఎం జగన్ కు విశాఖ ఉక్కుపై సడెన్ గా ఇంత చిత్తశుద్ధి ఎందుకొచ్చిందనే ఆశ్చర్యం అవసరం లేదు. ఎందుకంటే, బుధవారం విశాఖ కార్పొరేషన్ ఎలక్షన్. అందుకే, మంగళవారం మోదీకి జగన్ లెటర్. అంతే, సింపుల్ లాజిక్ అంటున్నాయి ప్రతిపక్షాలు.
విశాఖ ఉక్కును వంద శాతం ప్రైవేటీకరణ చేస్తామంటూ సోమవారం పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పేశారు. కేంద్రం తీరుతో విశాఖ తీరంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. మంత్రి ప్రకటన చేసినప్పటి నుంచీ విశాఖలో ఆందోళనలు ఓ రేంజ్ లో కొనసాగుతున్నాయి. సరిగ్గా జీవీఎమ్సీ ఎన్నికలకు ఒకరోజు ముందు జరుగుతున్న ఈ నిరసనలు అధికార వైసీపీలో వణుకుపుట్టిస్తున్నాయి. రాష్ట్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర మంత్రే స్వయంగా ప్రకటించడంతో విశాఖ ఉక్కు పాపం వైసీపీ మెడకు చుట్టుకుంటోంది. ఆ ప్రభావం కార్పొరేషన్ ఎన్నికల్లో కనిపించకుండా.. ప్రభుత్వాన్ని ముంచేయకుండా.. సీఎం జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టారని చెబుతున్నారు. అందులో భాగంగానే, విశాఖ స్టీల్ పై మోదీతో చర్చించేందుకు జగన్ లేఖ రాశారని అంటున్నారు.
సాధారణంగా ఓ ముఖ్యమంత్రి.. ప్రధానిని కలవాలంటే పీఎంవో ద్వారా అపాయింట్ మెంట్ తీసుకుంటారు. గతంలో ప్రధాని మోదీని జగన్ సైతం అలానే కలిశారు. అప్పుడు అపాయింట్ మెంట్ కోసం ఎలాంటి లేఖ రాయలేదు. అలాంటిది ఇప్పుడు కొత్తగా.. ప్రధానిని కలిసేందుకు ప్రత్యేకంగా లేఖ రాయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. లెటర్ రాసి అపాయింట్ మెంట్ కోరడం వెనుక రాజకీయ ఎత్తుగడ దాగుందని అనుమానిస్తున్నారు. విశాఖ ఉక్కు కోసం తానేదో ప్రయత్నం చేస్తున్నట్టు ప్రజలను నమ్మించడానికే ఇలా లేఖ రాసి దానిని బహిరంగ పరిచారని చెబుతున్నారు. ఇదంతా బుధవారం జీవీఎమ్సీ ఎన్నికల్లో వైసీపీకి నష్టం జరగకుండా పార్టీని గట్టెక్కించేందుకు వేసిన ఎత్తుగడే అని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామంటూ కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా అంత సూటిగా చెప్పాక ఇక జగన్ రెడ్డిని నమ్మేదెలా అని ప్రశ్నిస్తున్నారు ఉక్కు కార్మికులు.
సీఎం జగన్, పీఎం మోదీకి రాసిన లేఖలో కొత్త అంశాలేవీ ప్రస్తావించలేదు. గతంలో రాసిన లేఖకు కాస్త అటూ ఇటూగా ఉందా లేఖ. ఢిల్లీకి తనతో పాటు రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లతో వచ్చి కలుస్తానని లేఖలో సీఎం వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తాను రాసిన లేఖ విషయాన్ని కూడా తాజా లేఖలో సీఎం ప్రస్తావించారు. "32 మంది ప్రాణ త్యాగ ఫలితం విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉంది. 2002-2015 వరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంది. ప్లాంట్‌కు ఉన్న 19,700 ఎకరాల భూమి విలువ లక్ష కోట్లు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా 2014-15లో స్టీల్‌కు ఎదురైన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లింది. ఉత్పత్తి ఖర్చు పెరగడానికి కారణం సొంత గనులు లేకపోవడమే. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు సొంత గనులు కేటాయించాలి. ఉపయోగించకుండా ఉండిపోయిన 7వేల ఎకరాలను ప్లాట్లు వేసి విక్రయిస్తే ఆర్ఐఎన్ఎల్‌కు నిధులు సమకూరుతాయి. భూ వినియోగ మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులిస్తుంది. ఈ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి" అని మోదీకి రాసిన లేఖలో జగన్ కోరారు.
విశాఖ ఉక్కు కోసం రాజీనామాలకు సిద్ధమా? అంటూ విపక్ష నేతలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్న వైసీపీ నేతలు.. ఇలా లేఖల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు ఎవరిని నమ్ముతున్నారో.. ఎవరిని ద్రోహులుగా నిలబెడుతున్నారో.. జీవీఎమ్సీ ఎన్నికల తీర్పుతో తేలిపోతుందని అంటున్నారు.